Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కొత్తగా భీమ్ జిల్లా

-రూ.25 కోట్లతో స్మారక కేంద్రం -ప్రపంచమంతా దర్శించుకునే ఏర్పాట్లు -గిరిజన యూనివర్సిటీకి భీమ్ పేరు -వచ్చే వర్ధంతి గిరిజన మ్యూజియంలోనే -హైదరాబాద్‌లో ఆదివాసీ భవన్, బంజారాభవన్ -ఆ గోండు వీరుడు నా గుండెల్లో కొలువై ఉన్నారు -ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం -జోడేఘాట్‌ను చరిత్రలో నిలబెడుతాం -పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం -కొమురం భీమ్ వర్ధంతి సభలో సీఎం కేసీఆర్ -గోండు వీరుడికి ఘనంగా నివాళి -పోటెత్తిన గిరిజనులు.. జనసంద్రంలా జోడేఘాట్

KCR-addressing-Public-in-Komuram-Bheem-Vardhanthi-at-Jodeghat3

క్రాంతికారుడు, గోండువీరుడు కొమురం భీమ్ నా గుండెల్లో కొలువై ఉన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడిపాను. ఎంత వారించినా అందుకే ఆయన వర్ధంతికి వచ్చి నివాళులర్పించాను అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో బుధవారం కొమురం భీమ్ 74వ వర్ధంతి సభను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో గిరిజనులు హాజరుకావడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ఈ కార్యక్రమానికి స్వయానా ముఖ్యమంత్రి హాజరుకావడంతో గిరిజనుల సంతోషానికి పట్టపగ్గాల్లేకుండాపోయినై. జల్.. జంగల్.. జమీన్‌ కోసం కొట్లాడిన పోరుగడ్డకు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి.. భీమ్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం దర్బార్ వేదికపై చరిత్రాత్మక ప్రసంగం చేశారు.

కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు కొమురం భీమ్ పేరు పెడతామని ప్రకటించారు. భీమ్ వారసుల అభ్యున్నతికి పాటుపడుతానని హామీ ఇచ్చారు. వచ్చే వర్ధంతినాటికి జోడేఘాట్ రూపు రేఖలు పూర్తిగా మార్చివేస్తానని ఆదివాసుల హర్షధ్వనాల మధ్య సీఎం ప్రకటించారు. సీమాంధ్ర ప్రభుత్వాలు భీమ్ చరిత్రను మరుగున పడేశాయని ఆవేదన చెందారు. ఇప్పుడలాంటి పరిస్థితి ఉండదని భరోసా ఇచ్చారు. నేను జోడేఘాట్‌కు రావడం ఇదే మొదటిసారి కాదు.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు భీమ్ మనవడు సోనేరావు నన్ను కలిశిండు. మా తాతలాగే మీరూ ఉద్యమిస్తున్నారని చెప్పిండు. తెలంగాణ జెండా భుజానేసుకుని నా వెంట నడిశిండు. 2008ల భీమ్ వర్ధంతికి ఇక్కడికి వచ్చిన. సీమాంధ్ర పాలనలో భీమ్‌కు గుర్తింపు దక్కలేదని అప్పుడే అనిపించింది. న్యాయంకోసం, హక్కులకోసం, ఆదివాసి గిరిజనులకోసం భీమ్ తన రక్తాన్ని ధారవోసిన నేల ఎంతటి నిర్లక్ష్యానికి గురవుతున్నదో నేనర్థం చేసుకున్న. సమైక్య రాష్ట్రంలో సరైన గుర్తింపు లేకపోవడంపై బాధపడ్డా. ఆ బాధ ఇగ అయిపోయింది.

మన రాష్ట్రం మనకొచ్చింది. సోయి ఉన్న బిడ్డలే రాజ్యాధికారానికి వచ్చిన్రు. ఆ అధికారాన్ని మీరే అప్పగించిన్రు. ఆదిలాబాద్ అడవి బిడ్డలైన అక్కలు, చెల్లెల్లు, అన్నదమ్ములు ఏకపక్షంగా తీర్పు ఇచ్చి, టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చిన్రు. రాష్ర్టాన్ని బాగుచేయాలని హుకుం జారీ చేసిన్రు.

అందుకే భీమ్ వర్ధంతి బాధ్యతను సర్కారు తీసుకుంది అని కేసీఆర్ చెప్పారు. భీమ్ బలిదానం చేసిన జోడేఘాట్‌ను చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దుత. రూ.25 కోట్లతో అద్భుతమైన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయిస్త. ఈ అద్భుతం చరిత్రలో నిలిచిపోవాలె. ప్రపంచంలో ఎవరికైనా దీనిని చూసిపోవాలనిపించాలె. ఆర్కిటెక్ ఇంజినీర్లను పంపి అంత గొప్పగా డిజైన్ చేయిస్త అని ఉద్వేగభరితంగా ప్రకటించారు. రాబోయే కొద్దిరోజుల్లోనే ఈ స్మారక చిహ్నానికి శంకుస్థాపన చేసుకుంటం. హైదరాబాద్ వెళ్లగానే నిధులు విడుదల చేయిస్త.

భీమ్ కుటుంబాన్ని ఇన్నాళ్లు సమైక్య ప్రభుత్వాలు పట్టించుకోలె. ఈ కుటుంబం దీనస్థితి నాకు తెలుసు. ఇపుడట్లా నడవదు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన భీమ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్న. సోనేరావు కొడుకు, బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ రాష్ట్రమే కాదు.. ప్రపంచమే గుర్తుంచుకునేలా తీర్చిదిద్దుత. అద్భుతమైన అభివృద్ధి చేసి చూపుత అని హామీ ఇచ్చారు.

భీమ్ స్మారక స్థలంగా ఉన్న 8.25 ఎకరాల భూమితోపాటు చుట్టుపక్కల అసైన్ చేసిన మరో వంద ఎకరాలు సేకరించి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుత. గిరిజన యూనివర్సిటీకి భీమ్ పేరు పెడుతం. తెలంగాణకు కాశ్మీర్‌లాంటి ఆదిలాబాద్‌లో ఎత్తయిన కొండలు, అంతుతెలియని లోయలు, అందమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయ్. వీటన్నింటినీ అద్భుతమైన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్త. జోడేఘాట్ ఇక మారుమూల ప్రాంతం కాదు.

Public-Meeting

పర్యాటక కేంద్రమైతది. హట్టీనుంచి జోడేఘాట్‌వరకు రెండు లైన్ల బీటీరోడ్డు మంజూరు చేస్తున్న. హైదరాబాద్ వెళ్లగానే నిధులు విడుదల చేయిస్త. త్వరలో ఏర్పడే కొత్త జిల్లాకు కొమురం భీమ్ పేరు పెడ్తం. ఎకరం రూ.100కోట్లయినా సరే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రెండెకరాల భూమి కొని, ఒకదానిలో ఆదివాసీ భవన్, మరొకదానిలో బంజారాభవన్ నిర్మాణం చేస్తం అని ఆదివాసీల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆదివాసీల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని కేసీఆర్ చెప్పారు. సమతుల్య ఆహారం తీసుకునే విధంగా వారిలో చైతన్యం రగిలించేందుకు 500 కళాబృందాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయిస్తాననీ, ఆదిలాబాద్ జిల్లాలో ఈ రకంగా 20 బృందాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.

బృందాల్లో ఉండే కళాకారులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ నేను ఇందాక హెలికాప్టర్‌లో వస్తూ జిల్లాను పరిశీలించాను. అడవిలో అందమైన పల్లెలివి. వీటికి తాగునీరు, రోడ్లు, విద్యుత్‌వంటి మౌలిక సదుపాయాలు లేవు. ప్రతి గూడేన్ని, తండాను పంచాయతీగా గుర్తిస్తాం. పంచాయతీలకే సర్వాధికారాలు ఇస్తున్నాం. ప్రజలు అనారోగ్యాల పాలుకాకుండా చూసుకునే అధికారాలు, నిధులు ఇస్తాం.

ఇక వ్యాధులపై పోరాటం తప్పదు అని కేసీఆర్ అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల నీళ్లను తొలుత ఆదిలాబాద్ జిల్లా తాగునీటి అవసరాలకు ఇచ్చిన తర్వాతే బయటకు తీసుకెళతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, దేశపతి శ్రీనివాస్, జిల్లా ఎంపీ జీ నగేశ్, కలెక్టర్ జగన్మోహన్, పీవో ప్రశాంత్ పాటిల్, జిల్లాలోని ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, రేఖాశ్యాంనాయక్, విఠల్‌రెడ్డి, దివాకర్‌రావు, రాథోడ్ బాపూరావ్, దుర్గం చిన్నయ్య, ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ జిల్లాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు లోక భూమారెడ్డి, పురాణం సతీశ్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్‌రావ్, కొమురం భీమ్ స్మారక సమితి అధ్యక్షుడు రుద్ర శంకర్, భీమ్ మనువడు కొమురం సోనేరావ్, ప్రజాగాయిని విమలక్క తదితరులు భీమ్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భీమ్ త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

భీమ్ చరిత్ర పుస్తకం ఆవిష్కరించిన మంత్రి భీమ్ జీవితచరిత్ర, జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతిపై ప్రముఖ రచయిత ధ్యావనపల్లి సత్యనారాయణ రాసిన పుస్తకాన్ని మంత్రి జోగు రామన్న, ఎంపీ నగేశ్ ఉట్నూర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భీమ్ త్యాగాలను ప్రజలకు తెలియజేసేలా పుస్తకంరాసిన రచయితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖ, కలెక్టర్ జగన్మోహన్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు భూమారెడ్డి, మెస్రం గంగారాం, విద్యార్థి సంఘంకన్వీనర్ సోయం భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనుకున్న సమయానికంటే పది నిమిషాలు ముందే 12.55 గంటలకు కేసీఆర్ జోడేఘాట్‌కు వచ్చారు. సీఎంతోపాటు హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, సీఎంవోలో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ కూడావచ్చారు. నేరుగా కొమురం భీమ్ సమాధి వద్దకు వెళ్లిన సీఎం.. అక్కడ శ్రద్ధాంజలి ఘటించారు. ఆధునీకరించిన స్మారక చిహ్నాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ మరో విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఊట్నూర్ ఐటీడీఏ ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం రూ.60 లక్షలతో నిర్మించ తలపెట్టిన గిరిజన మ్యూజియం పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమాలన్నీ ముగించుకుని మధ్యాహ్నం 2.40 గంటలకు హైదరాబాద్ వెళ్లారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.