-తెలంగాణ రాష్ట్ర ప్రగతి సారథులకే పట్టం కట్టండి
-మునుగోడులో అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం
-ఓటర్లు ఆగం కావద్దు.. ఆలోచించి ఓటు వేయండి
-మహిళలూ.. సిలిండర్‌కు దండం పెట్టి ఓటేయండి
-బీజేపీకి ఓటేస్తే గ్యాస్‌బండ రూ.4 వేలు అయితది
-చేనేతకు మరణ శాసనం రాస్తున్న ప్రధాని మోదీ
-తెలంగాణలో దాడుల సంస్కృతి ఎన్నడూ లేదు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
-మునుగోడు ప్రచారం పరిసమాప్తం.. రేపే పోలింగ్

రేపటి ఘన విజయానికి నేడే జనగర్జన. టీఆర్‌ఎస్‌పై ప్రజల అభిమానం సాగర కెరటంలా ఉప్పొంగి ఎగసింది. మునుగోడు ఉప ఎన్నికకు మంగళవారం ప్రచారం ముగిసింది. ఈ క్రమంలో మునుగోడులో టీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కే తారకరామారావు, చండూరులో వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, వివిధ ప్రాంతాల్లో మంత్రులు, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు రోడ్‌షోలు నిర్వహించారు. ఈ రోడ్‌షోలకు జనం ప్రభంజనమై తరలివచ్చారు. టీఆర్‌ఎస్ నేతలకు అడుగడుగునా నీరాజనం పలికారు. ఇసుక రేణువు నేల మీద రాలడానికి చోటు కూడా లేనంతగా జనం వచ్చారు. చేనేతలు, ముదిరాజ్‌లు, యాదవులు, కుర్మలు, గౌడలు, పద్మశాలీలు, దళితులు, రైతులు, మహిళలు, యువజనులు.. ఒకరేమిటి.. సబ్బండ వర్ణాలు ఒక్కచోట సమీకృతమైన అద్భుత దృశ్యం ఈ రోడ్డు షోలలో ఆవిష్కృతమైంది. రోడ్‌షోలలో స్థలం చాలక ఇండ్ల పైకప్పులపైకి ఎక్కి మరీ తమ నాయకుల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా ఆలకించారు. మంత్రులు అడిగిన ప్రతి ప్రశ్నకు ముక్తకంఠంతో జవాబులిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలకు, పరిపాలనకు జై కొట్టారు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న మునుగోడు పోరులో ఫలితం ఎలా ఉండబోతున్నదో ఈ రోడ్డుషోలు చెప్పకనే చెప్పాయి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అద్భుతమైన మెజార్టీతో గెలువబోతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తేల్చిచెప్పారు. ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, పురోగతికి మునుగోడు ఓటర్లు పట్టం కడుతారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటును సవ్యంగా ఆలోచించి వాడాలని, ఆగం కావొద్దని విజ్ఞప్తిచేశారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా పనిచేస్తున్నదో దేశమంతా చూస్తున్నదని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు ఏ జీవన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు బొంతు రామ్మోహన్, దాసోజు శ్రవణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘మోసగాళ్లకు, మొనగాళ్లకు జరుగుతున్న పోరాటమిది.
ఈ పోరాటంలో దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడ్డ మునుగోడు ప్రజలకు బాసటగా నిలబడి, మునుగోడులోనే పైలాన్ ఆవిష్కరించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి.. ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమేసింది కేసీఆర్’ అని తెలిపారు. మునుగోడును రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోకపోయినా, అనాథలా వదిలిపెట్టినా.. అభివృద్ధి, సంక్షేమం ఆగలేదని మం త్రి కేటీఆర్ తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్తు, 79 వేలమందికి రైతుబంధు, 1189 మందికి రైతుబీమా అందిందని, చర్లగూడెం, శివన్నగూడెం, లక్ష్మణాపూర్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయని వివరించారు. ప్రధా ని మోదీ కృష్ణా జలాలను తెలంగాణకు కేటాయించి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని చెప్పారు. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ.. మోసం చేశారని ధ్వజమెత్తారు. నమ్మించి మోసం చేసేవాడే ‘నమో (నరేంద్ర మోదీ)’ అని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో అతి పెద్ద పారిశ్రామికవాడను మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురంలో 542 ఎకరాల్లో ఏర్పాటుచేశామని, 1800 ఎకరాలకు విస్తరిస్తామని,200 కంపెనీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
చేసిన పని చెప్తూ ఓటడగుతున్నం
తాము చేసిన పనులను వివరిస్తూ పాజిటివ్ ఓటు అడుగుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ప్రజల చిరకాల వాంఛ అయిన చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలు, గట్టుప్పల్ మండలం కావాలన్న కోరికలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చిందని, త్వరలో చండూరును రెవెన్యూ డివిజన్ చేస్తామని ప్రకటించారు. గిరిజన సోదరులకోసం నియోజకవర్గంలోని 62 తండాలలో 21 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని గుర్తుచేశారు. జనం బొక్కల్లో మూలుగ సచ్చిపోయి జీవచ్ఛవాలుగా మారిన ప్రాంతం లో తాగునీరు ఇవ్వడానికి ఉద్దేశించిన మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా 19 పైసలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన జేపీ నడ్డా.. మర్రిగూడలో 300 పడకల దవాఖానను ఏర్పాటు చేస్తామని, ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రాన్ని పెడతామని ప్రకటించి ఇంతవరకు అమలుచేయలేదని విమర్శించారు. శివన్నగూడెం, లక్ష్మణాపూర్ ప్రాజెక్టులకు కేంద్రం నయాపైసా ఇవ్వలేదని పేర్కొన్నారు. కృష్ణానదీ జలాల్లో మన వాటాను కేంద్రం ఇప్పటికీ తేల్చలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు రుణాలు ఆపి, తెలంగాణను చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. చేనేతపై 5% జీఎస్టీ విధించి చావుదెబ్బ కొట్టడమే కాకుండా మరణశాసనం రాసే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. బడా కార్పొరేట్లకు రూ.11.50 లక్షల కోట్లు మాఫీ చేసే బీజేపీ సర్కారు పెద్దలు.. రైతులకు రుణమాఫీ చేయొద్దు, రైతులకు ఏవీ ఉచితంగా ఏవీ ఇవ్వొద్దని అడ్డగోలుగా మాట్లాడుతున్నరని ధ్వజమెత్తారు. నల్లచట్టాలతో 13 నెలలపాటు రైతులను చావగొట్టారని, యూపీ లఖింపూర్‌లో రైతులపైకి జీపు ఎక్కించి చంపించారని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి.. వారి కష్టాలు, కన్నీళ్లను రెట్టింపు చేశారన్నారు. తెలంగాణలో పండిన వడ్లు కొనని బీజేపీ సర్కారు.. తెలంగాణ ఎమ్మెల్యేలను మాత్రం కొనడానికి వందల కోట్ల రూపాయలతో బ్రోకర్లను పంపించిందని ఆగ్రహించారు.
దాడుల సంస్కృతి ఎప్పుడూ లేదు
టీఎన్జీవోల మీద బీజేపీ నేతలు సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, దుర్మార్గంగా అవమానించి.. మంగళవారం ఉదయం టీఎన్జీవో కార్యాలయంపై దాడికి కొందరు పిల్లల్ని ఉసిగొల్పడం దారుణమని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీజేపీ నేతలు అనాగరికంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల్లో భౌతిక దాడులకు దిగే సంస్కృతి గతంలో ఎన్నడూ తెలంగాణలో లేదని, మునుగోడులో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌కు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. అక్కడ ఉన్న తమ పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటుగా చాలామందికి గాయాలయ్యాయని, వారిని పరామర్శించి వచ్చానని చెప్పారు.
బలం లేనప్పుడే కేంద్ర బలగాల హడావుడి
నీళ్లు ఇచ్చిన పార్టీకి, కన్నీళ్లు ఇచ్చిన పార్టీకి మధ్య జరుగుతున్న పోరాటంలో చైతన్యవంతులైన ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఆశీర్వదించాలని కేటీఆర్ కోరారు. కర్ణాటకలో అక్కడి బీజేపీ ప్రభుత్వం గీత కార్మికుల కడుపు మీద కొట్టిందని, కల్లు వృత్తినే బంద్ చేయించిందని అన్నారు. బలం లేనప్పుడు కేంద్ర బలగాలు కూడా చాలా హడావుడి చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, వారు ఏం చేసినా ప్రజలు చైతన్యవంతమైన తీర్పును ఇస్తారన్న విశ్వాసాన్ని కేటీఆర్ వెలిబుచ్చారు. ఉప ఎన్నికలో అద్భుతంగా కష్టపడి పనిచేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పారు. తమతోపాటు నడిచి, మద్దతు ఇచ్చిన సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల సంఘం ఎలా పనిచేస్తున్నది?
ఎన్నికల సంఘం పనితీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రోడ్డు రోలర్ గుర్తును తొలగించిన వాళ్లే తిరిగి పెట్టారన్న కేటీఆర్.. ఇందుకు చర్య రిటర్నింగ్ అధికారి మీద తీసుకోవాలా? ఢిల్లీలో తెలంగాణ విభాగం చూసే ఈసీ అధికారిమీద తీసుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా పనిచేస్తున్నదో దేశమంతా చూస్తున్నదన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌కు ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ హిమాచల్‌కు షెడ్యూల్ ఇచ్చి గుజరాత్‌లో మాత్రం మోదీ మొత్తం తిరిగి, అన్ని సెట్ చేసుకొనే వరకు షెడ్యూల్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ కొడుకు మునుగోడు ఓటర్లకు 5.25కోట్లు పంపిస్తాడు కానీ ఆయన తండ్రి నాకు సంబంధం లేదంటాడని ఎద్దేవా చేశారు. ఈసీ సర్టిఫికెట్ల కంటే.. ప్రజల సర్టిఫికెట్లే తమకు ముఖ్యమని చెప్పారు.
కారుకు ఓటు వేసి ఆశీర్వదించండి: కేటీఆర్
‘ఆలోచనాపరులైన, చైతన్యవంతులైన మునుగోడు ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి. ఒక బడా కాంట్రాక్టర్ అహంకారం వల్ల మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. సిలిండర్ ధర పెంచినా, చేనేత మీద జీఎస్టీ వేసినా, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా మధ్య తరగతికి వాతలు పెట్టినా, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, మధ్య తరగతి మహిళలను ముంచినా మాకేం కాదు.. వందల కోట్లు పెట్టి అంగడి సరుకులా మునుగోడు ఓటర్లను కొంటామనే దాష్టీకానికి తెరలేపిండు ఒక కాంట్రాక్టరు. కాంట్రాక్టరుకు తెల్ల అంగీ వేయగానే ఎమ్మెల్యే అయిపోడు. ప్రజా నాయకుడు అయిపోడు. ప్రజానాయకుడికి కడుపులో ఆర్తి ఉండాలి. ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలి. నియోజకవర్గాన్ని అనాథగా వదిలి పెట్టొద్దనే సోయి ఉండాలి. సోయిలేకుండా కేవలం డబ్బు మదాన్ని నమ్ముకొన్న దుర్మార్గులకు అవకాశం ఇస్తే మన వేలితో మన కంటినే పొడుచుకొన్నట్టు అయితది. బీజేపీ ప్రలోభాలకు లొంగకండి. కెలికి కయ్యం పెట్టుకొనేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. డబ్బు, మద్యం పంచుతారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఆడబిడ్డలు ఓటువేసేముందు సిలిండర్‌కు దండం పెట్టండి. మోదీని గుర్తు తెచ్చుకోండి. మీ ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పండి. కారు గుర్తుమీద ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి. మీ ఓటు ద్వారా మీ నిరసనను చెప్పండి’
ఎన్నికల్లో అల్టిమేట్‌గా గెలవాల్సింది ప్రజాస్వామ్యం, ప్రజలు.
-దున్నపోతుకు సున్నం పూస్తే ఎద్దు కాదు..
-మునుగోడులో ఆశ్చర్యపోయే మెజార్టీతో గెలుస్తాం
-మోదీకే భయ పడం, సీబీఐకి ఏం భయపడుతాం?
-సీబీఐ మోదీ వేటకుక్క. వేటకుక్కలకు, పిచ్చుకలకు భయపడం
-ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, తెలంగాణ పురోగతికి పట్టం కడుతారు.
-ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం, సవ్యంగా వాడండి. ఆలోచన చేసి ఓటు వేయండి. ఆగం కావద్దు.
మునుగోడు ఓటరు ఎటువైపు?
-రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు, రైతువేదికలు, 5 వేల ఎకరాలకు క్లస్టర్లతో కడుపులో పెట్టుకొనే కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు..
-నల్ల చట్టాలు తెచ్చి బాయికాడ మోటర్లకు మీటర్లు పెడ్తమని, కరెంటు కంపెనీలను -ప్రైవేటుపరం చేస్తమని, ధాన్యం సేకరణను ప్రైవేటు పరం చేస్తమని బాహాటంగా -ప్రకటించి.. రైతులకు వ్యతిరేకమంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు..
-చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, చేనేత బీమా ఇస్తున్న కేసీఆర్ ఒకవైపు..
-5% జీఎస్టీ వేసి, హ్యాండ్లూమ్ బోర్డు, హౌస్ కం వర్క్ షెడ్, ఇన్సూరెన్స్ పథకాన్ని రద్దుచేసి చేనేతకు మరణశాసనం రాస్తున్న మోదీ మరోవైపు
-రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2016 చేసి, ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష ఇస్తున్న కేసీఆర్ ఒకవైపు
-రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రూ.1200 చేయడం.. పెట్రో ధరలు పెంచి, అదనపు సెస్సులతో రూ.30 లక్షల కోట్లు మధ్య, దిగువ మధ్య తరగతిపై భారం మోపి, నిత్యావసరాల ధరలు పెంచిన మోదీ మరోవైపు.
-ప్రగతిశీల నాయకత్వంలో ముందుకుపోయే ప్రభుత్వం ఒకవైపు.. మతం పేరిట చిచ్చుపెట్టే చిల్లర రాజకీయం మరోవైపు..
-రెండు లక్షలకు పైగా ప్రభుత్వోద్యోగాల భర్తీతోపాటు.. టీఎస్‌ఐపాస్ ద్వారా రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణలో లక్షలాది ఉద్యోగాల కల్పన చేయడమే కాకుండా -దండుమల్కాపురంలో రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడ నిర్మాణంతో వేల ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఒకవైపు.
-ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తమని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని మోదీ సర్కారు వైపు..