Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మాది కమీషన్ల పాలన కాదు

-ఒకచేత్తో అడ్వాన్సులిచ్చి మరో చేత్తో కమీషన్ తీసుకొనే సంస్కృతి మీది -వాటర్‌గ్రిడ్‌పై ఏ సమాచారమైనా ఆర్టీఐతో తీసుకోవచ్చు -రూ.10వేల కోట్లతోనే పూర్తయితే ఇన్నాళ్లేం చేశారు? -చిత్తూరు జిల్లాకే రూ.7వేల కోట్లిచ్చినప్పుడు గుర్తుకురాలేదా? -ప్రాజెక్టు పూర్తయితే పుట్టగతులుండవనే కాంగ్రెస్ నేతల పిచ్చి మాటలు -ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజం

KTR-press-meet

రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించి, వారి దాహార్తిని తీర్చాలన్న గొప్ప సంకల్పంతో రూపొందించిన జలహారం పథకాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. ఈ పథకంపై కాంగ్రెస్ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలకులలాగా తాము ఒకచేత్తో అడ్వాన్సులిచ్చి మరో చేత్తో కమీషన్లు తీసుకొనే రకం కాదని స్పష్టంచేశారు. తమది కమీషన్ల ప్రభుత్వం కాదని చురకలంటించారు. రూ.10 వేల కోట్లతోనే పది జిల్లాల్లో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే అవకాశముంటే కాంగ్రెస్ నాయకులు ఇన్నేండ్లు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక్క చిత్తూరు జిల్లాకే రూ.7వేల కోట్లతో మంచినీటి పథకం చేపట్టినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ విషయం గుర్తుకురాలేదా అని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి, ఎంపీ బాల్క సుమన్ తదితరులతో కలిసి ఆదివారం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. జలహారం పథకం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులుండవనే భయంతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ అధ్యక్షుడు, అసెంబ్లీ, మండలి ఎల్పీ నాయకులు మొదటిసారిగా ఒక్క వేదికపైకి వచ్చి చాలా మాట్లాడారని, వాటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. జలహారం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తిచేసి తీరుతామని స్పష్టంచేశారు.

ఇన్నాళ్లూ మీరేం చేశారు? రూ.10 వేల కోట్లతో పూర్తయ్యే పథకానికి రూ.40 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారన్న కాంగ్రెస్ నేతల విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. నిజంగా రూ.10వేల కోట్లతో పూర్తిచేసే అవకాశం ఉంటే ఇన్నిరోజులు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. మీరు చెప్పింది వాస్తవమైతే.. ఆ విషయంలో మీకు సాంకేతిక పరిజ్ఞానం ఉంటే దయచేసి ఆ ఉపాయాలేందో మాకు చెప్పండి. ఒకాయన పైపుల్లేకుండా నీళ్లు తెస్తనంటడు. ఇంకో ఆయన రూ.10వేల కోట్లతోనే చేస్తనంటడు. అవేందో మాకూ చెప్పండి. ఈ పథకం ముఖ్యమంత్రో, మంత్రో డిజైన్ చేసింది కాదు. ఇంజినీరింగ్ చీఫ్‌లు, ఈఈలు, ఈఎన్‌సీలు డిజైన్ చేసి అంచనాలు వేసిన మొత్తమిది. ఇందులో ఏ రాజకీయ నాయకుడు, మంత్రి, ఎమ్మెల్యేల ప్రమేయం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల మేరకు కృష్ణా, గోదావరి నదుల నుంచి 39 టీఎంసీల సర్‌ఫేస్ వాటర్‌ను తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో 100 ఎల్పీసీడీలు (లీటర్ పర్ క్యాపిటాపర్ లీటర్), మున్సిపాలిటీల్లో 135 ఎల్పీసీడీలు, కార్పొరేషన్ల పరిధిలో 150 ఎల్పీసీడీలను ఇంటింటికీ నల్లాల ద్వారా ఇచ్చేందుకు వాటర్‌గ్రిడ్‌ను రూ.40వేల కోట్ల అంచనాతో ఇంజినీర్లు డిజైన్ చేశారు అని కేటీఆర్ తెలిపారు.

ఒక్క జిల్లాకు రూ.7వేల కోట్లయితే.. పది జిల్లాలకెంత? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆయన సొంత జిల్లా చిత్తూరుకు రూ.7వేల కోట్లతో మంచినీటి పథకాన్ని చేపట్టిన అంశాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు కేవలం ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి పథకాన్ని రూ.7వేల కోట్లతో చేపట్టినరు. ఆ పథకానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గంలో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నరు. మరి ఒక్క జిల్లాకు రూ.7వేల కోట్లయితే.. పది జిల్లాలకు ఎంత కావాలి? తెలంగాణ మొత్తానికి రూ.10వేల కోట్లతోనే ఇంటింటికీ నీళ్లెలా ఇస్తరు? ఈ విషయం మీకు ఆనాడు గుర్తుకు రాలేదా? ఇదేదో బట్టకాల్చి మీదేయడం తప్ప మరోటి కాదు అని విమర్శించారు.

పక్కన చూశారా? తెలంగాణలో టెండర్లు తక్కువకు పోవడం వల్ల ప్రజాధనం ఆదా కాగా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో చూడాలని మంత్రి సూచించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పట్టిసీమ అనే ప్రాజెక్టుకు టెండర్లు పిలిచినరు. వాటిని ఏకంగా 16.8 శాతం ఎక్కువకు కోట్ చేసిన వాళ్లకు ఇచ్చినరు. కానీ ఇక్కడ వాటర్‌గ్రిడ్‌లోని ఇన్‌టేక్‌వెల్ స్ట్రక్చర్ల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే ప్రతి టెండరుకు తక్కువకు (లెస్) కోట్ చేసినరు. ప్రభుత్వం నిర్ణయించిన అంచనా వ్యయం కంటే తక్కువకు పోయినందున ప్రజాధనం ఆదా అయింది. టెండర్లు కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్లకే ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన జలయజ్ఞం, వాటర్ వర్క్స్ పనుల్లో ఇదే కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ నేతలు కుంభకోణాలు, కమీషన్లు అంటున్నారంటే అదంతా మీ సంప్రదాయమేనా? ఇదివరకటి అనుభవాలతో ఇట్ల మాట్లాడుతున్నరా? అని ప్రజలు అనుమానించే అవకాశముంది మంత్రి చురకలంటించారు. కాంగ్రెస్ నేతలు వాటర్‌గ్రిడ్‌పై లేనిపోని విమర్శలుచేస్తూ ఆదుర్దా పడి, ఆగమాగం కావడం వెనక ఈ పథకం పూర్తయితే రాజకీయ పుట్టగతులుండవన్న భయమొక్కటే కారణమని కేటీఆర్ అన్నారు.

ప్యాకేజీలు ఎందుకు కుదించారంటే.. టెండర్లలో ప్యాకేజీలు కుదించడంలో ఎలాంటి బ్రహ్మ రహస్యం లేదని మంత్రి అన్నారు. వాస్తవంగా 14 చోట్ల ఇన్‌టేక్ స్ట్రక్చర్లు నిర్మించాలనుకున్నాం. ఆదిలాబాద్ వంటి ఒక్క జిల్లాలోనే ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి తదితర ఐదు చోట్ల కట్టాల్సి ఉంది. మిగతా జిల్లాలోనూ ఇదేరీతిన ఉన్నయి. చిన్న చిన్న ప్యాకేజీలు పిలవడం వల్ల అనుభవం లేనివాళ్లు కూడా వస్తరు. కీలకమైన సోర్స్ (జలాశయం నుంచి నీటిని సేకరించే ప్రాంతం) సరిగ్గా లేకపోతే మొత్తం ప్రాజెక్టు బంద్ అయ్యే ప్రమాదముంటది. అందుకే ప్రతి జిల్లాలోని స్ట్రక్చర్లన్నింటినీ ఒక ప్యాకేజీ కింద తీసుకోవాలని ఇంజినీర్లు సూచించారు. దీంతో మొదట 14 వేర్వేరుగా పిలవాలనుకొని అర్హత, అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు రావాలనే ఉద్దేశంతో పిలవడంతో ఆరు ప్యాకేజీలు వచ్చినయి. ఇందులో మంచి ఉద్దేశముందేగానీ చెడు ఉద్దేశం లేదు అని తెలిపారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు బాలమల్లు, కమలాకర్‌రెడ్డి, కిషన్‌రావు, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీడియా ముందు ఫైళ్లు పెట్టేందుకూ సిద్ధం.. వాటర్ గ్రిడ్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ.10వేల కోట్లతోనే ఈ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారో డీపీఆర్ పంపాలని కాంగ్రెస్ నాయకులను కోరారు. ర్రూ.10వేల కోట్లతో పూర్తిచేసే పరిజ్ఞానముంటే స్వీకరించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనన్నారు. ఎవరైనా సరే సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం కింద తీసుకోవచ్చు. రాజకీయ నాయకుడిగా నేను వద్దనుకుంటే కాంగ్రెస్ నేతలు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంజినీర్-ఇన్-చీఫ్ వద్ద కూర్చొని సమాచారాన్ని తీసుకోవచ్చు. సలహాలుంటే కచ్చితంగా స్వీకరిస్తామేగాని, బట్టకాల్చి మీదేస్తం, అనవసరంగా ఆరోపణలు చేస్తమంటే మాత్రం కుదరదు అని తేల్చి చెప్పారు.

ఈ మూడు గుర్తుంచుకోండి..! జలహారం ప్రాజెక్టును అమలుచేయడంలో ప్రధానంగా మూడు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే శాసనసభ సాక్షిగా చెప్పిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. -మేం మీ మాదిరిగా మొబిలైజేషన్ అడ్వాన్సు ఇవ్వం. మీ లెక్క కుడిచేత్తో అడ్వాన్సులు ఇచ్చి.. ఎడమ చేత్తో కమీషన్లు తీస్కొని జేబులో వేసుకునే సంస్కృతి మాది కాదు. జలయజ్ఞంలో జరిగిందేందో దేశమంతా తెలుసు. దేశ చరిత్రలో మొబిలైజేషన్ అడ్వాన్సు ఇవ్వబోమని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మాది. -వాటర్‌గ్రిడ్‌ను మూడేండ్లలోనే పూర్తిచేయాలని ప్రభుత్వం అనుకుంటున్నందున ఎవరుపడితే వాళ్లు టెండర్లలో పాల్గొనకుండా, ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొంటే పనులు త్వరగా పూర్తవుతాయనే ఉద్దేశంతోనే సీడీఆర్ (కార్పొరేట్ డెబిట్ రీస్ట్రక్చరింగ్) అయిన కంపెనీలను అనుమతించలేదు.దేశంలో 12 రాష్ర్టాలు ఈ నిబంధనను అమలు చేస్తున్నయి. అందులో కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాలు కూడా ఉన్నయి. ఆర్థిక పరిస్థితి బాగాలేని కంపెనీలు టెండర్లలో పాల్గొని మధ్యలో పనులు వదిలేసి పోతే ప్రాజెక్టుకు అంతరాయం కలిగే ప్రమాదముంది. అందుకే ఈ నిబంధన విధించాం. -పిలిచిన ప్రతి టెండరు తక్కువకు పోవడంతో ప్రజాధనం ఆదా అయింది. పైగా టెండర్లలో అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నయి.

కోడిగుడ్డు మీద ఈకలు పీకడమెందుకో? వారంలోగా టెండర్లు పూర్తిచేయాలన్న నిబంధనపై కాంగ్రెస్ నేతల విమర్శలు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. వారంలోపు టెండర్లు పూర్తిచేయాలన్న నిబంధన ఉంచిన మాట వాస్తవమే. ఇన్‌టేక్ స్ట్రక్చర్లను నీటిని సేకరించే జలాశయాల్లో నిర్మించాల్సి ఉంది. ఎండాకాలం పోయేలోపు వాటిని పూర్తిచేయాలి. లేకుంటే వర్షాలొచ్చినపుడు నీటమునిగిపోతాయి. అందుకే త్వరగా పనులు పూర్తిచేయటానికే గడువును వారానికి కుదించినం. ఒకవేళ ఎండాకాలం లోపల పనులు పూర్తి కాకపోతే మళ్లీ ఎండాకాలం వరకు వేచి చూడాలి. ఒక సీజన్ వృథా అవుతుది అని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.