-ఎత్తిపోతలను అడ్డుకునేందుకు బాబు లేఖ రాస్తేనే.. కేంద్ర ప్రభుత్వం సంజాయిషీ కోరింది -టీడీపీ నేతలు ఎవరి పక్షం?..చేతనైతే అనుకూల లేఖ ఇప్పించండి -ఏపీలో పట్టిసీమకు ప్రాజెక్ట్‌కు అనుమతి తీసుకున్నారా? -అఖిలపక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

కృష్ణా నది నీళ్లు పాలమూరు జిల్లా ప్రజల హక్కు అని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా పూర్తి చేసి తీరేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లోని సాయిగార్డెన్స్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, వైసీపీతోపాటు అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ చంద్రబాబు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు సీడబ్ల్యూసీకి లేఖ రాశారని, దీంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరిందన్నారు. వాస్తవం ఇలా ఉంటే ప్రాజెక్టు రిపోర్టు మాత్రమే చంద్రబాబు కోరారని టీడీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. కృష్ణా నీళ్లు జిల్లా ప్రజల హక్కన్నారు. పాలమూరును అడ్డుకుంటున్న బాబుకు.. ఆంధ్రాలో అనుమతి లేని పోతిరెడ్డిపాడు, పట్టిసీమ, కండలేరు, గాలేరు నగరి ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులు ఎలా కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలు లెటర్‌హెడ్‌పై తెలంగాణ రాష్ట్రం అని రాసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని దెప్పిపొడిచారు. టీడీపీ నేతలు పాలమూరు, తెలంగాణ ప్రజల పక్షం వహిస్తారా, ఆంధ్రా ప్రభుత్వం వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. టీడీపీ నేతలకు చేతనైతే బాబు చేత పాలమూరు ప్రాజెక్టుకు అనుకూలంగా లేఖ ఇప్పించాలని సవాల్ విసిరారు. కేఎల్‌ఐ, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడులతో పాటు పాలమూరు ద్వారా జిలాల్లో 17లక్షల ఎకరాలు సాగవుతాయనే బాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. కేఎల్‌ఐ ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందిస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 1993నుంచి 2004వరకు జిల్లాలోని ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో రూ.10కోట్లు కూడా ఖర్చు చేయలేదని పునరుద్ఘాటించారు. దీన్ని మరుగునపడేసి నోటికొచ్చినట్లు మాట్లాడి అదే వాస్తవమని మభ్యపెట్టే మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మనిషి తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే ముందుకొచ్చి మూడున్నర కోట్ల ప్రజలను ఉద్యమంలోకి తీసుకొచ్చి రాష్ట్రం సాధించగలిగారని గుర్తుచేశారు.
అదే అకుంఠిత దీక్షతో ప్రాజెక్టులను పూర్తి చేయడం ఖాయమన్నారు. మీసాలు తిప్పుతున్న, తొడలు కొడుతున్న టీడీపీ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రమణ, రేవంత్‌రెడ్డిలకు తెలంగాణ పౌరుషముంటే పాలమూరు ప్రాజెక్టుకు అనుకూలంగా చంద్రబాబుతో లేఖ ఇప్పించాలని మరోసారి సవాల్ విసిరారు.
తెలంగాణ పారిశ్రామిక విధానం భేష్ -పంజాబ్ పారిశ్రామికశాఖ మంత్రి మదన్‌మోహన్ మిట్టల్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ఎంతో బాగుందని పంజాబ్ పారిశ్రామిక,వాణిజ్యశాఖ మంత్రి మదన్‌మోహన్ మిట్టల్ అభినందించారు. పంజాబ్ మంత్రి నేతృత్వంలో ఆ రాష్ట్ర పరిశ్రమలశాఖ సెక్రటరీ, డైరెక్టర్ ఎస్‌ఆర్ లధర్, జేడీ కేఎస్‌బార్‌తో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును గురువారం సచివాలయంలో కలిసింది. రాష్ట్రంలో అమలవుతున్న టీఎస్‌ఐపాస్ తీరుతెన్నులను, పారిశ్రామికీకరణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను జూపల్లి వివరించారు. హైదరాబాద్‌లో పర్యటించనున్న పంజాబ్ ప్రతినిధి బృందం ఇండస్ట్రీయల్ పాలసీపై అధ్యయనంతోపాటు సాఫ్ట్‌వేర్, ఐటీ పార్కులను సందర్శించనుంది.