-ఉత్తమ కథనాలు రాసిన పాత్రికేయులకు అవార్డులు -మొదటి బహుమతిగా రూ.లక్ష నగదు అందజేస్తాం -పాలమూరు ఎత్తిపోతలకు తొలిదశలో రూ.16 వేల కోట్లు -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెరువులు తెలంగాణలోనే ఉన్నాయి. 46 వేల చెరువులు సాగు నీటికి అనుకూలంగా ఉన్నాయి. 11వ శతాబ్దంలో చెరువుల నిర్వహణ ఎంతో ఘనంగా ఉండేది. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను కలిపాక సీమాంధ్ర సీఎంలు తెలంగాణ చెరువుల నిర్వహణపై శ్రద్ధ చూపలేదు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యానికి గురైన చెరువులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమమైన మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఇది పూర్తయితే పల్లెలన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతాయి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలో కాగ్నా వాగులో రూ.8.52 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యామ్ పనులకు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు సోమవారం పునాదిరాయి వేశారు. తర్వాత నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. వెనుకబడిన రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల ప్రయోజనం కోసం పాలమూరు ఎత్తిపోతల పథకానికి త్వరలోనే సీఎం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. తొలిదశలో రూ.16వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. బడ్జెట్లవారీగా నిధులు కేటాయిస్తామన్నారు. ఈ పథకం ద్వారా తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందుతాయని చెప్పారు. ఉద్యోగుల విభజన తర్వాత వ్యవసాయ మార్కెట్లలో సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. మార్కెట్లలో జీరో వ్యాపారం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉత్తమ కథనాలకు అవార్డులు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మిషన్ కాకతీయ గురించి ఉత్తమ కథనాలు రాసిన పాత్రికేయులకు ప్రభుత్వం నుంచి అవార్డులు అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయ కార్యక్రమం విజయవంతం చేయడంలో మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జర్నలిస్టులందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తిచేశారు. రైతులను చైతన్యపరుస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేసేలా స్ఫూర్తినిచ్చే కథనాలను రాసిన వారికి మొదటి, రెండో, మూడో బహుమతులను అందిస్తామని ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.లక్ష నగదు అందిస్తామని, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు ప్రింట్ మీడియాకు వేర్వేరుగా ఉత్తమ కథనాలకు అవార్డులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మిషన్ కాకతీయలో జరిగే లోపాలను, అధికారులు చేసే తప్పిదాలను కూడా మీడియా బహిర్గతం చేయాలని, అవి కూడా స్ఫూర్తినిచ్చే రీతిలోనే కథనాలు ఉండాలని సూచించారు. కార్యక్రమాల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.