-హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపిక -వరంగల్- నల్లగొండ-ఖమ్మం అభ్యర్థి ఎంపిక నేడు! -ఆరు జిల్లాల ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం -సీఎం క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సాగిన చర్చ -స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టాలని ఆదేశం -4,5తేదీల్లో నాగార్జునసాగర్‌లో పార్టీ శిక్షణా తరగతులు

హైదరాబాద్,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ ఎంపికయ్యారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో ఆరు జిల్లాలకు చెందిన మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కూడా చర్చించారు. వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి అభ్యర్థిత్వానికి పోటీ నెలకొన్న నేపథ్యంలో వారందరినీ పిలిపించి సోమవారం మాట్లాడాలని నిర్ణయించారు.
అందరికీ నచ్చజెప్పి వీరిలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేసి సోమవారం సాయంత్రం ప్రకటించనున్నారు. ఇందుకోసం సోమవారం మధ్యాహ్నం 1గంటకు మూడు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీ అయ్యే స్థానిక సంస్థల స్థానాలతో పాటు మరో మూడు స్థానాలు పెరిగే అవకాశాలున్నందున.. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలను కేసీఆర్ కోరారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కీలకమైందని.. ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
మరోవైపు టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణా తరగతులు మార్చి 4, 5వ తేదీల్లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. శిక్షణా తరగతులు ఎవరితో చెప్పించాలనే విషయంపై త్వరలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేత ఒకరు మార్చి మొదటి వారంలో పార్టీలో చేరనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు సంకేతాలిచ్చారని తెలిసింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, పీ మహేందర్‌రెడ్డి, సీ.లక్ష్మారెడ్డి, అజ్మీరా చందూలాల్, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శులు గాదరి కిశోర్, జలగం వెంకట్రావ్, వీ శ్రీనివాస్‌గౌడ్, వొడితెల సతీష్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, తెలంగాణ భవన్ ఆఫీస్ కార్యదర్శి ప్రొఫసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల నుంచి మరో నేతకు అవకాశం తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెతో పాటు అన్ని వేళలా స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు చూపిన సాహసం, అందించిన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడు గుర్తు చేసేవారు. ఉద్యోగులకు తమ ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తామని చెబుతూ వచ్చిన సీఎం.. ఇప్పటికే పలువురికి అవకాశం కల్పించారు. తాజాగా మరో ఉద్యోగ సంఘ నాయకుడిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ నుంచి నిలబెడుతున్నారు.
ఇప్పటికే టీఎన్జీవో అధ్యక్షుడిగా పని చేసిన స్వామిగౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నికై మండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. టీజీవో అధ్యక్షుడిగా ఉన్న వీ శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ నుంచి 2014ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచి.. ఇటీవల పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా విఠల్‌కు అవకాశం కల్పించారు.
తాజాగా టీఎన్‌జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్‌కు ఎమ్మెల్సీగా పోటీకి పార్టీ నుంచి అవకాశం కల్పించటం విశేషం. మెదక్ జిల్లాలోని అల్లీపూర్ గ్రామంలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచి విద్యార్థి సంఘాల ఉద్యమాల్లో.. తర్వాత వామపక్ష ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ముందుండి నడిపించారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం తర్వాత అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది.
సీఎం కేసీఆర్‌ను కలిసిన దేవీప్రసాద్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన దేవీప్రసాద్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కారులందరికీ సీఎం సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల అభ్యున్నతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని అన్నారు.