ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని మన కామ్రేడ్స్ నిత్యం మాట్లాడుతారు. వారి పోరాటం నిజమైతే సమస్యల పరిష్కారం కావాలనే చిత్తశుద్ధి వారిలో ఉంటే ప్రభుత్వమే సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుంటే ఎందుకో వారికి కంటగింపుగా ఉన్నది.
నాలుగైదు దశాబ్దాల కిందట కమ్యూనిస్టులం, కష్టజీవులమంటూ ఎర్రజెండా భుజానేసుకున్న పాత తరం నాయకులు తాము పేదవర్గాలకు అండగా నిలిచామ న్న భావనను కలిగించగలిగారు. కారల్‌మార్క్స్ బోధించిన కమ్యూనిస్టు సిద్ధాంతం తొలినాళ్లలో ప్రజలను ఎంతోకొంత చైతన్య పరిచినప్పటికీ కాలక్రమేణా కామ్రేడ్ల ఆలోచనా ధోరణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేక అదే సిద్ధాంంతం నేడు ప్రజలకు చేటు చేసేదిగా మారింది. పాతతరం కమ్యూనిస్టు నాయకులకు, ఇప్పుడున్న నాయకులకు ఏ మాత్రం పోలికే లేకుండాపోయింది.
పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి మహానుభావులు తమ ఆస్తిపాస్తులను ప్రజలకు పంచి ఉద్యమంలో శ్రామికవర్గాల తరఫున పోరాడారు. వారి స్ఫూర్తి నేటితరం కమ్యూనిస్టు నేతల్లో కొరవడింది. అంతెందుకు 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారేమోనన్న వాతావర ణం ఉండేది. కానీ నేడు కాలం చెల్లిన సిద్ధాంతాలతో మార్క్సిస్టులు గాలి లో కత్తులు తిప్పుతున్నారు. రష్యా నుంచి తెలంగాణ రాష్ట్రం వరకూ మార్క్సిస్టులు అనుసరించే విధానాలతో అటు రష్యాలో, ఇటు తెలంగాణ లో మార్క్సిస్టుల ప్రభ తగ్గిందనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యం లోనే మార్క్సిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా ఉంటుంది.ఓ వైపు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు జరుగుతుంటే ప్రజలను, వారి ఆకాంక్షలను గాలికొదిలి తాము నమ్ముకున్న మూఢ సిద్ధాం తం వల్లె వేసి తద్వారా ప్రజలకు దూరమయ్యారనే విషయం మార్క్సిస్టు పార్టీకి ఎందుకు అర్థం కావడం లేదో? పీడితవర్గాల కోసం పోరాటం సాగిస్తున్నారా? లేక కనుమరుగవుతున్న తమ ఉనికికోసం తమ మూల సిద్ధాంతాన్ని విస్మరిస్తున్నారా? ఈ దేశాన్ని నాలుగు దశాబ్దాలకు పైగా పరిపాలిం చి పేదవాడు పేదవాడిగానే ఉండేలా చేసిన కాంగ్రెస్‌తో అంటకాగుతూ, తాము అంతర్థానం కాదల్చుకున్నారో తేల్చుకోవాల్సిన బాధ్యత మార్క్సిస్టుల పైనే ఉన్నది. ఒకనాడు ఎర్రజెండా అంటే అణచబడిన వర్గాలకు అం డగా ఉండి ఆత్మగౌరవంతో బతుకడానికి అండదండలందించే జెండాగా ప్రజలు భావించేవారు. ఈ రోజు ఎర్రజెండాలోని ఎరుపును నలుపు చేసి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం నిరసన జెండాగా వాడుకోవడం దురదృష్టకరం. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మార్క్సిస్టులు ఎవరి అజెండాను ఎత్తుకొని ముందుకుపోతున్నారో ఆలోచించుకోవాలి. నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా వారి మూల సిద్ధాంతాన్ని మరిచి గుడ్డిగా వ్యతిరేకించే పనిలో పడి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోతున్నామనే ధ్యాస కోల్పోతున్నారనడానికి ఈ మధ్యకాలంలో వారు అవలంబిస్తున్న కార్యక్రమాలే రుజువు చేస్తున్నాయి.
సహజంగా అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశంలో మనిషికి కావాల్సిన సాగు, తాగు నీరు, కూడు, గూడు, గుడ్డ ఉద్యోగావకాశాలు, విద్య వైద్యం తో పాటు తాము నమ్ముకొని బతుకుతున్న భూమిపై హక్కులు కావాలని కోరుకుంటారు. పై వాటిలో ఏవీ పేద ప్రజలకు అందకున్నా వారికి అం డగా ఉండి ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయడం కోసం మొదటి వరుసలో కమ్యూనిస్టులు ఉండాలి. కానీ మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా మార్క్సిస్టులు
వ్యవహరించడం దురదృష్టకరం. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ పరిష్కరించడానికి దేశంలో అతి చిన్న వయసు గల తెలంగాణ రాష్ర్టాన్ని, అనేక ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని నిందించడం ప్రజల పక్షం వహించే వారు చేయాల్సింది కాదు. బషీర్‌బాగ్ అమరులను స్మరిస్తూ గత నెల 28న 17వ వర్ధంతి సందర్భంగా వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆ వార్తలు, దృశ్యా లు టీవీల్లో, మరుసటి రోజు దినపత్రికల్లో చూసినప్పుడు ప్రజలకు మరొక దురదృష్టకర మారణకాండ కూడా మదిలో మెదిలింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లా ముదిగొండలో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో సామాన్య ప్రజలతో కలిపి మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు తొమ్మిది మంది చనిపోయా రు. ఈ విషయం మార్క్సిస్టు పార్టీ నాయకత్వం మర్చిపోయిందో, ఏమో కానీ చనిపోయిన వారి కుటుంబసభ్యులు, ప్రజల మనసుల్లో ఇంకా ఆ చేదు జ్ఞాపకాలున్నాయి. ఈ సందర్భంగా మార్క్సిస్టు పార్టీ మిత్రులకు గుర్తుండాల్సిన అంశమేమంటే ముదిగొండలో కాంగ్రెస్ పార్టీ నేతలు అం తటి మారణకాండకు ఒడిగట్టి అప్పుడు మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగినవారు నేడు బషీర్‌బాగ్ అమరులను స్మరించడం!
విచిత్రంగా టీడీపీ అధికారంలో ఉండగా కాంగ్రెస్‌తో కలిసి బషీర్‌బాగ్ అమరులను స్మరించడం, కాంగ్రెస్ అధికారంలో ఉండగా ముదిగొండ కాల్పులకు కారణమైన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ నాయకులతో కలి సి ముదిగొండ అమరులకు శ్రద్ధాంజలి ఘటించడాన్ని కామ్రేడ్స్ ఏ విధంగా సమర్థించుకుంటారో వారే చెప్పాలి. రైతుల కడగండ్లను, కష్టాలను తీర్చడం కోసం కోటి ఎకరాలకు సాగునీరందించాలానే లక్ష్యంతో ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తున్నది. పేదవాడి వైద్యం దినదిన గండంగా మారిన పరిస్థితిలో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రభుత్వం దవాఖానల ఆధునీకరణ, అవసరమైన పరికరాలను సమకూర్చడం, సర్కారు దవాఖానలను కార్పొరేట్ వైద్య సంస్థలకు ధీటుగా ఆధునీకరించడం సంక్షేమ పాలనకు గీటు రాయిగా చెప్పుకోవాలి. పేదవాడు చనిపోతే శవాన్ని దవాఖాన నుంచి తీసుకుపోదామ న్నా కష్టమే. అలాంటివారికి అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకురావడం గొప్ప మానవీయం. గుడిసె కోసం, భూమి కోసం పోరాటం అన్నవి ఏమీ లేకుండా ప్రభుత్వమే పేదవాడికి ఇల్లు కట్టివ్వాల ని డబుల్ బెడ్‌రూమ్ పథకం తెచ్చింది. దళితులు, గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీకి ప్రభుత్వం భుజానెత్తుకున్న బాధ్యత. పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేయలేమనే భయంతో భారమని భావించి బిడ్డ పుట్టగానే అమ్ముకునే పరిస్థితి నుంచి ఆడబిడ్డ అంటేనే అదృష్టంగా భావించే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలతో పేదలకు భరోసా. వేతనాలు గణనీయంగా పెరిగి సంతోషంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇక మీదట తమ వెంట ఉండరన్న బెంగేమో!
ఆత్మగౌరవం కోసం ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం సాధించుకు న్న రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వంలో ఇక బషీర్‌బాగ్ సంఘటనలు పునరావృతం కావని బాధేమో. చాలీచాలని స్కాలర్‌షిప్‌ల తో దొడ్డన్నం, పురుగుల కూరలతో విద్యార్థుల దుస్థితిని ఆసరాగా చేసుకొని వారితో జెండాలు పట్టించి రోడ్డు మీదికి తీసుకువచ్చి ఉద్యమాలు చేయించే పరిస్థితి ఇక తమకు లేదనే ఆక్రోశమేమో. ఇలా పైన పేర్కొన్న సమస్యలు సమస్యలుగానే మిగిలిపోవాలనే అక్కసేమో? ఈ పథకాలన్నీ విజయవంతమైతే మాతో జెండా పట్టుకొని నడువరనే భయమేమో తెలువదు. కానీ నిత్యం అదే పనిగా సైద్ధాంతిక వ్యతిరేకులైన కాంగ్రెస్‌తో కామ్రేడ్స్ కలిసి నడువడం వారి రాజకీయ పబ్బం గడుపుకొనే ఎత్తుగడలకు నిలువెత్తు నిదర్శనం. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని మన కామ్రే డ్స్ నిత్యం మాట్లాడుతారు. వారి పోరాటం నిజమైతే సమస్యల పరిష్కా రం కావాలనే చిత్తశుద్ధి వారిలో ఉంటే ప్రభుత్వమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే ఎందుకో వారికి కంటగింపుగా ఉన్నది. ఇకనైనా మన కామ్రేడ్స్ ప్రజలను గందరగోళపరిచే విధానాలు విడనాడాలి.
విశ్లేషణ : కర్నె ప్రభాకర్ , శాసనమండలి సభ్యులు. (నమస్తే తెలంగాణ)