Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కుట్రలను అడ్డుకోండి

తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం విద్యుత్ వివాదం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్న సీఎం వివిధ అంశాలను ఆయనకు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ, విద్యుత్ ఉత్పత్తిపై సాగుతున్న వివాదంపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ వాదనలను పూర్వపక్షం చేసే అనేక జీవోలు, నిబంధనలు ఉటంకిస్తూ పలు అంశాలను నరసింహన్‌కు కేసీఆర్ విడమరిచి చెప్పారు. సీలేరునుంచి శ్రీశైలం దాకా ఏపీ సర్కారు జరిపిన నిబంధనల ఉల్లంఘనలను సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు విశదీకరించారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను తూచా తప్పకుండా పాటించేలా ఏపీ సర్కారును ఆదేశించాలని ఆయన కోరారు.

KCR-with-Governor-Narsimhan

– సీలేరునుంచి శ్రీశైలం దాకా అన్నీ ఉల్లంఘనలే.. -న్యాయమైన వాటా ఇప్పించండి – కరెంటు కాజేశారు, నీరు తోడేశారు -మాపైనే దుష్ప్రచారం చేస్తున్నారు -దొంగే దొంగ అన్నట్టు ఏపీ తీరు -గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ బైఠక్ -ఏపీ సర్కారు తీరుపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు దొంగే దొంగ అన్నట్టు..: ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవోలు, విభజన చట్టంలో పేర్కొన్న వివిధ అంశాలు, నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏపీ సర్కారు దొంగే దొంగ.. దొంగ అన్నట్లు తమపై దుష్ప్రచారానికి దిగిందని కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్‌తో అన్నట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు, విద్యుత్ వాటాల వివరాలను ఆధారాలు, జీవోలతో సహా గవర్నర్‌కు వివరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని తెలంగాణకు న్యాయమైన వాటాను ఇచ్చేలా ఏపీ ప్రభుత్వానికి సూచనలివ్వాలని కోరినట్లు తెలిసింది.

కృష్ణా జలాల్లో తెలంగాణకు 261 టీఎంసీలు కేటాయించారని, ఇందులో 184.9 టీఎంసీలు నికర జలాలు కాగా, 75.67 టీఎంసీలు మిగులు జలాలుగా ఉన్నాయని సీఎం గవర్నర్‌కు వివరించారు. గతంలో జారీచేసిన జీవో 69 ప్రకారం శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం వరకూ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని, 2005లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలించుకుపోయేందుకు జీవో107ను జారీచేశారని తెలిపినట్లు సమాచారం.

నీరంతా తరలించుకున్నారు..: వాస్తవంగా రాయలసీమకు కృష్ణా జలాల్లో వాటాగా శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా 19 టీఎంసీలు, తెలుగుగంగ ద్వారా 15 టీఎంసీలు మొత్తం 34 టీఎంసీలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని కేసీఆర్ గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. వాటన్నింటినీ బేఖాతరు చేసి ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీటిని వాడుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన గవర్నర్ దృష్టికి తెచ్చారు. అయినా తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు ఆంధ్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని సీఎం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వర్షాభావం వల్ల తెలంగాణలో ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం వివరించారు.

విద్యుత్ వాటా ఎగ్గొట్టారు.. : రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం విద్యుత్‌లో తెలంగాణకు 54% వాటా రావాలని నిర్దేశించినా కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి తెలంగాణకు రావాల్సిన వాటాను ఏపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందని ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. సీలేరు నుంచి తెలంగాణకు రావాల్సిన 291 యూనిట్లను చంద్రబాబు కుట్రల వల్ల తెలంగాణ కోల్పోయిందని, వీటన్నింటి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కొరతతో నానా ఇబ్బందులు పడుతుంటే చాలదన్నట్టు న్యాయపరంగా, చట్టపరంగా శ్రీశైలం నుంచి ఉత్పత్తి చేసుకోవాల్సిన జల విద్యుత్‌ను ఆపి వేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు లేఖలు రాస్తూ, రాద్దాంతం చేస్తున్నారని వివరించినట్లు తెలిసింది. జీవోలను, నిబంధనలను, విభజన చట్టాలను ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపైనే నిందలు వేస్తున్నదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గవర్నర్‌కు వివరించారు. వెంటనే స్పందించి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.