Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మన రహదారులకు మహర్దశ

-1500 కి.మీ. నేషనల్ హైవేలకు కేంద్రం అంగీకారం -నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ -ప్రాణహిత మొదలు కాళేశ్వరంవరకు -గోదావరి తీరంవెంట జాతీయ రహదారి

CM-KCR-met-union-minister-for-roadways-Nithin-Gadkari

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనతో రాష్ర్టానికి జాతీయ రహదారుల పంట పండింది. రాష్ట్రంలో సుమారు 1500 కి.మీ. మేర జాతీయ రహదారులకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. తెలంగాణలో గోదావరి నది వెంట జాతీయ రహదారి నిర్మాణం కానుంది. రాష్ట్రంలో జాతీయ రహదారులను కొత్తగా నిర్మించడంతోపాటు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మంగళవారం గడ్కరీని ముఖ్యమంత్రి కలుసుకున్నారు. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన భేటీలో అనేక అంశాలపై చర్చ జరిగింది. అన్నింటికీ సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి 1500 కి.మీ. మేర జాతీయ రహదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు ప్రతి వంద చ.కి.మీ.కు 3.06కి.మీ. మేర, కర్ణాటకలో 3.28కి.మీ., కేరళలో 4.66కి.మీ., తమిళనాడులో 3.85 కి.మీ. చొప్పున ఉంటే తెలంగాణలో మాత్రం 2.25 కి.మీ.గా మాత్రమే ఉన్నదని, వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో పాటు కొత్తగా జాతీయ రహదారులను నిర్మించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ వివరించారు.

గోదావరి తీరం వెంబడి రహదారి రాష్ర్టానికి ఉత్తరాన గోదావరి నది ప్రవేశించి ఆదిలాబాద్ జిల్లా కౌటాల మొదలు నదీ తీరం వెంట నాలుగు జిల్లాలను తాకుతూ కాళేశ్వరం వరకూ జాతీయ రహదారికి కేంద్రంనుంచి అనుమతి లభించింది. వెంటనే ఈ రహదారికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి పంపాలని గడ్కరీ సూచించారు. కేంద్రం గత డిసెంబర్‌లో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (నం.563)ని మంజూరు చేసింది. దీన్ని ఖమ్మం జిల్లా వరకు పొడిగించడానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ రహదారి పొడిగింపువలన వరంగల్‌కు దాదాపు 90% మేర రింగురోడ్డు సౌకర్యం లభిస్తుంది.

భద్రాచలం-విజయవాడ రహదారి నాలుగు లేన్లకు అభివృద్ధి భద్రాచలం-విజయవాడలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం రెండు లేన్ల జాతీయ రహదారి (నెం.30)ని మెరుగుపరుస్తున్నది. ఇందులో సుమారు 60.75 కి.మీ.మేర రెండులైన్ల రహదారిగానే ఉంచి, 33.50 కి.మీ. మేర నాలుగు లైన్ల రహదారిగా మార్చుతున్నారు. ఎన్టీపీసీ, నవభారత్ ఫెర్రో అల్లాయ్స్, ఐటీసీ పేపరుమిల్లు, హెవీ వాటర్ ప్లాంట్ తదితర పరిశ్రమలు ఉన్న ఈ రహదారిలో భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అందువల్ల రెండు లైన్లకు బదులుగా నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గడ్కరీకి వివరించిన కేసీఆర్.. కొత్తగూడెం-భద్రాచలం మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని కోరారు.

మంచిర్యాల-వరంగల్ రహదారి ఖమ్మం వరకు పొడిగింపు మంచిర్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్‌ వరకు జాతీయ రహదారి (నం.563)ని కేంద్రం గతేడాది మంజూరు చేసింది. అయితే మంచిర్యాల నుంచి వరంగల్ వెళ్ళే ఈ రహదారి రెండుమార్గాల గుండా వెళ్ళవచ్చు. జగిత్యాల మీదుగా ఒక మార్గమైతే, మరొకటి జగిత్యాలను తాకకుండా కరీంనగర్‌కు వెళ్ళేది. ఈ అంశాలను ప్రస్తావించిన సీఎం కేసీఆర్ మంచిర్యాల నుంచి జగిత్యాల వరకు సుమారు 70 కి.మీ. మేర జాతీయ రహదారి (నం.63) ఉన్నదని, మంచిర్యాల నుంచి కరీంనగర్‌ వరకు ఉన్న రాష్ట్ర రహదారి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో నాలుగు లైన్ల రహదారిగా మారిందని వివరించారు. జగిత్యాలనుంచి వరంగల్‌వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారుల అథారిటీ తీసుకున్నదని, దీన్ని ఖమ్మంవరకూ పొడిగించడం ద్వారా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను కలిపే వీలవుతుందని వివరించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సూత్రరీత్యా అనుమతి లభించింది.

శంషాబాద్ విమానాశ్రయానికి ఆరు లైన్ల రహదారి హైదరాబాద్ నగరానికి వచ్చే వీవీఐపీలు శంషాబాద్ విమానాశ్రయంనుంచి వచ్చే రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ వల్ల ఇబ్బంది పడుతున్నారని వివరించిన సీఎం కేసీఆర్ ఆరామ్‌గఢ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంవరకు నాలుగులైన్లుగా ఉన్నరహదారిని (ఎన్‌హెచ్ 44) ఆరు లైన్లకు పెంచాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయం దగ్గర ఒక ైఫ్లె ఓవర్, గగన్‌పహాడ్ దగ్గర ఒక సబ్‌వే నిర్మించాలని కూడా కోరారు. ఈ మార్గంలో కొన్ని చోట్ల ప్రార్థనా మందిరాలు ఉన్నాయని, వీటిని మరోచోటికి తరలించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. కొంపల్లి-బోయినపల్లి మార్గంలో కూడా రహదారి నిర్వహణ సంతృప్తికరంగా లేదని, జాతీయ రహదారుల అథారిటీ పరిధిలో ఉన్న ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులను ఆదేశించాలని సీఎం కోరారు.

ఎన్‌హెచ్ 63 మద్నూర్ వరకు పొడిగింపు నిజాంపేట నుంచి మహారాష్ట్రలోని బీదర్ వరకు రాష్ట్ర రహదారి నిర్మాణం రెండేండ్ల క్రితం జరిగిందని, ఆ తర్వాత ఇది జాతీయ రహదారి (నం.50)గా అభివృద్ధి అయిందని వివరించిన సీఎం కేసీఆర్.. ఈ రహదారిని మద్నూర్ వరకు పొడిగించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంసైతం రాష్ట్ర రహదారిని నాందేడ్‌లోని ఎన్‌హెచ్-161 వరకు నిర్మించిందని, కానీ నిజామాబాద్ నుంచి జబల్‌పూర్ వరకు (ఎన్‌హెచ్-63) నిర్మాణం కావాల్సి ఉన్నదని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రోడ్లకు అనుసంధానించడం కోసం మద్నూర్ నుంచి రుద్రూరు, కోటగిరి, పోతంగల్, బోధన్‌ల మీదుగా నిజామాబాద్ వరకు సుమారు 70కి.మీ.మేర రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కోరారు.

హైదరాబాద్‌లోని జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు హైదరాబాద్ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు. పలు జాతీయ రహదారులు నగరం గుండా వెళ్తూ ఉన్నాయని ఈ రోడ్ల అభివృద్ధికి సుమారు రూ.150 కోట్ల మేరకు ఖర్చవుతుందని అధికారులు తెలిపారని, వాటి నిర్వహణ సంతృప్తికరంగా లేదని తెలిపారు.నగరంలోని జాతీయ రహదారులకు అవసరమైన నిధులను జాతీయ రహదారుల అథారిటీ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని నితిన్ గడ్కరీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

KCR featured List

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం 2009 నుంచి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో 28 రోడ్డు ప్రాజెక్టులకుగాను 27 పూర్తయ్యాయని సీఎం కేసీఆర్ వివరించారు. మొదటి దశ పనులు జరిగాయని, రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి, ప్రాణహిత నదుల తీరం వెంట అన్ని వాతావరణాలకు తట్టుకునే విధంగా రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నక్సలైట్లను అదుపు చేయవచ్చని, వెంటనే వీటికి అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

అంతర్ జల రవాణాకు ప్రోత్సాహం రాష్ర్టానికి సముద్ర తీరం లేనందువల్ల గోదావరి నదిలో ఇన్‌లాండ్ వాటర్ వేస్ (అంతర్ జల రవాణా) విధానానికి కేంద్రం ప్రోత్సాహం ఇచ్చింది. రాష్ట్రంనుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందిన వెంటనే దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నది. ఈ అంశం కూడా నితిన్ గడ్కరీ, కేసీఆర్ మధ్య జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. జల రవాణా వినియోగంలోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సరుకులను ఈ మార్గం ద్వారా నౌకాశ్రయాలకు తరలించే అవకాశం లభిస్తుంది. నితిన్‌గడ్కరీతో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తెజావత్, వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు కూడా ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.