-జీఎస్టీ బకాయిలు వెంటనే ఇవ్వాలి.. రాష్ర్టాల ఆగ్రహం -టీఆర్‌ఎస్ పిలుపుతో కదిలివచ్చిన 8 పార్టీల ఎంపీలు -తృణమూల్, డీఎంకే, ఆప్, బీజేడీ, బీఎస్పీ, -ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ సంఘీభావం -పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద నిరసన -కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని చూపాలని డిమాండ్

తెలంగాణలో తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న టీఆర్‌ఎస్.. జాతీయస్థాయిలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్న జీఎస్టీ బకాయిలపై గళమెత్తింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశంపై చొరవతీసుకుని ఆందోళనకు దిగింది. గురువారం పార్లమెంటు లోపల, బయట టీఆర్‌ఎస్ చేపట్టిన నిరసనకు 8 పార్టీలు మద్దతిచ్చాయి. జీఎస్టీ అంశంపై పార్లమెంటులో చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. టీఆర్‌ఎస్ ఆందోళనతో దిగివచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా.. బీఏసీలో చర్చించి, చర్చకు సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
కడుపుమండిన నోళ్లు గళమెత్తాయి.. నమ్మించి మోసంచేసిన వారిపై పోరాటాన్ని ప్రకటించాయి.. పట్టపగలే కండ్లముందటి దోపిడీపై తిరుగుబాటు చేశాయి.. సాకులు చెప్పి చేస్తున్న అన్యాయంపై న్యాయబద్ధంగా యుద్ధానికి దిగాయి. కరోనా సాకు చెప్పి రాష్ర్టాలకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై టీఆర్‌ఎస్ ఎంపీలు గళమెత్తారు. జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తంచేశారు. పార్లమెంట్ బయట, లోపల నిరసన తెలిపి తెలంగాణ వాణిని దేశానికి వినిపించారు. కలిసివచ్చిన మరో 8 పార్టీల సహకారంతో కేంద్ర వైఖరిని ఎండగట్టారు. గురువారం మధ్యాహ్నం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
కేంద్రం ఇప్పటికైనా ఫెడరల్ స్పూర్తిని ప్రదర్శించాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. ‘స్టాప్ కిల్లింగ్ ఫెడరలిజం’ అని నినదించారు. టీఆర్‌ఎస్ ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం హోరెత్తింది. వీరికి మద్దతుగా టీఎంసీ, డీఎంకే, ఆప్, బీజేడీ, బీఎస్పీ, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీల ఎంపీలు కలిసివచ్చారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ట్యాక్స్ ఉండాలని తీసుకొచ్చిన జీఎస్టీకి జాతీయ స్ఫూర్తి ప్రదర్శిస్తూ టీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. 14% కంటే తక్కువగా ఆదాయం వస్తే నష్టపరిహారం ఇస్తామని చట్టంలో చెప్పారని, కానీ ఇప్పుడు కేంద్రం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు దాదాపు రూ.8600కోట్లు రావాల్సి ఉన్నదన్నారు.
వెంటనే రాష్ర్టాలకు రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ, సహా ఇతర బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వ్యాట్ అమల్లో ఉండగా తెలంగాణలో 24% వృద్ధి ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకువచ్చారని, దేశానికి మంచి జరుగుతుందన్న ఆలోచనతో రాజీపడి టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పారు. బకాయిలను విడుదల చేయకుంటే కేంద్రంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో రాష్ర్టాలు ఆర్థికంగా చితికిపోయాయని, ఈ సమయంలోనూ కేంద్రం ఆదుకోకపోవటం శోచనీయమని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. కనీసం రాష్ర్టాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వటంలేదని విమర్శించారు. నిరసన వ్యక్తంచేసిన వారిలో టీఆర్‌ఎస్ ఎంపీలు సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పీ రాములు, వెంకటేశ్ నేతకాని, మాలోతు కవిత, లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జీ రంజిత్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి తదితరులున్నారు.
సభ లోపలా డిమాండ్.. జీఎస్టీ బకాయిలపై చర్చించాలని లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు టీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. స్పందించిన స్పీకర్.. నాగేశ్వర్‌రావుకు మాట్లాడే అవకాశమిచ్చారు. జీఎస్టీ చాలా ముఖ్యమైన అంశమని, ఇదే సభలో తీసుకొచ్చిన చట్టాన్ని తుంగలో తొక్కుతూ అందులోని అంశాలను అమలు చేయడంలేదని నామా అ న్నారు. జీరో అవర్‌లో అవకాశం ఇవ్వటం వల్ల ఉపయోగం ఉండదని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఉంటేనే సరైన సమాధానం వస్తుందని చెప్పారు. స్పందించిన స్పీకర్ బీఏసీలో చర్చించి జీఎస్టీపై చర్చకు అవకాశమిస్తానని హామీఇచ్చారు.
ఎనిమిది పార్టీల నిరసన రాష్ర్టాలకు జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేస్తూ గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో టీఆర్‌ఎస్‌సహా ఎనిమిది విపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పాల్గొనలేదు. జీఎస్టీ బకాయిల కోసం ప్రాంతీయ పార్టీలు సమన్వయంతో పోరాడాలని నిశ్చయించుకున్నట్టు ఈ నిరసన లు స్పష్టంగా వెల్లడిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ ఒబ్రెయిన్ వ్యాఖ్యానించారు. గురువారం నిరసనల్లో టీఆర్‌ఎస్, టీఎంసీ, ఆర్జేడీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఒకే దేశం ఒకే ట్యాక్స్ ఉండాలని తీసుకొచ్చిన జీఎస్టీకి జాతీయ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ టీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. 14% కంటే తక్కువగా ఆదాయం వస్తే నష్టపరిహారం ఇస్తామని చట్టంలో చెప్పారు. కానీ ఇప్పుడు కేంద్రం చేతులెత్తేసింది. తెలంగాణకు దాదాపు రూ.8600కోట్లు రావాల్సి ఉన్నది. వెంటనే రాష్ర్టాలకు రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ సహా ఇతర బకాయిలను కేంద్రం విడుదలచేయాలి.
– టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే