-కలప స్మగ్లర్ల ఆటలు సాగవు -నిర్దాక్షిణ్యంగా కఠిన చర్యలు -వనాల సంరక్షణలో అంతా భాగస్వాములు కావాలి -మనది ముమ్మాటికీ ధనికరాష్ట్రమే.. నెలరోజుల్లోనే మెరుగుపడ్డాం -నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు.. రైతుల బాగుకోసమే నియంత్రిత సాగు -రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా -ఆరో విడుత హరితహారం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్

1985 ప్రాంతంలో నర్సాపూర్ అడవిలో ప్రతిరోజూ సినిమా షూటింగ్‌లు జరిగేవి. ఆ అడవి ఎక్కడికి పోయినట్టు? ఎక్కడ లేకున్నా నర్సాపూర్‌లో వర్షాలు కురిసేవి. కౌడిపల్లిలో బెల్లం గానుగలు నడిచేవి. ఇప్పుడు కౌడిపల్లిలో కరువొచ్చింది. మనం చేతులారా అడవిని పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న అడవినంతా మనమే తెచ్చుకోవాలి. సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఏకంకావాలి. రోజూ ఎవరింటిని వారే ఊడ్చుకోవాలి. మనకు తలనొప్పి వచ్చిందని పక్కవాళ్లు వచ్చి ఊడ్వరు. మనం మేల్కొంటేనే అడవులు బాగైతయి. ఫారెస్టు వాళ్ల బాధ్యత అనుకోకుండా అందరూ కలిసి అడవులను రక్షించుకోవాలి. – సీఎం కేసీఆర్
మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అడవులు పూర్తిగా అంతరించుకుపోయాయని, తిరిగి ఆ అడవులను పునరుద్ధరించుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీప్రాంతంలోని అర్బన్ పార్కులో అల్లనేరేడు మొక్కనాటి రాష్ట్రంలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి పార్కును సందర్శించారు. రాష్ట్రంలో కలప స్మగ్లర్ల ఆటలు ఇకపై సాగబోవని.. వారిని ఎవరూ కాపాడలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా హెచ్చరించారు. అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని, కరోనా కారణంగా మూడు నెలలపాటు వేతనాల్లో కోతలు పెట్టినా.. తిరిగి నెలలోపే పుంజుకున్నామని.. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే..

ఆ అడవంతా ఏమయినట్లు? 1985 ప్రాంతంలో నర్సాపూర్ అడవిలో సినిమా షూటింగ్‌లు జరిగేవి. ప్రతిరోజూ ఏదో ఓ మూల షూటింగ్‌లు ఉండేవి. ఆ అడవి ఎక్కడికి పోయినట్లు? ఎక్కడ లేకున్నా నర్సాపూర్‌లో వర్షాలు కురిసేవి. కౌడిపల్లిలో బెల్లం గానుగలు నడిచేవి. ఇప్పుడు కౌడిపల్లిలో కరువొచ్చింది. మనం చేతులారా అడవిని పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న అడవినంతా మనమే తెచ్చుకోవాలి. అం దుకు సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఏకంకావాలి. రోజూ ఎవరింటిని వారే ఊడ్చుకోవాలి. మనకు తలనొప్పి వస్తే పక్కవాళ్లు వచ్చి ఊడ్వరు. మనం మేల్కొంటేనే బాగైతయి.
ఇది ఫారెస్టు వాళ్ల బాధ్యత అనుకోకుండా అందరూ కలిసి అడవులను రక్షించుకోవాలి. నర్సాపూర్‌లో కోల్పోయిన 92 వేల ఎకరాల అడవిని, ఫారెస్ట్ సిబ్బంది తిరిగి పునరుద్ధరణతో మొలిపించారు. ఇప్పుడు పాత అడవిలా ముఖం తెలివిలా కనిపిస్తున్నది. ఎంత ధనమున్నా ఆహ్లాదకర పరిస్థితులు లేకపోతే, 55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే తలుపుతీసి బయటకుపోము. అందుకే ముందుతరాలకు బతికే పరిస్థితి కల్పించాలి. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పుడు భూపాల్‌రెడ్డి హుడాలో ఉన్నాడు. సిద్దిపేటకు హరితహారం అని ప్రోగ్రాం పెట్టుకున్నాం. పదివేల మొక్కలు కావాల్సి వస్తే నేను పదివేల అవతారాలు ఎత్తిన. నర్సరీ ఎక్కడ ఉంటదో తెలియదు.

జిల్లా లెవల్‌లో ఒక్కటి ఉంటే ఎక్కువ. ముఖ్యమంత్రి, మంత్రి వస్తే ఒక మొక్కనాటి ఫొటో కొడితే తెల్లారి ఫొటో పేపర్ల వచ్చేది. ఆ తెల్లారి చూస్తే వాళ్లు నాటిన మొక్కలు ఉండేవి కావు. ఇది గతంలో జరిగిన కథ. చివరకు భూపాల్‌రెడ్డి వెయ్యి మొక్కలు పంపిస్తే సిద్దిపేటలో నాటినం.నర్సాపూర్ అడవిని మాయం చేసినట్లే తెలంగాణ మొత్తంలో కూడా అట్లే అడవిని మాయంచేశారు. వాళ్లను తిట్టదలచుకోలేదు. మళ్లీ వాళ్లే పెద్దనోరు పెట్టుకొని మాట్లాడతారు. సిగ్గుండాలి. లజ్జ అనిపియ్యాలి కదా? స్మగ్లర్లు, కలప దొం గలకు అడవులను అప్పగించారు. వాళ్ల నాయకులే కొందరు దొంగలు ఉండే.. పట్టుబడ్డరు కూడా.
మనది ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రం. మనకు డబ్బుల సమస్యలేదు. కొంచెం ధైర్యంచేసి నాలుగడుగులు వేస్తే వెయ్యి కోట్లు వస్తాయి. మనం గరీబోళ్లం కాదు. మంచి రాష్ట్రం. సౌండ్ ఎకానమీ ఉన్నది. అందులో డౌట్‌లేదు. కరోనా వల్ల 3 నెలలు సగం జీతాలిచ్చినం. నెలరోజులు వెసులుబాటు వస్తే మళ్లీ పికప్ అయిపోయినం. రేపటికి కూడా మరింత మెరుగవుతాం. డబ్బులు ఉన్న యి, అధికారులు ఉన్నరు. మంచి అటవీశాఖ ఉన్నది. ఇంకేం లోటు ఉన్నది? మన పనిమాత్రమే తక్కువ ఉన్నట్టు లెక్క. నేను అధికారికంగా చెప్తున్న సంగతి. మనది అద్భుతమైన ధనికరాష్ట్రం. ఎవడనుకున్నాడండీ.. ఉత్తగా డంకీలు కొడితే అయితదా? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తెలంగాణ కావాలంటే మీరు సన్నాసులు, మీకు పనిరాదు, వ్యవసాయమే రాదన్నారు. మేమే నేర్పినం అని చెప్పుకున్నారు. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉన్నది? నేను చెప్పేస్టోరీ కాదు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనుమడు, ఎఫ్‌సీఐ చైర్మన్ ప్రసాద్ చెప్పిండు.
దేశం మొత్తంమీద సేకరించిన వడ్లలో 55% ఇచ్చిన ఒకే రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు. ఈ డప్పు మనం కొట్టుకోవడంలేదు. వ్యవసాయమే రాకపోయే వడ్లు ఎలా పండినయి? ప్రజలు, రైతులకోసం ఆలోచించే ప్రభుత్వాలు, అధికారం మన చేతుల్లో ఉంటే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ అర్థం అయ్యింది. ఏడు వేల కోట్లు రైతులకు ఇస్తున్నవు.. మాకు జీతాలు ఇవ్వవా? అని అడిగితే రైతులకు ఇవ్వడానికే ఆపిన అని చెప్పిన. ధాన్యం మొత్తం కొన్నం. ఆరు లక్షల మంది రైతులకు రూ.25 వేల చొప్పున రుణాలు మాఫీచేశాం. పెట్టుబడి ఇచ్చాం. ఇప్పుడు డబ్బులు రైతుల దగ్గరే ఉన్నాయి. మంత్రి హరీశ్‌రావు చెరువులు, డ్యాములు తిరిగి వస్తున్నాడు. ఇదీ రియల్ ఎకానమీ.

సింగూరుకు నీళ్లొస్తే సమస్య తీరుతుంది సింగూరుకు గోదావరి జలాలు వస్తే పాత మెదక్ జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలతోపాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గానికీ నీళ్లు వస్తాయి. గోదావరి జలాలను పాములపర్తి నుంచి కొండపోచమ్మ వరకు తెచ్చుకున్నాం. త్వరలో నర్సాపూర్‌కు వస్తాయి. ఇక్కడి నుంచి సింగూరులోకి.. అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా జహీరాబాద్‌కు, మరికొన్ని ప్రాంతాలకు నీళ్లిస్తాం. హల్దీ, మంజీరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నరవేల కోట్లతో చెక్‌డ్యాములు నిర్మించుకొంటున్నాం.
రైతులను బాగుచేసేందుకే నియంత్రిత సాగు రైతులను బాగుచేయడానికే నియంత్రిత సాగు పద్ధతి తీసుకొచ్చాం. పదిమంది కూర్చొని మాట్లాడుకోవడానికి రైతువేదికలను నిర్మిస్తున్నాం. రైతు వేదికలకు ఇసుక ఫ్రీగా ఇస్తే బాగుంటుందని మంత్రి హరీశ్‌రావు సూచించారు. తప్పకుండా రైతు వేదికలకు ఇసుకను ఉచితంగా అందిస్తాం. వేదికల నిర్మాణం అయిన తర్వాత ఒక్క సెల్‌ఫోన్ మెసేజ్‌తో రైతులు ఏకం కావాలి. నేను కూడా రైతునే. యాభై ఎకరాలు వరి నాటేసిన. నేను కూడా అలర్ట్ చేసిన విధంగానే వడ్లు సాగుచేసిన (నవ్వుతూ). రైతు వేదికల ద్వారా ఎవరు ఏ పంట ఎంత మొత్తంలో సాగుచేస్తున్నారో తెలిసిపోతుంది. సంఘటిత శక్తిలో అద్భుతమైన బలం ఉంటది.
స్వయంగా నేను వాటర్‌జమిలన్ వేసిన. ఎట్లా తీసుకుంటారని స్థానికంగా అడిగితే ఐదు రూపాయలకు కిలో అన్నరు. హైదరాబాద్‌లో అడిగితే 40 రూపాయలు అన్నరు. నడుమ 35 రూపాయలు ఎక్కడికి పోతున్నయి? సాగుచేసిన రైతుకు 15 రూపాయలైనా ఇవ్వొచ్చు కదా? నియంత్రిత సాగుతో అది సాధ్యమైతది. మన పంటకు మనం ధర నిర్ణయిస్తే సచ్చినట్లు ధర వస్తది. లేదంటే ఎవరూ అమ్మవద్దని కూర్చుంటే ఏం చేస్తరు? రాష్ట్రంలోని 2,610 కస్టర్లలో వేదికలు నిర్మాణమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి స్వయంగా నేను ఒకేసారి అందరితో మాట్లాడుతా. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు లక్షల టన్నుల బియ్యమే పట్టగలం.
నీళ్లున్నయి కదా అని వరిపంట వేసుకోవడంతో పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అదే పద్ధతిలో సాగుచేస్తే ఫలితాలు అలాగే ఉంటాయి. నియంత్రితసాగు, రైతువేదికల ద్వారా అద్భుతమార్పులు వస్తాయి. తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ ఏం తింటుందని అధికారులను పిలిచి అడిగిన. ఎవరూ తెలియదన్నారు. ఢిల్లీ నుంచి ఓ సంస్థను పిలిపించి 370 మందిని పెట్టి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి లెక్కచేసి చెప్పారు. ఏటా 60 నుంచి 70 లక్షల టన్నుల వడ్లు తెలంగాణలో తింటున్నట్లు తేలింది. మనమే 4 కోట్ల టన్నుల వడ్లు పండిస్తే ఎట్లా? వాటిని పట్టే మిల్లులు ఏవి? ఆ వడ్లను ఎక్కడ గిర్ని పట్టియ్యాలె. గోదాములు ఉండవు? పైసలు రావు! రైతులు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు.
నర్సాపూర్‌కు వరాల జల్లు నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభ్యర్థన మేరకు నియోజకవర్గంలోని 200 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున మంజూరుచేశారు. అలాగే 7 మండల కేంద్రాలకు కోటి చొప్పున, నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు సీఎం మంజూరు చేశారు. పిల్లుట్ల వద్ద కాలువ ప్రారంభోత్సవానికి వచ్చే నాటికి నర్సాపూర్ అద్భుతంగా కనబడాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
గ్రామానికో నర్సరీ.. దేశంలోనే రికార్డు దేశంలో గ్రామానికో నర్సరీని ఏర్పాటుచేసింది భారతదేశంలో ఒక్క తెలంగాణ మాత్ర మే. ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టాం. ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లు అందించాం. ఎప్పుడైనా ఊరికి ట్రాక్టర్లు వస్తయని అనుకొన్నమా? 70 ఏండ్లలో ఎందుకు రాలేదు. ఎంతమంది గొప్పగొప్ప ముఖ్యమంత్రులు రాలేదు.. అం దుకే చాలెంజ్‌గా చెప్తున్నా.. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో నర్సరీలు లేవు.
మంచి నీళ్లిస్తమంటే నమ్మిండ్రా? మిషన్ భగీరథ నీళ్లొస్తయని చెప్తే అప్పుడెవరైనా నమ్మారా? చూద్దాం తియ్యి అనుకొన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఊళ్లకు పోతే ఖాళీ బిందెలు ప్రదర్శనకు పెట్టేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రదర్శనలు పోయినయి. కరెంట్ గింత మంచిగొస్తదని అనుకున్నమా? ఒక సబ్‌స్టేషన్‌కోసం ఎంత కష్టపడ్డం? ఇప్పుడు బిస్కెట్ల లెక్క వచ్చినయి. కరెంట్ సమస్య ఇక ఎట్టి పరిస్థితుల్లో రానివ్వబోం. మొగులుకు ముఖం చూడకుండా రోహిణి కార్తెలోనే నాటేసుకొనే పరిస్థితులు కొద్దిరోజుల్లోనే వస్తాయి. సూర్యాపేటకు పోతే ఎప్పటిదాక నీళ్లిస్తరని అడిగిన్రు. మీరు ఎన్నిరోజులు అడిగితే అన్ని రోజులిస్తమని చెప్పిన. నిజమేనా అన్నరు.
ఆరు నెలలపాటు కాలువ నడిచింది. ఆ తర్వాత నేను పోతే నన్ను బంతిలా ఎగురేసి మురిసిపోయారు. ఇవన్నీ ఎక్కడో అమెరికాలో జరిగిన స్టోరీ కాదు. అమెరికా, జర్మనీ, జపాన్‌లో ఏం జరిగిందనే ఇప్పటివరకు విన్నాం. వాడు బంగారం తింటున్నడు.. మనం మన్ను తింటున్నమా? పట్టుబడితే అంతకు తాత కావచ్చు. వాస్తవానికి మనం గొప్పోళ్లం. తెలంగాణ వ్యక్తిత్వ పటిమ చాలా గొప్పది. అది రుజువు అయితున్నది. తెలంగాణ రైతు, విద్యార్థి ఎంత గొప్పవాళ్లో రుజువు అయ్యింది. బాగా పనిచేస్తుందని సువర్ణ అనే అమ్మాయిని నేను ఫిషరీస్ సంస్థలో పెడితే, ఆమె ఇప్పుడు నేషనల్‌కు సెలెక్ట్ అయింది.
కలప దొంగలను ఎవ్వరూ కాపాడలేరు కలప దొంగలు, స్మగ్లర్లను ఈ ప్రపంచంలో ఎవ్వరూ కాపాడలేరు. కలప స్మగ్లర్ల ఆటలు కట్టించడానికి సీరియస్ నిఘా పెట్టినం. చీమ చిటుక్కుమన్నా నిమిషాల మీద హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ వస్తది. నిర్దాక్షిణ్యంగా శిక్షించడం ఖాయం. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో వెనకకుపోము. మీకు పేయింగ్ బిజినెస్ కాదు. ఏ ఏరియాలో కలప స్మగ్లింగ్ జరుగుతున్నదో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ గుర్తించాలి. అటవీశాఖ బాగా పనిచేస్తున్నది. రెండువేల కొత్త ఉద్యోగాలు ఇచ్చినం. 2,100 వాహనాలు కొనిచ్చినం. డబ్బులు, అన్ని వసతులు కల్పించినం. మీదాంట్లో ఎవరైనా చెడు లక్షణాలు ఉన్నవారుంటే.. అలాంటి చీడపురుగులను ఏరేసేయండి. అటవీప్రాంతాలనుంచి పూచికపుల్ల కూడా పోవద్దు. వాహనాల్లో టేకు ఎత్తుకుపోతుంటే మనది కాదని ఊరుకుంటాం. ప్రజాఆస్తులకు ప్రజలు కాపలాదారులు కానంతవరకు ఈ దురాగ