Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

-సబ్సిడీ బంద్‌.. మళ్లీ మోటర్లకు మీటర్లు, బిల్లు కలెక్టర్లు
-ఉత్తరాది కరెంటే కొనాలి.. లేకుంటే జరిమానా కట్టాలట
-సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికే యత్నం: సీఎం
-లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ పోతుంది
-50 వేల మంది ఉద్యోగులు ఏంగావాలె
-కేంద్రం విద్యుత్‌ చట్టం పెను ప్రమాదం
-కరెంట్‌ సమస్య వస్తే ఇకపై ఢిల్లీకి పోవాలె
-క్రాస్‌సబ్సిడీలకు పూర్తిగా మంగళం పడతది
-కోలుకుంటున్న రైతుపై పిడుగుపాటు ఇది
-కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీల వైఖరేంటి?
-రాష్ట్రంలో విద్యుత్‌ ప్రైవేటుకు ఇవ్వలేదు
-ఒత్తిడి చేసిండ్రు.. సచ్చినా ఇయ్యనని చెప్పిన
-విద్యుత్‌ బిల్లుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌
-కేంద్రం ఫాల్స్‌ ప్రెస్టేజ్‌కు పోవద్దని హితవు
-వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌
-బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో విద్యుత్‌పై రాష్ర్టాలకున్న అధికారం పోతుందని, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తారని హెచ్చరించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం సవరణ బిల్లుపై అసెంబ్లీలో మంగళవారం స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కేంద్ర చట్టం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. కేంద్రం తీరును ఎండగట్టారు. ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని విమర్శించారు. దేశంలో మిగులు విద్యుత్‌ ఉన్నా అనేక ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ బిల్లుతో రైతులు, పేదలు, విద్యుత్‌ ఉద్యోగులు.. ఇలా అన్నివర్గాల వారు నష్టపోతారని వివరించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ రైతాంగంపై ఇది పిడుగులాంటిదేనని సీఎం ఆవేదన చెందారు. కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు దేశంలో వృథా అవుతున్న నీటిని వినియోగించే ప్రణాళికలు రూపొందించలేదని, కానీ రాష్ర్టాల అధికారాలను హరించేందుకు ప్రయత్నించాయని విమర్శించారు. నిండు సభ నుంచి ప్రధాన మోదీని రెండు చేతులు జోడించి.. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని వేడుకుంటున్నా.. అని చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

కేంద్ర చట్టం ప్రమాదకరంగా ఉన్నది
కేంద్రం ప్రతిపాదించిన బిల్లు ప్రమాదకరంగా ఉన్నది. కాంగ్రెస్‌, బీజేపీలు దేశాన్ని పరిపాలించే విధానంలో అంబేద్కర్‌ వంటి పెద్దలు సూచించిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయి. అనేక చట్టాలను కాంగ్రెస్‌ కూడా కేంద్రీకృతం చేసింది. కేంద్రంలో ఎవరున్నా తమ అధికారాలను కిందికి బదిలీ చేయాల్సిందిపోయి అధికారాలను కేంద్రీకృతం చేశారు. రాష్ర్టాల హక్కులను హరించారు. ఇప్పుడు అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు నరేంద్రమోదీ.. ఏకంగా మొత్తం కేంద్రీకృతం చేస్తున్నరు. చెప్పడం ఒకటి.. చేసేది మరొకటి. ఈ చట్టం వస్తే.. హైదరాబాద్‌లో ఉండే లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ పోతుంది. అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే జరుగుతుంది. అన్నీ ఢిల్లీకి పోతాయి. రేపు కరెంట్‌ సమస్య ఏర్పడితే ఇక్కడ మాట్లాడే విద్యుత్‌ మంత్రి, ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవాలె.. అడుక్కోవాలె.. గడ్డాలు పట్టుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్‌, బీజేపీ ఏ ఒక్క రోజు కూడా దేశం మొత్తానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేదు. అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నరు.

ప్రజల అధికారం ఇక ప్రైవేటుకే
ఈ చట్టం అమల్లోకి వస్తే అనేక ప్రమాదాలు ఉన్నయి. ఇప్పుడు మనం నియంత్రణ చేస్తున్నం. పరిశ్రమలకు ఒక లిమిట్‌లో కరెంటు ఇస్తున్నం. ఈ చట్టం వస్తే మొత్తం మారిపోతది. మరి అట్లాంటప్పుడు మన డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎక్కడికి పోవాలె? అందులో పనిచేసే 50వేల మంది ఉద్యోగులు ఎక్కడికి పోవాలె? ఈ సంస్థలు మొత్తం మునిగిపోతే ఎట్ల? ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయింది. ఎల్‌ఐసీకి కూడా దెబ్బపెట్టిన్రు. విమానాలు, రైళ్లు అన్నీ వరుసపట్టి పోతున్నయి. అంతా గోవింద మంగళం అయితది. పబ్లిక్‌రంగ సంస్థలు ఉండవు. వీళ్లు ఉండనీయరు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు ఉన్నయి. వాళ్లు సరఫరా చేసి బిల్లులు తీసుకుంటున్నరు. దానికి ప్రైవేటు కంపెనీలను సప్లయిస్‌కు పిలుస్తరట. వాడు ఎక్కడినుంచైనా కరెంటు కొనుక్కోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడున్న మన డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు, దాంట్లో ఉన్న ఉద్యోగులు ఎక్కడికి పోవాలె? ప్రజల చేతుల్లో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే బిల్లు ఇది.

అన్న వస్ర్తానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టుంది
ఒక దగ్గర లాభం వస్తది, ఒక దగ్గర నష్టం వస్తది. ఆ నష్టాన్ని లాభంతో సరిచేసుకొని, ప్రజలకు కొంత చౌకగా విద్యుత్తు ఇస్తున్నం. ఇది క్రాస్‌ సబ్సిడైజేషన్‌. దానికి మంగళం పడుతది. అసలు క్రాస్‌ సబ్సిడీ కాదు.. డిస్కంలే ఉంటయా? మునుగుతయా? తెల్వదు. జెన్‌కో, ట్రాన్స్‌కో ఉంటదా? మునుగుతదా? అదో పెద్ద ప్రశ్న. ఈఆర్సీ ఏర్పాటు అధికారం ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది. రేపు కేంద్రం తీసుకుంటుంది. నియంత్రణ (లోడ్‌ రిలీఫ్‌) ఇప్పుడు మన చేతుల్లో ఉంటే ఈ చట్టంతో ఢిల్లీకి పోతది. అన్న వస్ర్తానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్లుంది ఈ బిల్లు పరిస్థితి. ఏదైనా బిల్లు వస్తే రాష్ర్టాలకు అధికారం ఇంకింత పెరగాలి, ప్రజలకు ఇంకింత లాభం జరగాలి కానీ.. అవేవీ లేవు.

జల విద్యుత్‌ను లెక్కలోకే తీసుకోరట!
సంప్రదాయేతర కరెంటు. అంటే ఉన్న వనరులను వాడి కరెంటును ఉత్పత్తి చేయడం. ఉదాహరణకు నీళ్లను నీళ్లుగా కాకుండా టర్బయిన్లకు మళ్లిస్తే కరెంటు ఉత్పత్తి అయితది. అట్లనే ఎండ నుంచి సోలార్‌, గాలి నుంచి విండ్‌ పవర్‌. ఇలా ఆ శక్తిని రెట్టింపు చేసుకొని వాడుకుంటున్నం. అందులో హైడ్రో ఎలక్ట్రికల్‌ ఒకటి. మనకు పుష్కలంగా నీళ్లు ఉన్నయి. మాకు గప్పాలు, డబ్బాలు కొట్టుకునేది తెల్వదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను పాత ఫార్ములాలో పెట్టిన్రు. ఆ కరెంటు ఇప్పుడు లెక్కల్లోకి తీసుకోరట. ఎంత విచిత్రం? సంప్రదాయేతర కరెంటు 20% వాడాలని నిబంధన పెట్టడం మంచిదే. కానీ నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను లెక్కలోకి తీసుకోమని చట్టంలో చెప్తరు. ఎందుకంటే.. ఉత్తర భారతదేశంలో ఏవో ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టినయట, వాటి కరెంటు అమ్ముడుపోక మూత పడుతున్నయట. దేశానికి ఆ ఆస్తులు ఉపయోగపడేందుకు ఇవి లెక్కపెట్టం అంటరు. ఇదేం కథ? ఇది చట్టమా? ఇంతకంటే ఘోరమైన చట్టం ఉంటదా? మీ హైడల్‌ పవర్‌ లెక్కపెట్టం.. కొత్తగ ఉత్తర భారతదేశంలో 25 మెగావాట్లు లోపు పెట్టినవి లెక్కకొస్తయి, వాటిని మాత్రం మీరు కొనితీరాల్సిందే అంటరు.

విద్యుత్‌ మిగులున్నా చీకటే
దేశంలో స్థాపిత విద్యుత్‌శక్తి 4లక్షల మెగావాట్ల పైనే ఉంటది. మనదేశం ఇప్పటివరకు అతి ఎక్కువగా వినియోగించిన విద్యుత్‌ 2లక్షల మెగావాట్లు దాటలే. మిగిలిన విద్యుత్‌ ఏమవుతున్నది? సంస్థలు మూతపడి ఉన్నయి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో మొత్తం రెడీ అయి పెట్టుబడులు పెట్టిన సంస్థలు నడుస్తలేవు. మిగులు విద్యుత్‌ను దేశ ప్రగతి కోసం ఎలా వినియోగిద్దాం.. ఎలా అమల్లోకి తెద్దాం.. అవసరమైతే ఓ లక్ష కోట్లు ఇద్దామనే పాజిటివ్‌ దృక్పథం లేదు. ఆ తోవ పట్టాల్సిందిపోయి.. కేంద్రం ఉల్టా తోవ పడుతున్నది. మిగులు విద్యుత్‌ 2 లక్షల మెగావాట్ల దాకా ఉన్నా ఉత్తర భారత్‌లో సమస్యలు ఉంటున్నయి. అనేక రాష్ర్టాలు అల్లాడుతున్నాయి. బీహార్‌ రాజధాని పాట్నాలో నాలుగు డీజిల్‌ జనరేటర్లు పెట్టుకొని యువకులు పవర్‌ అమ్ముకుంటున్నరు. ఉత్తరప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి. ఈ సమస్యలు పక్కకు పెట్టి ఈ బిల్లు తెస్తున్నరు.

నియంతృత్వ బిల్లు ప్రజల నెత్తిన రుద్దొద్దు
ఈ చట్టంపై తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు నాతో మాట్లాడినరు. వాళ్లంతా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నరు. మన చేతుల్లో నియంత్రణ లేకపోతే మనం ఏం చేయాలె? ప్రైవేటు కంపెనీలు వస్తే వాళ్లు ఇష్టమొచ్చినచోట నాగాలాండ్‌, కర్ణాటక ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజలకు ఏ రకంగానూ మంచి చేసేదికాదు. రైతులకైతే గొడ్డలి పెట్టు. రాష్ర్టాల అధికారాలు హరించే నియంతృత్వ చట్టం. సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించే చట్టం. అయ్యా.. దయచేసి మీకు బలం ఉంటే ఉండొచ్చుగాక. నేను రెండు చేతులు జోడించి నమస్కరించి నిండు శాసనసభ నుంచి నరేంద్ర మోదీని వేడుకుంటున్నా. ఫాల్స్‌ ప్రెస్టేజ్‌కు పోకుండా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రజల నెత్తి మీద రుద్దొద్దు.

ఇందిరా పార్కు వద్ద ధర్నా మచ్చుతునక
విద్యుత్‌ విషయంలో యావత్‌ ప్రపంచానికి తెలుసు కాంగ్రెస్‌, చంద్రబాబు కలిసి చేసిన కథ. అందుకే జై తెలంగాణ అన్న.. పిడికిలెత్తి పోరాటం చేసిన. పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. ఇదొక మచ్చు తునక. ఇంత కంటే ఎక్కువ అవసరం లేదు. రెవెన్యూ చట్టం తీసుకొస్తుంటే విపక్షాలు సతమతమవుతున్నయి. చాలా ఇబ్బంది పడుతున్నరు. అనవసర భేషజాలు వద్దు. కొవిడ్‌ కారణంగా మూడు నెలల విద్యుత్‌ బిల్‌ ఒకేసారి రికార్డు చేయడం వల్ల అదనపు భారం అవుతున్నదని చెప్పారు. సమస్యలు ఉంటే తప్పకుండా తొలగిస్తాం.

దేశం నీళ్ల కోసం అల్లాడుతన్నది..
ఈ దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నయి. చెన్నై లాంటి నగరం బకెట్‌ నీళ్ల కోసం ఎందుకు తపిస్తున్నది? ఎందుకు 75% పైచిలుకు దేశం మంచినీటి కోసం అల్లాడుతున్నది? కాంగ్రెస్‌, బీజేపీ ఇద్దరికీ ఒక సుదీర్ఘమైన ప్రణాళిక, ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలనే పటిష్ట దృక్పథం లేకపోవటం వల్ల ఇది మనకు కనిపిస్తున్నది. సాగునీటి కోసం, మంచినీటి కోసం గోస. ఇప్పటివరకు 28వేల టీఎంసీల వాడకం దాటలేదు. దేశంలో ఉన్నదే 40 కోట్ల ఎకరాల సాగుభూమి. 40వేల టీఎంసీలు వాడినా ఇంక 30 వేల టీఎంసీలు ఉంటయి. పది వేల టీఎంసీలను తాగడానికి, పారిశ్రామిక అవసరాలకు కేటాయించినా, ఇంకా 20వేల టీఎంసీలు ఉంటయి. ప్రకృతి ప్రసాదించిన నీళ్లను రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వలేదు. ఇది కఠోర సత్యం.

ఏకగ్రీవంగా తీర్మానించిన శాసనసభ
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు సీఎం కేసీఆర్‌ చెప్పారు. సభ ఏకగ్రీవంగా తీర్మానించాలని కోరారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం- 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ర్టాల హక్కులను హరించే విధంగా, రైతులు-పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానిస్తున్నది’ అని సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు కాంగ్రెస్‌ పక్షాన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

విద్యుత్‌ ఉద్యోగుల త్యాగం గొప్పది
శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో ప్రజల ఆస్తులు కాపాడాలని చివరి నిమిషం దాకా ప్రయత్నించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు చెప్తుంటే బాధ కలిగింది. తక్షణం పరుగెడితే వారు కూడా తప్పించుకొనే వారు. చివరిదాకా ప్రయత్నంచేసి అందులో ఇరుక్కుపోయారు. ఇద్దరు ప్రైవేటు, ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరి తరపున, సభ తరఫున మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి త్యాగం గొప్పది.

ప్రతి మోటరుకు మీటరు పెట్టాల్సిందే
తెలంగాణ కరెంటు కథ రాసుకుంటే రామాయణమంత. గతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాక, సరైన వర్షాలు పడక భూగర్భజలాలు పడిపోతే.. బతకడానికి తెలంగాణ రైతాంగం రూ.45వేల కోట్లు ఖర్చు చేసి పెట్టిన 25-26 లక్షల కరెంటు మోటర్లు, బోర్‌వెల్స్‌ ఉన్నయి. ఈ కరెంటు మోటర్ల కనెక్షన్లను ఊకే సతాయించొద్దని కరెంటోళ్లతో మాట్లాడి.. మేం మీకు రూ.10వేల కోట్లు ఇస్తమని ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు ఇస్తున్నం. రైతులు సంతోషంగా మోటర్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నరు. రెండెకరాలేసినోళ్లు ఇయ్యాల నాలుగెకరాలు, ఆరెకరాలు ఏస్తున్నరని లోకమంతా తెలుసు. ఇదొక్కటే కాదు.. మన వరద కాల్వ, కాకతీయ కాల్వ మీద 10-15 వేల మోటర్లు ఉంటయి. అంతకుముందు కరెంటోళ్లు వాటిని తీసి కాల్వల పడేసి ఘోరంగా దెబ్బతీసిన్రు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు కూడా ఇదే చెప్తే.. ‘వాళ్లను ముట్టకండయ్యా.. వాళ్లు ఏం చేస్తున్నరు? ఎకరంన్నరో, రెండెకరాలో పారించుకుంటున్నరుగానీ దోపిడీ చేస్తలేరు కదా! బతకనీయండి’ అని చెప్పిన. అట్ల 30-40వేల మోటర్లు నడుస్తున్నయి. ఇప్పుడు కేంద్ర చట్టంలో వాటికి కూడా మీటర్లు పెట్టాలె. మీటర్లు పెట్టాలంటే కనెక్షన్‌ ఇయ్యాలె. కనెక్షన్‌ ఇయ్యాలంటే వైర్లు, పోల్స్‌ వేయాలె. లక్షలకు లక్షలు వసూలు చేయాలె. ప్రతి బావికి, మోటరుకు మీటరు పెట్టాలె. మీటర్లు పెట్టాలంటే రూ.750 నుంచి 1000 కోట్ల వరకు అవుతుంది. దాని తర్వాత ఎంత కాలితే అంత బిల్లు వసూలు చేయాలి.

‘కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం- 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ర్టాల హక్కులను హరించేలా, రైతులు-పేదల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానిస్తున్నది’ – అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ తీర్మానం.. ఏకగ్రీవంగా ఆమోదించినసభ

నీళ్లను నీళ్లుగా కాకుండా టర్బయిన్లకు మళ్లిస్తే కరెంటు ఉత్పత్తి అయితది. అట్లనే ఎండ నుంచి సోలార్‌, గాలి నుంచి విండ్‌ పవర్‌. ఇలా ఆ శక్తిని రెట్టింపు చేసుకొని వాడుకుంటున్నం. అందులో హైడ్రో ఎలక్ట్రికల్‌ ఒకటి. మనకు పుష్కలంగా నీళ్లు ఉన్నయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ కరెంటు లెక్కల్లోకి తీసుకోరట. ఎంత విచిత్రం? ఎందుకంటే.. ఉత్తర భారతదేశంలో ఏవో ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టినయట, వాటి కరెంటు అమ్ముడుపోక మూత పడుతున్నయట. దేశానికి ఆ ఆస్తులు ఉపయోగపడేందుకు ఇవి లెక్కపెట్టం అంటరు. ఇదేం కథ? దీన్ని చట్టమంటరా? ఇంతకంటే ఘోరమైన చట్టం ఉంటదా?

లక్షలాది ఉద్యోగాలు ఉంటయా? ఊడుతయా?
దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగులు, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు, జెన్‌కోలు, ట్రాన్స్‌కోలలో లక్షలమంది ఉన్నరు. వాళ్లంతా ఏం కావాలె? మన దగ్గరనే 50వేల మంది ఉన్నరంటే దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటరు? మన దగ్గర ఆర్టిజన్స్‌గా పనిచేసెటోళ్లు.. సార్‌.. తెలంగాణ అయింది, మాకు విముక్తి కల్పించమంటే నేనే డిస్ట్రిబ్యూటరీ కంపెనీలతో మాట్లాడి, పోతేపోనీ కష్టపడి పది రూపాయలు ఎక్కువ సంపాదించి పిల్లల కడుపు నింపండని చెప్పిన. 20వేల మంది ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ను క్రమబద్ధీకరించినం. ఇప్పుడు మంచిగ బతుకుతున్నరు. ఇయ్యాల ఈ చట్టంతో ఈ ఉద్యోగాలన్నీ ఉంటయా? ఊడుతయా? కల్లోలమైన పరిస్థితి.

బీజేపీ మంత్రి, ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలి
బిల్లులో ఇంకా చాలా ఉన్నయి. రాష్ర్టానికి ఏం అధికారం ఉండదు. రాష్ర్టానికి సున్న వస్తది. ఈఆర్సీ నియామకం వాళ్ల చేతుల్లోకి పోతది. లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి పోతది. ఇది జరిగితే భయంకరమైన బాధ. ఇక్కడి నుంచి ఏదో మాట్లాడుతున్నరు.. ఏమో చేస్తమంటున్నరుగానీ.. అయ్యా.. మీరు చేసేదేమోగానీ శఠగోపం పెట్టేది బంద్‌ చేయించండి. ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు దీనిని అంగీకరిస్తారా? తెలంగాణలోని 25-26 లక్షల మోటర్లకు మీటర్లు పెట్టాలన్న దానికి మీరు ఒప్పుకొంటరా? కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలె.

దేశంలో ఉన్నదే 40 కోట్ల ఎకరాల సాగుభూమి. 40వేల టీఎంసీలు వాడినా ఇంక 30 వేల టీఎంసీలు ఉంటయి. పది వేల టీఎంసీలను తాగడానికి, పారిశ్రామిక అవసరాలకు కేటాయించినా, ఇంకా 20వేల టీఎంసీలు ఉంటయి. ప్రకృతి ప్రసాదించిన నీళ్లను రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వలేదు. ఇది కఠోర సత్యం.
– సీఎం కేసీఆర్‌

సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు
ఇంక తమాషా ఏందంటే.. మీరు గ్యారంటీగా కరెంటు కొనాలని ఈ చట్టం చెప్తది. కొనకపోతే యూనిట్‌కు యాభై పైసల నుంచి రెండు రూపాయల వరకు జరిమానా వేస్తరట. ఇదేం చట్టం? మొత్తం మేం తీసుకుంటం, డిస్కంలను బతకనీయమని సీదా చెప్తే అయిపోతది కదా! చాలా ఘోరాతి ఘోరమైన చట్టం. మీరు సచ్చుకుంట కొనాలంటరు. కరెంట్‌ కొనాలంటే మన దగ్గర ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాలి. బంద్‌ పెట్టాలి. రేపో, ఎల్లుండో ఇదంతా పార్లమెంటులో చర్చకు వస్తది. రాష్ర్టాల స్వయం ప్రతిపత్తిని, భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికేసే భయంకరమైన చట్టమిది.

కోలుకుంటున్న తెలంగాణ రైతుపై పిడుగు ఇది
ఇయ్యాల వర్షాలు మంచిగ పడి నీళ్లు మంచిగ వస్తున్నందున రెండెకరాల బదులు నాలుగు, ఆరెకరాలు వేసుకుంటున్నరు. ఓ నాలుగు యూనిట్లు ఎక్కువ కాల్చుకుంటరు. పంటనే కదా పండించేది! అట్ల కాదంట.. ఇప్పుడు ఎంత కరెంటు కాలితే అంత బిల్లు ముక్కుపిండి వసూలు చేయాలట. ప్రతి బోరుకు మీటరు పెట్టాలి. పెట్టిన మీటరుతో కాలినంత కరెంటుకు బిల్లు వసూలు చేయాలె. మీటరు రీడింగు తీయాలంటే బిల్లు కలెక్టర్‌ కావాలె. వెనకట నేను చాలా చిన్నగున్నపుడు.. అప్పుడప్పుడే ఊర్లళ్లకు కరెంటు వస్తుండె. అప్పుడు బిల్లు కలెక్టర్లు ఉండేది. బిల్లు కలెక్టర్‌ను చూస్తే రైతులు జిల్లా కలెక్టర్‌ కంటే ఎక్కువ భయపడెటోళ్లు. ఆయన్ని బతిమాలుడు, బామాలుడు.. దావత్‌ ఇచ్చుడు! ఇప్పుడు మళ్ల మీటర్లు వస్తయి.. వాటెనక 20-30వేల మంది బిల్లు కలెక్టర్లు వస్తరు. అప్పుడు ఆయన దయ, భక్తి అన్నట్టు ఉంటది. ఇది ప్రజలకు, రైతులకు అంగీకారమా? మంచిదా? దేనికి మంచిది? ఇది మంచిదికాదు, పనికిరాదని రెండు మూడు నెలల కిందటే ప్రధానమంత్రికి ఉత్తరం రాసిన. దయచేసి వద్దు.. మాలాంటి రాష్ర్టాలకు ఇది గొడ్డలి పెట్టు అయితది, మా రైతులు చచ్చిపోతరు, పెనం మీద నుంచి పొయ్యిల పడినట్లయితదని చెప్పిన. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే దమ్ము తీసుకుంటున్నరు. కాకతీయ పేరు మీద చెరువులు మంచిగ అయినయి, వానలు బాగా పడుతున్నయి. భూగర్భజలాలు పెరుగుతున్నయి. మంచిగ పంటలు పండిస్తున్నరని బతిమిలాడినా వింటలేరు.

ఒక్క మెగావాట్‌ కూడా ప్రైవేటుకు ఇయ్యలే
ఈ రాష్ట్రంలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ఉన్నరు. రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పడం వాళ్ల బాధ్యత. పార్లమెంటులో మేం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నం. యాదాద్రి, భద్రాద్రిని ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు నాపై విపరీతమైన ఒత్తిడి తెచ్చినయి. నేను సచ్చినా ఇయ్యనని చెప్పిన. కొంతదూరం సబ్సిడీ ఇస్తే మిగిలిన డబ్బంతా జెన్‌కో, ట్రాన్స్‌కోకు వస్తది. మన సంస్థలకు డబ్బొస్తే దాన్ని ఇంకో వంద మెగావాట్లు విస్తరిస్తం. ఇంకొంతమంది పిల్లలకు ఉద్యోగాలొస్తయి. అవసరమైతే పది పైసలు ధర తగ్గిస్తం. పోటీ ప్రపంచంలో ఐదు పైసలు సబ్సిడీ ఇచ్చి పెట్టుబడులు ఆకర్షిస్తం. కంట్రోల్‌ మన చేతుల్లో ఉంటది. అదే ప్రైవేటుకిస్తే.. వచ్చిన డబ్బులు జేబుల వేసుకొనిపోతడు. అందుకే ఎవరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా లొంగలేదు. దయచేసి నా దగ్గరకు రావొద్దని చెప్పిన. ఇదీ మనం అవలంబిస్తున్న విధానం. ఇప్పుడు ఈ విద్యుత్‌ చట్టం వల్ల దీన్ని కూడా ఘోరాతి ఘోరంగా దెబ్బకొడుతరు.

ఈ చట్టం వస్తే మొత్తం మారిపోతది. మరి అట్లాంటప్పుడు మన డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎక్కడికి పోవాలె? అందులో పనిచేసే 50వేల మంది ఉద్యోగులు ఎక్కడికి పోవాలె? ఈ సంస్థలు మొత్తం మునిగిపోతే ఎట్ల? ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయింది. ఎల్‌ఐసీకి కూడా దెబ్బపెట్టిన్రు. విమానాలు పోతున్నయి.. రైళ్లు పోతున్నయి. అన్నీ వరుసపట్టి పోతున్నయి. అంతా గోవింద మంగళం అయితది. పబ్లిక్‌రంగ సంస్థలు ఉండవు. వీళ్లు ఉండనీయరు.

ఈ దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నయి. చెన్నై లాంటి నగరం బకెట్‌ నీళ్ల కోసం ఎందుకు తపిస్తున్నది? ఎందుకు 75% పైచిలుకు దేశం మంచినీటి కోసం అల్లాడుతున్నది? కాంగ్రెస్‌, బీజేపీ ఇద్దరికీ ఒక సుదీర్ఘమైన ప్రణాళిక, ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలనే పటిష్ఠ దృక్పథం లేకపోవటం వల్ల ఈ దుస్థితి కనిపిస్తున్నది.
– ముఖ్యమంత్రి కేసీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.