
-16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మలివిడుత ప్రచారరంగంలోకి -బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలపై గళమెత్తనున్న నేత -గుణాత్మక మార్పు అవసరాన్ని వివరించనున్న సీఎం -6 రోజులు.. 13 నియోజకవర్గాలు..11 సభలు
లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించడానికి సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని పదహారు లోక్‌సభాస్థానాల్లో విజయమే లక్ష్యంగా మలి విడుత ఎన్నికల ప్రచారబరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే తొలివిడుతలో కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్న సీఎం.. రెండోవిడుత సభలను శుక్రవారం నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడ నుంచి ప్రారంభించనున్నారు. ఇదేరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలకు కలిపి నిర్వహించే భారీ బహిరంగసభనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ రెండు సభలకు స్థానిక నేతలు ధూంధాంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆరురోజుల వ్యవధిలో 13 నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే 11 బహిరంగసభలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. ఏప్రిల్ 4వ తేదీతో ఆదిలాబాద్ మినహా ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగసభ పూర్తికానుంది. ఎండాకాలం నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 4 గంటలకు మొదటిసభ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్లమెంట్ నియోజకవర్గాలు సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు సభ నిర్వహిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎందుకు గెలిపించాలి? జాతీయ రాజకీయాల్లో రావాల్సిన గుణాత్మక మార్పులేమిటి? వాటిని సాధించేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలి? అనే విషయాలను నేరుగా ప్రజలకు వివరించడంతోపాటు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని అభివృద్ధి చేయడంలో, ఇతర దేశాలకంటే ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైన తీరును తన ప్రసంగాల ద్వారా ఎండగట్టనున్నారు. ఈ బహిరంగసభల ద్వారా సుమారు 40-50 లక్షల మందితో సీఎం ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. ఆయా సభలను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లుచేస్తున్నారు. సభలు జరిగే ప్రాంతాలను గులాబీమయం చేశారు. ఈ నెల 17న కరీంనగర్, 19న నిజామాబాద్ బహిరంసభల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలకు అద్భుతమైన స్పందన లభించింది.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, దేశం తలరాత మారుస్తానన్న సీఎం.. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపించేందుకు సిద్ధమని కూడా సంచలన రీతిలో ప్రకటన చేశారు. రాష్ర్టాల హక్కులను కాపాడే, ప్రయోజనాలను నెరవేర్చే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. సమాఖ్య ప్రభుత్వంతోనే అన్ని రాష్ర్టాలు, తద్వారా దేశం ప్రగతిబాటన పయనిస్తుందని నమ్ముతున్న సీఎం.. అందుకు అవసరమైన కార్యాచరణను సైతం సిద్ధంచేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించని నేపథ్యంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కలిసి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు మెరుగవుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని, దేశ రాజకీయాలపై కొత్త ముద్ర వేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్ సభకు ధూంధాంగా ఏర్పాట్లు -చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ -నియోజకవర్గాల నుంచి లక్షల్లో జనసమీకరణ
సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో గులాబీ సేనల ప్రచారానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త జోష్ నింపబోతున్నారు. ఈ మూడుస్థానాలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ధూంధాంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గ్రేటర్ నలుమూలల నుంచి తరలివచ్చే వారంతా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లుచేశారు. సభకు సర్వం సిద్దమైందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాట్లను గురువారం టీఆర్‌ఎస్ నాయకులు గజ్జెల నగేశ్, కొమ్ముల నరేందర్‌లతో కలిసి తలసాని పరిశీలించారు. సభకు వచ్చే వారందరికీ ఇబ్బందిలేకుండా ట్రాఫిక్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తలసాని తెలిపారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, సామ స్వప్న, పరమేశ్వరీసింగ్, మిత్రక్రిష్ణ, ముఖేశ్‌సింగ్, దినేశ్‌చౌదరి, కార్వాన్ టీఆర్‌ఎస్ నాయకులు కావూరి వెంకటేశ్ తదితరులు కూడా సభాస్థలాన్ని పరిశీలించారు.
రెండు లక్షలమందితో మిర్యాలగూడ సభ! – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి టీఆర్‌ఎస్ బహిరంగసభకు భారీగా ఏర్పాట్లుచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగించే ఈ సభలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు రెండు లక్షలమంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. పట్టణ సమీపంలోని ఈదులగూడ వద్ద 58 ఎకరాల స్థలంలో సభాస్థలాన్ని ఏర్పాటుచేశారు. సమీపంలోనే హెలిప్యాడ్ సిద్ధంచేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని సభికులకు తాగునీటి వసతితో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వివిధ మార్గాల ద్వారా సభకు వచ్చే వాహనాలకు వేరు వేరుగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సీఎం సభ నేపథ్యంలో ఆ రోడ్డులో వెళ్లే ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరిశీలించారు.
