Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మూడింట రెండువంతుల మెజారిటీ మాదే

కేసీఆర్ స్పీకింగ్.. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన ముఠా సభ్యుడే పొన్నాల ఉద్యోగులకు ఆప్షన్లు వద్దంటే దామోదరకేంది బాధ?.. తెలంగాణ సచివాలయంలో 90శాతం ఆంధ్రోళ్లా? దామోదర దీనిని సమర్థిస్తారా?.. దొంగ ఎవరో.. దొర ఎవరో జనమే తేల్చేస్తారు: కేసీఆర్ ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులకు నీళ్లిచ్చేది లేదు కాంగ్రెస్‌కు అధికారమిస్తే గొర్రెలమందకు తోడేలును కాపలాపెట్టినట్లే చంద్రబాబు ఆస్తులను బయటకు కక్కిస్తాం కేసీఆర్‌ను.. నువ్వెవరని అడుగుతరా? అధికారం చేపట్టబోయే పార్టీకి అధ్యక్షుడిని నేను మనిషికి నీడ ఎట్లనో.. తెలంగాణకు నేనట్ల విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత నిప్పులు

KCR

హైదరాబాద్:గత కొద్ది రోజులుగా తనపై విమర్శలు కురిపిస్తున్న రాజకీయ నాయకులపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పటి ఉద్యమ ప్రస్థానంనాటి ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ మాటల తూటాలు పేల్చారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీకి అధ్యక్షుడి హోదాలో మాట్లాడుతున్నానంటూ పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి, చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. రానున్న రోజుల్లో కూడా ఇలాగే మాట్లాడుతానని స్పష్టం చేశారు.

మనిషికి నీడ ఎట్లనో.. తెలంగాణకు తాను అట్లని తేల్చిచెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వస్తే కాంగ్రెస్ నేతలు స్పందించలేదని, తాము రోడ్లపైకి వచ్చిన తర్వాతే ఆ ప్రతిపాదన వెనక్కు పోయిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాజధానికి ఒప్పుకొన్నది కూడా కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు. 14 ఎఫ్ విషయంలోనూ తాను నిరాహార దీక్ష చేయాల్సి వచ్చిందని అన్నారు. టీ బిల్లు విషయంలో మేం ఎన్నో డిమాండ్లు పెట్టినా.. టీ కాంగ్రెస్ నేతలు మాత్రం నోరుమూసుకుని కూర్చున్నారని మండిపడ్డారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో ఆంధ్రా ఉద్యోగులను ఒప్పుకొనే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ముక్కుమీద గుద్దుతరని ఆంధ్రోళ్లకు తెలుసు. అందుకే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావొద్దని అనుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. దొంగ ఎవరో దొర ఎవరో త్వరలోనే తేలిపోతుందన్నారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే గొర్రెల మందకు తోడేలును కాపలాపెట్టినట్లేనని చెప్పారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చెప్పడం ఈ సహస్రాబ్దికే తిరుగులేని జోక్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే చంద్రబాబు, ఆయన కొడుకు ఆస్తులు కక్కిస్తామని ప్రకటించారు. ఈసారి ఆయన స్టే కూడా తెచ్చుకోలేరని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పోలవరం ఆంధ్రవారికి ఉపయోగపడుతుందంటే అడ్డుకునేంత కుత్సితం తమకు లేదని, ఇక్కడ తెలంగాణను అది ముంచుతున్నది కాబట్టే దాని డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. టీ కాంగ్రెస్ నేతలు నిజంగానే సిపాయిలైతే పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ రద్దు చేయించాలని సవాలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడారు. వివిధ అంశాలపైనా.. వివిధ నేతలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు.. విమర్శలు ఇలా ఉన్నాయి.

అధికారం చేపట్టబోయే పార్టీ అధ్యక్షుడిని పోలవరం డిజైన్ మార్చకుండా కట్టొద్దు అన్నా. అయితే దీని మీద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఇతర తెలంగాణ నాయకులు ఉన్క మీద రోకన్లు ఎత్తేసినట్లుగా దుంక్కి పడుతున్నారు. నేను అడిగింది చెప్పకుండా తెలంగాణ నీ జాగీరా? నువ్వెవరు? అంటున్నరు. కేసీఆర్‌ను ఎవరు అని అడిగితే మనిషి తన నీడను నువ్వెవరని అడిగినట్లే ఉంటుంది. ఎంత సంస్కారహీనం. కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి కూడా మాట్లాడిర్రు. తెలంగాణ రాష్ట్రంలో మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారంలోకి రాబోయే పార్టీ అధ్యక్షుడిని నేను. ఇది 100శాతం జరుగుతుంది. అధికారం చేపట్టబోయే పార్టీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ కోసం మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో కూడా ఇదే పద్ధతుల్లో మాట్లాడుతా. ఆంధ్రవారికి ఇంకా దోచుకోవాలని ఉండొచ్చు. వారికి అనేక కోరికలు ఉంటాయి. కానీ నేను మాట్లాడుతుంటే మీకేం నొప్పి? రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా అంటున్నారు. అంటే న్యాయం అడుగొద్దా?ఉన్నదున్నట్లు మాట్లాడొద్దా? మీకు చేతకాకపోతే, సపోర్టు చేయలేకపోతే నోరుమూసుకోవాలి

కేంద్రాన్ని ఎన్నో అడిగాం తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సందర్భంలో ఎన్నో అడిగినం. 2005-06లోనే పోలవరంపై సుప్రీంకోర్టులో కేసు వేసి, ఓపెన్‌గానే పోరాడుతున్నం. ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని అడిగినం. 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని వద్దని అన్నం. తెలంగాణ రాష్ర్టానికి కూడా స్వయంప్రతిపత్తి హోదా కావాలని అడిగినం. ప్యాకేజీ కావాలని అన్నం. జనాభా ప్రతిపాదికన ఉద్యోగులు, పెన్షనర్ల పంపిణీ ఉండొద్దని అన్నం. వీటిల్లో ఒక్కటీ అంగీకరించలేదు. ప్రధాన మంత్రికి బహిరంగ లేఖ రాసినం. ఇవన్నీ మేం చీకట్లో అడుగలేదు. ప్రజల సాక్షిగానే అడిగినం. కానీ మీరు ఏమీ అడుగకుండా నోరుమూసుకున్నారు. ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతున్నా అడుగలేదు. రోశయ్య ప్రభుత్వంలో 14ఎఫ్ రద్దు కోసం మీరేమైనా కొట్లాడిర్రా? మీరు కొట్లాడితే నేను అమరణ నిరాహార దీక్ష చేసే ఖర్మ ఎందుకు పట్టేది? వైఎస్ సీఎంగా ఉండి ఇంకెక్కడి తెలంగాణ.. అంటుంటే ఆయన పక్కన కూర్చోని ఎక్కిరిచ్చిర్రు. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటుంటే.. అట్లెట్ల ఇయ్యవు? అని అడిగిర్రా? ఎవరికి తెల్వదు మీ చరిత్ర? నల్గొండ జిల్లా ఇప్పటికీ ఫ్లోరైడ్‌తో అల్లాడుతుంటే దీన్ని కాదని చిత్తూరు జిల్లాకు రూ.ఏడువేల కోట్లు తరలించుకుపోతుంటే గంగిరెద్దుల్లా సంతకాలు చేశారు. చేతకాదా? పౌరుషం లేదా? మీరు అడుగరు… అడిగెటోనికి అడ్డం పడుతరు

జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది నువ్వే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది నువ్వుకాదా పొన్నాల? నువ్వు ఆ దొంగల ముఠా సభ్యుడివే. ప్రాజెక్టుల మంజూరు ఫైళ్లపై నువ్వే కదా సంతకాలు పెట్టింది!ఆరేళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉండి దేవాదుల మొదటి దశను పూర్తిచేయలేదు. కానీ ఇవాళ పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నవు. నేను పార్టీ పెట్టినంక చంద్రబాబు ఆగమేఘాల మీద హెలికాప్టర్లో పోయి దేవాదులకు పునాదిరాయి వేసిండు. కానీ నువ్వు ఆరేళ్లు మంత్రిగా ఉన్నా ఎందుకు పూర్తిచేయలేదు? నీ తెలివి, నీ ప్రజ్ఞ ఏమైంది? నీ బతుకు అసమర్థుని జీవనయాత్రే! ఒక్కనాడన్న ఉద్యమంలో ఉన్నవా? ఉద్యమం ఉధృతం అయితే అమెరికా బాట.. లేకుంటే ఆస్పత్రి బాట! నీ చరిత్ర తెలుసు కదా. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. మిమ్మల్ని చూసి ప్రజలు జోకర్‌గాళ్లు అనికుని నవ్వుకుంటున్నరు. టీవీ9లో ఒకనాడు పోతిరెడ్డిపాడు మీద జూబ్లీహాల్లో పంచాయతీ పెడితే ఆనాడు నువ్వు వైఎస్‌కు డబ్బా కొట్టినవు. ఆనాడు నీకు చుక్కలు చూపించిన. నా దగ్గర సీడీలున్నయి. సమయం వచ్చినప్పుడు బయటపెడుత.

టీఆర్‌ఎస్ అధికారంలోకి రావద్దా డూడూ బసవన్నల్లా ఆంధ్రవాళ్లకు పొన్నాలైనా, డీఎస్ అయినా, దామోదర అయినా బాధలేదు. కానీ కేసీఆర్ ఉండొద్దు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ముక్కు మీద గుద్దుతరని ఆంధ్రోళ్లకు తెలసు. అందుకే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావొద్దని అనుకుంటున్నారు. ఇంకెవరొచ్చినా లొంగిపోతారని అంటున్నారు. నిజంగా మీరు సిపాయిలే అయితే పోలవరంపై కేంద్రం చేసిన ఆర్డినెన్స్ రద్దు చేయించుకురండి. అసలు ఏడు మండలాలను ఆంధ్రలో కలిపే ఆర్డినెన్స్ సక్రమమేనా? బిల్లు పాస్ అయిన తరువాత ఆర్డినెన్స్ తేవడం మోసం కాదా? ఉద్యోగులకు ఆప్షన్లపై దామోదర రాజనర్సింహకు బాధెందుకు? ఆప్షన్లు అంటే ఎట్లుంటయో నాకు తెల్వదా? నువ్వు చెప్పాల్నా? ఎందుకంత మిడిసిపాటు? కేసీఆర్ జాగీర్ కాదని, దొర అని లఫంగ ముచ్చట్లు ఎందుకు? ఎవరు దొర? ఎవరు దొంగ? నా జాగీరు కాదా? ప్రజలే చెబుతరు. ఆగమాగం ఎందుకు? ప్రస్తుత సెక్రటేరియట్‌లో 90శాతం మంది ఆంధ్ర ఉద్యోగులే ఉన్నారు. రేపు తెలంగాణ సెక్రటేరియట్ అయినంక ఇక్కడ ఆంధ్ర ఉద్యోగులు ఉండటాన్ని సమర్థిస్తావా? అనేక పాలసీలు జరిగే ప్రాంతంలో ఆంధ్ర వారు 90%, తెలంగాణవారు 10% ఉండొచ్చా దామోదరా? కేసీఆర్ వద్దు అంటున్నాడు. మొత్తం తెలంగాణ వారే ఉండాలంటున్నారు. నలభైఒకటిన్నర సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, 16 సంవత్సరాలు పాలించిన తెలుగుదేశంను ప్రజలు చూడలేదా? ఇంకా మీరే అధికారంలోకి రావాలా? ఇల్లు సదురుమని చెప్పిన మేస్త్రీ దాన్ని కూల్చేస్తే మళ్లీ ఆయనకే ఇల్లు కట్టే బాధ్యత ఇస్తామా? కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ కొంప కూల్చాయి. వీళ్లకు అధికారం అంటే గొర్రెల మందకు తోడేలును కాపలాపెట్టినట్లుగా ఉంటుంది. కాకి గంగలో మునిగితే హంస కాదు. గాలేరు నగరి ప్రాజెక్టు వందశాతం అక్రమ ప్రాజెక్టే. దీనికి అనుమతి ఇచ్చింది పొన్నాలే. ఒకవైపు తెలంగాణ ఉద్యమం సాగుతుంటే మరోవైపు ఈ అక్రమ ప్రాజెక్టు పూర్తయినప్పుడు రఘువీరారెడ్డి విజయయాత్ర చేశాడు. దీన్ని ప్రారంభించింది డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య. ఇన్నాళ్లూ తెలంగాణను కావాలి కాసిన. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతుంటే నువ్వు మాట్లాడుతవా అంటున్నారు. నేను చచ్చే వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే మాట్లాడుతా. దీనిపై ఎలాంటివెనుకడుగు లేదు. పెద్దపెద్ద రాకాసులతోనే కొట్లాడిన. ఈ బోకాసులకు భయపడుతనా? ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నా. కలిసి రండి.

అధికారానికి మీరు సమీపంలోనే లేరు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సమీపంలో కూడా లేదు. మూడింట రెండొంతుల మెజార్టీతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు చెబుతున్నయి. ప్రజలకేం చేస్తామని చెప్పామో వాటిని తప్పకుండా చేసి చూపిస్తాం. వచ్చేది జయనామ సంవత్సరం. తెలంగాణ అంతటా జయజయధ్వానాలే. సొంత రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తారు. ఉద్యోగులకు అప్షన్లు ఉండొద్దు అనేదానికి కారణాలున్నాయి. ఏపీభవన్ తెలంగాణ ప్రజల జాగీర్. మాకే ఉండాలి. దీనిపై కొట్లాడుతా. సుప్రీంకోర్టుకు కూడా పోత. అక్రమ ప్రాజెక్టులకు ముందుగా నీళ్లు పోనివ్వం. బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండిన తరువాతే మిగిలిన ప్రాజెక్టులకు నీళ్లు. తెలంగాణకు స్పెషల్ కేటగిరీ రావాలి. వాస్తవానికి ప్లానింగ్ కమిషన్ తెలంగాణలోని 10 జిల్లాల్లో 8 జిల్లాలు వెనుకబడినవేనని చెప్పింది. బడుగు, బలహీనవర్గాలు ఇక్కడే ఎక్కువ. ప్రత్యేక కేటగిరీ సాధించే వరకు పోరాటం చేస్తం. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిజమైన సిపాయిలైతే రెండుమూడు పనులు చేసుకురండి. ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా, ప్రత్యేక కేటగిరీ హోదా, ఏపీభవన్ తెలంగాణకే, ఉద్యోగులు, పెన్షనర్లను స్థానికత ఆధారంగా పంపండం, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చడంవంటివి చేసుకురండి. అధికారంలో ఉన్నది మీ పార్టీనే కదా! పులిచింతల ప్రాజెక్టును ఆరువందల మంది పోలీసులను పెట్టి వైఎస్ కట్టిండు. అప్పుడు ఈ పొన్నాలనే మంత్రిగా ఉన్నాడు. అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు ప్రజాభిప్రాయం తీసుకోలేదు? మంచిగా మాట్లాడితే మంచిగుంటం. మీరు ఒక్కటంటే మేం వందంటం. ఏపీ భవన్‌లో 200 మంది ఉద్యోగులుంటే తెలంగాణవారు కేవలం ముగ్గురే. ఆంధ్ర ఉద్యోగులను ఎందుకు తీసుకుంటం? వాళ్లను తీసుకుంటే మా నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తయి?

జూన్ 2 తరువాతే పంపకాలు పంపకాలపై ఎస్‌ఆర్‌సీ యాక్ట్‌లో చాలా క్లియర్‌గా ఉంది. గవర్నర్ పంచలేరు. పంపకాలకు ప్రాతిపాదిక ఏందీ అనేది మాత్రమే ఈ కమిటీలు చూస్తున్నాయి. కానీ కొన్ని పత్రికలు కూడా ఇప్పుడే పంపకాలు అని రాసేస్తున్నాయి. పంపకాలు మొత్తం జూన్ రెండు తరువాతే జరుగుతాయి. రెండు రాష్ర్టాల్లోని సీఎస్‌లు, ఇద్దరు సీఎంలు, ప్రభుత్వాలు ఉన్నప్పుడే పంపకాలు జరుగుతాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహనతో పంచుకుంటాయి.

ఏదైనా సమస్య ఉంటే కేంద్రం మధ్యలోకొచ్చి సమస్యను పరిష్కరిస్తుంది. ఏ ఒక్కటీ పోనివ్వకుండా ఉండాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలి. ఈమధ్య చంద్రబాబు జోరుగా మాట్లాడుతున్నడు. ఆయన కూడా అధికారంలోకి వస్తడట. ఇది జోక్ ఆఫ్ ద మిలీనియమ్. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తోంది కాస్కో. నీకు, నీ కొడుక్కు ఉన్న ఆస్తులను బయటకు కక్కిస్త. నువ్వు అమ్మిన భూములను, దాని వెనుకున్న అక్రమాలను కక్కిస్త. భూదాన భూములు, గురుకుల్ ట్రస్ట్ భూముల బండారం బయట పెడుత. వక్ఫ్ భూములను ఎవరు ధారాదత్తం చేశారో బయటకు లాగుతం. ఐఎంజీ వ్యవహారంలో కొట్టేసిన డబ్బులను కూడా బయటకు కక్కిస్తా. ఈ భయాల వల్లే కేసీఆర్ అధికారంలోకి రావొద్దని ఆంధ్రోళ్లు అనుకుంటున్నారు. అందుకే కేసీఆర్ రావొద్దని అనుకుంటున్నారు అని కేసీఆర్ అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.