– ఆయన ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి – బీజేపీ ప్రధాని అభ్యర్థిపై కేసీఆర్ నిప్పులు – బతికిన బిడ్డ ఎవరు? సచ్చిన తల్లి ఎవరు? -తెలంగాణ ఏర్పాటుతో భరతమాత సంతోషించింది -మోడీ క్షమాపణ చెప్పకుంటే ఊరుకునేదిలేదు – చంద్రబాబు, పొన్నాల అరెస్టు తప్పదు – తెలంగాణ ఇప్పుడు మేల్కొన్న బెబ్బులి – నిజామాబాద్, మెదక్ జిల్లాల సభల్లో కేసీఆర్

మోడీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి. తెలంగాణకు శత్రువు. మిస్టర్ నరేంద్రమోడీ బీ కేర్‌పుల్. తెలంగాణ ఇప్పుడు మేల్కొన్న బెబ్బులి. ఆంధ్రా నాయకులను చెరో పక్కన కూర్చోబెట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.
నువ్వో సన్యాసివి. తెలంగాణ ఏర్పాటుతో తల్లి చచ్చింది..బిడ్డ బతికిందా? ఏ తల్లి చచ్చింది? ఏ బిడ్డ బతికింది? తెలంగాణ ఇస్తే భరతమాత ఏడ్చిందా? స్వేచ్ఛా వాయువుల్లోకి వచ్చిన తెలంగాణను ముద్దాడి.. భరతమాత సంతోషపడింది. అయినా నీకు సంస్కారం ఉందా? తెలంగాణ ఉద్యమంలో వేల మంది విద్యార్థులు బలిదానమయ్యారు. పోరాడి తెలంగాణ సాధించుకుంటే కనీసం శుభాకాంక్షలు చెప్పే విజ్ఞత లేదు. నువ్వా మాట్లాడేది? నీ వెంట ఉన్న చంద్రబాబు మహా మోసగాడు. తెలంగాణ పసిగుడ్డును తీసుకెళ్లి దయ్యాలకు అప్పగించవద్దు. పొన్నాల లక్ష్మయ్య బండారాన్ని బయట పెట్టినం. రెండురోజుల్లో ఆయన అరెస్టు కావడం ఖాయం. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో దళిత భూములను పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించుకున్నాడు. దీనిపై రెండు రోజుల్లో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. ఆ తర్వాత పొన్నాల అరెస్టు అయితడు. – నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారసభల్లో కేసీఆర్
నిజామాబాద్, సంగారెడ్డి:బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణకు శత్రువు మోడీ అని బాజాప్తాగా ప్రకటిస్తున్నానంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. గురువారం నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, మోర్తాడ్, ఆర్మూర్, డిచ్‌పల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభల్లో కేసీఆర్ మాట్లాడారు. అన్ని సభల్లోనూ నరేంద్రమోడీని టార్గెట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తోపాటు టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై విరుచుకుపడ్డారు. సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న మోడీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని అవమానపర్చారని ఆరోపించారు. తెలంగాణపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి మోడీకి ఎన్ని గుండెలంటూ నిలదీశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
మిస్టర్ నరేంద్రమోడీ బీ కేర్‌పుల్. తెలంగాణ ఇప్పుడు మేల్కొన్న బెబ్బులి. చెరో పక్కన ఆంధ్రా నాయకులను కూర్చోబెట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. నువ్వో సన్యాసివి. నువ్వు చెప్పే లెక్క ఏంది? 1+1+1=111 అంటావా! నీ లెక్క తప్పు. 1+1+1=0. ఇది కరెక్ట్ లెక్క. నీ బతుకు జీరో అవుతుంది. తెలంగాణ ఏర్పాటుతో తల్లి చచ్చింది.. బిడ్డ బతికిందా? ఏ తల్లి చచ్చింది? ఏ బిడ్డ బతికింది?
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవాలకు మోడీ వస్తే అరెస్టు చేస్తానని సీఎం కుర్చీలో కూర్చుండి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మోడీ చంకలో చేరాడని విమర్శించారు. హైదరాబాద్‌లో వేల కోట్ల విలువచేసే భూములను కబ్జా చేసుకున్న ఆంధ్రోళ్లకు మోడీ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కోసం పడ్డ యాతన, ఏడ్చిన ఏడ్పులు మోడీకేం తెలుసు? చంద్రబాబు పిచ్చిపిచ్చి కూతలు మానుకోకుంటే తెలంగాణలో తిరిగే పరిస్థితి ఉండదు అని హెచ్చరించారు. ఆంధ్ర పార్టీలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఇంటి పార్టీనే ఆదరించి 90 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
రెండు నెలల్లో నిజాంషుగర్స్ స్వాధీనం ప్రఖ్యాత బోధన్ నిజాం షుగర్స్‌ను తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పూర్తిస్థాయిలో ప్రభుత్వపరం చేస్తామని కేసీఆర్‌ప్రకటించారు. మరోసారి ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా తీర్చిదిద్దుతామన్నారు. నిజాం షుగర్స్‌ను అక్రమంగా అమ్ముకున్న చంద్రబాబుపై టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. చంద్రబాబును జైలుకు పంపి తీరుతామని హెచ్చరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఫరేఖ్ 2002లో నిజాం షుగర్స్ అమ్మకంలో చంద్రబాబు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డాడో ఇటీవల వెల్లడించారని గుర్తుచేశారు. నిజాం షుగర్స్ అమ్మకంతో 380 కోట్లు నష్టం వచ్చిందన్నారు. ఇటువంటి వ్యక్తిని తెలంగాణలో విడిచిపెట్టేదిలేదన్నారు. వైఎస్ నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుంటామని చెప్పి, మోసం చేసిండన్నారు. బోధన్‌లో చెరుకు పంటకు పూర్వ వైభవం తెస్తామని, చెరుకు ఉత్పత్తి పెంచేందుకు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
రెండు రోజుల్లో పొన్నాల అరైస్టెతడు... పొన్నాల లక్ష్మయ్య బండారాన్ని బయట పెట్టినమని, రెండురోజుల్లో అరెస్టు కావడం ఖాయమని కేసీఆర్ అన్నారు. వరంగల్‌జిల్లా ధర్మసాగర్ మండలంలో దళిత భూములను పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించుకున్నాడని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలతో రెండురోజుల్లో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పొన్నాల అరస్టైతాడని అన్నారు. కొంతకాలంగా పొన్నాల తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని చెబుతూ కేసీఆర్ మంచీచెడు ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. 40ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరగబెట్టింది ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌కే అధికారమని తేలడంతో కాంగ్రెస్ నేతల కాళ్లకింద భూములు కదులుతున్నాయన్నారు. అందుకే రాహుల్‌గాంధీ మొదలుకొని పొన్నాల వరకు, టీ పీసీసీ నాయకులు, ఆంధ్ర పార్టీల అధినేతలు తననే టార్గెట్ చేస్తున్నారని కేసీఆర్ వివరించారు. కేసీఆర్‌ను చూస్తుంటే వాళ్లకు భయమైంది. ఏం ఎందుకు? టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వారి ఆటలు సాగవనే అన్ని పార్టీల నేతలు ఏకమయ్యారు అని చెప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అసెంబ్లీ సాక్షిగా అప్పటి సీఎం కిరణ్ మాట్లాడుతుంటే టీ మంత్రులు ఎందుకు స్పందించలేదు? అలాంటి వారు ఇప్పుడు తెలంగాణ మేమే తెచ్చామంటూ ప్రచారం చేసుకోవడం విచిత్రంగా ఉన్నది. ఈ ఎన్నికల్లో వారందరికీ గుణపాఠం తప్పదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేత కేవీపీ ఆశీస్సులతో పదవి తెచ్చుకున్న పొన్నాలకు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
డీఎస్… దేఖ్ లేంగే.. నిజామాబాద్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌పై డీఎస్ దాడి చేయించారని కేసీఆర్ ఆరోపించారు. దాడులతో భయపెట్టాలని చూస్తే దుమ్ములేపుతామని హెచ్చరించారు. చూసుకుందామంటే మేము కూడా రెడీ అని సవాల్ విసిరారు. నిజామాబాద్‌లో చెల్లని రూపాయి రూరల్‌లో చెల్లుతుందా? నిజామాబాద్ అంగడిలో అమ్ముడుపోని గోద డిచ్‌పల్లి అంగడిలో అమ్ముడు పోతుందా? అని ప్రశ్నించారు. డీఎస్ గెలిచి సీఎం అయ్యేదిలేదన్నారు. అసలా పార్టీయే గెలవదన్నారు. అనుభవం ఉన్న బాజిరెడ్డిని గెలిపిస్తే పెద్ద పదవిలో ఉంటారని హామీ ఇచ్చారు. గోవర్ధన్ సేవలను ఉత్తర తెలంగాణ స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలవడం, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి కావడం ఖాయమన్నారు. కామారెడ్డిలో షబ్బీర్‌అలీ ఆటలు సాగవని హెచ్చరించారు. ఆయనకు మరోసారి ఓటమి తప్పదని చెప్పారు. గంప గోవర్ధన్‌ను గెలిపించి పంపిస్తే మంచి పదవిలో ఉంటారని హామీ ఇచ్చారు.
బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి… రెక్కలు ముక్కలు చేసుకున్నా సరైన వేతనాలు అందక బీడీ కార్మికులు అరిగోస పడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంతటా లక్షలాదిగా ఉన్న బీడీ కార్మికులకు మేలు చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఇప్పుడున్న వేతనాలకు అదనంగా నెలకు వెయ్యి రూపాయల భృతిని ఇప్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. దళిత క్రిస్టియన్లను బీసీలుగా పరిగణించడం వల్ల ఉద్యోగ అవకాశాల్లో నష్టపోతున్నారని చెప్పారు. ఈ సమస్యపై అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రంలో కొట్లాడుతానని అన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న తరహాల్లో ఆరెకటికెలను ఎస్సీలో చేరుస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలోని గృహనిర్మాణం, రుణాలమాఫీవంటి అంశాలను మరోసారి ప్రస్తావించారు. ఈ హామీలన్నీ అమలు చేయించే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. అందుకోసమే తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాల్సి ఉందన్నారు. ప్రజలంతా ఒక్కటై టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. లేకుంటే తెలంగాణ పునర్నిర్మాణం జరగదన్నారు. తెలంగాణ ప్రజలు తమ తలరాతలను తామే రాసుకునే చరిత్రాత్మక ఎన్నికలివని కేసీఆర్ అభివర్ణించారు.
ఇందూరుకే సింగూరు జలాలు నిజాంసాగర్ ఆయకట్టుకు టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే సింగూరు జలాలను తరలిస్తామని, నిజామాబాద్ జిల్లాకు సింగూరు జలాలపై హక్కు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సింగూరు నీటిలో 3,4 టీఎంసీలను మెదక్ జిల్లాకు కేటాయించి, మిగతా నీటినంతా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు విడిచిపెడతామని అన్నారు. ఇన్నాళ్లూ ఆంధ్రోళ్ల పాలనలో నీరు లేక పంటలను ఎండబెట్టుకోవాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక ఆ పరిస్థితి ఉండని, సింగూరు నీళ్లకు ఎవరు అడ్డం పడతారో చూస్తానంటూ కేసీఆర్ హెచ్చరించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి లక్షా 25వేల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. సింగూరు ద్వారా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. మెదక్ పట్టణం కేంద్రంగా మెదక్ జిల్లానే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నేను పుట్టిన గడ్డ మెదక్. ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తా అని చెప్పారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శేరి సుభాష్‌రెడ్డి, సోమశేఖర్‌లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని కేసీఆర్ మెదక్ సభలో హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో బోధన్ దీక్షలు ఓ అద్భుతం.. బోధన్‌లో తెలంగాణ కోసం 1500 రోజులపాటు జరిగిన నిరాహారదీక్షలు ఓ అద్భుతమని కేసీఆర్ కొనియాడారు. ఎక్కడాలేని విధంగా తెలంగాణ బిడ్డలు ఇక్కడ తెలంగాణ సాధించేవరకు ఉద్యమానికి అండగా దీక్షలు చేశారని అన్నారు. కవిత నా బిడ్డ. తెలంగాణ జాగతి అధ్యక్షురాలు. అమెరికాలో ఉండేది. ఉద్యమంలో నాకు తోడుంటానంటూ వచ్చింది. మీ జిల్లా కోడలు అంటూ కవిత గురించి కేసీఆర్ చెప్పారు. మెదక్ స్థానం నుంచి పోటీ చేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ బరిలో ఉన్న మదన్‌రెడ్డిలను గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఈ బహిరంగ సభలో నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థులు కవిత, బీబీ పాటిల్, అసెంబ్లీ అభ్యర్థులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హన్మంత్‌షిండే, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, షకీల్, టీఆర్‌ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జ్ రాజయ్యయాదవ్‌లతో జిల్లా నాయకులు పాల్గొన్నారు.