చెరువుల పునరుద్ధరణలో ప్రజల మెప్పుపొందుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే చిన్ననీటిపారుదలశాఖ ఏఈలను గుర్తించి వచ్చే ఏడాది కోరుకున్న చోటకు బదిలీ చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హామీ ఇచ్చారు. సోమవారం కరీంనగర్ జెడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మిషన్ కాకతీయపై సమీక్ష నిర్వహించారు.

-మిషన్ కాకతీయలో కష్టపడితే గుర్తింపు -అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆఫర్ -ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం..ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ నిఘా -కబ్జాలకు పాల్పపడితే సహించం: మంత్రి హెచ్చరిక -ఐదుగురు సభ్యులతో కమిటీవేయాలి.. మంత్రి ఈటెల మిషన్ కాకతీయను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆ శాఖాధికారులు పోస్టింగ్ ఉన్న స్థానాల్లోనే నివాసం ఉండాలని అదేశించారు. కష్టపడే అధికారులకు ఏడాది తర్వాత పోస్టింగ్ ఇస్తామని, పనిచేయని అధికారుల జాబితా తయారు చేసి చర్యలు చేపడుతామని హెచ్చరించారు. చెరువుల శిఖం, కట్టుకాల్వల భూములు కబ్జాలకు పాల్పపడితే ఊరుకోబోమన్నారు. చెరువులు, శిఖం భూముల రికార్డులు బయటకు తీయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 46వేల చెరువులు, కుంటలుండగా కరీంనగర్ జిల్లాలో 6,939 ఉన్నాయని, ఐదేండ్లలో ప్రతి చెరువును పునరుద్ధరిస్తామని చెప్పారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణలో 267 టీఎంసీల నీరు వాడుకునే సామర్థ్యం గల చిన్ననీటి వనరులున్నాయని, 26 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చాన్నా రు. కానీ సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో చెరువులు ఉనికి కోల్పోయాయన్నారు. చెరువులకు పూర్వవైభవం కల్పించడానికి ఐదేండ్లలో రూ.22 నుంచి 25వేల కోట్లు ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. తాజా బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించామని, మార్చి 31లోపు వీటిని ఖర్చుచేయాల్సి ఉందన్నారు.
పనులు పారదర్శకంగా చేపట్టాలని, అంచనా నుంచి టెండర్ వరకు, పనుల ఆరంభం నుంచే పూర్తయ్యేవరకు నాణ్యతపై గతానికి భిన్నంగా తనిఖీ ఉంటుందని చెప్పారు. ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలోని 20 మంది అధికారులతో ఇది పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ ఒక విభాగం నిఘా పెడుతుందని తెలిపారు. ఎన్నారైలు తమ గ్రామాల పరిధిలోని చెరువులను పునరుద్ధరించేందుకు ముందుకొస్తున్నారని, ఆ చెరువులకు వారు సూచించిన పేరుపెట్టాలని కోరుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సిద్ధంగా ఉందని, ఎన్నారైలు, దాతలు సూచించిన పేరు పెడుతామన్నారు. మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరాలంటే సర్పంచ్ నుంచి మంత్రి వరకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ చెరువుల పనురుద్ధరణ, వాటి పర్యవేక్షణ నిమిత్తం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తే బాగుటుందని మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి వేములవాడకు వెళ్లి అక్కడ పనులపై సమీక్ష నిర్వహించారు.
రాజరాజేశ్వరస్వామి దేవస్థానం చెరువును బాగుచేసేందుకు రూ.17 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చిన హరీశ్‌రావుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో భారీస్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహం వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. కొతిరాంపూర్ వద్ద జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కట్ల సత్తీశ్ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.