Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మట్టిపనికైనా మనోడే ఉండాలె

-బీజేపీ ఎంపీ గెలిచినా, కాంగ్రెస్ ఎంపీ గెలిచినా ఢిల్లీకి గులాములే: కేసీఆర్
-16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలతో రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్త
-దేశ రాజకీయ గమనాన్ని మార్చి.. దిశ, దశ చూపిస్త..
-కేంద్రంలో ప్రాంతీయ పార్టీల చేతికే అధికారం
-కాంగ్రెస్, బీజేపీ పీఠాలు కదులుతున్నాయి.. వణుకు పుట్టింది
-నేను కొట్టినట్టు చేస్త.. నువ్వు ఏడ్చినట్టు చేయి అన్న చందాన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
-దేశం దరిద్రం పోవాలంటే ఈ ఇద్దరి దరిద్రం పోవాలి
-ఈ ఇద్దరు సన్నాసులులేని ఇండియా కావాలి
-73 ఏండ్లు గడిచినా మంచినీళ్లకు, సాగునీళ్లకు బాధేంది?
-వీటి గురించి మాట్లాడకుండా రామజన్మభూమి అంటున్నరు
-రాజకీయ నాయకులు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలె
-ప్రధాని ఎవరయితరని ఆసక్తిలేదు.. ప్రధాని కావాలనే కోరికలేదు
-ఫెడరల్ ఫ్రంట్ వస్తే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం
-వరంగల్ గడ్డమీద నుంచి సవాలు చేస్తున్న..మా డబ్బుతోటి నీ రాజ్యం నడుస్తున్నదా? నీ డబ్బులతోటి మేం బతుకుతున్నమా?
-నరేంద్రమోదీ సమాధానం చెప్పాలి
-దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి
-అనేక అంశాల్లో దేశానికి దిక్సూచిగా ఉన్నాం
-వరంగల్, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

మట్టిపనికైనా మనోడే ఉండాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఇక్కడ బీజేపీ ఎంపీ గెలిచినా, కాంగ్రెస్ ఎంపీ గెలిచినా.. వీరు ఢిల్లీ గులాములేకానీ మాట్లాడేవాళ్లు కాదన్నారు. రాహుల్, మోదీ ముందు వాళ్లు మాట్లాడుతరా? సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! మూత్రం పోయాలన్నా ఢిల్లీవాళ్ల అనుమతి కావాలి అని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలైతే.. ఇద్దరైనా మీరిచ్చిన బలాన్ని ఉపయోగించి పేగులు తెగేవరకు పోరాడి తెలంగాణ తెచ్చాం. ఇదే పద్ధతిలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకునేందుకు.. మట్టిపనికైనా సరే ఇంటోడు ఉండాలన్నట్టు.. పదహారుమంది టీఆర్‌ఎస్ ఎంపీలుంటే తెలంగాణ హక్కులు నెరవేరుతయి అని చెప్పారు. ఈ దేశం కూడా బాగుపడాలని, పేదరికం పోవాలని, దేశంలో ఉన్న వనరులన్నీ దేశ సౌభాగ్యానికి ఉపయోగపడాలని, నిరుద్యోగ సమస్య పోవాలని, పంటలకు గిట్టుబాటు ధర లభించాలని, మౌలిక సదుపాయాలు పెరుగాలని సీఎం ఆకాంక్షించారు. ఇవన్నీ జరుగాలంటే కేంద్రంలో ఫెడరల్‌ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడాలని, బీజేపీ లేని, కాంగ్రెస్‌లేని భారత్ కావాలని చెప్పారు. దళితులకు వర్గీకరణ ఫెడరల్ ఫ్రంట్‌తోనే సాధ్యమని స్పష్టంచేశారు. అత్యంత ధనికరాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ర్టాల్లో ఒకటని అన్నారు. సంక్షేమంతోపాటు అనేక అంశాల్లో దేశానికి దిక్సూచిగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ అవసరాలు, ప్రయోజనాలు, ప్రాజెక్టులు, హక్కులకోసం కచ్చితంగా టీఆర్‌ఎస్ ఎంపీలు గెలువాలన్నారు. మీరు గెలిపించే 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలతో దేశ రాజకీయ గమనాన్ని మార్చి.. దేశానికి ఒక దశ-దిశ చూపించేలా సర్వశక్తులు ఒడ్డుతానని పునరుద్ఘాటించారు. వరంగల్ సభలో ఆజంజాహీ మిల్లు ప్రాంతంలో సభ పెట్టినవాళ్లంతా ప్రధానులు అయ్యారన్న దయాకర్‌రావు వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. ప్రధానమంత్రి ఎవరయితరని నాకు ఆసక్తి లేదు. ఆజంజాహీ మిల్లుల సభ పెట్టినోళ్లందరూ ప్రధానమంత్రి అయిండ్రని దయాకర్‌రావు చెప్పినరు. నాకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు అని వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

దేశం బాగుకోసం తెలంగాణనే వైతాళికుడు కావాలి..
దేశం బాగుపడడంకోసం తెలంగాణనే వైతాళికుడు కావాలి. మనమే ముందుపడుదాం. బలంగా కొట్లాడుదామా? పోవాల్నా? మీ దీవెన ఉంటే, నాంది ప్రస్తావన మీరే పలికితే.. దేశం నివ్వెరపోయేలా 16కు 16 ఎంపీ సీట్లు మనమే గెలిస్తే కచ్చితంగా ఢిల్లీని శాసించే పరిస్థితి నాది. పోలికేకపెట్టే బాధ్యత నాది. ఈ దేశం గతిని కూడా మార్చే బాధ్యత తీసుకుందాం. తెలంగాణ బిడ్డనే.. తెలంగాణ దశ మారుస్తున్నడు.. భారతదేశం కూడా మారుస్తడనే గౌరవం తెలంగాణ జాతికి దక్కేలా రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇస్తున్న.

ఐదేండ్లలో మారిపోయిన తెలంగాణ

మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరంలేదు. ఐదేండ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే? ఇవాళ ఎట్ల ఉన్నది? గతంలో కరంటుకోసం ధర్నాలు, లాఠీచార్జీలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు.. ఎన్నోచూశాం. ఐదేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో పరిస్థితి తారుమారైంది. కష్టంచేస్తే.. వళ్లువంచితే సాధ్యమైంది. జగదీశ్‌రెడ్డి విద్యుత్‌మంత్రిగా శ్రమించారు. మనమందరం గర్వపడేలా విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. సంక్షేమంతోపాటు అనేక కార్యక్రమాల్లో దేశానికి దిక్సూచిగా ఉన్నం. మే నుంచి పింఛన్లు రెట్టింపు కానున్నాయి. వికలాంగుల పింఛన్ మూడువేలు కానుంది. రైతుబంధు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. వచ్చే వానకాలం పంటలకు రూ.5 వేలు ఇవ్వనున్నాం. 2, 5 గుంటల భూమి ఉన్న రైతు మరణించినా పదిరోజుల్లో రూ.5 లక్షలు అకౌంట్లో జమ అవుతున్నాయి. దీన్ని ప్రపంచం, దేశం కొనియాడుతున్నాయి. మా రాష్ట్రంలో పెడుతం అని అంటున్నారు. ఇది మనకు చాలా తృప్తినిచ్చే అంశం.

వీళ్లా మనకు కావాల్సింది?
పార్లమెంట్ ఎన్నికలు మోపైనకాన్నుంచి రోజూ టీవీల్ల చూస్తూనే ఉన్నం. రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ.. ఒకనిమీద ఒగలు తిట్టుకుంటున్నరు. ప్రధానమంత్రి చోర్ హై అని ఒకడు అంటాడు. మా, బేటా జమానత్ మే హై అని నరేంద్రమోదీ అంటాడు. మైకులు పగులుతున్నయి. నాకైతే సమజ్‌గాలే.. ఎవల మీద బొబ్బ పెడుతున్నరు వీళ్లిద్దరు? ఇందులున్న తమాషా ఏంది? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏండ్లు అవుతున్నది. దేశాన్ని ఎన్డీయే రూపంలో పదకొండేండ్లు బీజేపీ, 55 ఏండ్లు కాంగ్రెస్ పాలించాయి. మధ్యలో ఓ నాలుగేండ్లు ఇతర పార్టీలు పాలించాయి. ఇంకెవరో పరిపాలించినట్టు.. ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నరు మీ దొంగతనం బయటపడవద్దని! తెనాలి రామలింగని కథ ఉన్నది. నేను కొట్టినట్టు చేస్త.. నువ్వు ఏడిసినట్టు చెయ్యి అన్నట్టు వాళ్లువాళ్లే తన్నుకుంటే మనం బేజారుగావాలె! వీళ్లేనా మనకు కావాల్సింది? ప్రజలు లేరా? సమస్యలు లేవా? నేను దాదాపు ఏడాది నుంచి ఫెడరల్‌ఫ్రంట్ అని ఎప్పుడైతే మాట్లాడినానో.. ఆనాటినుంచి అడుగుతున్న. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నయి. వ్యవసాయానికి అనుకూలమైన భూమి 40 కోట్ల ఎకరాలు. ప్రతి ఎకరాకు నీళ్లుపారించినా ఇంకా 30 వేల టీఎంసీలు మిగులుతయి. పదివేల టీఎంసీలు తాగునీళ్లకు, పారిశ్రామిక అవసరాలకు వాడుకున్నా.. ఇంకా 20 వేల టీఎంసీల మిగులు నీళ్లున్నయి. 73 ఏండ్లు గడిచిపోయినా ఇంకా మంచినీళ్లకు బాధ, సాగునీళ్లకు బాధ. కరువుతో అల్లాడాలె. వాటిని ఎందుకు వాడటం లేదంటే వాడు మాట్లాడడు.. వీడు మాట్లాడడు! సమస్యల మీద నిలదీస్తే చర్చకురారు. ఏమంటడు మోదీ? కేసీఆర్ యాగాలు చేసుడు ఎక్కువ, పూజలు చేసుడు ఎక్కువ.

కేసీఆర్ ముక్కు పెద్దగుంటది! కేసీఆర్ ముక్కు పెద్దగుంటేంది.. ముడ్డి పెద్దగుంటేంది? ఇవా మాట్లాడేది? దేశం సంగతి, రైతుల సంగతి, గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య ఏందంటే.. అది ఇటుపెట్టి బూర నర్సయ్య ముఖం బాగాలేదు.. కేసీఆర్ ముక్కు బాగాలేదు! గిదేనా మాట్లాడేది? దేశంలో ఉత్పత్తి అవుతున్న కరంటు 3.44 లక్షల మెగావాట్లు. ఇందులో నాలుగు రకాల పవర్ ఉంటుంది. ఒకటి ఆటమిక్ పవర్, రెండోది థర్మల్ పవర్, మూడోది హైడల్ పవర్, నాలుగోది సోలార్ పవర్. హైడల్ పవర్‌గానీ, సోలార్ పవర్ గానీ వస్తుంటయి పోతుంటయి. కానీ ఆటమిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ స్థిరంగా ఉంటయి. వీటి కింద సుమారు 2.50 లక్షల మెగావాట్లు ఉంది. ఈ దేశం చేసుకున్న దుర్గతి, దౌర్భాగ్యం ఏందంటే.. 3.44 లక్షల మెగావాట్ల పవర్ ఉంటే ఎన్నడూ 2.20 లక్షల మెగావాట్ల వినియోగం దాటలే. ఉన్న కరెంట్‌ను వాడుకునేది లేదు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడ 24 గంటల కరంటు ఇవ్వరు. ఉన్న నీళ్లు, కరంటు వాడే తెలివి లేదు. దేశంలో యువశక్తిని, పనిచేసే మనషులను వాడుకునే తెలివిలేదు. మళ్లీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే వాళ్లే వచ్చారు. జలవిధానం బాగలేదు. ఎకనామిక్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ బాగలేదు. పాకిస్థాన్‌ను కంట్రోల్‌చేసే దమ్ములేదు. ఇవన్నీ రోజూ చూస్తలేమా? నిజంకాదా! ఎవరు బాధ్యులు? కేసీఆర్ బా ధ్యుడా? ఏమన్నంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, కంసుడి భూమి, సీతమ్మ పుట్టింది, శూర్పణఖ పుట్టింది.. ఇదేపనా? అవిచెప్పడానికి శంకరాచార్యులు, చిన్నజీయర్ స్వామిలున్నరు. మఠాధిపతులు, పీఠాధిపతులున్నరు. రాజకీయ నాయకులం మనకెందుకు? రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు మాట్లాడాలే. చేనేత, గీత కార్మికులు, రైతుల బాధలేందో మాట్లాడాలె.

సర్పంచ్‌స్థాయి కన్నా దిగజారిన ప్రధాని
చిన్న చిన్న సమస్యలు కూడా కేంద్రం దగ్గరపెట్టుకొని కూర్చున్నది. రాష్ర్టాల హక్కులు, అధికారాలు అన్నీ లాగేసుకున్నరు. గడ్డివాము మీద కుక్క కూసున్నట్టు.. వాళ్లు మెయ్యరు, ఇంకోలను మేయనీయరు. పనిచేయరు.. చేసేవాళ్లను చేయనీయరు. విదేశాంగనీతి పట్టించుకోరు. పాకిస్థాన్ సమస్య పరిష్కరించరు. గిట్టుబాటు ధరలు రావు. కానీ రాష్ర్టాల వెంబడిపడి చిల్లర రాజకీయాలు చేస్తరు. నరేంద్రమోదీ ఏం మాట్లాడతరు? కేసీఆర్ జాతకం చూసుకుంటరు.. ముక్కు సక్కగలేదు.. ఇదేనా ప్రధాని మాట్లాడేది? దేశ రాజకీయాల్ని నడిపించే వ్యక్తులు గివి మాట్లాడవచ్చునా? సర్పంచుస్థాయి కన్నా దిగజారి ప్రధాని మాట్లాడుతరు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఇంతకన్న అధ్వాన్నం ఏ మైనా ఉంటదా? గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడితే కూడా నువ్వు రా.. నేను చెప్పేది తప్పయితే నేను సీఎం పదవికి ఐదునిమిషాల్లో రాజీనామాచేస్తా, లేకపోతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకురాయాలని చెప్పినం. కానీ దాటిపోయి వెళ్లిపోయిండు. ఇయ్యాల మోదీ పచ్చి అబద్ధం చెప్తున్నరు.

20 లక్షల కోట్లు మూలుగుతున్నయి
ఆర్‌బీఐ, మహారత్న కంపెనీల దగ్గర 20 లక్షల కోట్లు మూలుగుతున్నయి. వాటిని వాడే తెలివిలేదు ఈ దద్దమ్మలకు. వికసించి ముందుకు పోతున్న దేశంలో కేంద్ర బడ్జెట్‌కు సమానమైన డబ్బు మూలగవచ్చునా? రండి చర్చకు ఎవరు వస్తారో? ఇవన్నీ మారాలె. దేశం ఆర్థిక పరిస్థితి పెరుగాలె. మనకన్న తక్కువ ఆదాయం, తక్కువ వ్యవసాయ భూమి ఉన్న చైనా.. ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థికశక్తిగా ఉన్నది. వాళ్లు ఏమైనా బంగారం తింటున్నరా? వాళ్లకు బుర్ర ఉన్నది.. ఈ సన్నాసులకు బుర్ర లేదు. కాంగ్రెస్ ముక్త్, బీజేపీ ముక్త్ భారతదేశం కావాలి. రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల కూటమి.. ఫెడరల్ ఫ్రంట్ దేశంలో అధికారం చేపట్టాలి. రైతుల పరిస్థితి, దేశం పరిస్థితి బాగుపడాలి. అది కావాలంటే ఎక్కడినుంచో ప్రారంభంకావాలి.

బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టరా?
బీసీలు దేశంలో 50 శాతం ఉంటరు. ఆర్ కృష్ణయ్యను నేను ప్రధానమంత్రి దగ్గరికి తీసుకపోయి దండం పెట్టి అడిగిన. ప్రతి రాష్ట్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఉన్నది.. కేంద్రంలో కూడా పెట్టాలని మన్మోహన్‌సింగ్, నరేంద్రమోదీలను అడిగిన. పెట్టరు.. ఏ కారణం చేత పెట్టరు? కండ్లు నెత్తికి ఎక్కినయా? ప్రజలకు అవసరాలు లేవా? ఎందుకో ఇయ్యరు.

రాజ్‌నాథ్‌సింగ్‌కు కిందపడ్డంత పని..
రైతుబంధు అనే స్కీం పెట్టినవట.. ఎట్టెట్ల ఉన్నది అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అడిగిండు. ఎకరానికి 4వేలు, రెండు పంటలకు 8వేలు ఇస్తున్నామని చెప్పిన. అందరికీ ఇస్తున్నరా అనడిగితే.. మా రైతులు దెబ్బతిని ఉన్నరు.. అప్పుల పాలై నాశనమై ఉన్నరు.. పదేండ్ల దాకా అందరు రైతులకు ఇస్తమని చెప్పిన. ఎన్ని కిస్తీల్లో వాపస్ కట్టాలి అని రాజ్‌నాథ్ అడిగిండు.. వాపస్‌లేదు.. ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పిన.. ఆయన కుర్చిలకెల్లి కిందపడ్డంత పనిచేసిండు. ఇదొక్కటే కాదు రైతుబీమా కూడా పెట్టినమని చెప్పిన. చానా పరేషాన్ అయిండు. ప్రధానికి సంకల్పం ఉంటే దేశంలో కల్యాణలక్ష్మి పథకం ఇవ్వరాదా? రైతుబంధు స్కీం పెట్టరాదా? రైతుబీమా పెట్టరాదా? ఎందుకు పెట్టరు? పెట్టరు. అడిగెటోడు లేరు.. రైతులు ఏం చేస్తరు? ఓట్లప్పుడు గిదే బొబ్బ పెడుతం? ఈ భూమి ఆ భూమి.. ఏదో ఒకటి చూపిస్తాం.. ఓట్లు వెయ్యక ఏం చేస్తరు అనే నిర్లక్ష్యం. అట్లే సాగుతున్నది. బంద్‌కావాలి. బంద్‌కావాలంటే ఎక్కడనో పిడికిలి లేవాలి.. మీ దీవెన ఉన్నట్టయితే ఆ పిడికిలి బిగించడానికి, ఈ దేశం గతి మార్చడానికి నేను సిద్ధం.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు ఒక్క తెలంగాణలోనే
ఇండియాలోనే వ్యవసాయానికి ఉచితంగా 24గంటల కరంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఐదేండ్లలో ఇంత మార్పు వచ్చింది. అంతేకాదు సంక్షేమరంగంలో దేశానికే దిక్సూచిగా ఉన్నం. పెన్షన్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, రైతుబంధు, రైతుబీమా.. ఇలా అనేక విషయాల్లో దేశానికి మార్గదర్శకంగా ఉన్నం. కొత్త జిల్లాలను చేసుకున్నం. వరంగల్‌లో చాలా కార్యక్రమాలుచేశాం. నిన్న, మొన్నటివరకు డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి విద్యాశాఖ నిర్వహించారు. చాలా ప్రయత్నంచేశారు. హెల్త్ యూనివర్సిటీ, సైనిక్‌స్కూల్, వెటర్నరీ కాలేజీ, ఐటీ కార్యక్రమాలు తెచ్చాం. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నయి. పరకాల ప్రాంతంలో టెక్స్‌టైల్‌పార్కు నిర్మాణం ప్రయత్నాలు జరుగుతున్నయి. మీకోసమే ఈ రోజు పరకాల, తొర్రూర్, స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేసుకున్నం.

వరంగల్ జిల్లాకు 70- 100 టీఎంసీల డెడికేటెడ్ జలాలు
అన్నింటికి మించి వరంగల్ జిల్లాకు దాదాపు 70 నుంచి 100 టీఎంసీల డెడికేటెడ్ జలాలు ఉండేలా దేవాదుల నిర్మాణం పూర్తవుతున్నది. రిజర్వాయర్ నిర్మాణం కూడ జరుగుతున్నది. దానికోసం ఇబ్బందిపడాల్సిన అవసరంలేదు. తుపాకులగూడెం వద్ద బరాజ్ నిర్మాణం కూడా జరుగుతున్నది. ఎస్సారెస్పీ కాల్వల్లో గత ప్రభుత్వ హయాంలో చెట్లు మొలిచినయి. ఇప్పుడే వాటి మరమ్మతులు జరుగుతున్నయి. ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద బటన్ ఆన్ చేసినమంటే దాదాపు పదినెలలు ఎస్సారెస్పీ కాల్వలో నిండా నీళ్లుంటాయి. ఐదేండ్లకో, పదేండ్లకో కాదు.. ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతున్నరు. ఈ వానకాలం తర్వాత కాకతీయ కాల్వ నీళ్లు లేకుండా ఉండదు.

రెండునెలల్లో కొత్త రెవెన్యూ చట్టం
భూముల విషయంలో దేశంలో ఎవరూచేయని సాహసం చేశాం. రెవెన్యూ రికార్డులు, పాసుబుక్కులను మార్చినం. సాదాబైనామాల్లో కొన్ని సమస్యలున్నాయి. రికార్డులు కొన్ని మారాల్సి ఉన్నయి. పోయిన టర్మ్‌లో కొత్త రాష్ట్రం కాబట్టి.. అర్థంచేసుకోవాలి కాబట్టి ఎక్కువ టైం పోయింది. ప్రతి జిల్లాకు నేనే స్వయంగా వచ్చి అన్ని సమస్యలూ పరిష్కరిస్త. ఈలోపల మీరెవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరంలేదు. రాబోయే రెండునెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నం. రైతులు ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, వారు కూర్చున్న దగ్గరే పనులు అయ్యేలా చేస్త.

ఫెడరల్ ఫ్రంట్‌తోనే ఎస్సీ వర్గీకరణ
కశ్మీర్‌నుంచి కన్యాకుమారిదాకా దళితులు దరిద్రంలో మగ్గుతున్నరు. మనదగ్గర ఎస్సీ వర్గీకరణ అంశం ఉన్నది. అసెంబ్లీలో నాలుగుసార్లు తీర్మానంచేసి పంపించినం. కడియం శ్రీహరి, మేమంతా మోదీని బతిమలాడినం. నీ అయ్య జాగీరా? ఎందుకియ్యరు? మా రాష్ట్రంలో మేం చేస్కుంటమంటున్నం. కేంద్రం తలచుకుంటే 371-డీలా ఒక రాష్ర్టానికి కూడా ఇయ్యొచ్చు. కానీ ఇయ్యరు. కాంగ్రెస్ ఇయ్యలే, బీజేపీ కూడా ఇయ్యలే. రేపు వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలన్నా ఫెడరల్‌ఫ్రంట్ ప్రభుత్వమేరావాలి. ప్రాంతీయపార్టీల పెత్తనమే నడువాలి. అప్పుడే మన వర్గీకరణ సమస్య పరిష్కారం అయితది.

భువనగిరి జిల్లాలో అద్భుత అభివృద్ధి
ఎక్కడ ఎవ్వరు లేనినాడు, ఉద్యమానికి పోయినపుడు ఈ మొత్తం ప్రాంతం నుంచి నీ వెనుక నీను ఉంటానని ఎలిమినేటి క్రిష్ణారెడ్డి అన్న మద్దతు తెలిపారు. ఆయన ఆశీర్వచనంతోనే ముందుకు పోయాం.. తెలంగాణ సాధించాం. ఆయనతోపాటు సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి మాకు జిల్లా కావాలని పట్టుబట్టారు. భువనగిరిని జిల్లా చేసుకున్నాం. తెలంగాణ ఏర్పడకుంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం లేకుంటే జన్మల జిల్లా అయ్యేదా? ప్రపంచమే ఆశ్చర్యపోయేలా స్వామివారి ఆలయ నిర్మాణం జరుగుతున్నది. భవిష్యత్‌లో అంతర్జాతీయ యాత్రికులు వస్తరు. ఈ ప్రాంతం ఆర్థిక ముఖచిత్రం మారిపోతుంది. ఒక టూరిజం సర్క్యూట్‌గా చేసుకుందాం.

భువనగిరి జిల్లాలో పెండింగ్ కాల్వలు పూర్తవుతాయి
లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా అందరు పెండింగ్‌లో ఉన్న మూడు నాలుగు కాల్వలు పూర్తిచేయాలని అడుగుతున్నారు. ఇప్పటికే బునాదిగానికాల్వ, ధర్మారెడ్డికాల్వ, పిల్లాయిపల్లికాల్వల పనులు జరుగుతున్నాయి. వీటన్నింటికి మించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దగ్గర పడ్డది. గోదావరి మీద బరాజ్‌లు అయిపోయాయి. జూలై నెలలో ప్రారంభమవుతుంది. భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చేందుకు 11 టీఎంసీలతో బస్వాపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్, ఆలేరు ప్రాంతంలో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణమవుతున్నయి. మొత్తం ఉదయసముద్రం నుంచి నకిరేకల్ వరకు లిఫ్ట్ పనులు జరుగుతున్నయి. కాళేశ్వరం నుంచి కాల్వల నీళ్లు కూడా తుంగతుర్తి, సూర్యాపేట వంటి కింది ప్రాంతాలకు రాబోతున్నయి. రిజర్వాయర్ కావాలని మా కిశోర్, మంత్రి జగదీశ్‌రెడ్డి కొట్లాడుతున్నరు. రుద్రమచెరువును పెద్దగచేయాలని కోరుతున్నరు. కొద్దిరోజుల్లో మం జూరుచేసి, నేనే వచ్చి కొబ్బరికాయ కొడుత.

పది లక్షల ఎకరాలకు నీరు
కాల్వలకు నీళ్లు వదిలినపుడు చానా ఏండ్లాయే.. జీవితంలో మొదటిసారి నీళ్లు చూస్తున్నం అని రైతులు సంతోషపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే.. ఏడాదికి 8-9 నెలలు కాల్వ నిండు గర్భిణిలా ఉంటుంది. కాల్వల మరమ్మతులు కూడా వెయ్యికోట్లతో పూర్తిచేస్తున్నాం. గంధమల్ల, బస్వాపూర్, ఉదయసముద్రం రిజర్వాయర్ కావొచ్చు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు కావొచ్చు.. కచ్చితంగా 10 లక్షల ఎకరాలకు ఈ ఏడాది చివరినాటికి నీరు అందుతుంది. వచ్చే ఏడాదిలో పదిలక్షల ఎకరాల్లో పచ్చని పంట పొలాలు చూపించే బాధ్యత నాది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. మూసీ ప్రాజెక్టు ఎన్నడూ ప్రతిపాదిత ఆయకట్టు పారలేదు. మంత్రిగారు వెంటబడి కాల్వలు మంచిగ చేస్తే 20 వేల ఎకరాలు పారుతున్నయి.

పట్టుబట్టి ఎయిమ్స్ సాధించారు
ఎంపీ నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఢిల్లీలో వంద చెక్కర్లుకొట్టి కేంద్ర ఆరోగ్యమంత్రి దమాక్ ఖరాబ్‌చేసి ఎయిమ్స్ తెచ్చారు. బూర నర్సయ్య గట్టోడు కాబట్టి ఇస్తవా.. లేకుంటే బూర పట్టి సంపుత బిడ్డ అంటే ఎయిమ్స్ వచ్చింది. శేఖర్‌రెడ్డి ఏనాడూ అలగడు. సౌమ్యుడు. అలాంటి వ్యక్తి ఓ రోజు వచ్చి ఎయిమ్స్ కావాలి.. బీబీనగర్‌లో ప్రారంభం కావాలని అడిగిండు. ప్రయత్నించి సాధించిండు. దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు ఈ ఎన్నికల తర్వాత శంకుస్థాపన చేస్తం. దాదాపు 10,000 మందికి ఉపాధి దొరుకనుంది. తాగడానికి మంచి నీళ్లు వస్తయి. ఫ్లోరైడ్ బాధలు పోతయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జనగామలో మెడికల్ కాలేజీ పెడ్తవ? పెట్టవ అని బద్దపట్టుకొని తిరుగుతుండు. జనగామ జిల్లా కేంద్రం అయింది కాబట్టి గ్యారంటీగా అక్కడికి రావాల్సినవి వస్తవి.

రైతుల ఖాతాల్లో నగదు నిల్వ ఉండాలెv మొన్ననే మీరు గెలిపించారు. స్థానిక సమస్యలన్నీ పరిష్కారం చేసుకుందాం. సాగునీళ్లు తెచ్చుకుందాం. తాగునీళ్లు కడుపునిండా తెచ్చుకుందాం. 24 గంటల ఫ్రీ కరంట్ ఇచ్చుకుందాం. తెలంగాణ రైతులు ఉన్న బాకీలన్నీ కట్టి, ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో నాలుగు లక్షలు, ఆరు లక్షలు, పది లక్షలు నిల్వ రావాలే. అప్పుడే అది బంగారు తెలంగాణ. దానికోసమే ఆరునూరైనా రాజీలేకుండా ముందుకుపోతం. ప్రభుత్వమంటే ఇలా పనిచేస్తదా? అన్నట్లుగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తం.

దయాకర్, వేమిరెడ్డి, నర్సయ్యగౌడ్‌లను భారీ మెజార్టీలతో గెలిపించాలి
వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా. ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించింది. ఇక్కడి ప్రజలకు కొత్తగా నేర్పాల్సిన అవసరంలేదు. స్ఫూర్తిమంతమైన తీర్పు వస్తుందని భావిస్తున్న. ఆనాడు జయశంకర్‌సార్ ఆధ్వర్యంలో అద్భుతంగా ఉద్యమాన్ని నిర్మించి, రాష్ట్ర సాధనలో నిలిపిన జిల్లా. టీఆర్‌ఎస్‌ను, ఉద్యమాన్ని అగ్రభాగాన నిలబెట్టినారు. ఈ ఎన్నికల్లోనూ అగ్రభాగాన నిలబెట్టాలి. సౌమ్యుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు దయాకర్‌ను గతంలో పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించినరు. దయాకర్ కత్తి పట్టి ఢాం ఢూం అనడు. కానీ తన జిల్లా, నియోజకవర్గ ప్రయోజనాల కోసం అనేకసార్లు నా దగ్గరికొచ్చి మాట్లాడినరు. పోరాటం కూడా చేస్తుంటడు. వినయశీలి. ఎవరికీ కీడుచేయడు. మంచి వ్యక్తి అయినందున అలాంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుందని మీముందు పెట్టాను. దయాకర్ కారు గుర్తుకు ఓటువేసి పెద్ద మెజార్టీతో గెలిపించి, వరంగల్ గౌరవాన్ని, తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి.

నల్లగొండలో రెండు సీట్లు గెలిపించాలి
నల్లగొండ సాయుధ పోరాటంచేసిన జిల్లా. కమ్యూనిస్టు ఉద్యమాలతోని ఎర్రజెండా ఎగిరిన జిల్లా. చైతన్యం,. మేధావులు ఎక్కువ. ఉమ్మడి నల్లగొండ జిల్లా రెండుసీట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్, వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించాలి. నర్సయ్యగౌడ్ విద్యావంతుడు, సౌమ్యుడు. దేశంలోని నలుగురైదురుగు ప్రముఖ లాప్రోస్కోపీ డాక్టర్లలో ఒకరు. ఆయనకు చాలా పెద్ద ఆదాయం ఉన్నది. పదిమందికి దానమిచ్చేంత శక్తియుక్తులున్నయి. కానీ తెలంగాణ ఉద్యమం జరిగేనాడు డాక్టర్ల జేఏసీ స్థాపించి.. కేసీఆర్ ముందుకు నడువు.. మీతోపాటు మేం ఉన్నాం అన్నడు. తెలంగాణ డాక్టర్లందరినీ ఏకంచేసిన తెలంగాణ బిడ్డ. ఎంపీగా కూడా గొప్పగా పనిచేశాడు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించండి.

దేశాన్ని సాదుతున్నం
తెలంగాణ అని నేను మొదలుపెట్టినపుడు నాపై జోకులు వేశారు. మీ అందరి దీవెనలతో గట్టిపోరాటంచేస్తే రాష్ట్రం సాధించినం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అద్భుత రాష్ట్రంగా ఉంటుందని ఉద్యమ సమయంలో మధుసూదనాచారి, మేం చెప్పినం. చెప్పినట్టే అత్యంత ధనికరాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. దేశాన్ని సాదే ఐదారు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. రూ.35వేల కోట్లు ఇచ్చినానని ప్రధాని ప్రగల్భాలు పలుకుతున్నరు. ముష్టి 35వేల కోట్లు మీరియ్యలేదు. మనల్ని ఢిల్లీ సాదుతలేదు, మనమే ఢిల్లీని సాదుతున్నం. కస్టమ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కంటాక్స్, జీఎస్టీలో కేంద్రం వాటా.. ఇట్ల ఏటా కేంద్రానికి తెలంగాణ లక్ష కోట్లు ఇస్తుంది. మా రాష్ట్రం నుంచి జనరేట్ అయ్యే దాదాపు రూ.75వేల కోట్లను మీరు వాడుకుంటున్నరు. తప్పని అంటలేం. కానీ ఇక్కడికొచ్చి అబద్ధాలు మాట్లాడొద్దు. నరేంద్రమోదీ.. మా డబ్బుతోటి నీ రాజ్యం నడుస్తున్నదా? నీ డబ్బులతోటి మేం బతుకుతున్నమా? సమాధానం చెప్పాలని వరంగల్ గడ్డమీద నుంచి చాలెంజ్ చేస్తున్న. మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ దేశాన్ని గోల్‌మాల్ చేసే కాంగ్రెస్, బీజేపీలు భారతదేశానికి పనికిరావు. కాంగ్రెస్‌లేని, బీజేపీలేని కూటమి ఈ దేశానికి కావాలి. ఇంతకుముందే ఎన్డీటీవీ వాళ్లు హైదరాబాద్‌లో నన్ను ఇంటర్వ్యూ చేసినరు. కచ్చితంగా కాంగ్రెసేతర, బీజీపీయేతర కూటమి అధికారంలోకి వస్తుంది, అనుమానంలేదని వాళ్లు కూడా చెప్తున్నరు.

భయపడితే ఈ జన్మల తెలంగాణ రాకపోవు
తెలంగాణ ఉద్యమం చేయకుండా.. తిడుతరో కొడుతరో అని భయపడి, నాకేందిలే అనుకుంటే ఈ జన్మల తెలంగాణ రాకపోవు. ఆనాడు మీరు వస్తారని ధైర్యంతోని పిడికిలి బిగించి గులాబీ జెండా ఎగురవేస్తే తెలంగాణ వచ్చింది. ఇయ్యాల కూడా ఆ మోదీతో, రాహుల్‌తో నాకెందుకు పంచాయితీ.. వాళ్లు పెద్దోల్లు, దబ్బున కిందిమీద చేస్తరేమో అని భయపడి ఇంట్లో పంటే.. నన్ను ఎవ్వడు ఏమనరు. చంద్రశేఖర్ జీ.. ఆప్ బహుత్ అచ్ఛేహై అంటరు.. ఎదురుతిరగంగానే ముక్కు సక్కగలేదు.. మూతి సక్కగలేదు.. ఈ దుకాణం మొదలుపెడుతరు. నేను మొండోన్ని. నేను వాని అయ్యకు కూడా భయపడ! కేసీఆర్.. నీ భరతం పడుత అని ఓ బీజేపోడు అన్నడు.. నా భరతం నీవు పట్టేంది ఏంది? నాకు ఉన్నదేంది? నీవు పట్టేదేంది? గోచా? గొంగడా? నాకు గీన్నే గింతంత భూమి ఉన్నది. ఏ చెకింగ్ వస్తవో రా బిడ్డ. దున్నుకుందామంటే నాలుగు మడులున్నయి. బర్ల కొట్టాలున్నయి. నాకు తిక్కరేగితే నీ బండారమంతా బయటపెడుతా అని అన్నాను.

కాంగ్రెస్, బీజేపీల పీఠాలు కదులుతున్నాయి..
ఎక్కన్నో ఒకడు, యాడనో ఒకడు పిడికిలి లేవట్టాలె. ఎవడో ఒకడు గొంతు ఎత్తాలె. దేశం గతి మారాలె. ప్రపంచంలోనే ఎక్కడాలేని వనరులు ఇక్కడ ఉన్నయి. సింగపూర్ దేశంలో మంచినీళ్లు లేవు. మట్టికూడా లేదు. వాళ్లు సముద్రం పూడ్చడానికి మట్టిని ఇండోనేషియా నుంచి కొనుక్కుంటరు. వాళ్ల జనాభానే 40-50 లక్షలు. ఆ దేశానికి 193 కిలోమీటర్లే సముద్ర తీరం. కానీ.. ఎగుమతి, దిగుమతి చేసే కంటెయినర్లు 3.70 కోట్లు. మన దేశానికి 7500 కి.మీ. సముద్రతీరం ఉంది. మనం ఎగుమతి, దిగుమతి చేసే కంటెయినర్లు 50-60 లక్షలు. అంతర్జాతీయ సగటు ట్రక్కు స్పీడ్ 80 కి.మీ. మన దేశంలో 24 కి.మీ.అంతర్జాతీయంగా గూడ్స్ రైళ్ల స్పీడ్ 85 కి.మీ. ఇండియాలో 32 కి.మీ. ఇదా మన బతుకు? ఇతర దేశాల గురించి వినడమే మన బతుకా? కాదు.. కాకూడదు. మారాలి. మారి తీరాలి. దానికోసం నేను పొలికేక పెట్టిన. ఇవన్నీ బయటపెడుతుంటే.. కేసీఆర్ ఢిల్లీకి గిట్ల బయలుదేరుతాడా! అని కాంగ్రెస్, బీజేపీకి వణుకు పట్టుకుంది. రెండు పార్టీల పీఠాలు కదులుతున్నాయి. బీజేపీ లేని భారత్ కావాలని కాంగ్రెస్, కాంగ్రెస్ లేని భారత్ కావాలని బీజేపీ అంటయి. ఈ ఇద్దరు సన్నాసులు లేని ఇండియా కావాలని మనం అంటున్నం. దేశం దరిద్రం పోవాలంటే ఈ ఇద్దరి దరిద్రం పోతనే అయితది. దా.. దమ్ముంటే మాట్లాడుదాం.. భువనగిరి చౌరస్తా దగ్గర.. మేము నాలుగున్నరేండ్లలో ఏం చేసినమో చూపిస్తం దా!

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.