
-రాష్ర్టానికి ప్రధాని చేసిందేమీలేదు -మహబూబ్‌నగర్ చౌరస్తాలో చర్చకు తయార్ -నేను జాతీయ రాజకీయాల్లోకి వస్తే పీఠాలు కదులుతాయని కాంగ్రెస్, బీజేపీకి భయం -మే 23 తర్వాత ఢిల్లీ గద్దెనెక్కేది ప్రాంతీయపార్టీలే -ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు బంద్ -16 సీట్లివ్వండి.. దేశ రాజకీయ గమనం మార్చేస్తా: కేసీఆర్ -పింఛన్లలో నీ వాటా ఎంత? మా వాటా ఎంత? -బీజేపీ ఇచ్చేది.. రూ.200.. మేమిచ్చేది రూ.800 -లెక్కలు ముందేసుకుని చర్చకు కూర్చుందామా? -ఐదేండ్లక్రితం పాలమూరు ప్రాజెక్టుపై ఏమన్నావు? -ప్రధాని అయ్యాక నువ్వు చేసిందేమిటి? -మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24 రూపాయలు కూడా ఇవ్వలే -ప్రధాని అయి ఉండి.. ఇన్ని పచ్చి అబద్ధాలా? -చేతకాని సన్నాసులు పాలిస్తున్నరు కాబట్టి దేశం ఇట్ల ఉన్నది -దేశానికి ఈ ఐదేండ్లలో ప్రధాని మోదీ చేసిందేమీలేదు -మోదీ ఏం చేశాడో చెప్పలేదు.. ఏం చేస్తాడో చెప్పలేదు -దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ -తెలగాణ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు -మే నుంచి మూడువేలకు పెరుగనున్న పింఛన్లు -వనపర్తి, మహబూబ్‌నగర్ ఎన్నికల సభల్లో సీఎం కేసీఆర్
రాష్ర్టానికి ప్రధాని నరేంద్రమోదీ ఏం చేశారని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సూటిగా నిలదీశారు. ఐదేండ్లలో ఈ దేశానికి కూడా ఆయన చేసింది ఏమీలేదని మండిపడ్డారు. గత ఎన్నికలప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామని హామీ ఇచ్చి, తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసుచేస్తే.. ఇరువై నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేద్దామనుకుంటే సీఎం కేసీఆర్ అడ్డుపడుతున్నారని మహబూబ్‌నగర్ సభలో మోదీ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. పాలమూరుకు డబ్బులిస్తే మేము వద్దన్నమా? అని నిలదీశారు. రాష్ర్టానికి ఏం చేశారో మహబూబ్‌నగర్ చౌరస్తాలో లెక్కలు ముందేసుకుని చర్చిద్దాం రావాలంటూ మోదీకి సవాలు విసిరారు. ప్రధాని స్థాయిలో ఉండే వ్యక్తి ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పవచ్చునా? అని ప్రశ్నించారు. పింఛన్ల విషయంలో బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న సీఎం.. రాష్ట్రంలో ఇస్తున్న ఆసరా పింఛన్లలో రూ.800 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంటే, కేంద్రం ఇస్తున్నది రూ.200 మాత్రమేనని స్పష్టంచేశారు. దీనిపై బీజేపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభల్లో సీఎం ప్రసంగించారు. బీజేపీ కుహనా హిందుత్వాన్ని సీఎం కడిగిపారేశారు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను రాజకీయాలకు వాడుకోవడాన్ని తీవ్రంగా నిరసించారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తానేమోనని కాంగ్రెస్, బీజేపీ వణికిపోతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేవన్న సీఎం.. మే 23 తర్వాత దేశంలో పాలనాపగ్గాలు ప్రాంతీయపార్టీల చేతిలోకి రాబోతున్నాయని తేల్చిచెప్పారు. బంగారు భారతదేశంకోసం రక్తం ధారబోస్తానని, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తానని అన్నారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..
ఇజ్జత్ పోయేలా మోదీ మాటలు మొన్న మహబూబ్‌నగర్ సభలో మోదీ పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. చెప్పుకుంటే ఇజ్జత్ పోతది.. ఇయ్యాల వచ్చినదాంట్లో పావులమంది కూడాలేరు మోదీసభలో! ఇగ దానికే ఆయన ఏదిపడితే అది మాట్లాడుతడు. ఒక ప్రధాని అలా మాట్లాడొచ్చునా! సర్పంచ్ కూడా అట్ల మాట్లాడడు. ఐదేండ్లు పీఎంగా ఉన్న మోదీ ఓటు అడిగే ముందు ఏం చేసినమో.. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తమో చెప్పాలి కదా! ఏం చేసిండో చెప్పడు. ఏం చేస్తడో చెప్పడు. ఇనుప డబ్బలో గులకరాళ్లు వేసి ఊపినట్లు ఒకటే లొల్లి. పైగా ఏం అంటడు.. బాగా అభివృద్ధి చేస్తా అంటే మీ సీఎం అడ్డంపడ్డడు అంటున్నరు. మీరు చేస్తా అన్నది ఏంది? నేను అడ్డం పడ్డది ఏంది? రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నరు. దేశానికి అసలు ఏంచేశారో మీరు చెప్పాలి. మహబూబ్‌నగర్‌లో ఎందరో రైతులు చనిపోయారు. ఎంతోమంది వలసపోయారు. 50 ఎకరాలున్న రైతు కూడా హైదరాబాద్‌లో కూలిపని చేసిండు. అనుభవించలేదా బాధలు మనం?
పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు పైసలు ఇయ్యలేదు? ఇదే జిల్లాలో 2014 ఎన్నికలప్పుడు బీజేపీకి అధికారం ఇస్తే పాలమూరు పథకం చేస్తానని మోదీ చెప్పిండు. కాంగ్రెసోళ్లు పదేండ్లు ఉండి చేయలేదన్నడు. మోదీ ప్రధాని అయినంక పాలమూరు పథకానికి నిధులివ్వాలని, కృష్ణా రివర్ ట్రిబ్యునల్ వివాదాన్ని సెక్షన్ 3 ప్రకారం తెంపమని 500 ఉత్తరాలు స్వయంగా ఆయనకు ఇచ్చిన. ఉలుకులేదు.. పలుకులేదు. రూపాయి కూడా ఇయ్యలే. ఇట్ల మాట్లాడవచ్చునా ప్రధాని? పాలమూరు ఎత్తిపోతల పథకం చేస్తానని మాట్లాడినవ్. ప్రధాని పదవి వచ్చింది. ఏ ముసుగువేసుకొని పడుకున్నవ్? పాలమూరుకు డబ్బులిస్తే మేము వద్దన్నమా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మంచి పథకాలని, వాటికి రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఅయోగ్ సిఫార్సుచేస్తే.. 24 రూపాయలు కూడా ఇయ్యలే. ఇవి వాస్తవాలు కావా? వస్తరా మోదీగారు? ఇదే మహబూబ్‌నగర్ చౌరస్తాలో చర్చకు తయార్. లెక్కలు తీసుకొని కూర్చుందాం. ఆగాథం.. జగన్నాథం.. ఎటువడితే అటు మాట్లాడిపోవచ్చునా? దయచేసి ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలి. జాతీయ పార్టీ.. ఇప్పుడు అధికార పార్టీ ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడవచ్చునా?

దమ్ముంటే చర్చకు వస్తవా మోదీ.. యాడాది నుంచి అడుగుతున్న. ఈ దేశంలో 3.44 లక్షల మెగావాట్ల కరంటు ఉత్పత్తి అయితే వాడకునే తెలివి కాంగ్రెస్, బీజేపీలకు లేదు. ఇది వాస్తవం కాదా? దమ్ముంటే నరేంద్రమోదీ చర్చకు రా. ఉత్పత్తి అయ్యే కరంట్‌ను కూడా వాడుకునే తెలివిలేని దద్దమ్మ ప్రభుత్వాలు మీవి. దేశానికి 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నయ్. ఇయాల్టి వరకు 35 వేల టీఎంసీలు కూడా వాడలే. స్వాతంత్య్రం వచ్చి 73 ఏండ్లు గడిచినా మంచినీళ్లకు ఏడ్వాలే. పొలాలకు నీళ్లు రాక ఏడ్వాలే. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నా ఎందుకు వాడరు. మీకు తెలివి లేక, మీ అవివేకం వల్ల, మీ చేతకానితనం వల్ల కాదా? ఇంకా మీ దద్దన్న పరిపాలన కొనసాగాల్నా? ఈ దేశం ఇట్లనే నాశనం కావాల్నా? అందరు ప్రేక్షకులుగానే ఉండాల్నా? ప్రజలకు సాగు, తాగునీరు రావద్దా? కరెంట్ రావద్దా? ఉత్పత్తి చేసే థర్మల్ స్టేషన్లేమో మూతపడి ఉంటయ్. సగం దేశం కరెంట్ కోతల్లోనే బాధపడ్తున్నది. ఇవన్నీ వాస్తవాలు కాదా? అంతర్జాతీయంగా లారీలు పోయే స్పీడు గంటలకు 80 కిలోమీటర్లు. మన దేశంలో 24 కి.మీ.! మీరు చేసిన ఉద్ధారకం కాదా? గూడ్స్ రైళ్లు అంతర్జాతీయంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో పోతే. ఇండియాలో 30 కిలోమీటర్లు పోతది. ఇదా మన తెలివితేటలు? ఎప్పుడు బాగుపడ్తం? మీ డైలాగులు విని మోసపోవాల్నా? ఎవడో ఒకడు మాట్లాడి నిజాలు బయటపెట్టకపోతే.. ఎవడో ఒకడు నడుం కట్టకపోతే ఈ దేశం బాగుపడది.
రైతు బంధు, రైతు బీమా దేశంలో ఎందుకు పెట్టలేదు.. కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నరు. దేశంలో రైతుబంధు, రైతుబీమా స్కీంలు ఎందుకుపెట్టలేదు? రైతులు చనిపోతే డ్రామాలుచేశారు. శవాలకు పూలమాలలువేశారు. కానీ రైతుబంధు, రైతుబీమా గురించి జిందగీలో ఎప్పుడైనా ఆలోచన చేశారా? కేసీఆర్ మీద ఇంత ఆడిపోసుకునుడు ఏంది? కేసీఆర్‌ను ఈ నమూనా తిట్టుడు ఏంది? అమిత్‌షా, నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ.. అదే బొబ్బ! 24 గంటల కరంటు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నరా? మోదీ.. మీ సొంత రాష్ట్రంలో ఇస్తున్నరా? దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. అంగన్వాడీ అక్కాచెల్లెళ్లకు, హోంగార్డులకు, ఐకేపీ, ఆశావర్కర్లకు భారతదేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు రైతులకు బంధువుగా మారింది. ఎకరానికి ఒక పంటకు రూ.5వేలు చొప్పున రెండు పంటలకు రూ.10వేలు ఇచ్చుకునే రాష్ట్రం ఒక్క తెలంగాణ. రైతులు చచ్చిపోతే వారి కుటుంబాలు దిక్కులేనివి అయ్యేవి. రైతు సహజ మరణం కావచ్చు.. యాక్సిడెంట్ ద్వారా చనిపోవచ్చు.. ఎక్కడా తిరిగే అవసరం లేకుండా పదిరోజుల్లోపల ఠంచన్‌గా ఐదు లక్షలు నామినీల ఖాతాల్లో జమైతున్నయి.
గురుకుల స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చుపెడుతున్నం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతోపాటు ఓసీల్లోని పేదవారి పిల్లల కోసం రాష్ట్రంలో 550 గురుకులాలు పెట్టినం. వాస్తవాలు కావా? మహిళలు, ఆడబిడ్డలు ప్రసవానికి పోతే కూలి డబ్బు పోతుంది కాబట్టి వారికి దేశంలో ఎక్కడా లేని కేసీఆర్ కిట్స్ అందించాం. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ కాదా? మీరు కడుతున్నరా మోదీగారు? మనం చేసిన పనులపై కొన్ని సందర్భాల్లో జాతీయ పేపర్లలో, జాతీయ టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నం. తెలంగాణలో సాధ్యమవుతున్నది హర్యానాలో, గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు ఇవ్వరని అక్కడివారు అడుగుతున్నరు. ట్రాఫిక్ పోలీసుల బాధ గమనించి వారి జీతంలో 30% అదనంగా ఇస్తున్నం. వారికి ఊపిరితిత్తులు చెడిపోతాయికాబట్టి రిస్క్ అలవెన్స్ ఇస్తున్నం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు. ముంబైలో ట్రాఫిక్ పోలీసులు సమ్మెచేశారు. పక్క రాష్ట్రం తెలంగాణ రిస్క్ అలవెన్స్ ఇస్తున్నది.. మాకు ఎందుకు ఇయ్యరు? అని అడుగుతున్నారు. మోదీ మేధావితనం.. రాహుల్ తెలివికల్ల పని అయితే ఎందుకు ఆలోచించలేదు ఇవన్నీ? దా నరేంద్రమోదీ.. తెలంగాణ నుంచి నేర్చుకొని పో. మిషన్ భగీరథ ఎట్లుంటదో 11 రాష్ర్టాలు నేర్చుకున్నయి.
24 గంటల కరంటు ఎట్ల ఇస్తున్నదో. భారతదేశం ఆశ్చర్యపడుతున్నది. 2000 పెన్షన్ ఎట్ల ఇస్తున్నదో దేశం నేర్చుకుంటున్నది. మా రైతుబంధును నువ్వే నకలు కొట్టావు కదా! మేమిచ్చేదెంత? నువ్విచ్చేదెంత? మేమిచ్చేది ఎందరికి? నువ్విచ్చేది ఎందరికి? ఈ రకంగా వారుచేయరు. దేశంలో ఎవరికైనా పేరొస్తే ఓర్వరు. ఈ మధ్య ఫెడరల్ ఫ్రంట్ స్థాపిస్తనని చెప్తున్న. కేసీఆర్ ఏమైనా ఢిల్లీ బయలుతేరుతడా అని మోదీ, రాహుల్‌కు భయం పట్టుకున్నది. పీఠాలు కదులుతయని గజ్జున వణికిచస్తున్నారు. వీడు ఇటు గిట్ల వచ్చి దుకాణం పెడితే గోల్‌మాల్ అయితమని, సినిమా చివరిసీన్‌లో లెక్క ప్రజలు తరుముతరని భయం పట్టుకున్నది.

మీ భరతం పడ్తా లక్ష్మణ్.. ఈ బీజేపోళ్లకు ఇక్కడేమున్నదండీ! అసెంబ్లీ ఎలక్షన్‌కన్న ముందు ఐదుగురు ఎమ్మెల్యేలుండిరి. ఎన్నికల ముందు మేమే ప్రత్యామ్నాయం, గవర్నమెంట్ రానే వచ్చిందంటూ ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన్రు. ఏమైంది? బీజేపీ పోటీచేసింది 118 సీట్లు. గెలిచింది ఒక్కటి. డిపాజిట్ పోయింది 103 సీట్లు. ఇప్పుడు కూడా ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నరు. నాకున్న రిపోర్లుల్లో ఈ ఎన్నికల్లో బీజేపీకి 15 సీట్లలో డిపాజిట్లే వస్తలేవు. కేసీఆర్.. నీ భరతం పడ్తం అని లక్ష్మణ్ అంటడు. ఏంటిది నువ్వు పట్టేది గోశా! మేం ఎట్లా కనపడ్తున్నం మీకు? నా జీవితం తెరిచిన పుస్తకం. నాకున్నకాడికి ఇండ్లు, భూమి ప్రతి సంవత్సరం బయటపెడ్తున్నా. మాకెమన్న ఉంటే మీరు ఊకుందురా? ఈ పాటికే జెండాకు ఎక్కిద్దురు. ఊకుండే బాపతిగాళ్లేనా? పాలమూరు గడ్డ మీద చెప్తున్న. మే 23 తర్వాత ఈ దేశంలో పరిపాలన పగ్గాలు చేపట్టేది ప్రాంతీయ పార్టీల కూటములే. మీ భరతం మేం పడ్తం లక్ష్మణ్. అయిపోయింది మీ కథ. నిన్ననే ఢిల్లీలో జర్నలిస్టు మిత్రులతో మాట్లాడిన. బీజేపీ 150 సీట్లకు లోపల్నే ఉంటుంది.. కాంగ్రెస్ నూరు ఉంటుంది. ఇద్దరు కలిస్తే కూడా ప్రభుత్వం వచ్చే పరిస్థితిలేదు.
ఇయాల ప్రాంతీయ పార్టీలు విజృంభించి ముందుకు పోతున్నయ్. కచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమే పరిపాలన చేయబోతున్నది. నేను అడిగే దాని మీద కాంగ్రెస్ నోరు తెర్వది. బీజేపీ నోరు తెర్వది. ఏమన్నంటే వ్యక్తుల మీద దాడి. కేసీఆర్ నీ ముక్కు పెద్దగున్నది! కేసీఆర్ ముక్కు పెద్దగుంటే నీకేంది? వ్యక్తుల మీద మాట్లాడుడేంది? ఒక ప్రధానమంత్రిస్థాయి వ్యక్తి ఆ రకంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్.. నీకు జ్యోతిష్యం మీద నమ్మకమున్నదంటరు. అరే ఉంటే ఉన్నది. లేకపోతే లేదు. నీకెందుకు? రామజన్మ భూమి సంగతేంది అంటరు. ఇవేనా మాట్లాడేది? ఇంకేమీ సమస్యల్లేవా? రైతులు, నీళ్లు, కరంటు, నిరుద్యోగులు, దళిత వర్గాల్లోని పేదలు.. వీటి సంగతేంది? పార్టీల, నాయకుల ఎజెండా ఏముండాలె.. ప్రజల సంక్షేమం ఉండాలె. రైతుల అభివృద్ధి ఉండాలె. దీని మీద ఎవ్వడు మాట్లాడ్తలేడు. మీరందరూ ఆలోచన చేయాలె.
మోదీ సిపాయి లెక్క మాట్లాడుతున్నడు.. బీసీలకు, ఎస్సీలకు, రైతులకు, గిరిజనులకు మోదీ ఏమైనా చేశారా? మహిళలకు ప్రత్యేకంగా చేసిన్రా? చేసిందేంలేదు. వట్టిదే బొబ్బ.. లొల్లి! ఇగ పాకిస్థాన్‌లకు పోయి కొట్టిన అంటడు. ఈ మొగోడే మొదలు కొట్టినట్టు! ఇప్పటికే బోలెడుసార్లు కొట్టిన్రు. సర్జికల్ స్ర్టైక్స్ అనేటివి బార్డర్ల జరుగుతనే ఉంటయ్. కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు పదకొండుసార్లు జరిగినయ్. అలాంటి విషయాలు క్యాబినెట్ మీటింగ్‌లో ప్రధాని చెప్తరు. రహస్యంగా ఉంచుతరు. బయట మాట్లాడరు. ఓ.. ప్రపంచంలో ఎవడూ చేయలే.. నేనే పెద్ద సిపాయిని అని మోదీ, బీజేపీ నాయకులు డబ్బా కొడ్తరు. దానిమీద ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఔరోంకా షాదీమే అబ్దుల్లా దివానా అన్నట్టు మాట్లాడుతడు. నేను సైన్యం పరువు తీశానట! మన సిపాయిలు కొడితే వీళ్లేం చెప్తున్నారు? బార్డర్‌లోని సర్జికల్ ైస్ట్రెక్స్‌ను రాజకీయాలకు వాడుతరా? అదొక డిప్లమసీ. డిఫెన్స్ మ్యాటర్. దాన్ని రాజకీయంగా వాడి.. ఫేస్‌బుక్‌లో పెట్టి నరుకుడు! వాడేం చెప్తుండు.. మా దగ్గర చీమ కూడా చనిపోలేదంటున్నడు. ఈ రకమైన డొల్ల ప్రచారం! ఇగ ఫేస్‌బుక్, సోషల్‌మీడియాలో దేవుళ్ల పేరుతో ప్రచారం. మాకు లేరా దేవుళ్లు? బీజేపీవాళ్లు చెప్తేనే మనం దేవుళ్లను కొలుస్తున్నామా? ఎవరండీ నిజమైన హిందువు? నేను చేసినన్ని యాగాలు దేశంలో ఎవరైనా చేశారా? బీజేపీవాళ్లు రాజకీయ హిందువులు.. మేం దేవుడిని కొలిచే హిందువులం. మేం ప్రజలను ప్రజలుగా చూస్తాం. ప్రేమిస్తాం. ఇది కూడా చర్చ జరుగాలి. దేశభక్తులం మేం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం బాగుపడాలనే తపన మాకుంది.
ఎన్నికల్లో ప్రజలు గెలువాలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు, ప్రజల అభీష్టం గెలిచినప్పుడే దేశం బాగుపడుతది. అలాంటి రాజకీయం ఈ దేశంలో రావాలి. దానికి మీ మద్దతు అద్భుతంగా ఉండాలి. స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి. అవసరమైన రాజ్యాంగ మార్పులు రావాలి. న్యాయవ్యవస్థలో మార్పులు జరగాలి. ఆర్థిక, వ్యవసాయ విధానాలు మారాలి. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి. రాకూడదా? ఇవన్నీ చేయకుండా ఇంట్లో పండుకొని ఏమో చేసినట్టు మాట్లాడుతున్నరు. ఎన్నేండ్లు ఏడ్చినం? మహబూబ్‌నగర్ ఎంత పెద్ద జిల్లా? పాలన సంస్కరణలు తెచ్చి, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు చేసుకున్నం. అద్భుత ప్రగతి కనిపిస్తున్నది. లకా్ష్మరెడ్డి ఆరోగ్యమంత్రిగా ఉన్నపుడు మెడికల్‌కాలేజీ తెచ్చుకున్నం. మొట్టమొదటిసారి దేశంలో 3000 మంది ఎస్టీలను సర్పంచ్‌లను చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. బీజేపీకి ఉన్నదా బీసీలపై ప్రేమ? దేశంలో యాభైశాతం ఉన్న బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ పెట్టాలని స్వయంగా మన్మోహన్‌సింగ్‌ను, నరేంద్రమోదీని అడిగిన. ఆయన పెట్టలేదు.. ఈయన పెట్టలేదు. ఎందుకు? అడిగేవారు లేరు. గోల్‌మాల్ తిప్పవచ్చు.. ఓట్లు దండుకోవచ్చు. ఇది ఎంతకాలం? దయచేసి బీసీ మిత్రులు ఆలోచించాలి. ఓసీలలో పేదలను సైతం ఆదుకోవాలి. ఎవరు పేదలైనా ఆదుకోవాలి.

ఓ రెండ్నెల్లు ఓపిక పట్టండి.. కొత్త రెవిన్యూ చట్టం తెస్తా.. రైతులు జూన్‌దాకా ఓపిక పట్టండి. ఎవరికీ లంచాలు ఇవ్వకండి. కొత్త రెవిన్యూ చట్టం తెస్తున్నం. రైతులు మండలాఫీసులకు పోయే అవసరం లేకుండా, పారదర్శకంగా ఉండేలా చేస్తం. మీకా బాధ తప్పిస్తం. ధరణి అనే కొత్త వెబ్‌సైట్ తెస్తం. ప్రతిరోజు జమాబందీ అయితది. గంట గంటకూ అప్‌డేట్ అయితది. మంది మాటలు పట్టుకొని గోల్‌మాల్‌కాకండి. టీఆర్‌ఎస్‌ది రైతుపక్షపాత ప్రభుత్వం. అసెంబ్లీలో కూడా చెప్పిన. ఇంతకుముందు పాసుపుస్తకాల్లో 37 కాలమ్స్ ఉండేవి. మనకు అర్థం కావు. ఇయ్యాల మూడే కాలమ్స్ పెట్టినం. కేవలం పట్టాదారు కాలమే ఉంటది. అనుభవదారు కాలమ్స్ పీకి పడేసినం. రైతు ఎవరికన్న కౌలుకు ఇస్తే అనుభవదారు కాలమ్ రాస్తరు. మరి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల కూడా భవనాలు అద్దెలకు ఇస్తరు. అక్కడ రాస్తరా? అంటే రైతులు అగ్వకు దొరికినారు.. వీళ్ల పేరు గోల్‌మాల్ రాయాలి.. డబ్బులు మింగాలి! రైతలకు నోరు లేదనా? రైతుల నోరు, రైతుల గొంతుక కేసీఆర్.. రైతు భూమి రైతుకే ఉండాలి. అందుకే అద్భుతంగా కొత్త రెవిన్యూ చట్టాన్ని రాబోయే జూన్-జులైలో తెస్తం. ఏ పద్ధతిల, ఎట్ల చేయాల్నో వంద శాతం చేసిచూపిస్త. మేం తప్పు చేస్తున్నట్లు, చేయబోతున్నట్లు కొన్ని పత్రికలు రాస్తున్నయి. రెవిన్యూ రికార్డులు మంచిగ ఉండొద్దా? తప్పా? రైతుల బాధలు పోవాల్నా? లేదా?
జిల్లా తలరాత మారుతున్నది.. ఉద్యమం జరిగేటపుడు నన్ను ఆగంచేసేందుకు ఎన్నో ప్రయత్నాలుచేశారు. తిట్టారు, అవమానించారు. నేను ఆగం కాలే దు. మీ గట్టి దీవెనతో రాష్ట్రాన్ని సాధించుకున్నం. నిజాయతీ వైపు ప్రజలుండాలె. అప్పుడే మీకు లాభం. టీఆర్‌ఎస్ ప్రభు త్వం రాకముందు మహబూబ్‌నగర్ ఎట్లుండే. ఇయ్యాల ఎట్లున్నది. కరెంట్, మంచినీళ్లు, పింఛన్లు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నయి. మహబూబ్‌నగర్‌లో ఎంతోమంది మేధావులు, రచయితలు, విద్యావంతులు ఉన్నరు. నేను చెప్పేది నిజమా అబద్ధమా గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఒకవేళ తప్పుచెప్తే మమ్మల్ని డిపాజిట్లు లేకుండా ఓడగొట్టండి. నిజమైతే ఎదుటివాళ్లను డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలి. మహబూబ్‌నగర్ అంటే కరువు జిల్లా, వలస జిల్లా, వర్షపాతం లేని జిల్లా, గంజి కేంద్రాలు పెట్టే జిల్లా.. ఇదంతా ఎవరి పుణ్యం? టీఆర్‌ఎస్ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది. ఐదేండ్లు ఇంకా పూర్తికాలేదు. ఇన్నాళ్లు పరిపాలించింది బీజేపీ, కాంగ్రెసే కదా! ఎవరి మీద మీ నిందలు? మహబూబ్‌నగర్‌ను అభివృద్ధికి దూరంలో ఉంచింది ఎవరు? గంజికేంద్రాలు పెట్టే గతికి తెచ్చిందెవరు? మంచినీళ్ల కోసం చంపిందెవరు? వలసల జిల్లాగా మార్చింది ఎవరు? ఇదంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు పొలాలు పచ్చబడుతున్నయి. జిల్లా తలరాత మారుతున్నది.
బంగారు భారత్ కోసం రక్తం ధారపోస్తా ఐకమత్యంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. కొంచెం బాగుపడుతున్నం. నిన్నియాల్నే తెల్లబడుతున్నం. వచ్చేనెల నుంచి అర్హులందరికీ పింఛన్లు రూ.2వేలు వస్తయి. వయసు 60 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు చేసుకున్నం. ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది. మీ బిడ్డగా.. దేశ రాజకీయాల్లో మార్పు తేవడానికి, రాష్ట్రంలోనూ పాలన పటిష్టంగా కొనసాగించేందుకు మీరు దీవించాలి. మీ ఆజ్ఞతో 16 ఎంపీలను తీస్కొని ఢిల్లీకిపోయి దేశ రాజకీయాలను మలుపుతిప్పేలా భగవంతుడు నాకిచ్చే శక్తియుక్తులన్నింటినీ వినియోగించి బంగారు భారతదేశంకోసం నా రక్తం ధారబోస్తా. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయాలె. ప్రపంచానికి తలమానికగా భారతదేశం మారేలా ప్రయత్నం ప్రారంభం కావాలె. పెదవులు చప్పరిచ్చుడు చేస్తే, ప్రేక్షకులుగా ఉంటే కాదు. దాని కోసం మీ బిడ్డగా మీరు దీవించి పంపిస్తే వంద శాతం ఆ ప్రయత్నం చేస్తా. దేశంలో తప్పకుండా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తా.

దరిద్రుల పాలన అంతం కావాలె ప్రపంచంలో అతి ఎక్కువ యువకులున్న దేశం మనది. వజ్రం తున్కల్లాంటి యువశక్తి ఉన్నది. నీళ్లు, కరంటు, అద్భుతమైన సహజ వనరులున్నయ్. కానీ దరిద్రుల పాలన ఉన్నది. ఇది పోవాల్నంటే ఎవ్వడో ఒకడు పొలికేక పెట్టాలె. ఈ దేశం బాగుపడాలె. ఇయాల పాలమూరు పిడికిలెత్తి చెప్పాలె. దరిద్రం పోవాల్నంటే ఎవరో ఒకరు నడుం కట్టాల్నా వద్దా? పోరాటం జరుగాలె కదా! పోరాటానికి కేసీఆర్ పోవాల్నా? నేను మాట్లాడుతున్నది ఆషామాషీ రాజకీయం కాదు. ప్రధానమంత్రి మాట్లాడినట్టు సిపాయి కూతలుకాదు. వట్టిగనే, తమాషా కోసం చెప్తలేను. కేసీఆర్ అట్లా చెప్పడని మీకు తెలుసు. దేశంలోని అనేకమంది నాయకులతోని మాట్లాడినా. ఎన్నికల తర్వాత మీరు చూడబోతున్నరు. తెలంగాణను ఎట్లైతే సాధించుకున్నమో అట్లనే అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపిస్తా. ఈ దేశం దరిద్రం పోవాలె. ఈ దరిద్రుల పాలన అంతం కావాలె. ప్రజల సమస్యలు తీరాలె.
ఆసరా పింఛన్లపై బీజేపీది తప్పుడు ప్రచారం మహబూబ్‌నగర్ వేదిక నుంచి ప్రజలందరినీ కోరుతున్నా. ఈ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి. బీజేపీవాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నరు. ఆసరా పింఛన్‌లో రూ.800 మోదీ, రూ.200 కేసీఆర్ ఇస్తున్నరట. ఇంత అబద్ధమా? రాష్ట్రంలో 47,88,070 మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నం. ఓటాన్ అకౌంట్‌లో పింఛన్లకు రూ.11,843 కోట్లు పెట్టినం. దాదాపు 48 లక్షలమందికి మనం పింఛన్లు ఇస్తుంటే.. పప్పులో ఉప్పేసి పొత్తు పెట్టుకున్నట్లు.. కేంద్రం ఇచ్చేది 6,66,533 మందికి. వీరికి కూడా ఒక్కొక్కరికి రూ.200 ఇస్తరు. మనం ఇచ్చేదాంట్లో ఐదోవంతు కూడాకాదు. దానికి కేంద్రం ఇచ్చేది ఏడాదికి రూ.203 కోట్లు. ఇది వాస్తవం. బీజేపీ నాయకులకు దీనిమీద చర్చకువచ్చే దమ్ముందా? తెలంగాణవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులను, నాయకులను, సోషల్‌మీడియాలో పెట్టేవారిని ప్రజలు నిలదీయాలి.
జాతీయస్థాయిలో మార్పు రావాలె.. ఇరువైఏండ్లనాడు గులాబీ జెండా ఎగురవేసి, జై తెలంగాణ అంటే నవ్విన్రు అందరు. వీన్తోని ఏమైతదన్నారు. అపహాస్యం చేసిన్రు. కానీ మీ అందరి దయ, సపోర్ట్‌తోని తెలంగాణ రాలేదా? దేశంలో దేదీప్యమానంగా తెలంగాణ వెలుగుతున్నదా లేదా? పట్టుపడితే ఏదైనా అయితది. మొండిగ కూసుంటే, చేయాలనే తపన ఉంటే అయితది. ప్రజా సమస్యలు కేంద్ర బిందువుగా పనిచేస్తే, పేదరిక నిర్మూలనే ఎజెండాగా పనిచేస్తే తప్పకుండా అయితది. ఇయాల దేశంలో ఆ పని జరుగాలె. దయచేసి మీరందరూ తీవ్రంగా ఆలోచించాలె. ఇది ఒక్క శ్రీనివాస్‌రెడ్డి ఎలక్షనో, ఒక్క ఎంపీ ఎలక్షనో కాదు. జాతీయ స్థాయిలో మార్పులు రావాలె. దేశంలో కరంట్, నీళ్లు వాడే తెలివుండది. పేదరికం పోగొట్టే తెలివుండది. దేశం ఆర్థికశక్తి పెంచే తెలివుండది. జపాన్ ఇట్లుంటదట.. అమెరికా అట్లుంటదట.. చైనా బ్రహ్మాండంగా ఉంటదట.. ఎన్ని రోజులు ఇనాలె ఈ స్టోరీలు? జపాన్, అమెరికా, చైనా దేశాల్లో ఏమన్నా బంగారం తింటున్రా. మనమేమన్న మన్ను తింటున్నమా? దద్దన్నలు, మొదద్దన్నలు, చేతకాని సన్నాసులు పరిపాలిస్తున్నరు కాబట్టి దేశం ఇట్ల ఉన్నది.
మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపు పక్కా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నా వద్ద ఉన్న సర్వే ప్రకారం శ్రీనివాస్‌గౌడ్ 50వేల మెజార్టీతో గెలుస్తారని చెప్పాను. చెప్పినట్టే 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిచాడు. సర్వే రిపోర్టు ప్రకారం ఇప్పుడు మళ్లీ చెప్తున్న. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో శ్రీనివాస్‌రెడ్డి 57-58 శాతం ఓట్లతో, రెండున్నర, మూడు లక్షల మెజార్టీతో గెలుస్తున్నడు. మామూలుగా కాదు గట్టిగ గెలవాలి. ఈ అబద్ధాలు నడవయని తెలుపాలి. కర్రు కాల్చి వాతపెట్టాలి. శ్రీనివాస్‌రెడ్డి యువకుడు. కల్మషంలేని వ్యక్తి. వ్యాపారంలోనే ఉండొద్దు.. కొత్తగా రాజకీయాల్లోకి రావాలని నేనే కోరిన. మన మాటల్ని విశ్వాసంచేసి రాజకీయాల్లోకి వచ్చినరు. ఆశీర్వదించండి. మీ సేవలో ఇక్కడే పనిచేస్తరు.
ఢిల్లీ గద్దెనెక్కేది ప్రాంతీయపార్టీలే -ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు బంద్ -16 సీట్లివ్వండి.. దేశ రాజకీయ గమనం మార్చేస్తా -ఢిల్లీలో టీఆర్‌ఎస్ కీలకమైతేనే పచ్చని పొలాల పాలమూరు సాధ్యం -ఎన్నికలయ్యాక సమస్యలన్నీ పరిష్కరిస్తా -రాములు గెలుపు ఖాయమని సర్వేలో తేలింది -నాగర్ కర్నూల్ నియోజకవర్గ సభలో సీఎం కేసీఆర్
లోక్‌సభ ఎన్నిల్లో అంతా ఆశీర్వదించి 16 సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. దేశ రాజకీయ గమనమే మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు బంద్ అయితయని ఢిల్లీ నుంచి రిపోర్టులున్నాయని చెప్పారు. దేశ పరిపాలన వందకు వందశాతం ప్రాంతీయపార్టీల చేతుల్లోకి రాబోతున్నదని అన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తేనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకోగలుగుతామని, అప్పుడే పాలుగారే పచ్చని పొలాల పాలమూరు జిల్లా సాధ్యమవుతుందని వివరించారు. కేసీఆర్ ఢిల్లీకి వస్తాడమోనన్న భయంతోనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గాయిగాయి చేస్తున్నరని ధ్వజమెత్తారు. వనపర్తిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
అప్పుడెట్లుండె.. ఇప్పుడెట్లున్నది? మహబూబ్‌నగర్‌జిల్లా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు ఎట్లా ఉండే.. వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? కరంటు, పెన్షన్లు అప్పుడు ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల ఉండె? రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలతో ధీమా వచ్చింది. ఆనాడు యాదవులను పట్టించుకున్నవాడెవడూ లేడు.. ఈనాడు లక్షల్లో గొర్రెల పంపిణీ జరుగుతున్నది. కేసీఆర్ కిట్లు ఇచ్చినవాడెవడూ లేడు. ప్రైవేటు దవాఖానల్లో దోపిడీని పట్టించుకున్నవాడు లేడు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ ప్రోత్సాహం, మీ ఆశీర్వాదం, మీరిచ్చే బలంతోనే ఈ రోజు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ తెచ్చింది. ఇంకో నెల పదిరోజుల్లో మిషన్ భగీరథ వందశాతం పూర్తవుతది. రాష్ట్రం మొత్తానికీ స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చే పథకం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే లేదు. కొద్దిరోజుల్లో పాలమూరు పథకాన్ని పూర్తిచేస్తం. ఉద్యమంలో మొదటిదశలోనే అమ్మవారికి దండంపెట్టి ఆలంపూర్ నుంచి గద్వాల్‌కు పాదయాత్ర చేసిన. ఆ 87,500 ఎకరాలకు ఆర్డీఎస్, సుందిళ్ల లేదా మరో ప్రయత్నం ద్వారా కావొచ్చు.. సంపూర్ణంగా నీళ్లు ఇస్తం.
20 లక్షల ఎకరాల్లో పాలుగారే పచ్చని పొలాల పాలమూరు జిల్లాను చూడాలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 14 స్థానాలకు 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించి పాలమూరు దెబ్బ ఏందో మీరు చూపించారు. అంత గొప్ప విజయం ఇచ్చిన పాత మహబూబ్‌నగర్ జిల్లా బిడ్డలందరికీ శిరస్సువంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరిచ్చిన బలం ఎట్టిపరిస్థితుల్లో వృథాకానివ్వబోం. ఎంత పట్టుదలతో తెలంగాణ తెచ్చుకున్నమో, అంతే మొండి పట్టుదలతో కష్టపడి 20 లక్షల ఎకరాల్లో పాలుగారే పచ్చని పొలాల పాలమూరు జిల్లాను మనం చూడాలి. మీ దీవెన ఉంటే అన్నీ కచ్చితంగా జరుగుతాయి.
ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి పాలన నిన్న మోదీ మహబూబ్‌నగర్‌కు వచ్చి ఏం మాట్లాడిపోయిండో మీరంతా విన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు ఈ దేశాన్ని, ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్, బీజీపీలే కదా పరిపాలించింది. మళ్ల ఇప్పుడు కాంగ్రెస్, బీజీపీవాళ్లు తూ కిత్తా అంటే మై కిత్తా అని చెప్పుడు! 16 సీట్లు గెలిపిస్తే ఏం చేస్తవు కేసీఆర్ అంటున్నరు! ఇదే పాలమూరు ఎంపీగా ఉండి దెబ్బకొట్టి తెలంగాణ తెచ్చినం. అప్పుడు ఇద్దరే ఎంపీలం. మీ అందరి ఆశీర్వాదంతో 16కు 16 ఎంపీలను గెలిపిస్తే.. కొట్టుడుకొడితే భారతదేశ రాజకీయ గమనమే మారిపోవాలి. నేను అందరితోని మాట్లాడిన. ఇవాళ మనతోటి ప్రకాశ్ అంబేద్కర్, ప్రకాశ్‌రాజ్, డీఎంకే స్టాలిన్ ఉన్నరు. చాలా రాష్ర్టాలవాళ్లు ఉన్నరు. అందరం అవగాహనతోని ఉన్నం. కానీ అన్ని విషయాలు బయటికి చెప్పరు. దేశ పరిపాలన ప్రాంతీయపార్టీల చేతుల్లోకి రాబోతున్నది. అందులో కీలకపాత్ర పోషిస్తేనే మనం బతుకుతం. పాలమూరు ప్రాజెక్టు పూర్తికావాలంటే 20 నుంచి 30వేల కోట్లు కావాలి.
అది కావాలంటే మనం 16 ఎంపీలు గెలువాలి. అన్నివర్గాల సంక్షేమంతోటి, రైతులను, అందర్నీ సవరించుకుని తెలంగాణ ముందుకు పోతున్నది. ఇట్లనే పోవాలి. ఒక బండి కడితే రెండు కోల్యాగలు కట్టాలి.. లేదంటే దున్నపోతులు కట్టాలి. ఒకటి కోల్యాగ, ఇంకోటి దున్నపోతు కడితే.. అటొక దిక్కు.. ఇటొక దిక్కు గుంజితే పని అయితదా? మొన్ననే ఎన్నికల్ల మమ్మల్ని గెలిపించి బండికి ఒకవైపు కట్టిండ్రు. ఇంకోటి వేరేది కడితే పని జరుగుతదా? 20 లక్షల ఎకరాల్లో నీళ్లు పారాలె. అది జరగాల్నంటే మీరు రాములు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. నిరంజన్‌రెడ్డి నా కుడిభుజం. వ్యవసాయశాఖతోపాటు నాలుగైదు శాఖలు ఆయన దగ్గరే ఉన్నయి. ఈ జిల్లా నుంచి ప్రధానమైన పదవిలో ఉండి.. రైతాంగానికి సేవ జరుగాలని పట్టుబట్టినం. అవన్నీ నెరవేరుస్తం. ఇప్పటికే చాలా జరిగినయ్. ఇంకా జరుగుతయ్. బంగారు తెలంగాణ సాకారం చేసుకోవడానికి మీరందరి ఆశీస్సులు, దీవెనలు కావాలె.
ప్రతి జిల్లాలో ప్రజా దర్బార్లు ఎన్నికల తర్వాత ఒక్కొక్క జిల్లాలో మూడ్రోజులుంటా. ప్రజాదర్బార్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తా. దేశంలో ఎక్కడలేని అనేక విషయాలు తెలంగాణలో జరుగుతున్నయ్. దానిని చూసి ఓర్వలేక… కేసీఆర్ ఏమన్న ఢిల్లీ దిక్కు బయలుదేరుతడా ఏమిరా అని, తెలంగాణకు వచ్చి గాయి గాయి, గోల గోల చేస్తున్నరు. మిమ్మల్ని కోరేది ఒక్కటే. దీవెన సంపూర్ణంగా ఇవ్వండి. పదహారుమంది ఎంపీలను గెలిపించండి. నిన్ననే సర్వే రిపోర్టు వచ్చింది. నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా రాములుకు 56 శాతం ఓట్లు వస్తున్నయ్. దాదాపు 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుస్తరని తేలింది.