ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. మిడ్ మానేరుకు నీటి తరలింపు, పునరావాసం, ఉపాధి కల్పన, పరిహారం వంటి అంశాలపై సభ్యులు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, శోభలు ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయనేందుకు మిడ్‌మానేరు ఒక ఉదాహరణ అని మంత్రి హరీష్ అన్నారు. 1993-2006 మధ్య మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగలేదని చెప్పారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయలాంటిందని.. టీఆర్‌ఎస్ హయాంలో మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయన్నారు. 25 ఏళ్లలో జరగని పనులు మూడేళ్లలో చేసి చూపించామని తెలిపారు. ప్లానింగ్‌లో లోపం ఉండటం వల్ల ప్రాజెక్ట్ ఖర్చు పెరిగిందన్నారు. మిడ్ మానేరు పనులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు చెప్పారు. రూ. 461 కోట్ల పనులతో 10 టీఎంసీల నీటినిల్వ కోసం మిడ్‌మానేరును ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. ప్రస్తుతం ఐదున్నర టీఎంసీల నీటి నిల్వకు సిద్ధంగా ఉందన్నారు. మిడ్‌మానేరు ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అదేవిధంగా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 18 మండలాలకు తాగు నీరందుతుందని వెల్లడించారు. తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే డిసెంబర్ నుంచి మిడ్‌మానేర్‌తో 466 గ్రామాలకు తాగునీరు.. మానకొండూరు నియోజకవర్గంలోని 48,731 ఎకరాలకు సాగునీరందిస్తమని హరీష్ వెల్లడించారు. అదేవిధంగా మిడ్ మానేరు ద్వారా వేములవాడ గుడిచెరువుకు నీరు, చొప్పదండి నియోజకవర్గంలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.