-పుష్కరం కిందటి మొక్కు చెల్లించిన ముఖ్యమంత్రి -ఆలయ విస్తరణకు స్థలం కేటాయిస్తానని హామీ -అక్కన్న, మాదన్న ఆలయంలోనూ ప్రత్యేక పూజలు

లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బంగారు బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని ఆలయానికి బంగారు బోనం ఎత్తుకుని వచ్చిన ముఖ్యమంత్రి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ కమిటీ, నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్కరం కిందటి మొక్కును సీఎం చెల్లించారు. 2002లో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్, తెలంగాణ ఏర్పాటైతే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నారు. ఇప్పుడు స్వరాష్ట్ర స్వప్నం సాకారమవడంతో తెలంగాణ రాష్ట్రంలో మహంకాళి అమ్మవారి తొలి బోనాల పండుగ రోజే మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్‌ను శాలువా కప్పి సత్కరించారు. అమ్మవారి విగ్రహంతో కూడిన మెమొంటోను అందజేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కూడా సన్మానించారు. అనంతరం ఆలయ చరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం కేసీఆర్ తిలకించారు.
అమ్మగుడి అమ్మే కట్టుకుంటుంది.. మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు విస్తరణకు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సింహవాహిని ఆలయాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామన్నారు. అమ్మవారి గుడిని అమ్మే నిర్మించుకుంటుందని, కేవలం మానవమాత్రులుగా మనవంతు ప్రయత్నం చేయాలన్నారు. ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బోనాల పండుగను భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరుపుకోవడంతెలంగాణ సంస్కృతికి చిహ్నమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అమ్మవారి బోనాల పండుగకు హాజరై, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నానని, ఇప్పుడు ఆ మొక్కు చెల్లించానని చెప్పారు.