-ఎంత ఖర్చయినా వెనుకాడొద్దు -అవసరమైన కొత్త ప్రాజెక్టులు వెంటనే చేపట్టాలి -టీజెన్‌కోకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం -సత్వర నిర్ణయాలకోసం ఉన్నతాధికార కమిటీ -త్వరలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కలుస్తా -కర్ణాటక, తమిళనాడు సీఎంలతో మాట్లాడుతా – రైతులను ఏమాత్రం ఇబ్బందిపెట్టొద్దు -ప్రజలు కరెంటు కష్టాల్లో ఉంటే మీకు పట్టదా? -అధికారుల తీరుపై సీఎం అసంతృప్తి

తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత రాకుండా ఉండేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సాధ్యమైనంత తొందరగా కొత్త పవర్ ప్రాజెక్టులను చేపట్టాలని, వాటిని నిర్దేశితకాలంలో పూర్తిచేయాలని కోరారు. విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఆయన గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, టీజెన్‌కో సీఎండీ డీ ప్రభాకరరావు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా, నెలకొన్న విద్యుత్‌లోటు గురించి ముఖ్యమంత్రికి వివరించారు.
సకాలంలో వర్షాలు పడకపోవడంవల్ల మే నెలలో ఉండే వాతావరణం ఇప్పుడు కూడా కొనసాగుతున్నదని, దాంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో కేసీఆర్ స్పందిస్తూ- డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు అదనపు విద్యుత్ విషయంలో ఇప్పటివరకు మీరు తీసుకున్న చర్యలేమిటి? ఇప్పటికే రుతుపవనాల రాక ఆలస్యం అయ్యింది, భారీగా కరెంటు కోతలు అమలు చేయడం తప్ప మీరు చేస్తున్నది ఏమిటి? అని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యుత్ విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అంతేకాకుండా మున్ముందు విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ప్రస్తుత విద్యుత్ కొరతను అధిగమించేందుకు దక్షిణాది గ్రిడ్ పరిధిలో ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి విద్యుత్తును పొందే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఆయా రాష్ర్టాల్లో విద్యుత్ లభ్యత వివరాలు సేకరించినట్లయితే తానే స్వయంగా తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడగలనని కూడా సీఎం అధికారులకు స్పష్టంచేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్తు అందుబాటులో ఉన్నందున అక్కడి నుంచి తెలంగాణకు తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలని నిర్దేశించారు.
దీర్ఘకాలిక అవసరాల కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు 400 కేవీ, 220 కేవీ లైన్లు ఏర్పాట్లు చేసే అంశంపై వెంటనే దృష్టి సారించాలన్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో తాను మాట్లాడటమే కాకుండా అవసరమైతే మరో రెండు మూడు రోజుల్లో స్వయంగా ఆయనను కలుసుకుంటానని చెప్పారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్రలోని వార్ధా వరకు పవర్‌లైన్స్ ఉన్నందున వార్ధా నుంచి డిచ్‌పల్లి వరకు అదనంగా పవర్‌లైన్స్ నిర్మాణాలు చేపట్టినట్లయితే వీలైనంత త్వరలో విద్యుత్‌ను తీసుకునే అవకాశం ఉందని సీఎం అధికారులకు సూచించారు. అంతేకాకుండా ఒడిశా, జార్ఖండ్ లాంటి రాష్ర్టాలతో విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలని సీఎం అధికారులను నిర్దేశించారు.
తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్తును సాధించేంతవరకు పొరుగు రాష్ర్టాల నుంచి మిగులు విద్యుత్తును పూర్తిగా వినియోగించుకోవాలని, మున్ముందు తెలంగాణలో పూర్తిస్థాయి విద్యుత్ అందుబాటులోకి వచ్చాక పొరుగు రాష్ర్టాల అవసరాలకు ఇచ్చేందుకు వీలుగా విద్యుత్‌లైన్ల వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు. అదనపు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కార్యాచరణను తెలంగాణ జెన్‌కో సీఎండీ డీ ప్రభాకరరావు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం టీజెన్‌కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, వాటి వివరాలు, కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణాల ప్రతిపాదనలను సమగ్రంగా విన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వీలైనంత త్వరలో కొత్త పవర్ ప్రాజెక్టులను చేపట్టి నిర్దేశిత కాలంలో వాటిని పూర్తిచేసేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, తెలంగాణ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, టీ ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చంద, తెలంగాణ సదరన్ పవర్ డిస్కమ్ సీఎండీ రిజ్వీ తదితరులు హాజరయ్యారు.
కర్ణాటకనుంచి విద్యుత్ కొనుగోలు!: తెలంగాణలో విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకనుంచి విద్యుత్ కొనుగోలు చేయనుంది. రాష్ట్రంలో 350 మెగావాట్ల విద్యుత్ లోటు ఉంది. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కర్ణాటక నుంచి 250 మెగావాట్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. గురువారం రాత్రినుంచే కర్ణాటకనుంచి విద్యుత్ సరఫరా జరుగునున్నట్లు సమాచారం.