Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మిషన్‌ హైదరాబాద్‌

-ఐదేండ్లలో రూ.50 వేల కోట్లతో అభివృద్ధి
-ఓఆర్‌ఆర్‌దాకా ప్రత్యేకంగా సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌
-ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానున్న టీఎస్‌ బీపాస్‌
-30 పట్టణాల్లో తాగునీటికి రూ.800 కోట్లు
-లక్ష పట్టాలిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే
-శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు
-శాసనసభలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో సాగు, తాగునీటి, పవర్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్టే.. హైదరాబాద్‌ను మిషన్‌ మోడ్‌తో విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రానికే హైదరాబాద్‌ ఆర్థిక చోదకశక్తిగా అవతరించిందని.. ఏటా రూ.10వేల కోట్ల చొప్పున రానున్న ఐదేండ్లలో రూ.50 వేల కోట్లతో అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆదివారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ అంటే జీహెచ్‌ఎంసీ మాత్రమే కాదని.. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు విస్తరించిన నగరమని చెప్పారు. అందుకే, ఓఆర్‌ఆర్‌ వరకూ ప్రత్యేకంగా సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌కు రూపకల్పన చేశామని తెలిపారు. వచ్చే వర్షాకాలం ముగిశాక పనులను చేపడుతామని.. ఇందుకు సంబంధించి రోడ్లు తవ్వేక్రమంలో ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలో పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకే కొత్త మున్సిపల్‌ చట్టానికి రూపకల్పన చేశామన్నారు. ప్రతి పట్టణంలో తాగునీరు, పచ్చదనం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు, క్రీడాప్రాంగణాలు, వెండింగ్‌ జోన్లు.. తదితర మొత్తం 42 పాయింట్లను చెక్‌లిస్టుగా పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నామని, నెలకు రూ.148 కోట్లను కేటాయిస్తామని చెప్పారు. భవన నిర్మాణాలకు అతివేగంగా అనుమతులు మంజూరుచేసేందుకు టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని ఏప్రిల్‌ 2 నుంచి అమలుచేస్తామన్నారు. పట్టణప్రగతిని క్రమం తప్పకుండా కొనసాగించాలనే విజ్ఞప్తులు వస్తున్నామని.. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లున్నా తన దృష్టికి తేవాలని విజ్ఞప్తిచేశారు. 38 పట్టణాల్లో నిలిచిపోయిన మిషన్‌ భగీరథ పనులను పూర్తిచేయడానికి రూ.800 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.

శంషాబాద్‌దాకా మెట్రో విస్తరణ
హైదరాబాద్‌లో ప్రజారవాణాకు పెద్దపీట వేశామని.. మెట్రోరైలును శంషాబాద్‌ విమానాశ్రయం దాకా విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎలివేటేడ్‌ ట్రామ్‌లు, బీఆర్టీఎస్‌లను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పార్కింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 40 మల్టీ లెవెల్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో మూడువేలకు పైగా ఆటోల ద్వారా ప్రతిరోజూ ఏడువేల మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు. సుమారు 98 రహదారులను విస్తరిస్తున్నామని, ఇందులో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని తెలిపారు. చార్మినార్‌ సుందరీకరణ కోసం దాదాపు రూ.16 కోట్లు ఖర్చు చేశామని, మరిన్ని సొబగులు అందించేందుకు వెనుకాడమని చెప్పారు. పాతబస్తీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు.

లక్ష పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దే..
జీవో 58కు అనుగుణంగా లక్ష పట్టాలిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్లను తయారుచేస్తున్నామని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరుచూ చెప్తుంటారని, ఈ క్రమంలో ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్లను జాగ్రత్తగా చేపడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో శాటిలైట్‌ టౌన్‌షిప్పులను ఏర్పాటుచేసేందుకు ప్రత్యేకంగా ముసాయిదాను సిద్ధంచేశామని, దీనిని మంత్రిమండలి ఆమోదించాల్సి ఉన్నదన్నారు. శంషాబాద్‌ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడతామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, మన నగరం కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగిస్తామని వివరించారు. గ్రేటర్‌లో విలీనమైన ప్రతి ప్రాంతాన్నీ తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

పర్యావరణహితమైన పారిశ్రామికీకరణ
ఫార్మాసిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణహితమైన పారిశ్రామికీకరణ ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతాయని, అందుకనుగుణంగా ఫుడ్‌, అగ్రో పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంతో రెండో హరితవిప్లవం, మాంసం ఉత్పత్తి ద్వారా పింక్‌, పాల ఉత్పత్తి ద్వారా వైట్‌, మత్స్యపరిశ్రమ ద్వారా బ్లూ రెవెల్యూషన్లు వచ్చాయని వివరించారు.

రాష్ట్రంలో ఐటీ వృద్ధిరేటు జాతీయ సగటుకంటే అధికంగా 16.89 శాతం ఉన్నదని తెలిపారు. గత ఏడాది హైదరాబాద్‌ ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు సగటును దాటిందని చెప్పారు. ఐటీ కంపెనీలను ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరిస్తున్నాయన్నారు. ఫార్మాసిటీ అనుమతులు రద్దుచేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ ఒకరు అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. స్థానికులకు ఉపాధి కల్పించడానికి అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్ట్‌లకు ఇండ్ల స్థలాల విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.