-నిలదీయండి.. పోరాడండి
-కేంద్రం వివక్షను ఎండగట్టండి
-ఉద్యోగ వ్యతిరేక విధానాలపై భావసారూప్యం ఉన్న పక్షాలు, ఉద్యోగ సంఘాలతో కలిసి పోరు
-టీఆర్‌ఎస్ పార్లమెంటరీ భేటీలో ఎంపీలకు సీఎం కేసీఆర్ నిర్దేశం
ఇంతకాలం ఓపిక పట్టాం.. ఇంకెంత కాలం ఓపిక పడదాం? ఓపికకు, సహనానికి హద్దు ఉంటుంది. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడు ప్రతి అంశంపైనా కేంద్రాన్ని నిలదీయాలి. మనకు రాష్ట్ర ప్రజల హక్కులు, వారి ప్రయోజనాలే ముఖ్యం. అందుకోసం ఎంతదూరమైనా వెళ్దాం.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం దుర్మార్గమైన వివక్షను ప్రదర్శిస్తున్నది. దీనిని ఎండగట్టాలి. కోల్‌బ్లాక్‌ల కేటాయింపు విషయంలో జాతీయస్థాయిలో ఆయా రాష్ర్టాల్లోని కోల్‌బ్లాక్‌ను ఆ రాష్ట్రాలకే కేటాయిస్తూ.. తెలంగాణకు వచ్చేసరికి ఓపెన్ టెండర్లు పిలిచి.. వివక్ష చూపుతున్నది. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేసింది. ఇటువంటి విషయాలపై గట్టిగా పోరాడాల్సిందే. బడ్జెట్‌లో రాష్ర్టానికి వివిధ రంగాల్లో కేటాయింపులు చేయాలని ఇప్పటికే ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులకు లేఖలు రాశాం. వాటిపై కేంద్ర స్పందనపై సమీక్షించుకొని అంశాలవారీగా కేంద్రాన్ని ఎండగట్టాలి. ఏరోజుకారోజు ఎంపీలంతా సమావేశమై, ఆ రోజు కార్యాచరణను రూపొందించుకొని సమన్వయంతో ఉండాలి. అవసరమైతే నేను పలు అంశాలపై సూచనలిస్తాను.
– ఎంపీలతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే సమస్యే లేదని, కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలపై చూపుతున్న శ్రద్ధ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చూపటంలేదని ఆగ్రహించారు. కేంద్రం ప్రదర్శిస్తున్న ఈ వివక్షను ఎండగట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. విభజన హక్కుల సాధన, కేంద్రం నుంచి రాష్ర్టానికి దక్కాల్సిన హక్కులపై పోరాడాల్సిందేనని స్పష్టంచేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంచేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది. వివిధ సందర్భాల్లో కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన హామీలు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలను రాబట్టుకోవటంలో పోరాటం చేయాల్సిందేనని ఆదేశించినట్టు సమాచారం.
రాజీపడేది లేదు
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేకుండా పోరాడాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ‘ఇంతకాలం ఓపిక పట్టాం.. ఇంకెంత కాలం ఓపిక పడదాం? ఓపికకు, సహనానికి హద్దు ఉంటుంది. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడు ప్రతి అంశంపైనా కేంద్రాన్ని నిలదీయాలి. మనకు రాష్ట్ర ప్రజల హక్కులు, వారి ప్రయోజనాలే ముఖ్యం. అందుకోసం ఎంతదూరమైనా వెళ్దాం’ అని సీఎం కేసీఆర్ ఎంపీలకు పేర్కొన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కొట్లాడుతూనే మరోవైపు కేంద్రం అనుసరిస్తున్న సామాన్య ప్రజల వ్యతిరేక విధానాలపై భావసారూప్యం గల సభ్యులతో కలిసి పోరాడాలని ఎంపీలకు సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలని, ఈ విషయంలో జాతీయ ఉద్యోగసంఘాలు, వారికి బాసటగా నిలుస్తున్న పక్షాలతో కలిసి ముందుకుపోవడంలో వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేసినట్టు సమాచారం.
ఏ అంశాన్నీ వదలొద్దు
విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా ఒక్కదాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదని, ఈ విషయంలో రాజీ పడకూడదని సీఎం కేసీఆర్ ఎంపీలకు స్పష్టంచేశారు. గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు మొదలైన విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. వీటిపై ఉపేక్షించవద్దని, రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న వివక్షను పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని సూచించినట్టు సమాచారం. ఐటీఐఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్‌కు రాయితీలు, జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు, 14, 15 ఆర్థిక సంఘాల సిఫారసులు, జింఖానా గ్రౌండ్ విషయంలో లోగడ కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఇచ్చిన హామీ వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ ఎంపీలతో అన్నారు.
వివక్షపై నిలదీతే..
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం దుర్మార్గమైన వివక్షను ప్రదర్శిస్తున్నదని, దీనిని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కోల్‌బ్లాక్‌ల కేటాయింపు విషయంలో జాతీయస్థాయిలో ఆయా రాష్ర్టాల్లోని కోల్‌బ్లాక్‌ను ఆ రాష్ర్టాలకే కేటాయిస్తూ.. తెలంగాణకు వచ్చేసరికి ఓపెన్ టెండర్లు పిలిచి.. వివక్ష చూపుతున్నదన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేసిందని గుర్తుచేశారు. ఇటువంటి విషయాలపై గట్టిగా పోరాడాల్సిందేనని ఎంపీలకు కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. బడ్జెట్‌లో రాష్ర్టానికి వివిధ రంగాల్లో కేటాయింపులు చేయాలని ఇప్పటికే ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులకు లేఖలు రాశామని గుర్తుచేస్తూ.. వాటిపై కేంద్ర స్పందనపై సమీక్షించుకొని అంశాలవారీగా కేంద్రాన్ని ఎండగట్టాలని సూచించినట్టు తెలిసింది. ఏరోజుకారోజు ఎంపీలంతా సమావేశమై, ఆ రోజు కార్యాచరణను రూపొందించుకొని సమన్వయంతో ఉండాలని, అవసరమైతే తాను పలు అంశాలపై సూచనలిస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, బీబీ పాటిల్, పీ రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.