-రాష్ర్టాల చేతుల్లోకి నగదు రావాలి కానీ కేంద్రం బిచ్చగాళ్లను చేసింది -రుణ పరిమితి పెంచారు.. కానీ దుర్మార్గపు ఆంక్షలు పెట్టారు -రూపాయి మెహర్బానీ కూడా లేదు కేంద్రం తన పరువును తీసుకున్నది సంస్కరణలు అమలు చేయబోం సీఎం కేసీఆర్ స్పష్టీకరణ -రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన ప్రభుత్వాలు. రాష్ట్రాలు సబార్డినేట్‌లు కావు. -కేంద్రం కంటే రాష్ట్రాల పైనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకు జవాబుదారీ ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం.

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పచ్చి దగా అని, నూటికి నూరు శాతం బోగస్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. చేతికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా రాష్ర్టాలను భిక్షగాళ్లలాగా చేసిందని మండిపడ్డారు. అప్పు తెచ్చుకొనేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచినట్టే పెంచి దరిద్రపుగొట్టు ఆంక్షలు విధించిందని ధ్వజమెత్తారు. ప్రజల మెడపై కత్తిపెడితే అప్పు తెచ్చుకొనేందుకు అనుమతినిస్తాననడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణం పొందేందుకు సంస్కరణలు అమలు చేయాలంటూ కేంద్రం విధించిన షరతులను అమలు చేయబోమని సీఎం స్పష్టం చేశారు.
సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వట్టి డొల్ల. వందకు వంద శాతం బోగస్. ఇది నేను చెప్తలేను. సింగపూర్ నుంచి వచ్చే ఏషియన్ ఇన్‌సైడ్స్ అంతర్జాతీయ జర్నల్‌లో ‘హౌ పోటెంట్ ఇజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా.. వట్టిదే బోగస్.. ఇందులో ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్లు కూడా లేదు, అంత గాలి కథ’ అని వ్యాఖ్యానించింది. జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్.. ‘డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఇజ్ దిస్ ది ఎయిమ్ టూ రివైవ్ జీడీపీ.. ఆర్ టు రిలీజ్ ది 20 లాక్ క్రోర్ నంబర్.. ఇది అంకెల గారడీనా, లేక జీడీపీని పునరుద్ధరించడమా?’ అని ప్రశ్నించింది. ఇది చాలా దుర్మార్గమైన ప్యాకేజీ. పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది.
నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాం. మేం అడిగింది.. కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం ఆర్థిక పరిస్థితిని నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి. అప్పుడు అది ప్రజల చేతుల్లోకి పోతుంది. మేం అది అడిగితే రాష్ట్రాలను భిక్షగాళ్లలాగా భావించి కేంద్రం ఏం చేసింది? ఇదేనా దేశంలో సంస్కరణలు అమలు చేసే పద్ధతి. ఎఫ్‌ఆర్‌బీఎం రెండు శాతం పెంచారు. దీని ద్వారా తెలంగాణకు 20 వేల కోట్ల రూపాయలు వస్తాయి. దీనికి కేంద్రం పెట్టిన షరతులు వింటే నవ్వుతారు. అది కూడా రాష్ట్రం కట్టుకునే అప్పు. వీళ్ల మెహర్బానీ ఒక్క రూపాయి కూడా లేదు. రుణ పరిమితి మాత్రమే పెంచింది. కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వదు. ఇందులో కూడా దరిద్రపుగొట్టు ఆంక్షలు ఉన్నాయి. రూ. 5 వేల కోట్లు ఇస్తారట.. దీని గురించి కొన్ని పత్రికలు రాశాయి. కొన్ని పత్రికలు ఎడిటోరియల్స్ కూడా రాశాయి. దీని ద్వారా తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని రాశాయి. తెలంగాణకు ఇప్పటికే 3.5శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంది. ఇందులో కొత్తగా వచ్చేది ఏమీలేదు.
ప్రజల మెడపై కత్తి పెట్టాలా? మిగిలిన వాటిల్లో రూ. 2,500 కోట్లకు ఒకటి చొప్పున సంస్కరణ ఆంక్ష పెట్టారు. కరెంటు సంస్కరణలు తీసుకొస్తే, ప్రజల మెడ మీద కత్తి పెడితే రూ. 2,500 కోట్లు ఇస్తారట, ఇది ప్యాకేజా? వాట్ ఇజ్ దిస్? దీన్ని ప్యాకేజీ అనరు. ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం ఇది కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల ఈ విధంగా వ్యవహరించవచ్చునా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంత దుర్మార్గం. మార్కెట్ కమిటీల్లో కేంద్రం చెప్పిన సంస్కరణలు అమలుచేస్తే మరో రూ.2,500 కోట్లు ఇస్తారట. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? మున్సిపాలిటీల్లో ఆదాయం పెంచితే, పన్నులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. దీన్ని ప్యాకేజీ అంటారా? ప్రోత్సహించే విధానమేనా ఇది? వన్ నేషన్, వన్ రేషన్‌కార్డు.. ఇందులో మనం నంబర్‌వన్‌గా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో చాంపియన్లుగా ఉన్నాం. నాలుగింటిలో మూడు సంతృప్తి పరిస్తే మరో రూ.5వేల కోట్లు ఇస్తారట. ఇదేం బేరమండి?. ఇది పచ్చి మోసం.. దగా.. అంకెల గారడీ. అంతా గ్యాస్. కేంద్రం తన పరువును తానే తీసుకుం ది. భవిష్యత్‌లో ఇది విజన్ ప్యాకేజా లేక బోగస్ ప్యాకేజా అనేది ప్రజలకు తెలుస్తుంది.
కేంద్రం వైఖరి బాధాకరం ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి చెప్తున్నాం. ఐ రియల్లీ ఫీల్ పెయిన్‌ఫుల్. ఐ రియల్లీ ఫీల్ వెరీ సారీ. రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధాని చెప్పారు. అది పూర్తిగా డొల్ల, బోగస్ అనేది ఇప్పుడు రుజువైంది. ఇంకెక్కడి ఫెఢరలిజం? దారుణంగా వ్యవహరిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇది చేస్తే పైసలిస్తం, అది చేస్తే పైసలిస్తం అనడం, పిల్లల కొట్లాటనా? ఇది వాంఛనీయం కాదు. ఇది అన్యాయం. మెడమీద కత్తి పెట్టి కరెంటు సంస్కరణలు అమలు చేస్తే నీకు బిచ్చం ఇస్తాం అనడం ప్యాకే జీనా? ఈ విధానం కరెక్టు కాదు. కరెం టుసంస్కరణలను మేం అమలుచేయం.
ముష్ఠి మాకొద్దు క్యాబినెట్ సమావేశంలో చర్చించాం. సంస్కరణలు అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. ముష్ఠి రూ. 2500 కోట్లు తీసుకోం. కేంద్రంపై సమ యం వచ్చినప్పుడు పోరాటం చేస్తాం. శిశుపాలునికి కూడా వంద తప్పులు మన్నించారు కదా. ఏదైనా పండాలి. పండే సమయం వచ్చినప్పుడు ఎట్ల పం డుతదో ఎట్ల ఫైటింగ్ అయితదో సూడు’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలిచ్చారు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ల పెంపు గురించి మాట్లాడుతూ.. ‘అది మా డబ్బే కదా.. మన ఓన్ సోర్స్. ఎప్పుడన్నా పైసలు వెళ్లకుండా ఉంటే ఎక్కువ డ్రా చేసుకునే అవకాశం. ఇది కూడా 500-600 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన ప్రభుత్వాలు. రాష్ట్రాలు సబార్డినేట్‌లు కావు. కేంద్రం కంటే రాష్ట్రాల పైనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకు జవాబుదారీ ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం.