-వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదార్ పాస్‌పుస్తకం -మెరూన్ కలర్‌లో ప్రత్యేకంగా రూపకల్పన -దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో పంపిణీ -మధ్యతరగతి ప్రజల ఆస్తులకు పూర్తిరక్షణ -నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లు ఉచితంగా క్రమబద్ధీకరణ -ధరణి పోర్టల్ వచ్చాకే ఆస్తుల రిజిస్ట్రేషన్లు -సాదాబైనామాలకు చివరగా మరో అవకాశం -ఇక ప్రతి జీవో, సర్క్యులర్ తెలుగులోనూ -రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌పై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయభూముల వద్ద, బావులకాడి ఇండ్లు, ఫామ్‌హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉచితంగా మ్యుటేషన్ (ఎన్‌రోల్) చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్నవారికి దేశంలోనే తొలిసారిగా పట్టాదార్ పాస్‌పుస్తకం జారీచేయనున్నట్టు తెలిపారు. మెరూన్ కలర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన పాస్‌పుస్తకాలను అందజేస్తామని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులకు పూర్తిరక్షణ కల్పించాలన్నదే కొత్త రెవెన్యూ చట్టం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. భూవివాదాలు, ఘర్షణలను నివారించి ప్రజల ఆస్తులకు పక్కాహక్కులు కల్పించేందుకే ఈ పాస్‌పుస్తకాలు జారీచేస్తున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూచట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పేదల ఇండ్లు రెగ్యులరైజ్ ఇకముందు ఒకరిపేరు నుంచి మరొకరి పేరుమీదకు ఒక్క ఇంచుభూమి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది నుంచి ఇంటినంబర్ తీసుకుని వ్యవసాయేతర ఆస్తులు, ఆధార్‌కార్డు, కుటుంబసభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇప్పుడు మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్‌లో ఆస్తులను పిల్లలకు బదిలీచేసే విషయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఏండ్లుగా పేదలు నివాసం ఉంటున్న ఇండ్లస్థలాలను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో పేదల ఇండ్ల స్థలాలకు రక్షణ ఏర్పడటమే కాకుండా.. వాటిపై బ్యాంకు రుణాలు తీసుకొనే వెసులుబాటు కూడా కలుగుతుందని తెలిపారు. ఆస్తుల మ్యుటేషన్‌కు, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతీరాజ్, మున్సిపల్‌చట్టాలు, నిబంధనలకు లోబడే ఉంటుందని వివరించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలోని వ్యవసాయభూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్టు ప్రకటించారు. వ్యవసాయభూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు, ఇతరవాటి విస్తీర్ణాన్ని వ్యవసాయ క్యాటగిరీ నుంచి తొలగించే విషయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. ఎంపీడీవోలు దీనిని పర్యవేక్షించాలని అన్నారు.
ఇకనుంచి ప్రతి ఆర్డర్ ఇంగ్లిష్, తెలుగులో.. ప్రభుత్వం ఇకనుంచి విడుదల చేసే అన్నిజీవోలు, సర్క్యులర్లు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో విడుదలచేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ప్రజలకు సమాచారం సౌలభ్యంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గణేశ్ బిగాల, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలసాని లక్ష్మినారాయణ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితాసబర్వాల్, వోఎస్డీ భూపాల్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వంద్‌కుమార్, డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాదాబైనామాలకు చివరి అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కొనుగోళ్ల మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయడానికి త్వరలో మరోసారి అవకాశం కల్పించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని పేర్కొన్న సీఎం.. భవిష్యత్తులో సాదాబైనామాలకు అనుమతించే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్రంలో పలుప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను కూడా ఉచితంగా క్రమబద్ధీకరించనున్నామని, ఇందుకు సంబంధించిన వివరాలు ఒకట్రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్టు వివరించారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్ధీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.
ఆలస్యమైనా ధరణి తర్వాతే రిజిస్ట్రేషన్లు ‘ప్రతి ఇంటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావాలి, ఇంటికి నంబర్ కేటాయించాలి, ట్యాక్స్ వసూలు చేయాలి, నాన్ అగ్రికల్చర్ కింద నాలా కన్వర్షన్ మార్చాలి. వందశాతం ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేసే విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు బాధ్యత తీసుకోవాలి. కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్‌టీఎల్, నాలా, యూఎల్సీ పరిధిలో నిర్మించుకున్న ఇండ్లకు ఈ మ్యుటేషన్ వర్తించదని తెలిపారు. ఆస్తుల నమోదు ప్రక్రియ, రెగ్యులరైజేషన్, ఉచిత నాలా కన్వర్షన్‌కు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియతోపాటు, ప్రజలకు మెరూన్ కలర్ పాస్‌పుస్తకాలు అందించే విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు, మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కొనుగోళ్ల మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయడానికి త్వరలో మరోసారి అవకాశం ఇస్తాం. వివరాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం. భవిష్యత్తులో సాదాబైనామాలకు అనుమతించే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో పలుప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను కూడా ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం.
ఇకముందు ఒకరిపేరు నుంచి మరొకరి పేరుమీదకు ఒక్క ఇంచుభూమి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతుంది. గ్రామ పంచా యతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయభూముల వద్ద, బావులకాడి ఇండ్లు, ఫామ్ హౌజ్‌లు తదితర వ్యవసా యేతర ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ప్రజలు ఉచితంగా మ్యుటేషన్ చేయించుకోవాలి. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది నుంచి ఇంటినంబర్ తీసుకుని వ్యవసాయేతర ఆస్తులు, ఆధార్‌కార్డు, కుటుంబసభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. ఇప్పుడు మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్‌లో ఆస్తులను పిల్లలకు బదిలీచేసే విషయంలో ఇబ్బందులు తప్పవు.
‘ప్రతి ఇంటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావాలి, ఇంటికి నంబర్ కేటాయించాలి, ట్యాక్స్ వసూలు చేయాలి, నాన్ అగ్రికల్చర్ కింద నాలా కన్వర్షన్ మార్చాలి. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్‌టీఎల్, నాలా, యూఎల్సీ పరిధిలో ఇండ్లకు మ్యుటేషన్ వర్తించదు.
-ముఖ్యమంత్రి కేసీఆర్