-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఓర్వలేక కక్షసాధింపు -సమస్యలు అధిగమించేలా సీఎం వద్ద సమగ్ర ప్రణాళిక -దశలవారీగా మ్యానిఫెస్టో అమలుచేస్తాం: మంత్రి హరీశ్‌రావు

ఉమ్మడిరాష్ట్రం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని తట్టుకోలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈర్ష్యతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం మెదక్ జిల్లా నంగునూరు మండలంలోని నంగునూరు, గట్లమల్యాల, కొండంరాజుపల్లి, వెల్కటూర్, పాలమాకుల గ్రామాల్లో ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్యరాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా సీమాంధ్ర ప్రాంతాల్లో నెలకొల్పారని, విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ అందకుండా చంద్రబాబు సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ వనరులతో ఆంధ్రాప్రాంతంలో విద్యుదుత్పత్తి చేసి తెలంగాణకు దక్కకుండా చూస్తున్నాడని నిప్పులు చెరిగారు.
మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వకపోవండతో ఇక్కడ విద్యుత్‌కోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో తెలంగాణలో విద్యుత్ సమస్యలు అధిగమించడానికి సమగ్ర ప్రణాళికలను సీఎం కేసీఆర్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్, సోలార్ ద్వారా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలు దష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రకటించిన రుణమాఫీని త్వరలోనే అమలు చేయబోతున్నామన్నారు. బ్యాంకర్లతో ప్రభుత్వానికి ఒప్పందం కుదరగానే ఇచ్చినహామీ మేరకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మండలాల్లో గోదాములు నిర్మిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా రాష్ట్ర అభివృద్ధికి దశలవారీ ప్రణాళికలతో ముందుకు సాగుతామన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధించేవరకు విశ్రమించబోమన్నారు.