Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కొంగరకలాన్ సభ కీలకం!

-ప్రగతి నివేదనకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
-సభాస్థలిని పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఏర్పాట్లపై సంతృప్తి
-జాతరలా ప్రగతి నివేదన సభ.. ట్రాక్టర్లను అలంకరించుకుని రావాలి
-జిల్లా మంత్రులకు జనసమీకరణ బాధ్యత
-వందకు పైగా సీట్లు గెలుస్తాం సిట్టింగ్‌లందరికి టికెట్లు.. రానివాళ్లకు ప్రత్యామ్నాయం
-ఎన్నికల వేళ 50 రోజుల్లో 100 సభలు
-అన్ని సభల్లో పాల్గొంటానని వెల్లడి
-ఎన్నికలపై నిర్ణయాన్ని సీఎంకే అప్పగించిన నేతలు..
-రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయం: కేసీఆర్
-తెలంగాణభవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్రకమిటీ, టీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ

సెప్టెంబర్ 2న హైదరాబాద్ శివారు ప్రాంతమైన కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభను టీఆర్‌ఎస్ అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నది. చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ సభ.. జాతరలా ఉండాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జాతరకు వచ్చినట్టు వివిధ రూపాల్లో ప్రగతి నివేదన సభకు హాజరుకావాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. రెండోసారీ విజయం టీఆర్‌ఎస్‌దేనని చెప్తూ.. ఇందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వందకుపైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం కొట్లాడేది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీయేనన్న సీఎం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ప్రజలందరూ టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ, టీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతకుముందు కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించి, నేతలకు పలు సూచనలు చేశారు. తెలంగాణ భవన్‌లో తన అధ్యక్షతన జరిగిన సంయుక్త సమావేశంలో మాట్లాడిన సీఎం.. నాలుగేండ్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా పనిచేశారని ప్రశంసించారు.

పండుగ వాతావరణంలో ప్రగతి నివేదన
ప్రగతి నివేదన సభకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, సైకిల్, కారుయాత్రలతో రావాలని కేసీఆర్ సూచించారు. ఒక్కో నియోజకవర్గంనుంచి కనీసం 50 ట్రాక్టర్లలో ప్రజలు తరలిరావాలని, ట్రాక్టర్లను శోభాయమానంగా అలంకరించాలని కోరారు. జన సమీకరణలా కాకుండా పండుగ వాతావరణం కనిపించాలన్నారు. సందడిగా, ర్యాలీలుగా సభకు రావాలని చెప్పారు. ర్యాలీలుగా, ట్రాక్టర్లలో వచ్చేవారు సెప్టెంబర్ ఒకటి సాయంత్రానికే సభాస్థలానికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలన్నారు. ఏడువేల ఆర్టీసీ బస్సులు, ఏడువేల ప్రైవేటు, కాలేజీ, స్కూల్ బస్సులు, ఇతర వాహనాల్లో సభకు రావాలని చెప్పారు. ప్రగతి నివేదన సభను చారిత్రాత్మకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. దూర ప్రాంతాలవారు ముందురోజు సాయంత్రానికే హైదరాబాద్ చేరుకుని, ఇక్కడ వండుకొని తినాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని చెప్తూ.. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు. హైదరాబాద్ పరిసర జిల్లాలవారు పెద్ద సంఖ్యలో వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలకు చెందిన మంత్రులు సమీకరణ బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. వీరికితోడుగా జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమించినట్టు ప్రకటించారు. ప్రగతి నివేదన సభలో ప్రభుత్వం గత నాలుగేండ్లలో చేపట్టిన పథకాల వివరాలన్నింటినీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తానని సీఎం తెలిపారు. ఇప్పటికే ప్రజల్లోకి పథకాలు పెద్ద ఎత్తున తీసుకువెళ్లగలిగామని, ప్రభుత్వ సభల్లోనూ ప్రస్తావించామని చెప్తూ.. మరోసారి పార్టీపరంగా ప్రజలకు వివరించాలనే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సరిహద్దులకు చెందిన నియోజకవర్గాల నాయకులు జన సమీకరణకు పక్క రాష్ట్రాల నుంచి వాహనాలను అద్దెకు మాట్లాడుకోవాలని చెప్పారు. సభ కమిటీల వ్యవహారాలన్నీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహమూద్‌అలీ, కే తారకరామారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చూసుకుంటారని తెలిపారు.

ఎన్నికల వేళ.. 50 రోజుల్లో 100 సభలు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మధ్యాహ్నం ఒకటి.. సాయంత్రం మరోటి.. ఇలా రోజుకు రెండు నియోజకవర్గాల్లో ఈ సభలను నిర్వహిస్తామని, ఈ సభలన్నింటిలోనూ తాను పాల్గొంటానని తెలిపారు. కాగా, ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేసీఆర్‌కే అప్పగిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే స్థితిలో కూడా ప్రతిపక్షపార్టీ లేదన్నారు. సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెప్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చేవరకు నాయకులు, కార్యకర్తలు యథావిధిగా పనిచేయాలని సూచించారు.

సిటింగ్‌లందరికీ సీట్లు
టీఆర్‌ఎస్ సిటింగ్ సభ్యులందరికీ సీట్లు కేటాయిస్తామని కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో సిటింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వబోరంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారమేనంటూ కొట్టిపారేశారు. ఒకవేళ ముగ్గురు లేదా నలుగురికి టికెట్లు ఇవ్వలేని పరిస్థితులుంటే.. వారి గొంతుకోయబోమని, వారిని పిలిచి మాట్లాడి.. ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నామో చెప్తామని తెలిపారు. వారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ తదితర ఏదో ఒక పోస్టు ఇచ్చేలా చూస్తామన్నారు. సెప్టెంబర్‌లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని పునరుద్ఘాటించారు.

మనకంటే భక్తిపరులు ఎవరు?
తెలంగాణ ఏర్పడిన తర్వాత దేవాలయాలు, మసీదులు, చర్చిలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినంతగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వేములవాడకు ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, కానీ.. వేములవాడకు కానీ యాదాద్రికి కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినంతగా మరే ప్రభుత్వమూ చేయలేదని చెప్పారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నామని సీఎం గుర్తుచేస్తూ.. మనకంటే భక్తిపరులు ఎవరు? అని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వాలు సంపాదన మీదనే దృష్టిపెట్టేవని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలనే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నదని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.