Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మా టెక్స్‌టైల్‌కు శక్తినివ్వండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

-మౌలిక వసతుల్లో బంగ్లాదేశ్‌, లంక కంటే వెనుకే
-ఇలా అయితే మేక్‌ ఇన్‌ ఇండియా పరిస్థితేంటి?
-మేం సొంతంగానే నేతన్నకు గొప్ప శక్తినిస్తున్నాం
-రాష్ట్రం చేసినప్పుడు కేంద్రం ఎందుకు చేయలేదు?
-వచ్చే బడ్జెటే మోదీ సర్కారుకు చివరి పూర్తి బడ్జెట్‌
-అందులోనైనా టెక్స్‌టైల్‌ రంగానికి ఊతమివ్వండి
-కేఎంటీపీకి 900 కోట్లు రూపాయలు ఇవ్వండి
-సిరిసిల్ల పవర్‌లూంకు 100 కోట్లు కేటాయించండి
-ఐఐహెచ్‌టీ, ఎన్‌టీఆర్‌ఐ, హెచ్‌ఈపీసీ ప్రకటించండి
-కేంద్రప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

తెలంగాణ నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్‌లో అయినా తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. మోదీ సర్కారుకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ అని, వచ్చే ఏడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే ఉంటుందని గుర్తుచేసిన కేటీఆర్‌, ఇప్పటికైనా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. రానున్న బడ్జెట్‌లో టెక్స్‌టైల్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రి కేటీఆర్‌ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.

మంత్రులు మారినా తీరు మారలే..
కేంద్రంలో మంత్రులు మారినా తెలంగాణకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం తీరు మాత్రం మారలేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఎనిమిదేండ్లుగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అందిన ప్రోత్సాహమేదీ లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ‘భారతదేశ టెక్స్‌టైల్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందాలంటే భారీగా మౌలిక వసతుల కల్పన అవసరం. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటుచేస్తున్నది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. దేశీయ టెక్స్‌టైల్‌ రంగంలో ఈ పారుకు ఉన్న ప్రాధన్యతను కేంద్రం గుర్తించాలి. ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో మౌలిక వసతుల కల్పన కోసం నిధులివ్వాలని కేంద్రాన్ని అనేకసార్లు అభ్యర్థించినా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. సుమారు రూ.1,600 కోట్లతో చేపట్టిన ఈ భారీ టెక్స్‌టైల్‌ పార్కుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నది. ఇందులో మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్‌లో కనీసం రూ.900 కోట్లు కేటాయించాలి’ అని కోరారు.

తెలంగాణకు ఐఐహెచ్‌టీ ఇవ్వాలి
రాష్ట్రంలో పవర్‌లూం పరిశ్రమతోపాటు చేనేత పరిశ్రమకు కూడా అత్యంత ప్రాధాన్యం ఉన్నదని, సుమారు 40 వేల చేనేత కార్మికులు పని చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. యాదాద్రి భువనగిరి, గద్వాల, వరంగల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) సంస్థను మంజూరు చేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత కళపై డిప్లొమా చేసేందుకు ఇక్కడి విద్యార్థులకు అవకాశం లేదని, వీరంతా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారని గుర్తుచేశారు. ఐఐహెచ్‌టీని కేటాయిస్తే ఇక్కడి విద్యార్థులకు అనుకూలంగా ఉండటంతోపాటు చేనేత పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందుకోసం మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థలం కూడా అందుబాటులో ఉన్నదని గుర్తుచేశారు. తెలంగాణకు నేషనల్‌ టెక్స్‌టైల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌టీఆర్‌ఐ), హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (హెచ్‌ఈపీసీ)ను వచ్చే బడ్జెట్‌లో ప్రకటించాలని కోరారు. నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ద్వారా బ్లాక్‌ లెవెల్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్లను మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు.

కేంద్రానిది ప్రగతి నిరోధక పాత్ర
టెక్స్‌టైల్‌ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న తెలంగాణకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టెక్స్‌టైల్‌ రంగాన్ని కాపాడుకొంటున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల పట్ల కేంద్రం ప్రగతి నిరోధక పాత్ర పోషిస్తున్నదని గత బడ్జెట్‌ కేటాయింపులను చూస్తే అర్థమవుతుందని విమర్శించారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి భారీగా నిధులు కేటాయించి నేతన్నలపట్ల నిబద్ధత చాటుకోవాలని సూచించారు. గత ఏడు సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న చేనేత, టెక్స్‌ టైల్‌ విధానాలను పునర్‌ సమీక్షించుకోవాలని కేటీఆర్‌ కోరారు. ‘కేంద్రం రద్దు చేసిన నేత కార్మికుల పొదుపు పథకం, ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌, పవర్‌ లూం, హాండీక్రాప్ట్‌ బోర్డులను తిరిగి ఏర్పాటు చెయ్యాలి. వర్‌ కం ఓనర్‌ షెడ్‌ పథకాన్ని పునరుద్ధరించి నేత కార్మికులు తమ కాళ్లపై తాము నిలబడేలా సహకారం అందించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా యార్న్‌ సబ్సిడీని కనీసం 50 శాతానికి పెంచాలి. మార్కెటింగ్ ఆధారిత ఇన్సెంటివ్‌ పథకాన్ని సరళతరం చేసి నేతన్నలకు అండగా నిలబడేలా బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలి. నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచే బీమా యోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలి’ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

జీఎస్టీని ఉపసంహరించాలి
చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ‘గ్రామీణ ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించి, దేశ వారసత్వ చరిత్రను ప్రపంచ పటంపై ఘనంగా ఆవిష్కరించే చేనేతను కేవలం ఒక పరిశ్రమగా కాకుండా దేశ సంసృతి, సంప్రదాయంగా చూడాలి. గాంధీ మహాత్ముని ఆలోచనల మేరకు చేనేత రంగానికి పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాలి. దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే టెక్స్‌టైల్‌, చేనేత రంగానికి అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాలి. ఈ దిశగా పరిశ్రమ వర్గాలు, నేతన్నలతో వెంటనే కేంద్రం సంప్రదింపులు జరపాలి. దేశంలో హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్‌ పరిశ్రమ సుమారు 80 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లుగానే ఉన్నది. అధిక పన్నుల భారంతో ఇప్పటికే ఎంఎస్‌ఎంఈల మనుగడ కష్టంగా మారింది. ఈ విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించి, పరిశ్రమకు బడ్జెట్‌లో ప్రోత్సాహక చర్యలు ప్రకటించాలి. ప్రస్తుతమున్న రూ.20 లక్షల జీఎస్టీ స్లాబ్‌ను చేనేత, పవర్‌లూం కార్మికులకు రూ.50 లక్షలకు పెంచాలి’ అని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ప్రోత్సాహకాలు లేనందునే బంగ్లాదేశ్‌, శ్రీలంక కన్నా వెనుకబాటు
కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవటం, పాలసీ ప్రోత్సాహకాలు లేకపోవడం వంటి కారణాల వల్లే టెక్స్‌టైల్‌ రంగంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి చిన్న దేశాలకంటే మనదేశం వెనుకబడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చిన్న దేశాలతో పోటీ పడేందుకు కూడా కేంద్రానికి ఎనిమిదేండ్ల కాలం సరిపోలేదా? అని ప్రశ్నించారు. ‘అంతర్జాతీయంగా గొప్ప పేరున్న కిటెక్స్‌ సంస్థ దేశాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధపడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులాంటి మౌలిక వసతులు, పాలసీ ప్రోత్సాహకాల వల్ల చివరిక్షణంలో దేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించిన మాట వాస్తవం. రాష్ట్రంగా ఏర్పడిన ఐదేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం టైక్స్‌టైల్స్‌లో అంతర్జాతీయంగా పోటీపడేలా భారీ మౌలిక వసతుల కల్పిస్తే, బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో ఇలాంటి ప్రయత్నం ఒక్కటి కూడా చేయకపోవటం బాధాకరం. ఇలాంటి విధానాలతో కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా అనేది ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతుంది. టెక్స్‌టైల్‌ రంగంలో అంతర్జాతీయ సంస్థలను మనదేశానికి రప్పించడంలో మోదీ సరారు పూర్తిగా విఫలమైంది’ అని కేటీఆర్‌ విమర్శించారు.

సిరిసిల్ల పవర్‌లూమ్‌ క్లస్టర్‌కు రూ.100 కోట్లు ఇవ్వండి
నేతన్నలకు భవిష్యత్తుపైన భరోసా కల్పించేందుకు ‘కాంప్రహెన్సివ్‌ పవర్‌లూమ్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ సీం’లో భాగంగా సిరిసిల్లలో భారీ పవర్‌లూం క్లస్టర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి ఆ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. మెగా పవర్‌లూం క్లస్టర్‌కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వరర్‌ టు ఓనర్‌ సీం, టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. 5 వేలకుపైగా పవర్‌లూమ్‌ మగ్గాలుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు అందించాలని నిబంధనలు చెప్తున్నాయని, సిరిసిల్ల పవర్‌లూం క్లస్టర్‌లో 25 వేలకుపైగా పవర్‌లూం మగ్గాలున్నందున దీనిని మెగా పవర్‌లూం క్లస్టర్‌గా గుర్తించి కేంద్ర బడ్జెట్‌లో కనీసం రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. ‘సిరిసిల్ల మరమగ్గాల ఆధునీకరణ, వ్యాల్యూ చైన్‌ బలోపేతం, మారెట్‌ అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్‌, ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ వంటి పనుల కోసం సుమారు రూ.990 కోట్లు అవసరం. ఇందులో సింహభాగం మోదీ సర్కారు వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలి. దీనితోపాటు ఇన్‌ సిటూ పవర్‌లూం అప్‌గ్రెడేషన్‌ కార్యక్రమం కింద మరో 13 వేల మరమగ్గాల అధునీకరణకు నిధులు కేటాయించాలి’ అని విజ్ఞప్తిచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.