-నూతన వస్త్రవిధానం రూపొందిస్తున్నాం.. -కేంద్రం చేయూతనివ్వాలి.. -టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇవ్వండి -మెగా పవర్‌లూమ్ క్లస్టర్లను ఏర్పరచండి.. -రాష్ట్ర టెక్స్‌టైల్ మంత్రుల సమావేశంలో కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగాభివృద్ధికి విశేషంగా కృషి జరుపుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఒక నూతన రాష్ట్రంగా తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అండదండలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన వివిధ రాష్ర్టాల చేనేత అభివృద్ధి శాఖ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
చేనేత, జౌళి రంగాలపై కేంద్రం రూపొందించనున్న నూతన విధానానికి సంబంధించి వివిధ రాష్ర్టాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ చేనేత రంగ విశిష్టతను వివరించారు. దేశంలో తెలంగాణ చేనేత పేరెన్నికగన్నదని, ఇక్కడి పోచంపల్లి, గద్వాల, నారాయణపేట తదితర వస్ర్తాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో సైతం వస్త్ర విధానాన్ని రూపొందిస్తున్నామని, దాన్ని దేశమంతా మెచ్చే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేనేత పరిశ్రమ విస్తరించి ఉందని, లక్షలమంది ఈ రంగం మీద ఉపాధి పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ముందుకు వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలోనే కాకుండా ఈ రంగంలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించడంలో కూడా రాష్ట్రం ఆదర్శనీయంగా ఉందని అన్నారు. ఈ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలను అందించాలని కోరారు. జౌళి రంగంలో ప్రపంచం మొత్తానికే భారతదేశం హబ్‌గా మారబోతోందని, ఇందులో తెలంగాణ పాత్ర కూడా గణనీయంగా ఉంటుందని అన్నారు.
కేంద్రానికి కేటీఆర్ విన్నపాలు.. -వరంగల్‌లో జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక స్పిన్నింగ్ మిల్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకు 50 ఎకరాల స్థలాన్నితెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. -హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, హాండ్‌లూమ్ ఎగుమతి ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేయాలి. -గద్వాలలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాండ్‌లూమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలి.
-సిరిసిల్లలో మోడిఫైడ్ కాంప్రహెన్సివ్ పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద మెగా క్లస్టర్, పవర్‌లూమ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలి. పాత రకం పవర్‌లూమ్ యంత్రాల స్థానంలో సెమీ ఆటోమేటిక్ యంత్రాలను సమకూర్చుకోడానికి రూ. 1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడానికి కొత్త స్కీమ్‌ను రూపొందించాలి. -సమగ్ర హ్యాండ్‌లూమ్ అభివృద్ధి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 14 క్లసర్లు, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో మెగా పవర్‌లూమ్ క్లసర్లు ఏర్పాటు చేయాలి.