Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మార్కెట్లు ఉంటాయి

-కొత్త సాగు చట్టాలెలా ఉన్నా వాటిని కాపాడుతం
-సెస్‌ రాకున్నా బలోపేతం చేస్తం.. పంట విక్రయం అక్కడే: సీఎం
-కొనుగోళ్లకు గ్రామాలవారీగా టోకెన్లు
-గిట్టుబాటు ధరపై నిత్యం సమాచారం
-మార్కెటింగ్‌శాఖలో పరిశోధనావిభాగం
-రైతు వేదికల్లోనే వ్యవసాయ ప్రణాళికలు
-సాగులో కొత్త పద్ధతులకు ప్రోత్సాహం
-వ్యవసాయంలో ముమ్మర యాంత్రీకరణ
-వెదజల్లే పద్ధతిపై అవగాహన పెంచాలి
-జిల్లా స్థాయి వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్‌
-పొలం- హలం శాఖగా వ్యవసాయశాఖ మారాలి
-ఇకపై అంతా తెలంగాణ విజయగాథనే చెప్పుకోవాలి
-4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రం

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయచట్టాలతో దేశంలో మార్కెటింగ్‌ వ్యవస్థ ఎలా రూపాంతరం చెందినా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. తెలంగాణలో మార్కెట్లను సజీవంగా ఉంచడంతోపాటు, వాటిని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రైతులు పండించిన పంటను మార్కెట్‌లో అమ్ముకొనేలా సరైన విధానం రూపొందించే బాధ్యత మార్కెటింగ్‌శాఖపైనే ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో సాగువిస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని సూచించారు. వ్యవసాయశాఖ కేవలం కాగితం- కలంశాఖగా కాకుండా పొలం- హలం శాఖగా మారాలని చెప్పారు.

ఈ రెండుశాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పురావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగుపద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయశాఖకృషి చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్‌ శాఖాధికారులతో సమావేశమయ్యారు. వ్యవసాయాభివృద్ధి- రైతు సంక్షేమం విషయంలో నిర్వహించాల్సిన బాధ్యతలను వారికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

పంటల కొనుగోళ్లలో మార్కెట్లే కీలకం
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్టాల కారణంగా ఇకమీదట రైతులు పండించిన పంటను అమ్ముకొనేందుకు వ్యవసాయ మార్కెట్లే వేదికగా మారనున్నాయి. దేశంలో మార్కెటింగ్‌ వ్యవస్థ ఎలా మారినప్పటికీ రాష్ట్రంలో మార్కెట్లను తప్పకుండా కొనసాగిస్తాం. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకొనేలా చూడాల్సిన బాధ్యత మార్కెటింగ్‌ అధికారులపై ఉన్నది. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏరోజు మార్కెట్‌కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీచేయాలి. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉన్నదనే దానిపై ఎప్పటికప్పుడు సూచనలు అందించాలి. ఇందుకోసం మార్కెటింగ్‌శాఖలో రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ను ఏర్పాటుచేయాలి. పంటల కొనుగోళ్లలో మార్కెట్లే కీలకం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది.. అక్కడి వ్యాపారులకు కొనుగోలు శక్తి ఎంతవరకు ఉన్నది అనే వివరాలు సేకరించాలి. రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేశారనే విషయంలో అధికారులు పదిరోజుల్లోగా సరైన లెక్కలు తీయాలి.

వెంటనే అందుబాటులోకి రైతువేదికలు
రాష్ట్రంలో కొత్తగా 2,600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వాడుకలోకి తీసుకువచ్చి.. రైతులతో సమావేశాలు ఏర్పాటుచేయాలి. ఏఈవో, రైతుబంధు సమితి కార్యాలయాలు కూడా ఇందులో భాగం కావాలి. ఇందుకు అవసరమైన ఫర్నిచర్‌, మైక్‌సెట్‌ తదితర వసతులను అధికారులు కల్పించాలి. రైతులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు, పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై రైతు వేదికలే కేంద్రంగా నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్లవారీగాఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించి ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పదిరోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్న పంటల విషయంలో స్పష్టత రావాలి. రైతువేదికలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరాచేయాలి. ఏ క్లస్టర్‌లోనైనా ఏదైనా కారణంతో ఏఈవో పోస్టు ఖాళీ అయినా, ఎవరైనా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఈవో పోస్టు ఖాళీగా ఉండొద్దు.

4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏడాదికి 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. నేడు కోటి పదిలక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతున్నాం. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకుపైగా నీరందుతున్నది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయరాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి.

పంట మార్పిడి.. యాంత్రీకరణ పెరగాలి
రైతులు ఎప్పుడూ ఒకే పంటవేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉన్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగాల్సి ఉన్నది. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగు చేయడం వల్ల ఎకరానికి రూ.10 వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉన్నది. పత్తిలో సింగిల్‌పిక్‌ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటిపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నది. దాదాపు 8 గంటలపాటు జరిగిన సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌, ఎంపీ కే కేశవరావు, ప్రభుత్వవిప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్‌, భూపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, డైరక్టర్‌ లక్ష్మీబాయి, సీడ్స్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

ఇతర దేశాల గాథలు అవసరం లేదు
ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా, జపాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఇలా జరిగింది.. అలా జరిగింది అంటూ చెప్పుకొనే విజయగాథలు విన్నాం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రమే గతంలో కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచింది. రాష్ట్రంలోని ఇంటింటికీ వందశాతం నల్లాల ద్వారా నీరు అందించి నంబర్‌వన్‌గా నిలవడం మిషన్‌భగీరథతో సాధ్యమైంది. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించుకొన్నాం. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసుకోగలుగుతున్నాం. రెవెన్యూలో అత్యంత జటిలమైన సమస్యలను పరిష్కరించుకొన్నాం. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయభూములు రికార్డుల నిర్వహణను, రిజిస్ట్రేషన్లను, మ్యుటేషన్లను సులభతరం చేసుకొన్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామసీమల రూపురేఖలే మారిపోయాయి. అన్ని్ర గామాల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు వచ్చాయి. డంప్‌ యార్డులు, శ్మశానవాటికలు, రైతువేదికలు, కల్లాలు వచ్చాయి. ఇలా ప్రతిరంగంలోనూ ఎన్నో అద్భుత విజయాలు తెలంగాణ రాష్ట్రం సాధించింది. అదే తరహాలో వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకొన్నాయి.

రాష్ట్రంలో నిర్మించిన రైతువేదికలు వెంటనే వాడుకలోకి రావాలి. ఏఈవో, రైతుబంధు సమితి కార్యాలయాలూ అందులో భాగంగా ఉండాలి. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్‌ తదితరాలపై చర్చించే వేదికలు కావాలి. క్లస్టర్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఈవో పోస్టు ఖాళీగా ఉండొద్దు. కాగితం- కలం శాఖగా కాకుండా.. పొలం- హలం శాఖగా వ్యవసాయశాఖ మారాలి.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

మరికొన్ని సూచనలు
-వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచేందుకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్నది.
-మండల వ్యవసాయాధికారులను ఆగ్రినమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
-ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్‌లో పర్యటించాలి.
-పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది.
-ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటుచేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్‌ పాయింట్లను గుర్తించాలి.
-వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
-మార్కెట్లలో ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.