Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మాట నిలబెట్టుకుందాం..

నగరాన్ని లివబుల్, లవబుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్బోధించారు. సోమవారం నగర శివార్లలోని ప్రగతి రిసార్ట్స్‌లో జీహెచ్‌ఎంసీకి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల శిక్షణా తరగతులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తూ దాదాపు రెండు గంటలపాటు నగరంలోని సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రభుత్వం చేస్తున్న కృషి తదితర అంశాలను వివరించారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని టీఆర్‌ఎస్‌ను కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చి గెలిపించారని, ఈ దిశగా నగరాన్ని సుందరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్పొరేటర్ల మీద ఉన్నదని ఆయన అన్నారు.

CM-KCR-interaction-classes-with-GHMC-Corporators

-అంకితభావంతో పనిచేద్దాం -చరిత్ర ఎరుగని విజయం సాధించాం -హైదరాబాద్‌ను లివబుల్,లవబుల్ సిటీగా తీర్చిదిద్దుదాం -బల్దియా కార్పొరేటర్లకు కేసీఆర్ ఉద్బోధ -ప్రగతి రిసార్ట్స్‌లో శిక్షణా కార్యక్రమం -50 మార్కెట్లు, 30 ఫంక్షన్ హాళ్లు.. 2 అదనపు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం -ఇంటింటికీ నల్లా కనక్షన్ ఇస్తున్నాం -24 గంటల నీటి సరఫరా యోచన:ముఖ్యమంత్రి కేసీఆర్ -కార్పొరేటర్లకు కేసీఆర్ హోంవర్క్.. -బస్తీవాసులతో కమిటీల ఏర్పాటు -డబుల్‌బెడ్‌రూం ఇండ్లపై చైతన్యం -పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు -అవగాహనకు నాగ్‌పూర్, ఢిల్లీ పర్యటన -సమస్యల అధ్యయనానికి నగర సందర్శన

కారణాలేమైనా కార్పొరేటర్లమీద ప్రజల్లో సదభిప్రాయం లేదని, అంకితభావంతో పనిచేసి వారి ఆదరణను చూరగొనాలని సీఎం చెప్పారు. హైదరాబాద్ గతం ఏమిటి? వర్తమానం ఏమిటి? భవిష్యత్తు ఎలా ఉండాలి? ఎలా తీర్చిదిద్దాలి అనే విషయంలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో నే ప్రారంభమవుతుందని, ఆ దిశగా సంకల్పసిద్ధితో ముందడుగు వేయాలని అన్నారు. నిరంతర విద్యుత్, 24 గంటల నీరు, గుంతలు లేని రోడ్లు, చెత్తకుప్పలు లేని వీధులు, పచ్చని చెట్లతో కూడిన హైదరాబాద్‌ను తయారు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతారని కేసీఆర్ అన్నారు. వారికి కర్తవ్యం నిర్దేశిస్తూ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లకు మురికివాడల ప్రజలను ఒప్పించి అక్కడే కాలనీలు నిర్మించేందుకు కృషి జరపాలని, మిషన్ భగీరథ కింద ప్రతి పేదవారి ఇంట్లో నల్లా కనెక్షన్ ఇప్పించాలని, బస్తీ కమిటీలు వేసి వారికి బాధ్యతలు అప్పగించాలని, కార్పొరేటర్లు తమ డివిజన్లకే పరిమితం కాకుండా మూడు నాలుగు రోజులపాటు నగరం మొత్తం పర్యటించి పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.

కొత్తలో నేనూ ఇబ్బంది పడ్డా.. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో అధికారులు నిర్వహించే సమీక్షా సమావేశాలకు వెళితే విషయం అర్థంకాక తాను కూడా తీవ్ర ఇబ్బంది పడేవాడినని సీఎం చెప్పారు. ఆ పరిస్థితిని అధిగమించేందుకు వారంపాటు ఎన్‌ఐఆర్‌డీలో పంచాయతీరాజ్ వ్యవస్థపై శిక్షణ పొందానని తెలిపారు. తర్వాత వివిధ విభాగాల అధికారులకు లేఖలు రాసి అన్ని అంశాలపైనా పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని అధ్యయనం చేసి పట్టు సాధించానన్నారు. అధికారులుసైతం తన ఉత్సాహంచూసి ఏదైనా పని చెప్తే వెంటనే చేసేవారని, దానివల్ల పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అక్కడి ప్రజలతో తిట్లు పడేవని పేర్కొన్నారు.

మనది అసాధారణ విజయం.. ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించింది అపూర్వ విజయమని కేసీఆర్ అన్నారు. గతంలో నెహ్రూ హయాంలో మినహా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకే పార్టీ ఒంటరిగా మెజారిటీ సాధించిన సందర్భం లేదని అన్నారు. మిత్రపక్షం మజ్లిస్‌తో కలిపి ప్రజలు 150 సీట్లలో 143సీట్లు ఇచ్చారన్నారు.ప్రజలకు ఇతర పార్టీలపై ఉన్న ఆగ్రహమే కాకుండా, మనం చెప్పింది చేస్తామనే ఆపార విశ్వాసం కూడా ఈ విజయానికి ప్రధాన కారణం అని పేర్కొన్నారు.

కార్పొరేటర్లపై విముఖత.. కారణాలేమైనా కార్పొరేటర్లపై ప్రజల్లోకూడా సదభిప్రాయం లేదని, ఇది తన సర్వేలో కూడా వెల్లడైందని సీఎం చెప్పారు. గతంలో కార్పొరేటర్లతో అనవసరమైన గోల..బల్దియా ఎన్నికలు వాయిదా వేయాలి అని ఒక ఎమ్మెల్యే కూడా తనతో అన్నారని కేసీఆర్ చెప్పారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే చాలు.. ఇసుక పడగానే కార్పొరేటర్ల అనుచరులు దిగి లంచాలకు వేధించే పరిస్థితి దానికి కారణమని అన్నారు. ఇటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచివేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సీఎం ఉద్బోధించారు. కాంట్రాక్టర్లు గ్యాంగ్‌గా ఏర్పడి ఏడాది పొడుగునా ఏవో పనులు చేసి డబ్బులు జేబులో వేసుకునే విష సంస్కృతి బల్దియానుంచి కూడా పోవాలని నిర్దేశించారు. ఇంట్లో చిన్న మోరీ జామైనా, నల్లా పనిచేయకపోయినా వెంటనే ప్లంబర్‌ను పిలిచి ఎలా బాగు చేయించుకుంటామో అలాగే కార్పొరేటర్లు వార్డులో తలెత్తే సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. అప్పుడే గొప్ప పేరువస్తుందన్నారు. నేడు చేసే మంచిపనులు భవిష్యత్తుకు పునాదిగా మారతాయన్నారు. మరింత ఉన్నతమైన పదవులు వెతుక్కుని వస్తాయని చెప్పారు.

నగర పరిస్థితి అధ్వానం.. నగరంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, మౌలిక సదుపాయాలు సరిగాలేవని సీఎం చెప్పారు. కోటి జనాభాకు ఏడు కూరగాయల మార్కెట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. గుంతలతో కూడిన రోడ్లు, టాయ్‌లెట్ల సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. వేలకొద్ది ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా వాటికి సరైన బస్‌బేలు లేవన్నారు. నగర పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉందన్నారు. నగరంలో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య ఏర్పడుతున్నదని, అసెంబ్లీ, రాజ్‌భవన్, సీఎం క్యాంపు కార్యాలయం తదితర ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు చేరుతున్నదని చెప్పారు. తాను అధికారంలోకి రాగానే ఈ ముంపు బాధ తప్పించాలని అధికారులకు సూచిస్తే దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారని సీఎం తెలిపారు. గతంలో ముంబైలో నాలుగు రోజులు, ఆ మధ్య చెన్నైలో 21 రోజులు క్లౌడ్ బరస్ట్ (కుంభవృష్టి)కారణంగా నీటి మునకలో ఉండిపోయాయని, అలాంటి కుంభవృష్టి మన నగరంలో వస్తే పరిస్థితి ఊహకందని విధంగా ఉంటుందని చెప్పారు.

నగరంలో ప్రభుత్వ భూములన్నీ కబ్జాలైపోయాయని, ఆఖరుకు శ్మశానాలు కబ్జా చేశారన్నారు. గత పాలకులు ఈఎన్‌టీ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుపడి కాపాడామన్నారు. బొటానికల్ గార్డెన్‌ను ముగ్గురికి విక్రయించగా కాపాడినట్లు చెప్పారు. నగరంలో పారిశుధ్యం ఉండవలిసిన స్థితిలో లేదని అన్నారు. రియోడీజెనీరో ప్రపంచంలో అతి సుందరనగరమనే పేరుందని అక్కడ నగర రోడ్లను రోజుకు రెండుసార్లు కడుగుతారని చెప్పారు. జనీవాలో రోజూ ఒకసారి రోడ్లను కడుగుతారని, చైనాలో ప్రధాన రహదార్ల మీద దుమ్ములేవకుండా నీరు చిలకరిస్తారని చెప్పారు. అలాంటి నగరాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

పరిస్థితులు మారాలి.. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా బస్తీల్లోకి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు తనను కలిచివేశాయని సీఎం చెప్పారు. కనీసం ఐదునిమిషాలు నిలబడలేని ప్రదేశాల్లో పేదలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అటువంటి బస్తీల రూపురేఖలను సమూలంగా మార్చి వేయాలని అన్నారు. మానవతా దృక్పథంతో మెలగాలని కోరారు. అలాంటి పరిస్థితి ఏదైనా తన దృష్టికి తెస్తే అవసరమైతే రూ. 100-150కోట్లు కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం చెప్పారు. వందేండ్ల క్రితం అత్యంత శాస్త్రీయంగా మోండా మార్కెట్‌ను నిర్మించారని, అదే తరహాలో నగరంలో కనీసం 50ప్రాంతాల్లో మార్కెట్లు నిర్మించాలని ప్రతిపాదించామని చెప్పారు. పేదల కోసం మరో 30ఫంక్షన్‌హాళ్లు నిర్మించాలని ఆదేశించామన్నారు.

శ్రోతగా మారిన సీఎం.. భోజన విరామం తరువాత సీఎం దాదాపు అరగంటపాటు కార్పొరేటర్ల మధ్య కూర్చొని నిర్వాహకులు చెప్పిన పలు విషయాలను ఆసక్తిగా విన్నారు. ఆస్కి ప్రొఫెసర్ చారి పట్టణాభివృద్ధి-నగరాలు, హైదరాబాద్ అనే అంశంపై మాట్లాడుతుండగా జోక్యం చేసుకుంటూ మిషన్ భగీరథ గురించి వివరించారు. ఈసారి వర్షాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలతోపాటు పంచాంగకర్తలు కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. నగరం నీటి నిల్వకు రిజర్వాయర్ల నిర్మాణం కోసం హడ్కోనుంచి రూ. 2,000కోట్లు రుణం పొంది పనులు చేపట్టినట్లు వివరించారు.

ఇదీ మీ కర్తవ్యం…. గతంలో హైదరాబాద్ ఎలా ఉండేది?, ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉంది?, భవిష్యత్తులో హైదరాబాద్ ఎలా ఉండాలి? అనే ఈ మూడు ప్రశ్నలకు జవాబు రాసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఏ పని చేపట్టినా అడ్డంకులు రావటం సహజమని అంటూ గతంలో జూబ్లీ బస్టాండ్ కడుతుంటే అంత దూరంలో ఎందుకని వ్యతిరేకించారని, అయితే ఇప్పుడు అది నగరం మధ్యలోకి వచ్చి పెరిగిన అవసరాలకు సరిపోవడంలేదని సీఎం చెప్పారు. నగర అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ల సంఖ్య పెరుగలేదని, కేంద్రంతో నిరంతర చర్చలు జరుపడంతో నాగులపల్లి, చెర్లపల్లిలలో కొత్తగా రెండు టెర్మినళ్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ఘనవిజయంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పాత్ర ఉన్నదని సీఎం చెప్పారు. లక్షల సంఖ్యలో వస్తున్న దరఖాస్తులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి బస్తీల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. మురికివాడల్లో టవర్లతో కూడిన సువిశాల అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు వారిలో చైతన్యం తేవాలన్నారు.

మిషన్ భగీరథ కింద రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా ఇస్తున్నట్లుగానే నగరంలో కూడా నల్లా కనెక్షన్లు లేనివారికి ఉచితంగా ఇచ్చేందుకు కార్పొరేటర్లు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అలాగే నగరంలో ప్రతి ఐదు వేల మందికి ఒకటి చొప్పున కమిటీలు ఏర్పాటుచేసి వారిని అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని సీఎం చెప్పారు. వారితో తాను కూడా సమావేశమవుతానని అన్నారు. నగరంలో కాగితం, చెత్త, ప్లాస్టిక్ ఎక్కడా కనిపించకుండా ఉండేందుకు కృషిచేయాలని, ఎవరైనా వినకుంటే గాంధీగిరీ తరహాలో కార్పొరేటర్లే చెత్త ఎత్తే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. గుంతలు లేని రోడ్లు, ట్రాఫిక్ లేని రహదారులు, కోతలు లేని కరెంటు, కొరతలేని నీటి సరఫరా, చెత్తకుప్పలు లేని వీధులు, పచ్చని చెట్లతో కూడిన హైదరాబాద్‌ను నిర్మిస్తే ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని చెప్పారు.

కార్పొరేటర్లు కులమతాలకు అతీతంగా పనిచేయాలని సీఎం చెప్పారు. మహిళలకు తగు ప్రాధాన్యమివ్వాలన్నారు. నగరంలో కాస్మోపాలిటన్ కల్చర్‌ను కాపాడుతూ ముందుకు సాగాలన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలని, కార్పొరేటర్ పదవి వచ్చాక మన భాషలో, కట్టుబాట్లలో ఎటువంటి మార్పు రాకూడదని, అప్పుడే నాయకుడిగా నాలుగు కాలాలపాటు ఉండే అవకాశం ఉంటుందన్నారు. కార్పొరేటర్లు కేవలం తమ డివిజన్లకే పరిమితం కాకుండా పూర్తి నగరంలోని పరిస్థితులు ఆకళింపు చేసుకోవాలని సీఎం చెప్పారు. ఇందుకోసం మూడు నాలుగు రోజులపాటు బస్సుల్లో నగర సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే పారిశుద్ధ్యం నిర్వహణపై అవగాహన కల్పించేందుకు నాగపూర్, డెబ్రిస్ నిర్వహణను తెలుసుకునేందుకు ఢిల్లీ పర్యటనలకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

మనిషి పుట్టడంతోనే అన్నీ నేర్చుకోని పుట్టడు. పుట్టిన తరువాత నేర్చుకుంటాడు. నేర్చుకోవాలనే పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన ఉంటే చేయలేనిది ఏదీ లేదు. ఎంత దూర ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో చేపట్టిన పనులన్నింటినీ విజయవంతం చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. నగరంలోని సకల సమస్యలనూ పారద్రోలాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఇక్కడినుంచే సంకల్పసిద్ధితో ముందుకు సాగుదాం. అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), జీహెచ్‌ఎంసీ, కార్పొరేటర్లు సమన్వయంతో నగరాభివృద్ధికి కృషిచేయాలని సీఎం సూచించారు. డా. బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నగరంలో 125అడుగుల ఎత్తైన విగ్రహాన్ని స్థాపించాలని నిర్ణయించడంపై దేశ విదేశాలనుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తినట్లు చెప్పారు.

చెట్లతోనే మనిషి జీవితం, ఉత్తమ డివిజన్‌కు రూ. కోటి నజరానా.. మనిషి జీవితంలో చెట్లు ప్రధానపాత్ర పోషిస్తాయని కేసీఆర్ చెప్పారు. సకాలంలో వర్షాలు కురవడానికి, పర్యావరణ రక్షణకు చెట్లు అవసరమని చెప్పారు. కెనడాలో ఒక్కో మనిషికి సగటున 8953చెట్లు(పర్ హెడ్) ఉండగా, రష్యాలో 4461, అమెరికాలో 716, చైనాలో 102 ఉన్నాయని, మన నగరంలో మాత్రం ప్రతి ఒక మనిషికి సగటున 28చెట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుత సమావేశం నిర్వహిస్తున్న ప్రగతి రిసార్ట్స్‌లో మాత్రం ఒక్కో మనిషికి సుమారు 5000మొక్కల చొప్పున ఉన్నాయని, అందుకే ఇక్కడ అత్యంత ఆహ్లాదభరితమైన వాతావరణం ఉందని చెప్పారు. ఇక్కడ దోమలను నిరోధించే ఔషధ మొక్కలు కూడా ఉన్నాయని చెబుతూ, తన ఫామ్‌హౌస్‌లో కూడా ఇక్కడినుంచి ఆ మొక్కలు తెప్పించి నాటించానని తెలిపారు. చెట్ల ఆవశ్యకతను గుర్తించి ఒక్కో వార్డులో ఎన్ని మొక్కలు నాటగలరో కమిషనర్‌కు తెలియజేయాలని కార్పొరేటర్లకు సీఎం సూచించారు. మొక్కలు నాటడంతోపాటు 90% మొక్కలను కాపాడిన డివిజన్‌కు సీఎం సహాయ నిధినుంచి రూ. కోటి ఇస్తానని ప్రకటించారు. ఇలా 50 డివిజన్‌లకైనా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.