Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేంద్రం వివక్షపై యుద్ధం

-రాష్ట్ర ప్రగతికి అడ్డుగా కేంద్రం అసంబద్ధ విధానాలు: సీఎం కేసీఆర్
-రాష్ట్రాల ఆదాయంపై ఆంక్షలు
-డిసెంబర్‌లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
-కేంద్రం వైఖరితో రాష్ట్రానికి 40వేల కోట్ల నష్టం
-బీజేపీ ప్రభుత్వ దుర్నీతిని ప్రజలకు చెప్పడమే ఉద్దేశం
-రాష్ట్రంపై కక్షసాధింపును ఎండగట్టనున్న ముఖ్యమంత్రి
-వారం రోజులపాటు శాసనసభ సమావేశాల నిర్వహణ
-పైసా ఇవ్వదు, పనిచేసుకోనివ్వదు.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీరు ఇదే. -అభివృద్ధిపై కక్షసాధింపుతో, ఆర్థిక ఆంక్షలతో తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతున్న కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారు. కేంద్రం ఆంక్షలు, వివక్ష ఫలితంగా ఈ ఒక్క ఏడాదిలోనే తెలంగాణ ఏకంగా రూ.40వేల కోట్లకుపైగా నష్టపోయింది.

కేంద్రం దుర్నీతిని ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ ఎండగట్టారు. తెలంగాణకు ఆర్థికంగా జరిగిన అన్యాయాన్ని ఈ సారి అసెంబ్లీ వేదికగా అంకెలతో సహా ప్రజలముందు ఉంచేందుకు ఆయన సిద్ధమయ్యారు. శాసన సభను ప్రత్యేకంగా సమావేశపర్చి.. నిప్పులాంటి నిజాలేమిటో, నిస్సిగ్గు అబద్ధాలేమిటో నిగ్గుతేల్చనున్నారు.

గతంలో ప్రాజెక్టుల రీడిజైన్‌పై అసెంబ్లీలో ప్రత్యేకంగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడం ద్వారా అబద్ధాల భాండాన్ని బద్దలుకొట్టి నిజాలను జనం ముందు నిలిపారు కేసీఆర్‌. అదో సంచలనం. ఇప్పుడు కేంద్రం విధానాలను తూర్పారబట్టేందుకు ప్రత్యేక సమావేశాలకు సిద్ధమవడం చరిత్రాత్మకమని విశ్లేషకులు చెప్తున్నారు.

40 వేల కోట్లకు పైగా నష్టం ఇలా…
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి తగ్గటంతో నష్టం: 15 వేల కోట్లు
విద్యుత్తు సంస్కరణలు ఒప్పుకోనందుకు నష్టం: 6 వేల కోట్లు
రాష్ట్రానికి బడ్జెటేతర నిధుల కోతతో నష్టం: రూ.20 వేల కోట్లు

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్‌ నెలలో వారం రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ ఆర్థిక విధానాలు రాష్ట్ర ప్రగతికి అడ్డుగోడగా మారాయి. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత నిర్ణయాల ఫలితంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. ‘అమ్మ పెట్టదు.. అప్పు తెచ్చుకోనివ్వదు’ అన్నట్టు వ్యవహరిస్తున్న కేంద్రం దుర్నీతిని ప్రజలకు సవివరంగా చెప్పేందుకే డిసెంబర్‌ నెలలో వారం పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టుగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బండారాన్ని అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రజావ్య తిరేక ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రాల భవిష్యత్తుకు, ప్రగతికి ఆటంకంగా మారింది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదలచేసే బడ్జెట్‌ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ బడ్జెట్‌ను రూపొందించుకొంటాయి.

ఆర్థిక వనరులను సమకూర్చుకొనేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రూ.54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ తన బడ్జెట్‌ను రూపొందించుకొన్నది. కానీ, కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రూ.39 వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు తగ్గాయి. అంతేకాకుండా ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంటుంది. ఆర్థికంగా అత్యంత పటిష్ఠంగా ఉన్న తెలంగాణ.. ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా కేంద్రం అడ్డుపుల్ల వేసింది. విద్యుత్తు సంసరణలు అమలు చేస్తామంటేనే 0.5 శాతం రుణ పరిమితికి తెలంగాణకు అనుమతిస్తామనే వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంతపెట్టింది. ఎన్ని కష్టాలనైనా భరిస్తాం కానీ తెలంగాణ రైతులకు, వ్యవసాయానికి నష్టంచేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంసరణలకు ఒప్పుకోబోమని సీఎం కేసీఆర్‌ కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. దాంతో సుమారు రూ.6 వేల కోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోయింది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ సంకుచిత విధానాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ.21 వేల కోట్ల నిధులు ఆగిపోయి, రాష్ట్రం ఆర్థికంగా నష్ట పోయింది. అకడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా రాకుండా కేంద్రం నిలిపివేయించింది. కేంద్రం అనాలోచిత విధానాలు, ఆర్థిక అజ్ఞానంతో కూడిన నిర్ణయాలతో రాష్ట్రానికి దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా నిధులు రాకుండా పోయాయి.

సంక్షేమ పథకాల అమలుకు కొర్రీలు..
తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకొన్న ఒప్పందాల ప్రకారం నిధులను సమీకరిస్తున్నది. ఆ నిధులను కూడా కక్షసాధింపు నిబంధనలతో కేంద్రం నిలిపివేయించింది. వెంటనే అప్రమత్తమైన సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆయా సంస్థలతో ప్రభుత్వాధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపారు. రుణాల రూపంలో రాష్ట్ర ప్రగతి కోసం వారిచ్చిన నిధులను తప్పకుండా తిరిగి చెల్లించేంత ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నామని, ఇట్లా ఒప్పందాల ఉల్లంఘన సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం వారికి నచ్చచెప్పింది. అర్థం చేసుకొన్న ఆర్థిక సంస్థలు రాష్ట్రం మీద భరోసాతో గతంలో చేసుకొన్న ఒప్పందాల మేరకు నిధులను ఈ మధ్యకాలంలో విడుదల చేస్తున్నాయి. ఇట్లా అడుగడుగునా తెలంగాణను ఆర్థిక దిగ్బంధం చేసి ప్రగతిపథంలో సాగుతున్న తెలంగాణ ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తున్నది. అనతికాలంలోనే అన్ని రంగాల్లో అత్యద్భుత ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రతిభను పలుచన చేయాలనే కుట్రపూరిత వైఖరితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని స్పష్టమవుతున్నది.

దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టు
ప్రతి యేటా ఆయా రాష్ట్రాలు పొందుపరుచుకొనే అంచనాలకు అనుగుణంగానే ప్రగతి పద్దులు రూపొందించుకొంటాయి. కేంద్రం తన ఇష్టానుసారం అనుసరిస్తున్న అసమర్థ, అనుచిత నిర్ణయాల వల్ల సమయానుకూలంగా నిధులు అందక అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. తద్వారా కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు.. దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉన్నది. ఇటువంటి పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన, అనాలోచితమైన, అసంబద్ధ నిర్ణయాల వల్ల ఒక్క తెలంగాణ ప్రగతిని మాత్రమే కాదు, దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తున్నది. రాజకీయ ప్రేరేపితమైన తన కక్షపూరిత దిగజారుడు విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల గొంతు కోస్తూ, నష్టపరుస్తూ, కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నది. కేంద్ర అనుసరిస్తున్న ఇటువంటి అసంబద్ధ విషయాలను ఇటు రాష్ట్ర ప్రజల దృష్టికి అటు దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా డిసెంబర్‌లో అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించి చర్చించాలని నిర్ణయించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.