Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కొత్త భూసేకరణ చట్టం

తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త భూసేకరణ చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నది. భూసేకరణ, పునరావాస చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూమికోల్పోయేవారికి ఆసరాగా నిలిచేలా కొత్త చట్టం ఉండాలని అధికారులకు నిర్దేశించారు. మానేరు డ్యామ్ నిర్మించిన సందర్భంగా స్వయంగా తమ కుటుంబం కూడా ఎంతో విలువైన భూమిని కోల్పోయిందని గుర్తు చేసుకున్న సీఎం.. భూమి కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు.

KCR Review on Land Aquisitionనిర్వాసితులపై అత్యంత మానవత్వంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సాధ్యమైనంత ఎక్కువ పరిహారం చెల్లించే అంశంపై సమీక్ష సందర్భంగా చర్చ జరిగింది. ఇదిలాఉంటే.. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న రుణమాఫీలో బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చే విషయంలో కొంత సంశయిస్తున్నాయని, రైతులకు కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు సూచించాలని ముఖ్యమంత్రి ఆయనను కోరారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అభినందించిన రాజన్.. రిజర్వు బ్యాంకు పరిధిలో ఉన్నంతమేరకు సహాయం అందించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మరో కార్యక్రమంలో నగరంలోని హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన అంశాన్ని సీఎం సంబంధిత అధికారులతో చర్చించారు. ఒకప్పుడు మంచినీటి చెరువుగా భాసిల్లిన హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పారు. గణేష్ విగ్రహాల నిమజ్జనంకోసం ప్రత్యామ్నాయంగా ఇందిరాపార్క్‌లో 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో సరస్సును నిర్మించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.

కొత్త భూసేకరణ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఆ చట్టం భూమి కోల్పోయేవారికి ఆసరాగా ఉండాలన్నారు. భూసేకరణ, పునరావాస చట్టంపై సీఎం బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర భూ సేకరణ, పునరావాస చట్టాన్ని, వివిధరాష్ర్టాలు భూసేకరణలో అమలు చేస్తున్న నిబంధనలను ఆయన సమీక్షించారు.

భూమిని సేకరించే క్రమంలో నిర్వాసితులపట్ల అత్యంత మానవత్వంతో వ్యవహరించాలని, పునరావాస ప్యాకేజీని వీలైనంత తొందరగా అందించాలని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. మార్కెట్ రేట్లకు, రిజిస్ట్రేషన్ విలువకు చాలా తేడా ఉంటుందని, రిజిస్ట్రేషన్ విలువకన్నా ఎక్కువ మొత్తాన్ని నిర్వాసితులకు ఇవ్వాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువకన్నా రెట్టింపు, ఇతర ప్రాంతాల్లో ఒక్కటిన్నర రెట్లు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రెండు రెట్ల విలువఇచ్చే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు ఎక్కువ భూమి కావాల్సి ఉన్నందున, ఎక్కువమంది నిర్వాసితులుంటారని, వారందరి పునరావాసానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నిర్వాసితులతో చర్చించి పరిహారాన్ని నిర్ధారించాలన్నారు.

పరిహారాన్ని ముందే బ్యాంకులో డిపాజిట్ చేయాలని, నిర్వాసితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి రానీయవద్దని కేసీఆర్ చెప్పారు. ఒక్కో పరిశ్రమ స్థాపనకు గరిష్ఠంగా రెండు వేల ఎకరాలను సేకరించటం, ఆహార భద్రతకులోటు రాకుండా 15%లోపే వ్యవసాయ భూములను సేకరించేలా చట్టం రూపొందించే అంశాలను సమావేశంలో చర్చించారు. భూ సేకరణ నిర్వాసితులకు శాపంగా మారకూడదని సీఎం సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు టీ హరీశ్‌రావు, కేటీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ, ముఖ్యకార్యదర్శులు ఎస్‌కే జోషి, రేమండ్‌పీటర్, ప్రదీప్‌చంద్ర, శ్రీదేవి, సీఎం ముఖ్యకార్యదర్శి నర్శింగరావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.