-నాణ్యతలో రాజీవద్దు ఐదేండ్ల వరకు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే -ఆర్‌అండ్‌బీ రోడ్లపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే రోడ్ల నాణ్యత విషయంలో రాజీపడవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాబోయే మూడేండ్లలో రోడ్లన్నీ బాగుపడాలని స్పష్టంచేశారు. ఆర్‌అండ్‌బీ రోడ్లపై శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రోడ్లకు ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా పరిపాలన అనుమతులు జారీచేసింది. దీనిపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. బడ్జెట్‌లో రోడ్ల కోసం భారీగా నిధులు కేటాయించామని చెప్పిన కేసీఆర్.. నిర్ణీత సమయంలో పనులు పూర్తవడంతోపాటు నాణ్యత కూడా పాటించాలని ఆదేశించారు.
ఐదేండ్ల వరకు రోడ్ల నిర్వహణ కాంట్రాక్టర్లే చూసుకొనేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. రూ. 3704 కోట్ల వ్యయంతో 2721 కిలోమీటర్ల సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడం.. రూ.1974 కోట్లతో గోదావరి, కృష్ణా, ఇతర నదులు, ఉపనదులు, వాగులపై 390 వంతెనలు నిర్మించడం, రూ.2585 కోట్లతో 149 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు సింగిల్‌లేన్ రోడ్లను డబుల్‌రోడ్లుగా మార్చడం, రూ.2400 కోట్లతో 10 వేల కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు చేయడంలాంటి పనులు ప్రభుత్వ ప్రాధాన్యాలని ముఖ్యమంత్రి తెలిపారు.