Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మా సహనాన్ని పరీక్షించొద్దు

-కేసీఆర్‌ లేకుంటే టీపీసీసీ, టీబీజేపీ నేతలకు పదవులెక్కడివి?
-అవాకులు, చవాకులు పేలేవారి విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి
-ఏ రంగానికీ లోటు లేకుండా చేసిన సీఎం
-మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు
-విద్యుత్తు కార్మికుల సభలో మంత్రి కేటీఆర్‌
-టీఆర్‌వీకేఎస్‌లో విలీనమైన తెలుగునాడు విద్యుత్తు కార్మిక సంఘం

తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ మొదట విద్యుత్తు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించారు. తెలంగాణ వస్తే అంధకారమయం అవుతుందని కొందరు ఎద్దేవా చేశారు. కానీ, ప్రతి రంగానికీ 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామంటే.. అందుకు విద్యుత్తు ఉద్యోగులు, కార్మికుల కృషే కారణం. విద్యుత్తు రంగం విషయంలో గడిచిన ఆరేండ్లు సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. తాగునీటి సమస్యలు లేవు. సాగునీటి కష్టాల పరిష్కారంతో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారింది.
-మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతి రంగానికీ న్యాయంచేశారని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. అన్ని రంగాల్లోనూ అసాధారణ కార్యక్రమాలను అమలుచేస్తున్న నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు. గురువారం తెలంగాణభవన్‌లో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి సమక్షంలో తెలుగునాడు విద్యుత్తు కార్మికసంఘం.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) లో విలీనమైంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరికీ అన్యాయం చేసే నాయకుడు కాదు. అందరికీ మేలుచేయాలన్న ఉదాత్తమైన తపన కలిగిన నాయకుడు’ అని అన్నారు. కానీ, ప్రతిపక్ష నాయకులు కొందరు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ వయస్సుకు, హోదాకు కనీస గౌరవం ఇవ్వకుండా ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ సాధించిన కేసీఆర్‌ లేకుంటే.. టీపీసీసీ, టీబీజేపీ నాయకులకు పదవులు ఎక్కడివని, వీళ్లకు ఉనికి ఎక్కడిదని ప్రశ్నించారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేవారి వారి విజ్ఞత ఏపాటిదో అర్థంచేసుకోవాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలుతున్న విపక్షాల విమర్శలను దీటుగా సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీని అనాడు స్థాపించకుంటే తెలంగాణ ఏర్పాటు కాకపోయేదని.. ఈ నాయకులకు అడ్రస్సే ఉండేది కాదని గుర్తుచేశారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని.. తమ సహనానికి కూడా హద్దు ఉంటుందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలనేదే సీఎం కేసీఆర్‌ ఉద్దేశమన్నారు. ‘ఆదాయం పెరుగాలి.. సంపద పెంచాలి. ఆ సంపదను పేదల సంక్షేమంకోసం ఖర్చుచేయాలి. ఇదే ముఖ్యమంత్రి ఉద్దేశం. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి నాయకత్వంలో ముందుకుపోతాం’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కరెంటు సమస్యకు శాశ్వత పరిష్కారం
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ మొదట విద్యుత్‌ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించారని గుర్తుచేశారు. తెలంగాణ వస్తే అంధకారమయమవుతుందని ఎద్దేవాచేశారని, కానీ, ప్రతి రంగానికి 24 గంటల విద్యుత్తు సరఫరాచేస్తున్నామంటే.. అందుకు విద్యుత్తు ఉద్యోగులు, కార్మికుల కృషేనని ప్రశంసించారు. ‘2014కు ముందు శ్మశానంలో అంత్యక్రియలకు పోతే స్నానానికి మోటర్‌ వేసుకొందామంటే కరెంటు ఉండేది కాదు. కరెంటు కోసం అధికారులకు ఫోన్లు చేయాల్సివచ్చింది. వారానికి మూడురోజులు పవర్‌ హాలిడేలతో పారిశ్రామికవేత్తలే ధర్నాలు చేయాల్సి వచ్చేది. రాష్ట్రం ఏర్పడ్డాక మనల్ని అడగకుండానే కేంద్రం ఏడు మండలాలను, చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే 450 మెగావాట్ల జలవిద్యుత్తు ప్రాజెక్టును ఏపీకి ఇచ్చేసింది. అయినా దీన్ని సవాలుగా తీసుకొని సీఎం నాయకత్వంలో మీ అందరి శ్రమతో ఆరు నెలల్లో విద్యుత్తు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకొన్నాం. ఇవాళ విద్యుత్తు వినియోగంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం.

విద్యుత్తు రంగానికి సంబంధించి గడచిన ఆరేండ్లు సువర్ణాక్షరాలతో లిఖించదగింది’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆర్టిజన్లను ప్రభుత్వం రెగ్యులర్‌ చేసిందని పేర్కొన్నారు. తాగునీటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. సాగునీటి కష్టాల పరిష్కారంతో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 14 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, వీటి ద్వారా 14.50 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించాయని, రూ.2.05 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

దేశానికి అన్నపూర్ణ
కరోనా వల్ల అభివృద్ధికి స్పీడ్‌ బ్రేకర్‌ అడ్డుపడినట్లు అయిందని, రానున్న కాలంలో మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. ఉద్యోగులకు ఉన్న చిన్నపాటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. విద్యుత్తు ఉద్యోగులకు అసాధారణంగా ఫిట్‌మెంట్‌ అందించారని గుర్తుచేశారు. పర్యావరణహితంగా గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని, 4 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి జరుగుతున్నదని తెలిపారు. నవ్విన నాప చేను పండిందన్నట్లుగా భారతదేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని వివరించారు. కేసీఆర్‌ నాయకత్వంలో కోటిన్నర ఎకరాల మాగాణంగా తెలంగాణ మారిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 9 వేలపైకు కొత్త ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. 23 వేల మందిని శాశ్వత ఉద్యోగులుగా మార్చామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులు బండి రమేశ్‌, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌, టీఆర్‌వీకేఎస్‌ అధ్యక్షుడు కేవీ జాన్సన్‌, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టీ రమేశ్‌, సెక్రటరీ కరెంటు రావు, తెలుగునాడు విద్యుత్తు కార్మిక సంఘం అధ్యక్షుడు మహేందర్‌, ప్రధాన కార్యదర్శి ఎంఏ అబీద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌, అర్గనైజింగ్‌ సెక్రటరీ రమేశ్‌, ప్రెసిడెంట్‌ నదీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే నిరుద్యోగభృతి
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు భృతి లభించనున్నదని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో కలిపి ఇప్పటివరకు 1.31 లక్షల ఉద్యోగాలను కేసీఆర్‌ ప్రభుత్వం భర్తీచేసిందని.. తొందర్లోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.