Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మోదీ నిజ స్వరూపం ఇదీ.. యువతా మేలుకో!

‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది’- ఓ పాత తెలుగు సినిమాలో నూతన్‌ ప్రసాద్‌ డైలాగ్‌ ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డైలాగ్‌ అక్షరాలా వర్తిస్తుంది. బాధ్యత గల తెలంగాణ రాష్ట్ర మంత్రిగా చెప్తున్న ఈ మాట. మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ ఏలుబడిలో దేశ భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టబడింది. ఒకరిద్దరు తమ మిత్రులకు కేంద్ర పాలకులు మేలు చేసే ప్రక్రియలో కోట్ల మంది ప్రజల జీవితాలు అగమ్యగోచరమయ్యాయి. దేశ సంపద అంతా కార్పొరేట్‌ గద్దల పాలవుతోంది. భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను పరాయి దేశాల ముందు అభాసుపాలు చేస్తున్నారు. దేశ జనాభాలో సుమారు 50 శాతం యువత ఉన్న సుసంపన్న, సువిశాల దేశం మనది. అట్లాంటి యువ భారతం ప్రపంచం ముందు చేతులు చాచాలా? దేశ భవిష్యత్తునే తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊర్కోవాలా? మన నవ యువ భారతాన్ని మనమే నిర్మించుకోలేమా? ఈ పరిస్థితుల్లో దేశం లోపల, బయట జరుగుతున్న సంఘటనలను యువ భారతం ముందు ఉంచదలచుకున్న.. యువకుల్లారా ఆలోచించండి!

‘సబ్‌ కా సాత్‌- సబ్‌ కా వికాస్‌’ నినాదంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోదీ సర్కార్‌.. విమానాశ్రయాలు, ఓడరేవులు, రహదారులు, రైల్వేస్టేషన్లు, రైల్వే లైన్లు, విద్యుత్‌ లైన్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలికాం టవర్లు, చమురు పైపులైన్లు, బొగ్గు, మైనింగ్‌ ప్రాజెక్టులు, గోదాములు, ప్రభుత్వ హోటళ్లు, క్రీడా మైదానాలు.. ఇలా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ.. తమ కార్పొరేట్‌ మిత్రులకు అప్పనంగా కట్టబెట్టి సబ్‌ కా సత్తె నాశ్‌ చేస్తున్నది. ఉదాహరణకు మోదీ మిత్రుడు అదానీ అనే గుజరాతీ వ్యాపారి సంపద 2014లో సుమారు 45 వేల కోట్లు (7.3 బిలియన్‌ డాలర్లు) ఉంటే.. ఇప్పుడు 12 లక్షల కోట్లకు (140 బిలియన్‌ డాలర్ల)కు పెరిగింది. ఇది ఎలా జరిగిందంటే నరేంద్ర మోదీ, అమిత్‌ షా అదానీకి అక్రమంగా ఇచ్చిన ప్రోత్సాహమేనన్నది దాచేస్తే దాగని సత్యం. ఇవాళ అదానీ గ్రూప్‌ గుజరాత్‌, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశాలలో 11 రేవులను స్వాధీనం చేసుకున్నది.

ఒకే సంస్థకు రెండు కంటే ఎక్కువ విమానాశ్రయాలను ఇవ్వకూడదని నీతి ఆయోగ్‌ సూచించినా.. అందుకు భిన్నంగా అదానీ గ్రూపు దేశంలోని 8 ప్రధాన విమానాశ్రయాలను చేజిక్కించుకున్నది. 2014లో అదానీ గ్రూపునకు 44 ప్రాజెక్టులు ఉంటే 2022 నాటికి అంటే కేవలం ఎనిమిదేండ్లలో ప్రాజెక్టుల సంఖ్య దాదాపు 103కు చేరింది. బొగ్గు మైనింగ్‌, ట్రేడింగ్‌, రేవులు, షిప్పింగ్‌, రైల్వే, థర్మల్‌ విద్యుత్‌, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్‌ ఉత్పాదన, పంపిణీ, వ్యవసాయోత్పత్తులు, వంట నూనెలు, రవాణా, రియల్‌ ఎస్టేట్‌, కోల్డ్‌స్టోరేజీ కేంద్రాలు, గోదాములు, రక్షణరంగం, సిమెంట్‌ ఇలా అనేక రంగాల్లోకి అదానీ గ్రూపు విస్తరించినట్లు ఆ గ్రూపు వెబ్‌సైట్‌ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

సామాన్యుడు ఇల్లు కట్టుకునేందుకు తీసుకొనే రూ.20 లక్షల అప్పును బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు వారి మిత్రులైన బడా పారిశ్రామికవేత్తలకు చెందిన సుమారు 12 లక్షల కోట్ల లోన్లను ఈ ఎనిమిదేండ్లలో బ్యాంకులు మాఫీ చేశాయి. ఈ డబ్బు ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్నదే కదా!

భారతదేశ ప్రధాని మోదీ తన మిత్రుడైన అదానీకి మన్నార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను ఇవ్వాలని తమపై ఒత్తిడి తెచ్చాడని స్వయంగా శ్రీలంక సిలోన్‌ విద్యుత్‌ బోర్డు చైర్మన్‌ ఎం.ఎం.సి.ఫెర్డినాండో వెల్లడించింది వాస్తవం కాదా? శ్రీలంకలో దీనిపై ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. భారతదేశం పరువు మంట గలిసింది. ఆస్ట్రేలియాలోని బొగ్గు గనులపై దాదాపు రూ.940 కోట్ల పెట్టుబడులు పెట్టింది మోదీ దోస్త్‌ అదానీ కంపెనీ. ఆ దేశ ప్రజలు ఏకంగా ‘గో హోమ్‌’,‘స్టాప్‌ అదానీ’ అని ప్లకార్డులు పట్టుకొని అదానీ కార్మిఖేల్‌ బొగ్గుగని లీజును రద్దు చేయాలని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.

2007లో జరిగిన వేలంలో 2జీ స్పెక్ట్రం టెక్నాలజీ రూ.1.7 లక్షల కోట్లకు అమ్ముడు పోయినప్పుడు.. దాంట్లో అవినీతి జరిగిందని అరిచి గీ పెట్టిన అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ.. ఇప్పుడేమో అంతకంటే మెరుగైన టెక్నాలజీ అయిన 5జీ స్పెక్ట్రంను కేవలం రూ.1.48 లక్షల కోట్లకే తమకు సన్నిహితులైన టెలికాం కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టారు. 2007లో వచ్చిన రూ.1.70 లక్షల కోట్ల విలువ ఈ పదిహేనేండ్ల వ్యవధిలో రూపాయి మారకం ప్రకారం సుమారు రూ.12 లక్షల కోట్లు అయితది. అందుకే మొన్న జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని దేశవ్యాప్తంగా ఒక అభిప్రాయం నెలకొన్నది. ఇట్లా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రజలు తమను తిరస్కరించిన చోట.. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలతో ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

అదానీ ఆస్ట్రేలియా బొగ్గు గనులకు లాభం చేకూర్చటానికి దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హుకుం జారీచేసింది. మన సింగరేణి బొగ్గు ధరలు టన్నుకు రూ.3,000-5,000 వరకు ఉండగా.. దిగుమతి చేసుకునే బొగ్గు ధర టన్నుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల (సీజీ ఎస్‌)తో పాటు ప్రైవేటు విద్యుత్‌ కేంద్రాల నుంచి రాష్ర్టాలకు సరఫరా అవుతున్న విద్యుత్‌ ధరలు అమాంతం పెరిగాయి. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లతోపాటు, సామా న్య వినియోగదారులపైనా ప్రభావం పడుతున్నది.

ఎనిమిదేండ్లలోనే దేశాన్ని మునుపెన్నడూ లేనంతగా అప్పుల కుప్పగా మార్చారు మోదీ. 1947-2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పు సుమారు రూ.55 లక్షల కోట్లయితే మోదీ ఎనిమిదేండ్లలో చేసిన అప్పు సుమా రు రూ.94 లక్షల కోట్లు. ఈ దేశ యువత భవిష్యత్తును ప్రపంచబ్యాంకు వద్ద తాకట్టు పెట్టింది బీజేపీ. అప్పు చేసిన ఆ లక్షల కోట్లతో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? సమాజంలో ఏదైనా పెద్ద మార్పు కోసం ఖర్చుచేసారా? దీనిపై యువత ఆలోచించాలి. యువత కోసం ఏటా కోటి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పిన మోదీ.. ప్రభుత్వరంగ సంస్థలను మూసేస్తూ, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నడు. దేశంలో నిరుద్యోగం 2014లో 5.44 శాతం ఉంటే 2022కు 7.1 శాతానికి పెరిగింది.

2014లో మోదీ వచ్చిన కొత్తలో ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.58.55 ఉంటే ఇప్పుడు రూ.83 అయ్యింది. రూపాయి విలువ రికార్డు స్థాయి పతనాన్ని చవిచూస్తున్నది. అట్లాగే విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు గణనీయంగా క్షీణించాయి. గత అక్టోబర్‌లో 642 బిలియన్‌ డాలర్ల నిల్వలుండగా, ప్రస్తుతం 545.65 బిలియన్‌ డాలర్ల కు తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ ఆర్థికస్థితి అధోగతి పాలవుతున్నది. అదనపు సెస్సులు మోపడం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి అన్ని రకాల సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నవి. బీజేపీ ప్రభుత్వ వైఖరి వల్ల దేశ మనుగడే ప్రశ్నార్థకమైంది. ఆలోచించండి యువకుల్లారా!

అందుకే కదా.. బీజేపీ అసమర్థ, దోపిడీ పాలనను ప్రశ్ని స్తూ కేసీఆర్‌ భారత్‌ రాష్ట్ర సమితితో బయల్దేరిండు. దీంతో గుజరాత్‌ మాడల్‌లోని డొల్లతనం బయటపడి, ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం బీజేపీకి మొదలైంది. కేసీఆర్‌ను అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నది. కానీ, కేసీఆర్‌ ఆగరు. దేశానికి అసలైన రోల్‌మోడల్‌ తెలంగాణ. కండ్ల ముందు కనిపిస్తున్న ప్రగతి, కేంద్రం అందించిన అవార్డులు, కేంద్రమంత్రుల ప్రశంసలే దీనికి సాక్ష్యం. దేశవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్‌ లాంటి నాయకుడు కావాలని బలంగా కోరుకుంటున్నారు. తెలంగాణ మాడల్‌ పాలనను దేశమంతటా అందించాలని ఆహ్వానిస్తున్నారు.

దేశం బాగు కోసం కంకణం కట్టుకొని కేసీఆర్‌ అడుగు ముందుకువేశారు. ప్రాణాల మీదకి వచ్చినా అడుగు వెనక్కి వేయరు. దేశ పేరు ప్రతిష్ఠలు కాపాడటానికి, దేశం పూర్వ వైభవం సంతరించుకోవడానికి కేసీఆర్‌ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. దేశ ప్రజలు కేసీఆర్‌ వెంట నడిస్తే ఇప్పుడు తెలంగాణ ఎట్లా సస్యశ్యామలమైందో.. రేపు భారతదేశం అంతా కూడా అట్లనే అగ్రరాజ్యం అవుతుంది. ప్రస్తుత తరుణంలో యువత మేలుకోవాలి. బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్‌కు మద్దతుగా నిలబడాలి. నేను కచ్చితంగా చెప్పగలను ఈ దేశానికి కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామ రక్ష అని.
(వ్యాసకర్త: రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి)

వేముల ప్రశాంత్‌ రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.