-2004 నుంచి అనేకసార్లు తెలంగాణపై మాటతప్పారు -ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేసిన ఘనత కేసీఆర్‌ది -పదవుల కోసం కిరణ్‌ను నిలదీయని పొన్నాల, దామోదర -కేవీపీ డైరెక్షన్‌లో పొన్నాల.. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆంధ్రోళ్లకు వేసినట్లే -కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004లో చెప్పింది కాంగ్రెస్సే. రాష్ట్రపతి ప్రసంగం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకసార్లు తెలంగాణ విషయంలో ఇంతకాలం మాట తప్పింది కాంగ్రెస్సే. కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేశారు. వందల మంది విద్యార్థుల ఆత్మత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందేమీ లేదు’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు మండిపడ్డారు.
గురువారం మెదక్ జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో పార్టీ కార్యకర్తల సమావేశలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు బుగ్గకారులో తిరుగుతూ మంత్రి పదవులను వదిలిపెట్టని మంత్రులంతా, ఇవాళ ఉద్యమాలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ మాట తప్పారని మాట్లాడుతున్న దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్యలే మాటతప్పారు. మంత్రి పదవులను కాపాడుకోవడానికి కిరణ్ సర్కార్ ఆగడాలను ప్రశ్నించలేదన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా చిత్తూరుకు కిరణ్ వేల కోట్లు తీసుకెళ్తే ఏ మంత్రీ అడ్డుచెప్పలేదని ధ్వజమెత్తారు.
పొన్నాల లక్ష్మయ్య పదవిని కాపాడుకోవడానికి రెండేళ్ల కిందట సమ్మక్క-సారక్క జాతరలో కిరణ్‌కుమార్ కాళ్లపై పడ్డాడన్నారు. కేవీపీ రామచందర్ రావు డైరెక్షన్‌లో పనిచేస్తున్న పొన్నాల, రేపు తెలంగాణను ఏం ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. ఆంధ్రోళ్ల పీడవిరగడం కోసం ఉద్యమించామని, మళ్లీ వీరికి ఓటు వేస్తే ఆంధ్రోళ్లకే వేసినట్లవుతుందన్నారు. సీమాంధ్ర పార్టీల కింద పోటీ చేసిన వారంతా ఆంధ్రోళ్లేనన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్ర కలిపితే ఈ కాంగ్రెస్ నాయకులు ఏనాడైన అడిగారా? పోరాటం చేశారా అని నిలదీశారు. బీజేపీ నేత వెంకయ్యనాయుడు సీమాంధ్ర స్పెషల్ స్టేటస్ కోసం అడిగాడే తప్ప తెలంగాణకు ఏం చేశాడని ప్రశ్నించారు. ఈ నాయుళ్ల మూలంగానే తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికారం చేపడుతుందని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.