Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మన నగరం మన పార్టీ మన పాలన

-డిసెంబర్‌ నుంచి 20 వేల లీటర్లదాకా ఉచితంగా మంచినీరు
-హైదరాబాద్‌ మహానగరానికి సమగ్ర సీవరేజి మాస్టర్‌ప్లాన్‌

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి పారుదల వ్యవస్థను విస్తరించడంతోపాటు మురుగునీటి శుద్థికి చర్యలు చేపడుతాం. ఇందుకోసం ఎస్‌ఆర్‌డీపీ తరహాలోనే వ్యూహాత్మక నాలాల అభివృద్థి ప్రణాళిక (ఎస్‌ఎన్‌డీపీ) ఏర్పాటుచేస్తాం. ఔటర్‌ రింగురోడ్డు లోపలి గ్రామాలవరకు ఈ వ్యవస్థను ఏర్పాటుచేయడంతోపాటు మురుగు శుద్ధికి ఎస్‌టీపీలు ఏర్పాటుచేస్తాం. డ్రైనేజీలను సరిచేస్తాం. దీనికి రూ.13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్‌
ఇప్పుడు నగరంలోని నాలాలు, వరదనీటి కాలువల సామర్థ్యం కేవలం రెండు సెంటీమీటర్లే. అందుకే గట్టిగ వానపడితే రోడ్లు మునుగుతున్నయ్‌. ఇండ్లల్లకు నీళ్లు చేరుతున్నయ్‌. ఈ బాధలు తప్పాల్నంటే కనీసం 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కూడా తట్టుకొనే విధంగా నాలాలు, వరదనీటి కాలువలను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని మనం చూశాం. ఇలాంటివాటిని నివారించేందుకు సమగ్ర వరద నీటి నిర్వహణ ప్రణాళిక అవసరం ఉన్నది. దీనికోసం ఇప్పటికే వ్యూహాత్మక నాలా అభివృద్థి విభాగాన్ని ఏర్పాటుచేశాం. ప్రణాళిక అమలుకు రూ.12,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. దీన్ని పూర్తిస్తాయిలో పట్టాలెక్కిస్తాం.

గోదావరితో మూసీ అనుసంధానం
గోదారమ్మ ఇప్పటికే కాళేశ్వరం కాడ గట్టెక్కి.. కొండపోచమ్మ కాడ గుట్టెక్కింది. తర్వాతి దశలో ఆ నీటిని మన భాగ్యనగరానికి తరలిస్తాం. మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి నదిని స్వచ్ఛంగా మారుస్తాం. మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేయడంతోపాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఇప్పటికే ఏర్పాటుచేసింది. మూసీ పరీవాహక ప్రాంతంలో మురుగునీటి శుద్థి ప్లాంట్లను ఏర్పాటుచేయడం ద్వారా శుద్థిచేసిన నీటిని నదిలోకి వదిలేలా చర్యలు చేపడ్తాం. దీనికోసం 59 ఎస్‌టీపీలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అమలుచేస్తాం. బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు నదిలో బోటింగ్‌ ఏర్పాటుచేస్తాం. వీటికోసం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తాం హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లకు గోదావరి నీళ్లను తరలిస్తాం.

రాజకీయాల జోలికి పోకుండా ప్రజల అభివృద్థే మనోరథంగా స్వీకరించిన రాజనీతిజ్ఞులకే చరిత్ర బ్రహ్మరథం పడుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌నగరాన్ని ప్రజలందరి జీవగడ్డగా నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని ప్రభుత్వం నిరంతరంగా పనిచేస్తుందని తెలిపింది. హైదరాబాద్‌ మహానగరానికి దేశపటంలో ఉజ్జ్వల స్థానం కల్పించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవరావు, రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, దానం నాగేందర్‌, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
-సినీ పరిశ్రమకు బాసట
కరోనాతో కుదేలై ఆర్థికంగా నష్టపోయిన మరోరంగం సినిమా రంగం. మన హైదరాబాద్‌ నగరం చిత్రనిర్మాణ రంగానికి దేశంలోనే పెట్టింది పేరు. చితికిపోయిన చిత్ర పరిశ్రమను పునరుజ్జీవింపచేయడానికి అన్ని చర్యలు తీసుకొంటాం. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థలతోపాటు ఉండే హెచ్‌టీ, ఎల్టీ క్యాటగిరీ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీలను ప్రభుత్వం రద్దు చేస్తుంది.

-రాష్ట్రంలో 10 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ను సహాయంగా అందించి చిన్న సినీ పరిశ్రమలను ఆదుకుంటాం.
-రాష్ట్రంలోని అన్నిరకాల సినిమా థియేటర్లలో ప్రదర్శనలను (షోలు) పెంచుకొనేందుకు అనుమతిస్తాం. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకొనే వెసులుబాటును కల్పిస్తాం.

జీహెచ్‌ఎంసీ ప్రజలకు తీపికబురు
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ మరో తీపికబురు అందిస్తున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 లక్షల గృహ వినియోగ నల్లా కనెక్షన్లున్నాయి. వీరందరూ తాగునీటి చార్జీలు భారంగా ఉన్నాయని భావిస్తున్నారు. డిసెంబర్‌నెల నుంచి నెలకు 20 వేల లీటర్లలోపు నల్లా నీళ్లు వినియోగించే గృహ వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు. నెలకు 20 వేల లీటర్ల వరకు ప్రభుత్వం ఉచితంగానే నీటి సరఫరా చేస్తుంది. దీని ద్వారా నీటి దుబారా తగ్గుతుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారిపై ఆర్థికభారం కూడా తగ్గుతుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ ఉచిత నీటి పథకం మంచి చెడులను పరిశీలించి రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విస్తరించే అంశాన్ని కూడా పరిశీలిస్తాం.

కరోనా కాలానికి సంబంధించి మోటర్‌ వాహనపన్ను రద్దు
కరోనా కాలంలో (మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు) లాక్‌డౌన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల నిర్వాహకులు విజ్ఙప్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,37,611 వాహనాలకు సంబంధించిన రూ.267 కోట్ల మోటర్‌ వాహన పన్నును రద్దుచేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో స్వీకరిస్తున్నాం. వారిని ఆదుకోవాలని నిర్ణయించాం. మోటర్‌ వాహనాలకు సంబంధించిన రూ.267 కోట్ల పన్నును (రెండు త్రైమాసికాలు) మాఫీచేయాలని నిర్ణయించాం.

కనీస విద్యుత్‌ డిమాండ్‌ చార్జీల మినహాయింపు
జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన అనేక పరిశ్రమలు, వ్యాపార సంస్థల హెచ్‌డీ, ఎల్టీ క్యాటగిరీ విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించిన కనీస డిమాండ్‌ చార్జీలు (మినిమం డిమాండ్‌ చార్జీ) మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు రద్దు చేయాలని కోరుతున్నారు. కరోనాకాలంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారాలు జరుగక నష్టపోయామని, కనీస విద్యుత్‌ చార్జీలను రద్దుచేసి తమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నారు. ఇందులో రాష్ట్రంలోని సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. కరోనా కాలానికి సంబంధించిన ఆరునెలలకు కనీస విద్యుత్‌ డిమాండ్‌ చార్జీలను రద్దుచేస్తాం.

సమగ్రంగా జీహెచ్‌ఎంసీ చట్టం
కాలానికనుగుణంగా జీహెచ్‌ఎంసీ చట్టానికి ఇప్పటికే పలు సవరణలుచేశాం. పాలనను మరింత సమర్థంగా సాగించడానికి త్వరలోనే సమగ్ర జీహెచ్‌ఎంసీ చట్టాన్ని రూపొందిస్తాం. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించడంతోపాటు అధికారుల్లో బాధ్యతను పెంపొందించేలా నూతనచట్టం ఉంటుంది. ఇప్పటికే టీఎస్‌బీపాస్‌, నూతన రెవెన్యూ చట్టం వంటి పదునైన చట్టాలను తెచ్చాం. ఈ క్రమంలోనే నగర అభివృద్దికి మరింత ఊతమిచ్చేలా కొత్త చట్టంలో నిబంధనలను పొందుపరుస్తాం.

లాండ్రీలకు, దోభీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌
జీహెచ్‌ఎంసీ పరిధిలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక సామాజిక ప్రజలందరూ తాము దోభీఘాట్ల వద్ద వాడుతున్న విద్యుత్‌కు, లాండ్రీలకు వాడుతున్న విద్యుత్‌ను ఉచితంగా సరఫరాచేయాలని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ నుంచి జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని దోభీఘాట్లకు, లాండ్రీలకు ఉచిత విద్యుత్‌ సరఫరాచేస్తాం. జంటనగరాలలో ఇటీవల కురిసిన వర్షాలకు ధ్వంసమైన దోభీఘాట్‌లను పునరుద్ధరించడంతోపాటు నగరంలో అవసరమైనచోట అధునాతనమైన దోభీఘాట్‌లను కూడా నిర్మించి ఇస్తాం.

సెలూన్లకు ఉచితంగా విద్యుత్‌
జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలల (సెలూన్లు)కు ప్రభుత్వం డిసెంబర్‌ మాసంనుంచి ఉచిత విద్యుత్‌ సరఫరాచేస్తుంది. నాయీబ్రాహ్మణులు చాలాకాలంగా కోరుతున్న ఈ కోరికను రాబోయే డిసెంబర్‌ నుంచిప్రభుత్వం నెరవేర్చి నాయీ బ్రాహ్మణుల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది.

శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు
శాంతి భద్రతలు కాపాడటానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పటికే దేశంలో శాంతి భద్రతల రక్షణలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా నగర పోలీసులు 5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. మరో 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. మహిళల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా షీ టీమ్‌లను ఏర్పాటు చేశాం. ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేరాలను అదుపుచేసేందుకు కఠినమైన చట్టాలను, చర్యలను అమలు చేస్తున్నాం. మా ఈ సంకల్పాన్ని కొనసాగిస్తాం.

తాగునీటి గోస తీరుస్తాం
హైదరాబాద్‌ ప్రజలు నీళ్ల కోసం కొట్లాడుకునే రోజులను పోగొట్టినం. భవిష్యత్తు తరాల క్షేమంకోసం ఆలోచించి.. రాబోయే 50 ఏండ్లకు సరిపడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నాం. కేశవాపురంలో రిజర్వాయర్‌ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చాం. అతి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.

పేదల సొంతింటి కల సాకారం చేస్తాం
-డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తాం
-నగరంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించాలని సంకల్పించాం. అతి త్వరలోనే వీటిని పేదలకు అందిస్తాం. ఇప్పటికే జియాగూడలో లబ్ధిదారులకు ఇండ్లను అందజేశాం. నిర్మాణం పూర్తవుతున్నకొద్దీ గృహప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొల్లూరు వద్ద దాదాపు 15 వేల ఇండ్లతో అతిపెద్ద టౌన్‌షిప్‌ ఆవిష్కృతం కాబోతున్నది.
-వివాదాస్పద స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాలను క్రమబద్ధీకరిస్తాం. స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించి ఇండ్లు నిర్మించుకునేలా చర్యలు. యూనిట్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నది.

పర్యావరణ హిత నగరంగా మన హైదరాబాద్‌
హైదరాబాద్‌లో అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే 50 అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌లను గుర్తించింది. థీమ్‌పార్క్‌లను ఏర్పాటుచేస్తున్నది. గత ఐదేండ్లలో వెయ్యి నర్సరీలను ఏర్పాటుచేశాం. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. చెరువుల సుందరీకరణ ప్రక్రియను కొనసాగిస్తాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 2,700 చెరువులు ఉన్నాయి. వీటిని దశలవారీగా సుందరీకరించే పని ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.250 కోట్లతో 20 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.120 కోట్లతో మరో 20 చెరువుల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. మిగిలినవాటిని పూర్తిచేస్తాం.

ప్రజా రవాణాకు పెద్దపీట
మెట్రోరైలు ప్రాజెక్టును రెండోదశలో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహిదీపట్నంవరకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్టులో కీలకమైన రెండో దశను ఈ దఫా పూర్తిచేస్తాం. హైదరాబాద్‌ అభివృద్ధి వేగాన్ని పెంచుతాం. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగంగా వెళ్లడానికి ఎక్స్‌ప్రెస్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టును అమలు చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌ అనుమతిని పొందింది. నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి మెట్రోరైలు నేరుగా ఎక్కడా ఆగకుండా విమానాశ్రయానికి చేరుకొంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసివస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటికే రహదారులు, మెట్రోరైలు విస్తరణ చేపట్టాం. ఇక ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా విస్తరిస్తాం. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాం. మాకు అవకాశం ఇవ్వండి. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌ రైళ్లను మీ కోసం అందుబాటులోకి తీసుకొస్తాం.

ట్రాఫిక్‌ గోసలకు చెక్‌
టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నగరంలో ట్రాఫిక్‌ సమస్యలను తీర్చడంపై దృష్టి సారించాం. దీంట్లో భాగంగానే స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ)కి రూపకల్పన చేశాం. రూ.22 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో తొలిదశ పూర్తయింది. నగరంలో పలు రోడ్లు, ఫ్లైఓవర్లు, కూడళ్ల అభివృద్దిని పూర్తిచేశాం. నగరవ్యాప్తంగా రహదారులను సిగ్నల్‌ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దడం మా లక్ష్యం. ఎస్‌ఆర్‌డీపీ రెండో, మూడో దశను ఇక చేపడుతాం. మొదటి దశలో నగరంలోని వెస్ట్‌, ఈస్ట్‌జోన్‌ పరిధిలో పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయింది. రెండోదశలో మరిన్ని ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తాం. జెల్ది ఆఫీస్‌కు చేరాలె.. మళ్లా ఇంటికి జెల్ది పోవాలె’ సామాన్యులు కోరుకొనేది ఇదే. దీనిని సాకారం చేసే క్రమంలో లింక్‌ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. మొదటిదశలో 37చోట్ల లింకురోడ్ల నిర్మాణం చేపట్టాం. ఇది అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. రెండోదశలో మరో 11రోడ్లకు ఇటీవలే ప్రభుత్వం అనుమతులిచ్చింది. మొత్తం 125 చోట్ల లింక్‌రోడ్లు నిర్మించాలని యోచిస్తున్నాం.

ఎలివేటెడ్‌ బీఆర్‌టీఎస్‌
నగరవాసులకు ఇప్పటికే మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చినం. రాబోయే అయిదేండ్లలో నగర రవాణా చరిత్రనే మలుపుతిప్పేలా ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (బీఆర్‌టీఎస్‌) తీసుకురాబోతున్నాం. ఇది హైదరాబాద్‌ చరిత్రలోనే విప్లవాత్మకమైన మార్పుగా నిలువబోతున్నది. మా పారీ ్ట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ. బీఆర్‌టీఎస్‌పై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాం. అతి త్వరలోనే కొత్త తరహా రవాణాసౌకర్యాన్ని అమలులోకి తెస్తాం.

ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యాగ్నెట్‌
ఏరోస్పేస్‌, లాజిస్టిక్స్‌, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రికల్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో హైదరాబాద్‌ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. ఈ ఒరవడిని కొనసాగిస్తాం. ఐటీని హైదరాబాద్‌ నలువైపులా విస్తరిస్తాం. నగరంలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తాం.

నగర ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌
132 , 11 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ కేబుళ్లతో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని శాశ్వతంగా తొలగిస్తాం. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి హైటెన్షన్‌ విద్యుత్‌ కేబుళ్లను తొలగించాం. వాటిని అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటుచేశాం. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నాం. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లు, నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు రూ.2,000 కోట్లు ఖర్చుచేశాం. 24 గంటల విద్యుత్‌ కొనసాగిస్తాం.

ఉపాధి, ఉద్యోగాలకు భరోసా
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంలో యువత పాత్ర శ్లాఘనీయం. వారికి ఉపాధి, ఉద్యోగ మార్గాలను చూపడంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి నుంచి ప్రణాళికాబద్థంగా ముందుకు సాగుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఐటీ, దాని అనుబంధ పరిశ్రమల్లో లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే సంకల్పంతో అనేక సంస్కరణలు తెచ్చింది. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎన్నడూ భర్తీ చేయలేనన్ని ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేసింది. ఇదో రికార్డు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి 36 వేల ఉద్యోగాలను కమిషన్‌ నేరుగా భర్తీ చేసింది. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు 30 వేల ఉద్యోగాలను ఇచ్చింది. పంచాయతీరాజ్‌లో 9 వేల ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలోని వివిధ విద్యుత్‌ సంస్థల్లో ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా పనిచేస్తున్న 22,500 మందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాం. మరో 7,600 మందిని కొత్తగా రిక్రూట్‌ చేశాం. గురుకుల విద్యాసంస్థల్లో 3,500, సింగరేణిలో 12,500.. ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి లక్షా 25 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీచేశాం. ఇవన్నీ మీ కండ్లకు కనిపించేవే. ఆరేండ్లలోనే 17 లక్షల 80వేల ఉద్యోగాలను కల్పించిన ప్రభుత్వంగా మరోసారి గర్వంగా చెప్తున్నాం. మరో అయిదేండ్ల్లు జీహెచ్‌ఎంసీలో మాకు అవకాశం ఇవ్వండి.. మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. యువతకు ఉద్యోగ కల్పనను మా భుజస్కంధాలపై తీసుకుంటాం.

కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్‌ వాహనాలు
నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. దశలవారీగా నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగాన్ని పెంచుతాం. నగరంలో ఉన్న ఆర్టీసీ బస్సుల రూపురేఖలు మారుస్తాం. రాష్ట్రంలో కాలుష్యకారక వాహనాలను తగ్గించి, విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. 2030 నాటికి జపాన్‌, 2060 నాటికి చైనా.. జీరో కార్బన్‌ సిటీలను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకొన్నాయి. తెలంగాణలోనూ హైదరాబాద్‌ను జీరో కార్బన్‌ సిటీగా మార్చాలన్నదే మా లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే ఎలక్రిక్‌ వెహికిల్‌ పాలసీని తీసుకొచ్చాం. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగదారులకు, తయారీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం.

యువత నైపుణ్య అభివృద్థికి ప్రత్యేక కేంద్రాలు
యువతలో నైపుణ్యాలను అభివృద్ధిచేసేందుకు ఇప్పటికే టీ-హబ్‌,వీ-హబ్‌, టాస్క్‌, న్యాక్‌, నిథమ్‌ వంటి వాటిని ఏర్పాటుచేశాం. టీశాట్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం. వీటిని కొనసాగిస్తాం. పీపీపీ పద్థతిలో అనేక శిక్షణ కేంద్రా లు ఏర్పాటుచేస్తాం. స్టార్టప్‌ల స్థాపన, గ్రామీణ ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తాం.

వ్యర్థాలకు కొత్త అర్థం
నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణలో ఎండ్‌ టు ఎండ్‌ సొల్యూషన్‌ తీసుకొచ్చాం. ‘వేస్ట్‌ టు వెల్త్‌’ దిశగా వ్యర్థాలకు కొత్త అర్థం చెప్పేలా ప్రత్యేక పాలసీని రూపొందించాం. ఇందులో భాగంగా వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తున్నాం. రోజూ 500 టన్నుల వ్యర్థాల నుంచి 23 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తూ వ్యర్థానికి అర్థాన్నిస్తున్నాం. ప్లాంట్ల సామర్థ్యాన్ని మరో 500 టన్నులకు.. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 43 మెగావాట్లకు పెంచుతాం. వ్యర్థాల రవాణాకు ఆధునిక వాహనాలను సమకూర్చుతున్నాం. నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్‌ చేసేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం.

నలువైపులా టిమ్స్‌ సేవలు
మీకు సుస్తీచేస్తే ప్రైవేట్‌ దవాఖానలకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా చేశాం. వీటిలో డయాగ్నస్టిక్‌ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) పేరుతో ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక ఆసుపత్రిని ప్రారంభించాం. వీటిని నగరం నలువైపులా విస్తరిస్తాం. మరో మూడు టిమ్స్‌ను నెలకొల్పుతాం.

అభివృద్థి వికేంద్రీకరణ
నగరం సమగ్రాభివృద్థి దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టాం. నలువైపులా అభివృద్థి చేసేందుకు ఇప్పటికే లుక్‌ ఈస్ట్‌, లుక్‌ వెస్ట్‌ పాలసీలు అమలు చేస్తున్నాం. ప్రజలకు సమీపంలోనే అన్ని వసతులు సమకూరేలా ‘మైక్రోసిటీ కాన్సెప్ట్‌’ను అమలుచేస్తాం. ఇందులో భాగంగా జోన్లవారీగా బస్టాండ్లు, హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, షాపింగ్‌ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం.

రీజనల్‌ రింగ్‌రోడ్డు
హైదరాబాద్‌ చుట్టూ ఇప్పుడున్న ఔటర్‌రింగ్‌ రోడ్డుకు అవతల మరో రింగ్‌రోడ్డును నిర్మిస్తాం. రీజనల్‌ రింగ్‌ రోడ్డుగా ఇది తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతుంది. హైదరాబాద్‌ అభివృద్దికి ఇది చోదకశక్తిలా ఉపయోగపడుతుంది. రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్‌ అభివృద్దికి రీజనల్‌ రింగ్‌ రోడ్డు మరో కీలకమలుపు అవుతుంది.

సంక్షేమానికి పెద్దపీట కొనసాగిస్తాం
సంక్షేమానికి పెద్దపీట కొనసాగిస్తాం, అర్హులైన అందరికీ రేషన్‌ కార్డుల పంపిణీ- గతంలో రేషన్‌పై పరిమితులు ఉండగా, ప్రస్తుతం ఎంతమంది కుటుంబ సభ్యులుంటే వారందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నాం.

అర్హులందరికీ సామాజిక భద్రత పెన్షన్లు
బస్తీల్లో ప్రభుత్వ మోడల్‌ స్కూల్స్‌(ఇంగ్లీష్‌ మీడియం)ఏర్పాటు
‘అన్నపురాసులు ఒకచోట.. ఆకలిమంటలు ఒకచోట’ అన్నారు కాళోజీ. పేదలు ఆకలితో అలమటించొద్దనే లక్ష్యంతో అన్నపూర్ణ క్యాంటిన్ల ద్వారా రూ.5 కే కడుపునిండా అన్నం పెడుతున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో ఇవి పేదలను ఉచితంగా ఆదుకొన్నాయి. వీటిని మరింత విస్తరిస్తాం. కూర్చొని తినే విధంగా ఏర్పాట్లు చేస్తాం.

నగరానికి వచ్చేవారి కోసం అన్ని వసతులతో షెల్టర్‌ హోమ్స్‌ ఏర్పాటు చేశాం. వీటిని మరింత విస్తరిస్తాం. యాచకులు లేని నగరంగా మారుస్తాం. విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ-లైబ్రరీల ఏర్పాటు- ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటుచేస్తాం. సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్‌లో లైబ్రరీ, సీనియర్‌ సిటిజన్స్‌ క్లబ్‌, యోగా సెంటర్‌, జిమ్‌ ఏర్పాటు చేస్తాం. ఉచితంగా బస్‌పాస్‌లు ఇస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.