రికార్డుస్థాయిలో పదకొండుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రజలపై వరాలు కురిపించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నింటికంటే మిన్నగా.. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన బడ్జెట్ రూపకల్పనలో అందరికీ ఆదర్శంగా ఉండేలా కొత్త పంథాను నిర్దేశించుకున్నారు.
-రికార్డు స్థాయిలో 11 గంటల పాటు క్యాబినెట్ భేటీ -కొత్తపంథాలో బడ్జెట్ -ప్రాథమ్యాల ఖరారు -జిల్లా అభివృద్ధి పత్రాలు -ఇరిగేషన్‌కు 25 వేల కోట్లు -రాష్ట్ర ఆదాయంలో 15% వృద్ధి -ముందస్తు బడ్జెట్ తప్పేమీ కాదు -రాష్ట్ర మంత్రివర్గ సమావేశం -నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ఆదాయంలో ఇప్పటికే 15% వృద్ధి కనిపిస్తున్నందున రాబోయే బడ్జెట్‌కూడా అదేస్థాయిలో ఉండేలా ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల పరిమాణాలను, ప్రాథమ్యాలను మంత్రివర్గం ఖరారు చేసుకుంది. అదే సమయంలో ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కీలక సమస్యలకు చరమగీతం పాడారు. క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించారు.
-18 వేల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ -15,628 టీచర్ పోస్టుల భర్తీ -అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు -మైనారిటీ సంక్షేమ శాఖకు సొంతంగా ఉద్యోగ వ్యవస్థ- పోస్టులు మంజూరు -18 వేల సెలూన్లకు గృహ వినియోగ కరెంటు చార్జీల వర్తింపు -వీధి వ్యాపారులకు రక్షణ, రుణాలు, గుర్తింపు కార్డులు -ట్రాఫిక్ పోలీసులకు అదనంగా 30 శాతం పొల్యూషన్ అలవెన్స్ -గ్రేటర్ పరిధిలో రూ.1200లోపు ఉన్న ఆస్తి పన్ను ఇకపై రూ.101 -15 సంవత్సరాల మంచినీటి బకాయిలు రూ.457కోట్లు రద్దు -వచ్చే విద్యా సంవత్సరం నుంచి 60 మైనారిటీ గురుకులాలు -గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ యూనిట్ వ్యయం రూ.7లక్షలకు పెంపు -హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా 40టీఎంసీల నీటి నిల్వసామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు -నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసే కాంట్రాక్టర్లకు 1.5శాతం ప్రోత్సాహకం -97 అర్బన్ ఆరోగ్య కేంద్రాలు పీహెచ్‌సీల స్థాయికి అప్‌గ్రేడ్ -కొత్తగూడెంలో రిజర్వు పోలీసు బెటాలియన్‌కు 115 ఎకరాలు -వారంలోపే కారుణ్య నియామకాలు పూర్తయ్యేలా కొత్త విధానం -రిటైరైన ఉద్యోగికి విధుల చివరి రోజున ఒకేసారి బెనిఫిట్స్ ప్యాకేజీ -ఒకటి రెండు రోజుల్లో శాఖల వారీగా ప్రణాళిక కేటాయింపుల వెల్లడి -గ్రేటర్ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, సడలింపులు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీగా పెంపు, ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్, బార్బర్ సెలూన్లకు డొమెస్టిక్ కరెంట్ చార్జీల వర్తింపు, కారుణ్య నియామకాల్లో వేగం, రిటైరయ్యే సమయానికే అన్ని రకాల బెనిఫిట్లతో ఒకేసారి ప్యాకేజీ, వీధి వ్యాపారులకు ప్రభుత్వ రక్షణ, వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ అంచనా వ్యయం పెంపు, నగరానికి ప్రత్యేకంగా తాగునీటి రిజర్వాయర్లు.. తదితర అంశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఆయా వర్గాల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ఈ నిర్ణయాలు ప్రకటించిన వెంటనే సచివాలయంలో పలు వర్గాల ప్రజలు, ఉద్యోగులు కేసీఆర్ ఫ్లెక్సీకి అప్పటికప్పుడు క్షీరాభిషేకం చేయడం విశేషం. పకడ్బందీగా బడ్జెట్ రూపకల్పన, పలు వర్గాలపై వరాల వానకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల వివరాలు ఆయన మాటల్లోనే..
ఈ రోజు జరిగిన మారథాన్‌లో సమావేశంలో చర్చ చేసిన అంశం ఏందంటే.. బడ్జెట్ మేకింగ్ అనేది ఇప్పటి వరకు మూస పద్ధతిలో ఉండేది. అనేక కన్ఫ్యూజన్లు.. ఇబ్బందులు..! ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ చుట్టూ అనేక ఇతర శాఖలు తిరగాల్సి వచ్చేది. దీనిపై పెద్ద డిస్కషన్ జరిగింది. అందుకే బడ్జెట్ రూపకల్పనలో కొత్త పంథా అవలంబించాలని నిర్ణయించినం. ఏ శాఖకు నాన్‌ప్లాన్ ఎంత? ప్లాన్ కింద ఎంత డబ్బు వస్తుందనే స్పష్టమైన విధానం రూపకల్పన చేయడం జరిగింది. మంచి పద్ధతిలో రూపకల్పన చేశాం. దీని ముందు జరిగిన అనేక రివ్యూ మీటింగ్‌ల్లో చూసినం. శాఖలవారీగా రాష్ర్టానికి ఎస్వోటీఆర్ (స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ), ఎస్వోఆర్ (స్టేట్ ఓన్ రెవిన్యూ) రెండు రకాల ఆదాయ మార్గాలుంటాయి. మైన్స్, సాండ్‌మైన్స్, అటవీశాఖ ద్వారా వచ్చే ఆదాయం. ఎస్‌వోటీఆర్, ఎస్‌వోఆర్‌ను కలిపి కూడా ఎస్‌వోఆర్ అనే అంటరు. దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో 15% పెరుగుదల ఉంది. అన్ని రంగాల్లో వృద్ధి ఉంది.
వాణిజ్య పన్నులు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్, మైన్స్‌లో కూడా పెరుగుదల ఉంది. ఇది చాలా చక్కగా ఉంది. అందుకే పోయిన సంవత్సరం బడ్జెట్‌పై 15 శాతం పెరుగుదల కచ్చితంగా ఉంటది. దీని మీదనే క్యాబినెట్‌లో చాలా చర్చ జరిగింది. ఎంత పెరుగుతది? ఎక్కడ పంచాలి? ప్రాథమ్య క్రమాలు ఏంది? అనే దానిపై ఫలవంతమైన చర్చ జరిగింది. కార్యక్రమాల అమలులో వేగాన్ని పెంచుతం. టార్గెట్స్ తెలుస్తాయి. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించతలుచుకున్న లక్ష్యాలు రీచ్ అయ్యేలా ఉంటది. ఎప్పుడూ జరుగనంత విపులంగా చర్చ జరిగింది.
క్యాబినెట్ భేటీలోనూ సీఎం కేసీఆర్ రికార్డ్ సుదీర్ఘంగా 11 గంటలపాటు కీలక అంశాలపై చర్చ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పరిపాలనలో ప్రత్యేక ముద్రవేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్యాబినెట్ భేటీ నిర్వహణలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ నిర్వహించని విధంగా 11 గంటలపాటు సుదీర్ఘ మంత్రివర్గ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సచివాలయంలో శనివారం ఉదయం 11.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమతాబ్లాక్‌లో మొదలైన సమావేశం.. సుదీర్ఘంగా సాగి.. రాత్రి 10.30 గంటలకు ముగిసింది. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ఈ భేటీకి మంత్రులతోపాటు తొలిసారిగా ప్రభుత్వ సలహాదారులు సైతం హాజరయ్యారు.
జిల్లా అభివృద్ధి కార్డులు రూపొందిస్తాం ఉదాహరణకు హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 జిల్లాల్లో ఏం చేస్తరు? అప్‌గ్రేడ్ చేస్త్తరా? కొత్త బిల్డింగ్‌లు కడతరా? ఎందుకు? ఎప్పడు? ఏ జిల్లాలో ఎన్ని? అనేది మొత్తం తెలుస్తది. ఏ జిల్లాలో ఏం చేయబోతరనేది అన్ని శాఖలు తమకు కేటాయించిన ప్లాన్ పద్దులో నిర్ణయించుకుంటయి. ఏయే జిల్లాల్లో ఏయే కార్యక్రమాలు చేస్తరనే దానిపై జిల్లా డెవలప్‌మెంట్ కార్డ్ తయారవుతుంది. జిల్లా మంత్రికి, కలెక్టర్‌కు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్‌లా పనిచేస్తది. సీఎం పోయినా దాని మీదే రివ్యూ చేస్తరు. ప్రెస్‌కూడా ప్రశ్నించడానికి అవకాశముంటది. పూర్తి పారదర్శకంగా ఏర్పాటు చేసి, అమలు చేస్తం.
హెయిర్‌కటింగ్ సెలూన్లకు భారీ రాయితీ బీసీ శాఖ వారు ప్రతిపాదన తెచ్చారు. రాష్ట్రంలో 18వేల వరకు హెయిర్‌కటింగ్ సెలూన్లు ఉన్నాయి. వీరికి కమర్షియల్ విద్యుత్ టారిఫ్ వసూలు చేస్తున్నారు. డబ్బా పెట్టుకున్నా కమర్షియల్ చార్జీలే వసూలు చేస్తున్నారు. అందుకే ఇకనుంచి 200 యూనిట్లు వాడే వారివద్ద కమర్షియల్ నుంచి డొమెస్టిక్ చార్జీలే వసూలు చేస్తారు. రూ.144కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. దీనిని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది.
వీధి వ్యాపారులకు సర్కారు రక్షణ హాకర్స్.. ఫుట్‌పాత్‌ల మీద చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారిని పోలీసులు కొడుతున్నారు.. వేధిస్తున్నరు. కేంద్ర ప్రభుత్వం యాక్ట్ మేరకు వారికి రక్షణ కల్పించడం, లోన్లు ఇవ్వడం, నిర్ణీత స్థలాలు చూపించడం, వారికి వేధింపులు లేకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నం. వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి నిర్ణీత ప్రదేశాన్ని చూపిస్తాం.
ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్ ట్రాఫిక్ పోలీసులు కాలుష్యానికి గురవుతున్నారు. జబ్బులు వచ్చి కొంత మంది చనిపోతున్నారు. వారికి బేసిక్ వేతనంపై 30శాతం అదనంగా చెల్లిస్తాం. వారికి రేపటినుంచి ఇది వర్తిస్తుంది. (ఐఎస్‌డబ్ల్యూ, సీఐడీ వారికి మూల వేతనంపై 25శాతం అదనం).
ఆస్తిపన్నులో నగర వాసికి ఊరట జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను రూ.1200చెల్లించే వారు ఇకపై రూ.101 చెల్లిస్తే సరిపోతుంది. ఇది 3.12 లక్షల పేద కుటుంబాలకు లాభం. 15ఏండ్లనుంచి నుంచి మొండి నీటి బకాయిలు ఉన్నాయి. ఇది రూ.299కోట్లు అసలు ఉంది. వడ్డీ వేరే ఉంది. ఇది వచ్చింది లేదు. సచ్చింది లేదు. కానీ వసూలు చేసే వారికి జీతాలే ఎక్కువవుతున్నాయి. 1989నుంచి బకాయిలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో రూ.457కోట్ల నీటి బకాయిలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
మైనార్టీ శాఖకు 80 పోస్టులు మైనార్టీ శాఖలో అందరూ డిప్యూటేషన్‌పై ఉన్నరు. రెగ్యులర్ ఎంప్లాయి అనే వారే లేరు. ఇంతకుముందు ప్రభుత్వాల ఘనకార్యం ఇది. డైరెక్టరేట్ లేదు. బడ్జెట్ ఇచ్చినా ఖర్చుపెట్టే దిక్కులేదు. ప్రతి జిల్లాకు ఆరుగురు, 20మందితో డైరెక్టరేట్‌తో కలిపి మొత్తం 80పోస్టులు మంజూరు చేశాం.
ఇతర శాఖలకు మరిన్ని పోస్టులు ఇరిగేషన్‌లో 108 పోస్టులు, వరంగల్ ఎంజీఎంలో 147, మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ తరఫున చేపట్టే మెడికల్ కాలేజీలో 462పోస్టులు మంజూరు చేయడం జరిగింది.
డబుల్ బెడ్‌రూం అంచనా వ్యయం పెంపు జీహెచ్‌ఎంసీలో స్థలాభావం వల్ల మల్టీస్టోరీడ్ బిల్డింగ్‌లు కడుతున్నాం. వీటిలో లిఫ్ట్‌లు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతున్నది. తొమ్మిది అంతస్తులు కూడా కడుతున్నందున మనుషులు ఎక్కలేరు. అందుకే డబుల్ బెడ్‌రూం కింద ఒక ఇంటికయ్యే రూ.5.30లక్షల వ్యయాన్ని రూ.7లక్షలకు పెంచాం.
హైదరాబాద్‌కు రెండు రిజర్వాయర్లు హైదరాబాద్ ఎప్పుడో నిజాం రాజు ఉన్నప్పుడు హిమాయత్‌సాగర్, గండిపేట్ చెరువులు కట్టారు. హెచ్‌ఎండీఎ పరిధిలో 1.20కోట్ల మంది ఉన్నారు. గోదావరినుంచి 200 కిలోమీటర్లు, నాగార్జునసాగర్‌నుంచి 160 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు వస్తున్నయి. కానీ హైదరాబాద్‌కు డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లేదు. మొన్న మొత్తం లెక్కలు తీసినం. హైదరాబాద్‌కంటే చిన్నసిటీకి కూడా డెడికేటెడ్ రిజర్వాయర్ ఉంది. అందుకే ఇప్పుడు 40టీఎంసీలతో రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో, మరో 40 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో శామీర్‌పేట్ వద్ద రిజర్వాయర్లు కడుతున్నాం. ఇవి కేవలం హైదరాబాద్ ప్రజల తాగునీటికే. ఇరిగేషన్‌తో సంబంధం లేదు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ అనే సంస్థ ఈ రిజర్వాయర్ల పంపులు, మోటార్లకోసం రూ.7200కోట్లు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. గ్యారెంటీ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు నియమిత సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే 1.5శాతం ఇన్సెంటివ్ ఇస్తం అని ఇరిగేషన్‌లో ప్రకటించినం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలని నిర్ణయించినం.
97 అర్బన్ పీహెచ్‌సీలు అప్‌గ్రేడ్ రూరల్ ఏరియాలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. కానీ అర్బన్‌లో 97 ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటిని పీహెచ్‌సీల స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలో ఇండియన్ రిజర్వుడు బెటాయలియన్‌కు 115ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం.
రియల్ వ్యాపారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమకు కూడా ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని అడిగారు. వారు 70-80 కోరికలు అడిగారు. అందులో 20 కోరికలు అంగీకరించినం. రేపు ఆ అంశాలను మీకు ఇస్తాం. రాష్ట్ర బడ్జెట్‌లోనే 15శాతం అదాయం పెరుగుతున్నప్పుడు టాక్స్‌ల పెంపు ప్రశ్న ఎక్కడిది?
వారంలోనే కారుణ్య నియామకాలు సర్వీస్‌లో ఉండగా ఉద్యోగి చనిపోతే వారంలో కారుణ్య నియామకాలు చేయాలని నిర్ణయించినం. రిటైర్ అయిన వారికి పెన్షన్ సరిగ్గా ఇవ్వక ఉసురు పోసుకుంటున్నారు. దీన్ని రివ్యూ చేయాలని నిర్ణయించినం. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఒకే ప్యాకెట్‌లో ఇచ్చి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దింపాలని నిర్ణయించినం. చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేయిస్తాం. ఆంధ్రలో ఉండే తెలంగాణ ఉద్యోగులైనా ఇదే న్యాయం ఉంటుంది. తెలంగాణలో ఉండే ఆంధ్ర ఉద్యోగులపట్ల పక్క రాష్ట్రం వాళ్లు ఎట్లా వ్యవహరిస్తే మేం అట్లే వ్యవహరిస్తం.
రేస్‌కోర్స్ నగరం బయటికి రేస్‌కోర్స్ తరలింపుపై వాళ్లే నన్ను కలిశారు. హైదరాబాద్‌కు గ్రాండ్ రేస్‌కోర్స్ ఉండాలని అన్నారు. ఆ స్టాండర్ట్స్‌కోసం దాన్ని మెయిన్‌టైన్ చేయాలి. వాళ్లకు 130 ఎకరాలు ఉంది. 200 ఎకరాలు ఇస్తే అవతలికి పోతం అన్నారు. పరిశీలనలో ఉంది. రేస్‌కోర్స్‌ను, చంచల్‌గూడ జైల్‌ను కూడా తరలించాలని విధాన నిర్ణయం తీసుకున్నం. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు గురుకుల పాఠశాలలు తీసుకొస్తాం.
నాకందరూ సమానమే భేదాలు లేకుండా హైదరాబాద్‌లో ఉండే ప్రజలందరినీ ఒకే ప్రజలుగా చూస్తున్నాం. పక్క రాష్ట్రం వారు సెక్షన్ 8 పెట్టాలని చూస్తే కేంద్రం తిరస్కరించింది. సింగిల్ ఇన్సిడెంట్ ఉందా? అభూతకల్పనలు సృష్టించారు. మరాఠీలు, మలయాళీలు, బెంగాలీలు, కన్నగిగులు, ఆంధ్రవారు ఉన్నారు. వారిని రక్షించే బాధ్యత మాపై ఉంది. అదే పనిచేస్తాం. ఇక్కడ ఉండేవారేవరైనా తెలంగాణ బిడ్డలే. హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. కోర్టు తీర్పు ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జనవరి 31లోపు నిర్వహిస్తాం.
పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నం మొదటి ఏడు నెలలు అధికారం లేదు. 12నెలలు మాత్రమే మనం పరిపాలించుకున్నాం. మార్చి 31నుంచి మార్చి31 గడిస్తే ఫైనాన్షియల్ ట్రెండ్ తెలుస్తుంది. కేంద్రంనుంచి వచ్చే రిలీజ్‌లు కూడా తెలుస్తాయి. ఆటోమేటిక్‌గా అనుకున్న దాన్ని రీచ్ అవుతున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా అక్యురేట్‌గా ముందుకు వెళ్తాం. 12నెలల్లో ప్రాధాన్యతక్రమాలు నిర్ణయించుకున్నాం. ఇరిగేషన్‌లో ఏమేమి చేయాలో రీ ఇంజినీరింగ్ కూడా చేసుకున్నాం. రైతుల ఆత్మహత్యల నివారణ కార్యక్రమాలు కొనసాగుతాయి. రుణమాఫీని రెండు విడుతల్లో చేస్తాం. ఒకేసారి చేసే అవకాశం లేదు అసెంబ్లీలో కరెక్టుగానే చెప్పిన. మీరే సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంచితే మూడు నాలుగువేల కోట్లు వస్తాయి అన్నాం. భూములు అమ్మితే బ్రహ్మాండమైన రేట్లు వచ్చినయ్. ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసినా, కేంద్రం మొండిగా ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పెంచితే ఒకేసారి రుణమాఫీ చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ప్రతిపాదించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అసమగ్రంగా, అసంబద్ధంగా, పొలాలకు నీళ్లు రాకుండా పెట్టారు. ప్రాణహిత చేవెళ్లకు 160 టీఎంసీలతో 16లక్షల ఎకరాలకు నీరు అందిస్తం అన్నరు.. కానీ 14 టీఎంసీల రిజర్వాయర్‌ను మాత్రమే ప్రతిపాదించారు. దీనిపై సీడబ్ల్యుసీ కూడా ఎగతాళి చేసింది. మేం చేసిన రీ ఇంజినీరింగ్‌తో అదనపు సామర్థ్యంతో ప్రాజెక్టులు కడుతున్నాం. ఆ వాస్తవాలు మీ ముందు పెడతాం.
ముందస్తు బడ్జెట్ తప్పేమీ కాదు కేంద్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండానే 18 రాష్ర్టాలు తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకుంటున్నాయి. కేంద్రంనుంచి మూడు రకాల నిధులు వస్తాయి. ఇందులో రెండు ప్రధానమైనవి. సెంట్రల్ డెవల్యూషన్ కింద ఎంత ఇస్తరో ఫైనాన్స్ కమిషన్ సూచిస్తుంది. ఇది ముందే తెలుస్తది. కేంద్ర ప్రభుత్వ పథకాల సహాయంకింద ఎంత వస్తుందో అంత మేరకు వాటి అమలు ఉంటుంది కాబట్టి ఇందులో ఎలాంటి గొడవ లేదు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు వచ్చినప్పడు గ్రాంట్స్, లోన్లు ఇస్తుంది.
నెలానెలా శాఖలకు నిర్ణీత బడ్జెట్ బడ్జెట్‌లో 15% ఆదాయం పెరుగుదల వచ్చింది కనుక దానిమేరకు ఫైనాన్స్ శాఖ ఆదివారం సాయంత్రం, సోమవారం మధ్యాహ్నానికి అన్ని శాఖలకు ఎంతెంత కేటాయించాలో సూచిస్తారు. దానిమేరకు ఆయా శాఖలు ఏ జిల్లాలో ఏం చేయాలనేది జిల్లా డెవలప్‌మెంట్ కార్డు తయారు చేసుకుంటారు. 100శాతం వారికి కేటాయించిన డబ్బు విడుదల అవుతుంది. ఇరిగేషన్‌కు రూ.25వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించినం. ఆ లెక్కన ప్రతినెలా రూ.2083కోట్లు రిలీజ్ చేయాలి అంతే. అన్ని శాఖలకు ఇదే వర్తిస్తుంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పథకాలకింద రూ.1500కోట్లు రావాలి. కానీ రూ.250కోట్లే ఇచ్చారు. ఉన్న వనరులను వాడుకుని వారు ఇచ్చినప్పుడు మళ్లీ సర్దుబాటు చేసుకుంటాం. జిల్లా కార్డు ఉంటే ఎవరైనా రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి ప్రోగ్రెస్ వచ్చే అవకాశం ఉంది.
18వేల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చాలా రోజులుగా కొన్ని పెండింగ్‌లో ఉన్నయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తిచేయాలి. జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎస్‌ను క్యాబినెట్ ఆదేశించింది. అన్ని శాఖల వివరాలు తెప్పించి, విషయాలు సరిచూసుకుని చేస్తరు. కాంట్రాక్టు ఉద్యోగులు 18వేల పైచిలుకు ఉంటరు. అయితే మొదట్లో.. అప్పుడే నేను కూడా మంత్రిగ ఉన్న.. ఆర్‌వోఆర్ (రూల్ ఆఫ్ రిజర్వేషన్), రోస్టర్ పాటించలేదు. తరువాత గొడవ జరిగితే ఆర్‌వోఆర్ పాటించినరు. ఆర్‌వోఆర్ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులు సరిపోకపోతే.. అందుకు సరిపడ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల కింద భర్తీ చేసుకోవాలని ఆదేశాలిచ్చినం.
అవుట్ సోర్సింగ్‌కు భారీగా వేతనాల పెంపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. పాపం చాలా మంది ఉన్నరు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా.. తిని బతకాలి కనుక చేస్తున్నాం. రూ.6,700 వేతనం ఉన్న వారికి రూ.12,000 జీతం దొరుకుతుంది. రూ.8,400 ఉన్న వారికి రూ.15,000 వేతనం లభిస్తుంది. రూ.10,900 ఉన్న వారికి రూ.17,000 వేతనం వస్తుంది. ఇది 1-1-2016 నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల నాలుగైదు వేల కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుంది. అయినా వేల మందికి న్యాయమని నిర్ణయం తీసుకున్నం.
15,628 పోస్టులతో డీఎస్సీ మైనార్టీ స్కూళ్లు, ఉర్దూ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. 15628 టీచర్ పోస్టులను మంజూరు చేస్తూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. ఉర్దూ టీచర్ పోస్టులు 1,225 ఉన్నాయి. డీఎస్సీద్వారానా లేక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ద్వారానా? ఎలా నింపాలనేది విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుంది. అవినీతి లేకుండా ఎలా మంచిదైతే అట్లా చేస్తం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మైనార్టీల పిల్లల కోసం 30 బాలికల, 30 బాలుర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వాటికి సరిపడా టీచర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.