-ఉత్తమ పంచాయతీలకు కేంద్రం గుర్తింపు -రాష్ట్రంలో 8 పంచాయతీలకు 9 అవార్డులు -మెదక్ జడ్పీ, కోరుట్ల, ధర్మారం ఎంపీపీలకూ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అభివృద్ధి సాధించిన పంచాయతీలకు అవార్డుల పంట పండింది. 2019-20 సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సశక్తికరణ్ పురస్కారాల్లో రాష్ట్రానికి 12 అవార్డులు లభించాయి. మెదక్ జడ్పీ, కోరుట్ల, ధర్మారం మండల పరిషత్తులతోపాటు ఎనిమిది పంచాయతీలు మరో తొమ్మిది అవార్డులను దక్కించుకున్నాయి. పంచాయతీల అభివృద్ధి, పారిశుద్ధ్యం, వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తదితర విభాగాల్లో ఉత్తమ పనితీరుకు కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటించింది. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతితో తెలంగాణలో గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటుచేసి పచ్చదనం పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామానికో ట్రాక్టర్, ట్యాంకర్ కొనుగోలు చేసి మొక్కలను కాపాడటంతోపాటు, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేశారు. వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్‌యార్డుల ఏర్పాటు, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల కూల్చివేత, అస్తవ్యస్త విద్యుత్తు వ్యవస్థను చక్కదిద్దడం వంటివి చేపట్టారు. ఇందుకు ప్రభుత్వం ప్రతినెలా ఠంచన్‌గా రూ.308 కోట్ల నిధులను విడుదల చేస్తున్నది.
ఒక్కో పంచాయతీకి 8-12 లక్షలు రాష్ట్రానికి వచ్చిన పన్నెండు అవార్డుల్లో మెదక్ జిల్లా పరిషత్, ధర్మారం, కోరుట్ల మండల పరిషత్‌లు ఉన్నాయి. ఈ మూడింటికీ జనరల్ క్యాటగిరీలో అవార్డులు దక్కాయి. మరో 8 గ్రామ పంచాయతీలకు 9 అవార్డులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల పంచాయతీ రెండు క్యాటగిరీల్లో అవార్డులకు ఎంపికయింది. అవార్డులకు ఎంపికైన జడ్పీ, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు నగదు బహుమతి అందించనున్నారు. జడ్పీకి రూ.50 లక్షలు, మండల పరిషత్తులకు రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తారు. గ్రామ పంచాయతీల్లో క్యాటగిరీల ఆధారంగా రూ.12 లక్షల నుంచి 8 లక్షల వరకు నగదును నేరుగా వాటి అకౌంట్‌లో వేస్తారు.
అవార్డులు పొందిన గ్రామపంచాయతీల వివరాలు పంచాయతీ- మండలం- జిల్లా పర్లపల్లి -తిమ్మాపూర్ -కరీంనగర్ హరిదాస్‌నగర్ -ఎల్లారెడ్డిపేట -రాజన్న సిరిసిల్ల మిట్టపల్లి -సిద్దిపేట అర్బన్ -సిద్దిపేట మల్యాల -నారాయణరావుపేట -సిద్దిపేట రుయుద్ది -తలమడుగు- ఆదిలాబాద్ చక్రాపూర్ -మూసాపేట -మహబూబ్‌నగర్ సుందిల్ల- రామగిరి- పెద్దపల్లి (రెండు క్యాటగిరిల్లో) మోహినికుంట- ముస్తాబాద్ -రాజన్న సిరిసిల్ల
ప్రజల ఐక్యతకు నిదర్శనం.. సిద్దిపేట జిల్లాలో రెండు గ్రామాలు అవార్డులను దక్కించుకోవడంపై ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు హర్షం తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, పరిశుభ్రత ఇతర అంశాల పనితీరుకు అవార్డులు నిదర్శనమని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంపై జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని.. వారి ఐక్యతను చాటిందని తెలిపారు. రెండు గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలను హరీశ్‌రావు అభినందించారు. -ఆర్థికమంత్రి హరీశ్‌రావు
కేంద్రానికి కృతజ్ఞతలు.. కేసీఆర్‌కు ధన్యవాదాలు: ఎర్రబెల్లి కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రం ముందువరుసలో నిలవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపు, చొరవ, మార్గదర్శనం వల్లే ఈ అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే.. మా గ్రామానికి అవార్డు రావడానికి సీఎం కేసీఆరే కారణం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే పనులు చేసుకున్నాం. గ్రామ ప్రజలు, పాలకవర్గం అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఊర్లల్లో ఎప్పుడూ లేని మార్పు వచ్చింది. గ్రామాన్ని ఆదర్శంగా ఉంచాలనే ఉద్దేశంతో ఎన్నో పనులు చేశాం. అందరి సహకారంతో అవార్డును పొందాం. -మాదాడి భారతీ నర్సింహారెడ్డి, పర్లపల్లి సర్పంచ్