-జంట నగరాల్లో నీటి ఎద్దడి లేకుండా చేస్తాం -అవసరమైతే కృష్ణా నాలుగోదశ చేపడతాం -క్షేత్రస్థాయి పర్యటనలో మంత్రి పద్మారావు

నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) నుంచి మూడోదశ పైప్‌లైన్ ద్వారా మార్చి నాటికి జంట నగరాలకు తాగునీరు అందించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. హైదరాబాద్-సాగర్ హైవేపై 106 కిలోమీటర్ల మేర జరుగుతున్న కృష్ణా జలాల మూడో దశ పైప్‌లైన్ పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని గున్‌గల్, ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ, కోదండాపురం మెట్రోవాటర్ ప్లాంట్, గొడుకొండ్ల, నసర్లపల్లి రిజర్వాయర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జంట నగరాల్లో జనాభా రెండు కోట్లకు చేరువవుతుండడంతో భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నదన్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా రోజూ 540 ఎంజీడీల నీటి సరఫరా అవసరమని, 340 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు. నీటి కొరతను అధిగమించేందుకే గోదావరి, కృష్ణామూడో దశ పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు. నిత్యం 90 ఎం జీడీలను తరలించే కృష్ణా మూడోదశ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబర్ చివరినాటికి రెండు పంపులు నడిపించి తొలిదశ కింద రోజూ 22.5 ఎంజీడీలు సరఫరా చేస్తామన్నారు.
మార్చి నుంచి 90 ఎంజీడీలను పూర్తిగా తరలించే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌తో ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోదావరి మొదటి దశ జలాల తరలింపుపై దృష్టి సారించి జూన్, జూలై నాటికి తొలి దశ పనులను పూర్తి చేసి రోజూ 172 ఎంజీడీలను నగరానికి సరఫరా చేస్తామన్నారు. అవసరమైతే సుంకిశాల నుంచి రూ.840 కోట్ల వ్యయం తో కృష్ణానాలుగో దశ పైప్‌లైన్ చేపట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.అప్పుడు సాగర్‌లో డెడ్‌స్టోరేజీలో నీరున్నప్పటికీ తాగునీరు అందించవచ్చన్నారు. మూడో దశ పనులను డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని అధికారులకు టార్గెట్ పెట్టామని, పథకంపై పూర్తిస్థాయి నివేదికను సీఎంకు అందజేస్తామన్నారు.
-కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రానికి లేఖ రాయాలి కాంగ్రెస్, టీడీపీ చేసిన పాపాలను కడిగే పనిలో టీఆర్‌ఎస్ ఉందని, ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల్లోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలను పొందుతున్నదని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరత ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు అగకుండా చర్యలు చేపట్టామని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి దమ్ముంటే ఐఎఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులపై కేంద్రానికి లేఖ రాయాలని సవాల్ విసరారు.