-మూడురోజులుగా అధికారుల కసరత్తు -ఐటీకి ఆకర్షణీయ గమ్యంగా హైదరాబాద్ -16 శాతం వృద్ధి.. 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం: మంత్రి కేటీఆర్

నూతన ఐటీ విధానాన్ని ఈ నెల మూడోవారంలో విడుదల చేయటానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఐటీ పరిశ్రమపై తనదైన ముద్రవేసిన ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఐటీ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ప్రకటించనున్న ఐటీ పాలసీ రూపకల్పనపై గత మూడురోజులుగా ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. పాలసీలో ఉండబోయే అంశాలకు సంబంధించిన సూత్రప్రాయ వివరాలను మంత్రి కేటీఆర్ ఆదివారం మీడియాకు తెలిపారు.
ఐటీ పరిశ్రమకు ఇప్పటికే గమ్యంగా మారిన హైదరాబాద్ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేలా పాలసీలో పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధాన స్ఫూర్తిని ఐటీ పాలసీ కొనసాగిస్తుందని తెలిపారు. కంపెనీల స్థాపనకు అతి తక్కువ సమయంలో అనుమతులు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఐటీ పాలసీ ద్వారా తమ ప్రభుత్వం రూ.1.2 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోబోతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఇప్పటికే ఆకర్షణీయమైన వృద్ధి రేటు ప్రదర్శిస్తున్న తెలంగాణ ఐటీ పరిశ్రమ.. 16 శాతం వృద్ధితో సుమారు 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి క ల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్న ఉపాధికి అనువుగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చే పలు కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యార్థులు చదువులు పూర్తికాగానే పరిశ్రమలో ఉద్యోగాలు పొందేలా, వారిలో పరిశోధన, ఆవిష్కరణ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంటి నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే కంపెనీలకు అదనంగా ప్రోత్సాహకాలు అందించి సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు చెప్పిన చేజింగ్ సెల్ లాంటి వ్యవస్థలను ఐటీ కంపెనీల సౌకర్యార్థం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నుంచే ఫేస్‌బుక్, గూగుల్, వాట్స్‌అప్ లాంటి జనరేషన్ కంపెనీలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వై ఫై వ్యవస్థను సైతం ఐటీ విధానం దృష్టిలో పెట్టుకుంటుందని, వీటితోపాటు ప్రభుత్వం చేపట్టిన టాస్క్, టీ హబ్ కార్యక్రమాల వివరాలు పాలసీలో వివరిస్తామని వెల్లడించా రు.
సూత్రప్రాయంగా అంగీకరించిన అంశాలతోపాటు మరికొన్ని ఆకర్షణీయమైన విధానాలు, కంపెనీలకు ఇన్సెంటివ్స్‌ను ప్రకటిస్తామన్నారు. గతమూడు రోజులుగా విస్తృత కసరత్తుతో రూపొందిస్తున్న కొత్త ఐటీ పాలసీని డిసెంబర్ మూడోవారంలో విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. పాలసీ రూపకల్పనలో కేవలం ప్రభుత్వమే కాకుండా, పరిశ్రమ వర్గాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సూత్రప్రాయంగా తయారుచేసిన అంశాలపై పరిశ్రమ వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని, మరింత ఆకర్షణీయంగా ఐటీ పాలసీని విడుదల చేస్తామని కేటీఆర్ వివరించారు.