కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తెలంగాణ రాష్ర్టానికి అన్యాయం చేస్తున్నది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచి, ఆమోదించిన పలు హామీలను నెరవేర్చడం లేదు. గిరిజన ప్రాంతమైన బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి, అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఐటీఐఆర్ స్థాపన, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు నాడు హామీలిచ్చారు. భారత పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీలవి. వాటిని రద్దుచేసే హక్కు గానీ, అధికారంగానీ బీజేపీ ప్రభుత్వానికి లేదు. ఇవి తెలంగాణకు చెందవలసిందే. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వీటిని నూటికి నూరు శాతం పూర్తిచేయాలి. వివక్షతో వాగ్దానాలు నెరవేర్చకుంటే ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోతారు.

16వ లోక్‌సభలో నేను, సహచర లోక్‌సభ సభ్యులం పోడియం దగ్గరికి వెళ్లి సభా కార్యక్రమాలను పలుమార్లు స్తంభింపజేసినం. రాజ్యసభ సభ్యులు కూడా అన్ని అంశాలను తూచా తప్పకుండా త్వరితగతిన పూర్తిచేయాలని పదేపదే ప్రస్తావించారు. ఇప్పటికైనా వీటిని పూర్తిచేసి తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. పార్లమెంటు సాక్షిగా బిల్లు రూపంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకపోతే, తెలంగాణ ప్రాంతానికి తీరని ద్రోహం చేసినవారవుతారు. దేశ రాజకీయాలు శ్రీరాముడు, దేవతల చుట్టూ నడుస్తున్నవి. భద్రాచలంలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీరామచంద్రమూర్తి దేవాలయం వరకు పాండురంగాపురం నుంచి సారపాక- భద్రాచలం వరకు 15 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎనిమిది రైల్వే పెండింగ్ లైన్ల జాడలేదు. మూడు కొత్త లైన్ల ఊసులేదు. కాజీపేట రైల్వే డివిజన్ మాటే లేదు. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ చూడలేము. రైల్వే యూనివర్సిటీ ఇవ్వలేదు. కాజీపేట- వరంగల్ హన్మకొండ ట్రైసిటీ ఆధునిక రైల్వేస్టేషన్ ఆలోచన బుట్టదాఖలైంది.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ప్రారంభిస్తారని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం- కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదు. కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్రం ఇప్పటికే 150 ఎకరాల విలువైన భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించింది. కోచ్ ఫ్యాక్టరీ రాలేదు.
‘నన్ను నమ్మండి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తాం అని చెప్పిన ప్రధానమంత్రి మోదీ ఇప్పుడేం చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నా గుండెకాయ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు (రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఇండియా, ఎల్‌ఐసీలను ప్రైవేట్ పరంచేసి నిరుద్యోగ సమస్యను ఎలా నిర్మూలిస్తారు? ఉద్యోగాలు కావాలి అంటే మిర్చి బజ్జీలు అమ్ముకోండి అంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మితేనే దేశం బాగుపడుతుందనడం జాతి వ్యతిరేక చర్య వంటిదే. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభు త్వం లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీచేసినట్లు మం త్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేశారు. దానిపై బీజేపీ, ఇతర పార్టీలు వితండవాదాలకు దిగుతున్నాయి. తెలంగాణ సాధించుకొని అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్న టీఆర్‌ఎస్ పార్టీ ఎదురులేని రాజకీయశక్తిగా ఎదిగింది. ఇంకా ఎదుగుతుంది.
అజ్మీర సీతారాంనాయక్ (వ్యాసకర్త: లోక్‌సభ మాజీ సభ్యుడు, మహబూబాబాద్)