Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మేడిన్ తెలంగాణ

-ప్రపంచ పారిశ్రామిక చిత్రపటంలో ఇక మనదైన ముద్ర -ప్రతిష్ఠాత్మక టీ-పాస్ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్ -ఇన్నోవేట్.. ఇన్‌క్యుబేట్.. ఇన్‌కార్పొరేట్ – ఇదే రాష్ట్ర కొత్త పారిశ్రామిక సూత్రం – ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్ కారిడార్లు – అమలుకు నిబంధనలు కాదు.. చట్టాలే ఏర్పాటు

KCR 01 మేడిన్ తెలంగాణ! మనదైన ముద్ర కలిగి ఉన్న వస్తువులను, ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేయడం! తద్వారా ప్రపంచంలో తెలంగాణకు ఒక విశిష్టస్థానం కల్పించడం! ఇందుకోసం సృజనాత్మక ఆలోచనలు ప్రోదిచేసి.. వాటికి జీవంపోసి.. అవి ఇచ్చే ఫలితాలను పారిశ్రామిక అభివృద్ధిలో అంతర్భాగం చేసుకునేందుకు ఇన్నోవేట్.. ఇన్‌క్యుబేట్.. ఇన్‌కార్పొరేట్.. అనే సూత్రం! గ్లోబల్ మార్కెట్‌ను ఆకట్టుకునేలా ఉత్పాదక రంగానికి నూతన జవసత్వాలు అందించే ఉద్దేశంతో ఆకర్షణీయమైన రాయితీలు! అనుమతుల్లో సరళమైన విధానాలు! ఇప్పటిదాకా నిబంధనలకే పరిమితమైన విధానాలను పక్కనపెట్టేస్తూ.. జవాబుదారీతనం పెంపొందించేలా పటిష్ఠమైన చట్టం ఏర్పాటుకు కృషి! ఇలాంటి అనేకానేక ఆర్షణీయమైన అంశాలన్నీ కలిస్తే.. రాష్ట్ర పారిశ్రామికరంగం రూపురేఖలను మార్చివేయనున్న టీ-పాస్ డ్రాఫ్ట్-2014!! ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాలుగా ప్రచారంలో ఉన్నవాటిని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర టీ-పాస్ (తెలంగాణ స్టేట్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)-2014 డ్రాఫ్ట్‌ను తయారుచేశారు. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టగానే అనూహ్య స్పందన లభించింది. పారిశ్రామికవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ముసాయిదా గురువారం అసెంబ్లీలో చర్చకు రానుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంపై ఇప్పటికే పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేఖామాత్రంగా చెబుతూ వచ్చారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సైతం సభలో దీనిపై పలుమార్లు ప్రభుత్వం నుంచి వివరణ తీసుకున్న నేపథ్యంలో గురువారం ఈ విధానంపై జరిగే చర్చ ఆసక్తికరంగా ఉండబోతున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

పారిశ్రామికాభివృద్ధిలో ప్రభుత్వ లక్ష్యాలను ఇప్పటికే ముఖ్యమంత్రి పాక్షికంగా వివరించి ఉన్న నేపథ్యంలో దీనిపై చర్చ జరిగే సమయంలో మరింత స్పష్టత లభించనున్నది. ప్రతిపక్ష పార్టీల ఊహలకు కూడా అందని విధంగా డ్రాఫ్ట్ రూపొందిందని తెలంగాణ పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. అసెంబ్లీలో చర్చ ముగిసిన తర్వాత ప్రభుత్వం పారిశ్రామిక విధానంపై తయారు చేసిన 20 పేజీల ఫ్రేం వర్క్‌తో కూడిన నివేదికను కూడా సభ్యులకు సమర్పించనుంది. దీనిలో ప్రభుత్వ ఆలోచనా విధానాలన్నీ ఉంటాయని సమాచారం. అలాగే ఏయే రంగానికి ఎలాంటి రాయితీలు ఇవ్వనున్నారో కూడా ఇందులోనే వెల్లడిస్తారు.

పక్కా అమలుకోసం చట్ట రూపం గత ప్రభుత్వాలు పాలసీని అమలు చేసేందుకు కేవలం నిబంధనలను మాత్రమే రూపొందించేవి. ఫలితంగా వాటి అమలులో ఎవరు నిర్లక్ష్యం వహించినా జవాబుదారీతనంలేక.. చర్యలు శూన్యమయ్యేవి. ఈ విధానాన్ని సమూలంగా మార్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ప్రతిదశలో ప్రతి అంశంపైనా జవాబుదారీతనం వహించడాన్ని తప్పనిసరి చేస్తూ తాజా పారిశ్రామిక విధానానికి చట్ట రూపం కల్పించనుంది. ఇందులో భాగంగానే పరిశ్రమలకు అనుమతుల జారీలో నిర్దిష్ట కాలపరిమితితో కూడిన సిటిజన్‌చార్టర్‌ను రూపొందింది.

నోడల్ ఏజెన్సీలు, ఇతర కమిటీలు దీనిని తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో తగిన శిక్షలను కూడా విధానంలోనే ప్రస్తావించారు. సింగిల్‌విండో విధానం అమలుకు గతంలోనూ నిబంధనలున్నాయి. కానీ చట్టరూపంలో లేకపోవడంతో అమలుకు నోచుకోలేదు. ఇప్పుడెలాంటి సందేహం లేకుండా పక్కాగా అమలు కానుంది. దీనికిగాను దరఖాస్తుదారుడికోసం సమాచార హక్కు చట్టం పద్ధతుల్లో రైట్ టు సింగిల్‌విండో తీసుకొస్తున్నారు. అలాగే స్వీయ ధ్రువీకరణతోనే పరిశ్రమల స్థాపనకు అనుమతి లభిస్తుంది. ఆఖరికి కామన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు.. దరఖాస్తుదారుడు ఏ శాఖకు తిరుగాల్సిన అవసరంలేదు.

ప్రతి శాఖకు సంబంధించిన ప్రక్రియను నోడల్ అధికారి చేపడుతారు. ఇది కూడా పక్కాగా అమలు చేసేందుకు ప్రతిపాదిత చట్టంలోనే పొందుపరిచారు. దాంతో అధికారుల దాటవేత ధోరణికి చెక్ చెప్పినట్లే! ఇలాంటి ప్రత్యేకాంశాలెన్నింటినో ప్రభుత్వం సాహసోపేతంగా చట్టరూపంలోకి తీసుకురానుంది.

రాయితీలు నాలుగు విధాలు.. పారిశ్రామిక విధానంలో అత్యంత గోప్యంగా ఉంచిన అంశం రాయితీలే. గురువారం దీనిపై చర్చ ముగిసిన తర్వాత ఏయే రంగాలకు ఏ స్థాయిలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారో పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇన్సెంటివ్స్‌ను నాలుగు కేటగిరీలుగా రూపొందించినట్లు సమాచారం. అందులో సాధారణ రంగాలకు ఒకటి, ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం ప్రత్యేకంగా మరోటి తయారు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను బట్టి మిగిలిన రెండు ఉంటాయని తెలిసింది. ఆ వెంటనే సాయంత్రానికల్లా ఇన్సెంటివ్స్‌లపై ప్రభుత్వం జీవోలను జారీ చేయనుంది.

ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ప్రోత్సాహం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందించనుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(ఎన్‌ఏసీ)లో పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ ముగించుకున్న వారికి ప్రత్యేక ప్యాకేజీ అమలుచేస్తారు. ఇందులో పరికరాల కొనుగోలుకు, ఇతర అవసరాలకు ఆర్థికసాయం అందించే వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది.

నీటి పారుదల, పంచాయత్‌రాజ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో వీరికి భాగస్వామ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ, ఎస్టీ ఇంజినీర్లకు రూ.15 లక్షల విలువైన పనులను అప్పగిస్తారు. ఏదేని పరిశ్రమను నెలకొల్పేందుకు ప్రభుత్వమే రూ.10 కోట్లవరకు పెట్టుబడి కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాలోనూ మహిళలకోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రాథమిక అంచనా. కోవే, ఎలీప్, ఫిక్కీ-ఎఫ్‌ఎల్‌వోవంటి సంస్థలద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అన్ని జిల్లాలకూ పరిశ్రమల విస్తరణ తెలంగాణ పది జిల్లాలూ పారిశ్రామీకరణకు నోచుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. పరిశ్రమలకు వెన్నుదన్నుగా నిలిచేది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే. వీటితోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. పెట్టుబడి తక్కువైతేనే ఎక్కువ మంది పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ఎంఎస్‌ఎంఈ కారిడార్ ఉండేటట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

200నుంచి 300ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు క్లస్టర్లను టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రతి జిల్లాలోనూ కనీసం రెండు ప్రతిపాదనలు ఉండేటట్లు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఖాయిలాపడ్డ ఎస్‌ఎంఈలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ఆధునీకరణకు కూడా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారని సమాచారం. నేషనల్, ఇంటర్నేషనల్ ట్రేడ్ షోల్లో పాల్గొనేందుకు మార్కెటింగ్ అసిస్టెన్స్ ఇస్తారు. బయ్యర్స్, సెల్లర్స్ సమావేశాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది. ఎంఎస్‌ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు అవసరమైన కన్సల్టెంట్ ప్యానెల్ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ రంగానికి ప్రత్యేకంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీని ఏర్పాటు చేస్తారని సమాచారం.

అవినీతి నిర్మూలనకు ప్రత్యేక నిబంధనలు ముసాయిదా పారిశ్రామిక విధానంలో అవినీతి, వేధింపులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లయితే సంబంధిత శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే నిర్దిష్ట కాల పరిధిలోనే దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న హెల్ప్‌డెస్క్ ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు న్యాయం దొరుకుతుంది. వేధింపుల నివారణకు యాదృచ్ఛిక తనిఖీలకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు.

ప్రాధాన్యతా రంగాలు ఇవే రాష్ట్రంలో ఏయే రంగాలకు ప్రాధాన్యం కల్పించాలన్న దానిపై అధికారులు లోతుగా అధ్యయనం చేశారు. భౌగోళిక పరిస్థితులు, వనరుల లభ్యత, స్కిల్ బేస్, రా మెటీరియల్ లభ్యత, ఇప్పటికే ఉన్న ఉత్పాదక పరిశ్రమలు తదితర అంశాలను ఆధారంగా చేసుకొని ప్రాధాన్య రంగాలను అంచనా వేశారు. 12రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

లైఫ్‌సైన్సెస్ (బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్స్, వాక్సిన్స్, న్యూట్రాస్యూటికల్స్, బయోలాజికల్స్), ఐటీ, హార్డ్‌వేర్ (బయో మెడికల్ డివైసెస్, ఎలక్ట్రానిక్స్, సెల్యూలార్ కమ్యూనికేషన్స్, ఫ్యాబ్), ఇంజినీరింగ్ (ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్), ఫుడ్‌ప్రాసెసింగ్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్‌బ (డెయిరీ, పౌల్ట్రీ, మీట్, ఫిషరీస్), ఆటోమొబైల్స్ అండ్ హెవీ ఇంజినీరింగ్), ప్లాస్టిక్స్ అండ్ పాలీమార్స్, కెమికల్స్, టెక్స్‌టైల్స్ అండ్ అప్పరెల్ (లెదర్ కూడా), వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్, జెమ్స్ అండ్ జ్యుయలరీస్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సోలార్ పార్క్స్, ట్రాన్స్‌పోర్టేషన్/లాజిస్టిక్ హబ్/ ఇన్‌ల్యాండ్ పోర్ట్/ కంటెయినర్ డిపోట్, మినరల్ బేస్‌డ్/ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిశ్చయించారు. ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక సెక్టోరియల్ పాలసీని రూపొందిస్తారని సమాచారం. దానిలోనే రాయితీలను ప్రస్తావిస్తారని ఓ అధికారి చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.