సుమారు రెండేళ్ల క్రితం కావచ్చు.. ఓ అమెరికన్ విశ్వవిద్యాలయం భారతదేశంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలుగుతున్న రాజకీయ నేతలపై ఓ సర్వే నిర్వహించింది. ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలుగుతున్న మొదటి నేత నరేంద్ర మోడీ , రెండో నేత కేసీఆర్ అని ఆ సర్వే తేల్చిచెప్పింది. దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థి కనుక మోడీని ప్రజలు ప్రభావంతుడైన నాయకుడిగా భావించి ఉండడంలో ఆశ్చర్యంలేదు. కానీ సువిశాల దేశంలోని ఒక ఉపప్రాంతీయ పార్టీ నాయకుడు కేసీఆర్‌కు ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలుగుతున్న రెండో నాయకుడిగా దేశ స్థాయిలో స్థానం లభించిందంటే… కేసీఆర్ ఎంత శక్తిమంతుడైన నాయకుడో వేరే చెప్పనక్కర లేదనుకంటా! దానికి కారణం ఆయన అచ్చ తెలంగాణ యాసతో కూడిన ప్రసంగం… అందులో దొర్లే సామెతలు.. ఆయన ఇచ్చే నినాదాలు. సీమాంధ్ర మీడియా అందుకే ఆయనను మాటల మరాఠీ అని అభివర్ణించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ…: ఇదిగో నా డిప్యూటీ స్వీకర్ పదవికి రాజీనామా తీసుకో, నా శాసన సభ్యత్వానికి రాజీనామా తీసుకో, నీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా తీసుకో…అంటూ ఆయన రాజీనామా పత్రాలు పంపించిన తీరు ప్రజల మనసులో బలమైన ముద్ర వేసింది.

జలసాధన: పార్టీ పెట్టిన తర్వాత ఆయన తీసుకున్న కార్యక్రమం జలసాధన ఆర్డీఎస్ తూముల వ్యవహారాన్ని ప్రజల ముందు పెడుతూ తలాపున గోదారి మనకు మాత్రం ఎడారి అన్న ఆయన నినాదం రైతుల గుండెను తాకింది.
జలయజ్ఞం చేసినావా? మేసినావా?: వైఎస్ పై కేసీఆర్ పదునైన భాషతో దాడి చేశారు. వైఎస్ చేతిలో సోనియా కీలుబొమ్మ. జలయజ్ఞం చేసినావా? మేసినావా? అంటూ ఆయన చేసిన విమర్శలు ప్రజల్లోకి నేరుగా వెళ్లాయి.
తెలంగాణతో గోక్కున్నోడు…: వైఎస్ తెలంగాణతో పెట్టుకోకు.. తెలంగాణతో గోక్కున్నోడు ఎవరూ బాగుపడలేదు.. బ్రహ్మానందరెడ్డి అయినా రాజశేఖరరెడ్డి అయినా… అంటూ కేసీఆర్ వైఎస్‌పై దాడికి దిగేవారు.
సిపాయీల తిరుగుబాటు… ఎత్తుపల్లాలు ఎదురైన సమయంలో తెలంగాణ వాదులకు ఆయన ఇచ్చిన టానిక్..సిపాయీల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం! రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమొచ్చి తీరుతుంది అనే గీత చరణాలు. ఈసారి దెబ్బతిన్నా బెబ్బులిలా లేస్తాం అంటూ భరోసా ఇచ్చారు.
జాగో..భాగో..: తెలంగాణ వాలే జాగో.. ఆంధ్రావాలే భాగో… ఈ నినాదం రాజకీయంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రత్యర్థులు, తెలంగాణ వ్యతిరేకులు ఈ నినాదంపై కేసీఆర్‌పై తీవ్రంగా విమర్శలకు దిగారు. వారి విమర్శలకు ధీటైన వివరణనే కేసీఆర్ ఇస్తూ వస్తున్నారు.
తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో…: 2009 నవంబర్ 27న కేసీఆర్ తలపెట్టిన ఆమరణ దీక్ష ఆయన రాజకీయ జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఆ సందర్భంలోనే ఆయన తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో జరగాలి అని బహిరంగంగా పాలకులకు హెచ్చరిక, ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ నినాదమే తెలంగాణ సమాజాన్ని చలింపచేసింది. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేయగలిగింది.అయితే జైత్ర యాత్ర…లేదంటే శవ యాత్ర – తన దీక్షకు ముందు కేసీఆర్ చేసిన ఈ నినాదం కూడాప్రజల గుండెలను తాకింది.
యాచించి కాదు శాసించి తెద్దాం: వచ్చిన తెలంగాణను సీమాంధ్రులు అడ్డుకున్న తర్వాత ఉద్యమ క్రమంలో ఈ నినాదం ముందుకు తెచ్చారు. సంఖ్యాబలంతో వారు శాసిస్తున్నారు. అందుకే ఇక యాచన వద్దు సంఖ్య పెంచుకుని శాసిద్దామన్నారు కేసీఆర్.
స్వీయ రాజకీయ అస్తత్వమే శ్రీరామ రక్ష : తెలంగాణ రాజకీయ మేలుకొలుపునకు ఒక గంభీరమైన ఆలోచనాత్మక నినాదమే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తత్వం. తెలంగాణ ప్రాంత అజమాయిషీలో ఏ ఒక్క రాజకీయ పార్టీ లేకపోవడాన్ని ఈ నినాదం గుర్తుచేస్తుంది. ఢిల్లీపార్టీలు, లేదంటే ఆంధ్రాపార్టీలు తప్ప తెలంగాణోడి అజమాయిషీలో ఒక్క టీఆర్‌ఎస్ తప్ప ఏ ఒక్క పార్టీ లేకపోవడం.ఢిల్లీ, ఆంధ్రాపార్టీలు తెలంగాణను సామంత రాజ్యంగా మలుచుకొని తెలంగాణకే ఎసరు పెడుతుండటం ప్రతి తెలంగాణ వాసిని తీవ్రంగా ఆలోచింపజేస్తున్నందంటే… కేసీఆర్ చెప్పిన తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే నినాదమే ఒక బలమైన కారణం.
ఔర్ ఏక్ ధక్కా…తెలంగాణ పక్కా: 2009లో తెలంగాణ ప్రకటన ఆగిపోయిన నాటి నుంచి అనేక ఉద్యమాలు, సమ్మెలు, మార్చ్‌లు, రాజకీయ పోరాటాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పుట్టిందే ఔర్ ఏక్ ధక్కా…తెలంగాణ పక్కా నినాదం. దీక్ష చేస్తేనే తెలంగాణ ఇచ్చిన కేంద్రం గట్టిగా ఉద్యమిస్తే రాష్ట్రం ఇవ్వడం ఖాయమనేది సందేశం.
గాడిదలకు గడ్డేసి… ఆవులకు పాలు పిండితే వస్తాయా?: కత్తి ఇంకొకనికి ఇచ్చి .. ఇంటోన్ని యుద్ధం చేయమంటే కుదురుతదా? సగటు పల్లెజీవిని కూడా ఆలోచింప చేసే ఈ నినాదం ఇతర పార్టీల భ్రమల్లో ఉన్న వారికి జ్ఞానోదయం కలిగించేందుకు కేసీఆర్ ముందుకు తెచ్చారు. బయటిపార్టీలకు ఓట్లేసి… తెలంగాణ ఇంటిపార్టీని కొట్లాడమంటే ఎైట్లెతది? ఇవి సగటు ప్రజల రాజకీయ పరిజ్ఞానానికి సానపెట్టే నినాదాలు, సామెతలు!
మన రాష్ట్రం! మన పార్టీ ! మన ప్రభుత్వం !: తెలంగాణ వచ్చింది. అది ఆంక్షల తెలంగాణ. ఆంక్షలను తొలగించుకోవాలంటే, సంపూర్ణ తెలంగాణను పునర్నిర్మించుకోవాలంటే. మన రాష్ట్రంలో మన పార్టీ గెలవాలి, మన ప్రభుత్వం ఏర్పడాలి. మన రాష్ట్రంలో మనం రాజకీయ స్వతంత్రం సాధిస్తేగానీ న్యాయం జరగదు అనేది సందేశం.
మన తలరాతను మనమే రాసుకోవాలే!: కేసీఆర్ ఇచ్చిన మరో బ్రహ్మాస్త్రం మన తలరాతను మనమే రాసుకోవాలే! నినాదం. మనకోసం మనమే కొట్లాడాలి. ఎవడో చేయడు అనే సందేశం ఇది.
వీటితోపాటు కొసదాక కొట్లాడటోడే సిపాయి, గమ్యాన్ని ముద్దాడుతాం వీరప్పమొయిలీ… ఇది వీర తెలంగాణ, ఆజాదూ నీ జాదూ ఇక్కడ చెల్లదు దొంగది కాదు… దొడ్లకు రాదు ఎవరి తల్లి… ఎవనికి తల్లి కఫన్ బాంద్‌కే ఆయాహై చీరి చింతకు కడ్తరు బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు…. ఇలా ఎన్నో ఎన్నెన్నో నినాదాలు.. – కల్లూరి
మొదట్నుంచి చురుకైన వాడే..
కేసీఆర్ చాలా చురుకైన విద్యార్థి. ఒక్కసారి చెబితే అప్పటికప్పుడే అవగాహన చేసుకునేవాడు. చెప్పిన పద్యాన్ని వెంటనే చెప్పేసేవాడు. అప్పట్లో ప్రతి విద్యార్థి 60 పద్యాలన్నా గడగడా చెప్పేసేవారు. అదే మార్గంలో కేసీఆర్ తెలుగుపై ఇతర విద్యార్థుల కన్నా చురుకుగా పట్టు సాధించాడు. కేసీఆర్ 8, 9 తరగతిలోనే ఏ అంశం పైనైనా సుదీర్ఘంగా మాట్లాడేవాడు. ఇతర విద్యార్థుల కన్నా ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండేవాడు.
కేసీఆర్ ఎదుగుదల చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. అప్పటి పట్టుదల అతనిలో ఇప్పటికీ ఉంది. ఒంటరి పోరుకైనా సిద్ధమనే నైజం కనబడుతోంది. కేసీఆర్‌లో ఉన్న లక్షణాలు, పట్టుదల ఆయనను నాయకుడిగా మార్చాయని చెప్పొచ్చు.
ఆయన ఎదుగుదల చూస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. కేసీఆర్‌కు ఎంతో మంది ఉపాధ్యాయులు పాఠాలు చెప్పినా నన్ను గురువుగా ప్రకటించడం మరచిపోలేని గొప్ప అనుభూతి. పలు యజ్ఞాలలో నాకు అపూర్వ గౌరవం ఇచ్చేవాడు. స్వర్ణకంకణంతో సత్కరించి తన గురుభక్తిని చాటుకున్నాడు. అలాంటి నా శిష్యుడు ఇవాళ రాజకీయ ప్రముఖుల్లో ఒకరిగా ఉండటం చెప్పలేని ఆనందం. – గురుపూజోత్సవం సందర్భంగా శిష్యుడు కేసీఆర్ గురించి ఆయన గురువు మత్యుంజయ శర్మ



కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే అయ్యాక తాను నివసించిన ఇల్లును, ఖాళీ స్థలాన్ని తన స్వగ్రామమైన చింతమడక ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. తాను పుట్టి పెరిగిన ఇంటిని ఆ ఊరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇచ్చేశారు. అదే విధంగా సుమారు ఐదు ఎకరాల ఖాళీ స్థలాన్ని సైతం పాఠశాలకు దానంగా ఇచ్చారు.
Please click on the image to view full size
