-ఒక్క ఎకరాకైనా సాగునీరందించారా? -పొన్నాలకు మంత్రి హరీశ్‌రావు సూటిప్రశ్న
పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా కొనసాగిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ఏం చేశారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణలో కొత్తగా ఒక్క ఎకరా భూమికైనా సాగునీరందించారా? అని నిలదీశారు. రాష్ట్ర సాధనకోసం రాజీనామా చేయాలని మంత్రి నివాసం ముందు విద్యార్థులు నిరసన తెలిపిన పాపానికి యాకూబ్‌రెడ్డి అనే విద్యార్థిని పోలీసు లాఠీలతో కొట్టించలేదా.. ఇందుకేనా మీకు ఓట్లేసేది అని మండిపడ్డారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీకి ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అడుగడుగునా తెలంగాణ ఉద్యమాలకు అడ్డుతగిలి పోలీసులతో ఉద్యమకారులను కొట్టించిన నీచ సంస్కృతి ఆ పార్టీల నాయకులదని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు, పార్టీలో సీనియర్ నాయకుడైన బండారు దత్తాత్రేయకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. బుధవారం నర్సాపూర్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ సభకు తరలివచ్చిన అశేష జనసందోహాన్ని చూస్తేనే సీఎం కేసీఆర్‌పై ప్రజలకున్న అభిమానం ఏపాటిదో జాతీయ పార్టీలకు తెలిసిపోయిందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్ నేతలు మనోహర్‌గౌడ్, నరహరిరెడ్డి, కసిని విజయ్‌కుమార్, హరికిషన్, ఆర్ వెంకటేశ్వర్లు, విజయేందర్‌రెడ్డి, గొల్ల నిరంజన్, మధుసూధన్‌రెడ్డి, రాజేందర్‌నాయక్, అశోక్, నాని, జలేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హరీశ్‌రావు దుబ్బాకలో ప్రచారర్యాలీ, సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సీమాంధ్ర పాలకులకు తాకట్టుపెట్టి పదవుల కోసమే పాకులాడిన అవకాశవాదులైన జగ్గారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ఓట్లు వేయొద్దని ఓటర్లను కోరారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, జేఏసీ కన్వీనర్ రొట్టె రాజమౌళి, ఎల్లారెడ్డి, రామస్వామి, స్వామి, భీమసేన తదితరులు పాల్గొన్నారు.