Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మోదీ బినామీ అదానీ

-హిండెన్‌బర్గ్‌పై అదానీని ప్రశ్నించే దమ్ముందా?
-డబుల్‌ ఇంజిన్‌ అసలు రూపం మోదానీ
-ఈడీ జారీచేసే సమన్లు.. మోదీ సమన్లే
-సీబీఐ కీలుబొమ్మ… ఈడీ తోలుబొమ్మ
-దాడులతో బీఆర్‌ఎస్‌ విస్తరణను ఆపలేరు
-దేశమంతా అవినీతిపరులా? బీజేపీ నేతలు
-సత్యహరిశ్చంద్రుడి కజిన్సా.. బామ్మర్దులా?
-బీజేపీ నిజస్వరూపాన్ని నగ్నంగా నిలబెడ్తాం
-విపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి
-ఏ విచారణకైనా మేం సిద్ధం.. మోదీ రెడీయా?
-ప్రెస్‌మీట్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సవాల్‌

అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్‌గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్‌ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమోదీ సొంత కంపెనీ. అదానీ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రధాని హోదాలో మార్కెటింగ్‌ చేస్తున్నారు. ప్రధానిపై ఆరోపణలు వస్తే ప్రజలకు వివరణ ఇవ్వాలనే ఇంగితం కూడా లేదు.
– మంత్రి కేటీఆర్‌

ప్రధాని మోదీకి విచారణను ఎదుర్కొనే దమ్ముందా? మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మోదీకి అదానీనే బినామీ అని దేశంలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడని ఎద్దేవా చేశారు. చట్టాలను గౌరవించే భారతీయపౌరులుగా తాము విచారణను ధైర్యంగా ఎదుర్కొంటామని, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్నదని తెలిపారు. కేసును ఎదుర్కొనే ధైర్యంలేని బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ లాంటి వాళ్లం తాము కాదని స్పష్టం చేశారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కనుమరుగు చేయటమే బీజేపీ లక్ష్యమని విమర్శించారు. దేశవ్యాప్తంగా విపక్షపార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జారీ చేసే సమన్లను మోదీ సమన్లుగా ఆయన అభివర్ణించారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థల దాడులకు బీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బెదరరని తేల్చి చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత దాకా ఎంతోమంది బీఆర్‌ఎస్‌ పార్టీనేతలపై దాడులు జరిగాయని తెలిపారు. గురువారం తెలంగాణభవన్‌లో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కార్‌పై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. మోదానీగా మారిన డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నిజస్వరూపాన్ని నగ్నంగా ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు బీఆర్‌ఎస్‌ విస్తరణను, సీఎం కేసీఆర్‌ మనోైస్థెర్యాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు.

సీబీఐ కీలుబొమ్మ… ఈడీ తోలుబొమ్మ
మోదీ చేతుల్లో సీబీఐ కీలుబొమ్మ.. ఈడీ తోలుబొమ్మగా మారాయని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై ఇప్పటి దాకా జరిగిన దాడులు నూటికి నూరుపాళ్లు ఈడీ ద్వారా మోదీ చేయించిన దాడులని పేర్కొన్నారు. అయితే జుమ్లా లేదంటే హమ్లా ఇదే మోదీ విధానంగా మారిందని ధ్వజమెత్తారు. దేశమంతా అవినీతిపరులు, తాము మాత్రమే సత్యహరిశ్చంద్రుడి కజిన్‌బ్రదర్స్‌.. బామ్మర్దులైనట్టు బీజేపీ ఫోజులు కొడుతున్నదని ఎద్దేవా చేశారు. నీతి లేని పాలనకు.. నిజాయితీలేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా ఎన్డీయే ప్రభుత్వం నిలిచిందన్నారు.

ప్రతిపక్షాల మీద కేసుల దాడి.. ప్రజల మీద ధరల దాడి
ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి.. ఇది తప్ప కేంద్రం సాధించింది ఏమీలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గౌతమ్‌ అదానీ ఎవరి బినామో చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని ప్రశ్నించారు. మోదీ వల్లనే అదానీ ప్రాపకం పెరిగిందని స్పష్టం చేశారు.

బీబీసీపై దాడితో ఇండియన్‌ మీడియాకు మోదీ హెచ్చరిక
బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల మీద దాడులు చేయడం ద్వారా తమకు అనుకూలంగా లేకపోతే మీడియా సంస్థల మీద ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని మోదీ దేశ మీడియా సంస్థలను హెచ్చరించారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ‘బీబీసీనే లెక్కచేస్తలేను ఇక మీరెంత’ అని ఇండియన్‌ మీడియాకు వార్నింగ్‌ ఇచ్చారని తెలిపారు.

జీ టు జీ డీల్‌ – అదానీ మోదీ బినామీ
జీ 20 సదస్సులో పాల్గొనడానికి వచ్చిన శ్రీలంక ఆర్థిక మంత్రి అదానికి శ్రీలంకకు మధ్య జరిగిన రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్‌గా పేర్కొన్న విషయాన్ని మంత్రి ఉదహరించారు. జీ టు జీ అంటే గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ కాదని, అదీ గౌతమ్‌ అదానీ టు గొటబయ (శ్రీలంక మాజీ రాష్ట్రపతి గొటబయ రాజపక్షే) అని వివరించారు. జీ టు జీకి మధ్యవర్తిగా వ్యవహరించింది మోదీ అని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ప్రతిపక్షాల మీద 5,422 కేసులు పెట్టారని, వీటిలో కేవలం 23 కేసుల్లో మాత్రమే శిక్షపడిందని తెలిపారు. దర్యాప్తుసంస్థను ఈ స్థాయిలో దుర్వినియోగం చేసినందుకు ఈడీకి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలా? అని ఎద్దేవా చేశారు. ఈడీ అంటే ఇరాడికేషన్‌ ఆఫ్‌ డెమోక్రసీ (ప్రజాస్వామ్యాన్ని కనుమరుగు చేయటం)గా మోదీ మార్చారని మండిపడ్డారు. దేశంలో అసలు ప్రతిపక్షాలే లేకుండా చేయాలనే మోదీ కుట్రకు నిదర్శనమే ఈ దాడులని వివరించారు. కేవలం విపక్షాలపై బురదజల్లటమే పనిగా బీజేపీ వ్యవహరిస్తున్నదన్నారు. నమ్ముకున్న ప్రజల కోసం బీజేపీ వైఫల్యాలను ఎండగట్టిన పాపానికి ప్రాంతీయ పార్టీల నేతల మీద కేసుల పేరుతో బీజేపీ బెదిరిస్తున్నదని తెలిపారు. ఒక్క బీజేపీ నాయకుడిపై ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు లేవని నిలదీశారు.

కేసీఆర్‌ మానసిక ైస్థెర్యాన్ని దెబ్బతీయలేరు
కేసీఆర్‌ మానసిక ైస్థెర్యాన్ని దెబ్బతీయాలనే బీజేపీ కుట్రలను తిప్పికొడతామని మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లల్లో డిపాజిట్లు రాలేదని గుర్తుచేశారు. ఉద్యమనేత బిడ్డగా మొదటి నుంచే చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్న ఉద్యమకారురాలు ఎమ్మెల్సీ కవితపై ఈడీ పేరుతో వేధింపులకు దిగటం వెనుక ఉద్దేశం కేసీఆర్‌ను టార్గెట్‌ చేయటం కాదా? అని ప్రశ్నించారు.

అవినీతికి కేరాఫ్‌ బీజేపీ
దేశంలో అవినీతికి కేరాఫ్‌గా బీజేపీ మారిందని కేటీఆర్‌ ఆరోపించారు. 2 రోజుల క్రితం కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కొడుకు రూ.40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని, దీనిమీద ఈడీ, సీబీఐ దాడి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. మహారాష్ట్రకు చెందిన ఎంపీ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై టీవీల్లో ప్రసారమైన వీడియో క్లిప్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రదర్శించారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీజేపీలో చేరిన హర్షవర్ధన్‌ అనే ఎంపీ ‘నేను బీజేపీలోకి వచ్చిన తర్వాత హాయిగా నిద్రపోతున్నా. ఈడీ నుంచి ఉపశమనం లభించింది’ అని బాహాటంగా చెప్పిన ఉదంతాలను పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వేల కోట్ల కుంభకోణంలో ఇరుకున్న తృణమూల్‌ నేత సువేందు అధికారిని విచారణ పేరుతొ భయపెట్టి ఆ తర్వాత బీజేపీలో చేరగానే వాషింగ్‌ పౌడర్‌ నిర్మా కాలేదా? అని గుర్తు చేశారు. శారదా కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న హిమంత బిశ్వశర్మ బీజేపీలో చేరిన తరువాత ఈడీ, సీబీఐ కేసులు, దర్యాప్తు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

రాజకీయ డ్రామాను ఎదుర్కొంటాం
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజకీయ డ్రామాను రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్నదన్నారు. అంతిమంగా న్యాయమే విజయం సాధిస్తుందని చెప్పారు. మోదీ సమన్లకు.. ఉడుత ఊపులకు తెలంగాణలో భయపడేవాడెవరూ లేరని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఆదివారమెలా కాదో, మోదీయే శాశ్వతం కాదని తెలిపారు.

గౌతమ్‌ అదానీని ప్రశ్నించే దమ్ముందా?
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన హిండెన్‌బర్గ్‌ నివేదికతో రూ.13 లక్షల కోట్ల ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థల్లోని ప్రజల డబ్బులు ఆవిరైనా ప్రధానమంత్రి ఉలకడు పలకడు, దేశ ఆర్థిక మంత్రికి కనీసం చీమకుట్టినట్టు కూడా కాదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై ప్రధాని, ఆర్థికమంత్రి నోరెందుకు మెదపరని నిప్పులు చెరిగారు. ఒక సంస్థకు రెండు ఎయిర్‌పోర్టులకంటే ఎకువ కాంట్రాక్టు కట్టబెట్టొద్దు అని అప్పటిదాకా ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి గౌతమ్‌ అదానీకి 6 ఎయిర్‌పోర్టులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇలా కట్టబెట్టడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, నీతి అయోగ్‌ చెప్పినా ఎవరి ప్రయోజనాల కోసం కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలను మార్చి ఆయనకు ఆర్థికలబ్ది చేకూరేలా వ్యవహరిస్తూ దేశాన్ని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తున్నదని మండిపడ్డారు. గౌతం అదానీ ఆధీనంలోని గుజరాత్‌ ముంద్రాపోర్టులో రూ.21 వేల కోట్ల విలువైన 3000 కిలోల హెరాయిన్‌ పట్టుబడినా ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కాదని ప్రశ్నించారు. కేంద్రానికి, దర్యాప్తు సంస్థలకు గౌతమ్‌ అదానీని ప్రశ్నించే దమ్ముందా అని ఆయన నిప్పులు చెరిగారు. దేశంలోని యువతను పెడత్రోవ పట్టించే మత్తు పదార్థాలు అదానీ పోర్టు కేంద్రంగా బట్వాడా అయితే అదానీపై కేసు పెట్టారా? అని నిలదీశారు.

రూ.2500 కోట్లు ఇస్తే సీఎం పదవీ ఇస్తానని చెప్పిందెవరు?
కర్ణాటక ఎమ్మెల్యే, మాజీ మంత్రి రూ.2500 కోట్లు ఇస్తే తమ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని బాహాటంగా చెప్పింది నిజం కాదా? అని మంత్రి నిలదీశారు. ఇంత బాహాటంగా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేదంటేనే అందులో నిజం ఉన్నట్టు ప్రజలకు అర్థమైపోయిందని తెలిపారు. దేశంలో అత్యంత అవినీతి పాలన కర్ణాటకలో సాగుతున్నదని మీడియా, తమకు పనులు కావాలంటే 40 శాతం కమీషన్‌ ఇవ్వాల్సి వస్తున్నదని ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లు, ప్రైవేట్‌ యాజమాన్య సంస్థలు బాహాటంగా ఘోషిస్తే చర్యలెక్కడ తీసుకున్నారని ప్రశ్నించారు. హిందుత్వానికి ప్రతీకలుగా ఉన్న మఠాధిపతులు కూడా తమకు కమీషన్లు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్న సందర్భాలను సైతం కేటీఆర్‌ గుర్తుచేశారు.

మోదీకి విచారణను ఎదుర్కొనే దమ్ముందా?
బీఎల్‌ సంతోష్‌ ఇద్దరు స్వాములను పంపి దొరికాడని.. ఆయన దొంగలా కోర్టులకు వెళ్లి విచారణకు రాకుండా స్టే తెచ్చుకున్నారని, తాము అలా కాదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. విచారణకు హాజరు కాకుండా కోర్టుకు పోయి తనను అరెస్టు చేయవద్దని భయపడి దాక్కోబోమని తేల్చిచెప్పారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా బాజాప్తా విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు. విచారణలను ఎదుర్కొంటామని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత కూడా బాజాప్తా ఎదుర్కొంటారని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఎదర్కోవటంలో తమ పార్టీలో కవితనే మొదటివారు కాదని, ఆమె చివరి వారూ కాబోరని కూడా చెప్పారు. ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్‌, మల్లారెడ్డి, తలసాని, జగదీశ్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, ఎల్‌ రమణ, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి తదితరులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాడులు చేశాయని గుర్తు చేశారు. ఇటువంటివి ఇంకా వస్తాయని చెప్పారు. ఎన్ని వచ్చినా వాటి విచారణను ఎదుర్కొనే దమ్ము తమకు ఉన్నదని, ఆ దమ్ము మోదీకి ఉన్నదా? అని ఆయన ప్రశ్నించారు. గౌతం అదానీ మోదీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా… శ్రీలంక ప్రభుత్వం చెప్పినా ‘పలుకే బంగారమాయేనా ’ అన్నట్టు మోదీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చాయ్‌పే చర్చ.. పరీక్షాపై చర్చ అని అన్నిటిపై మాట్లాడే మోదీ వీటిపై ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు.

విదేశీ బొగ్గెందుకు?
ఒక వ్యక్తి ప్రయోజనం కోసం విధానాన్ని మార్చిన దుర్మార్గం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌దని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. స్వదేశంలో చౌకగా దొరికే బొగ్గు ఉండగా, విదేశీబొగ్గును ఎందుకు తీసుకోవాలె అని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు స్వయంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి కూడా ప్రశ్నించటం నిజం కాదా? అని గుర్తు చేశారు. ఇది ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చటం కాక మరేమిటని ప్రశ్నించారు. అదానీ ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో తీసుకున్న బొగ్గు కోసం మోదీ ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇజ్జత్‌ లేకుండా ప్రమాణ స్వీకారానికి
దేశంలో కొన్రాడ్‌ సంగ్మా ప్రభుత్వం అత్యంత అవినీతి పాలన సాగిసున్నదని మేఘాలయ ఎన్నికల ప్రచార సభల్లో అమిత్‌షా, ప్రధాని మోదీ ఇద్దరికిద్దరు విమర్శించి, తీరా అదే సంగ్మా సీఎంగా పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇజ్జత్‌లేకుండా వెళ్లారని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. సంగ్మా పార్టీకి 28 సీట్లు, బీజేపీకి 2 సీట్లు రావటంతో సంగ్మాకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇజ్జత్‌.. మానం.. మాట్లాడిన మాటకు విలువ ఉన్నదా? అని మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. అధికారం కోసం ఏదైనా చేస్తామనే మోదీ వ్యవహారాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.

డబుల్‌ ఇంజిన్‌ అసలు రూపం మోదానీ
మోదీ సర్కార్‌ తొమ్మిది ఏండ్ల పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చింది, రాజకీయ పార్టీలను చీల్చింది నిజం కాదా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. డబుల్‌ ఇంజిన్‌ అంటూ ఊదరగొడుతున్న బీజేపీ ప్రభుత్వం అసలు రంగు దేశ ప్రజలకు తెలిసిపోయిందని తెలిపారు. డబుల్‌ ఇంజిన్‌లో ఒక ఇంజిన్‌ మోదీ అయితే మరో ఇంజిన్‌ అదానీ అని, ఈ రెండూ కలిస్తే మోదానీ అని ఎద్దేవా చేశారు. ఇందులో ఒకటి పొలిటికల్‌ ఇంజిన్‌.. మరొకటి ఎకనామిక్‌ ఇంజిన్‌.. అదానీ కోసం మార్కెటింగ్‌ చేయటం.. ప్రాజెక్టులు ఇప్పించటం మోదీ పని అయితే.. ప్రాజెక్టులల్లో వచ్చిన దందా సొమ్మును అదానీ చందాల రూపంలో పార్టీకి ఇవ్వటం, ఆ దొంగసొమ్ముతో రాష్ర్టాల్లో ప్రజల పక్షాన నిలిచిన పార్టీలను, ప్రభుత్వాలను కూల్చటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తమకు అనుకూలంగా లేని, తమ పార్టీలో చేరని నాయకులపై, పార్టీలపై ఈడీని ఉసిగొల్పాలి అనేది మోదీ నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల మునుగోడు ఉపఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టి కాంగ్రెస్‌ అభ్యర్థిని బీజేపీ తరుపున నిలపెట్టింది నిజం కాదా? ఇది కాదని చెప్పే దమ్మూ.. ధైర్యం ఉన్నదా? అని నిలదీశారు. మోదీ, అదానీ చీకటి స్నేహం ఎన్నో రోజులు దాగదని స్పష్టం చేశారు.

మద్యనిషేధం ఉన్న గుజరాత్‌లో జరిగింది నిజమైన లిక్కర్‌ స్కాం
మద్య నిషేధం ఉన్న గుజరాత్‌లో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారని, అసలైన లిక్కర్‌ స్కాం ఆ రాష్ట్రంలో జరిగిందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. అయితే కొంతమందికి అనుకూలంగా పాలసీ తయారు చేశారనేది బీజేపీ అభియోగమని, అదానీకి అనుకూలంగా పాలసీలు తయారు చేస్తే అవి తప్పు కాదా? అని ప్రశ్నిస్తూ.. ఆర్థికమంత్రిత్వశాఖ, నీతి అయోగ్‌ లాంటి సంస్థలే కాకుండా హిండెన్‌బర్గ్‌ నివేదిక ఈ విషయాన్నే తేల్చి చెప్పాయని వివరించారు.

బీజేపీలో చేరితే పునీతులా..
దేశంలో ఏం జరుగుతున్నదంటే సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు వాషింగ్‌పౌడర్‌ నిర్మా జరుగుతున్నదని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. గంగలో మునిగినోళ్లు పునీతులు అయిపోతారు అన్నట్టు బీజేపీలో చేరగానే వారి పాపాలు పోతున్నాయన్నట్టుగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అందుకు అనేక ఉదహరణలున్నాయని వెల్లడించారు. వైఎస్‌ సుజనాచౌదరి ఉదంతాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. సుజనాచౌదరీకి 6 విలాసవంతమైనకార్లు.. 120 షెల్‌ కంపెనీలకు సంబంధించి రూ.6000 కోట్ల అవినీతి జరిగిందని నవంబర్‌ 24, 2018న ఈడీ తన అధికారిక ట్వీట్‌లో పేర్కొన్నదని తెలిపారు. దీంతో జూన్‌ 20, 2019న సుజనాచౌదరీ, సీయం రమేశ్‌ ఇద్దరూ బీజేపీలో చేరినట్టు ఆధారాలతో సహా వివరించారు. ఇది వాషింగ్‌పౌడర్‌ నిర్మా కాక మరేంటని నిలదీశారు.

ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు గురైన మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు

-మంత్రి గంగుల కమలాకర్‌
-మంత్రి మల్లారెడ్డి
-జగదీశ్‌రెడ్డి, పీఏ
-తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పీఏ, బంధువులు
-బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు
-రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డి
-లోక్‌సభ సభ్యుడు మన్నే శ్రీనివాస్‌రెడ్డి
-ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వీ6లో.. ఏం చూపిస్తారో వెలుగులో ఏం రాస్తారో తెలుసు
గుజరాత్‌లో మద్య నిషేధం ఉన్నా 42 మంది చనిపోతే వీ6లో చూపించారా? దీన్ని లిక్కర్‌ స్కాం అనాలా? మోదీ స్కాం అనాలా? అని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. వీ6లో ఏం చూపిస్తారో, వెలుగులో ఏం రాస్తారో, ఏ డ్రామాలు చేస్తారో మాకు తెలుసు.. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్‌చేయాలో కూడా మాకు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ మౌత్‌ పీస్‌లాగా పనిచేసే సంస్థల నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఎండగడతామని తేల్చిచెప్పారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డేను బీజేపీ ఆఫీసులో బ్యాన్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో మీడియా తన వెన్నెముక కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంకలో మోదీ వ్యవహారాన్ని ఎందుకు రిపోర్ట్‌ చేయలేదని నిలదీశారు. జర్నలిస్టు మిత్రులపై, సంస్థలపై తమకు గౌరవం ఉన్నదని, అలాగే యాజమాన్యాలపై తమకు స్పష్టమైన అవగాహన ఉన్నదని స్పష్టం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.