Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేంద్ర బకాయిలు 29,891 కోట్లు

-తెలంగాణకు నిధులు సత్వరమే విడుదలచేయండి
-పార్లమెంటు లోపల, వెలుపల టీఆర్‌ఎస్ ఎంపీల డిమాండ్
-సభ ప్రారంభానికి ముందు గాంధీ విగ్రహం వద్ద నిరసన
-రాజ్యసభ, లోక్‌సభలో ప్రస్తావించిన కేకే, నామా
-రాజ్యసభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని చైర్మన్
-తమ స్థానాల వద్దే నిల్చుని టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన
-స్తంభించిన రాజ్యసభ.. వాయిదా

జీఎస్టీ బకాయిలు రూ.4531 కోట్లు సహా రాష్ట్రానికి రావాల్సిన రూ.29,891 కోట్ల నిధులు సత్వరమే విడుదలచేయాలని కేంద్రప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్రం నాన్చుడు వైఖరిపై పార్లమెంటు లోపల, వెలుపల నిరసన వ్యక్తంచేశారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. బుధవారం ఉదయం పార్లమెంట్ అవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిల విడుదలలోనూ కేంద్రం వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశా రు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు సంతోష్‌కుమార్, వీ లక్ష్మీకాంతరావు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, బండా ప్రకాశ్, జీ రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీ వెంకటేశ్, బీ లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.

రాజ్యసభలో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన
బుధవారం పార్లమెంట్ ప్రారంభం కాగానే ఉభయసభల్లోనూ టీఆర్‌ఎస్ సభ్యులు రాష్ర్టానికి రావాల్సిన నిధుల అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్ నేత కే కేశవరావు జీఎస్టీ బకాయిల విడుదలపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలని చైర్మన్ వెంకయ్యనాయుడును కోరారు. ఈ సమస్య తెలంగాణకు సంబంధించినదే కాదని, దాదాపుగా తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినదని, కేంద్రం వెంటనే నిధులు విడుదలచేయాలని కోరారు. గత రెండురోజులు అదే అంశంపై చర్చ జరిగినందున మాట్లాడే అవకాశమివ్వలేనని చైర్మన్ తెలిపారు. కనీసం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చైర్మన్‌ను కేకే కోరినా స్పందన రాకపోవడంతో టీఆర్‌ఎస్ సభ్యులు తమ స్థానాల్లో నిల్చుని నిరసన తెలిపారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది.

తెలంగాణపై చిన్నచూపు: నామా
తెలంగాణపై కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు విమర్శించారు. బుధవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇప్పటికైనా విడుదలచేయాలని డిమాండ్‌చేశారు. కేంద్రంనుంచి తెలంగాణకు రూ.29,891 కోట్లు రావాల్సి ఉన్నదని తెలిపారు. ప్రధాని సహా కేంద్రమంత్రులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనేకమార్లు లేఖలు రాసినా స్పందనలేదని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణను కేంద్రం అదుకొంటుందని భావించామని, కానీ ఎలాంటి సహకారం అందటం లేదని విమర్శించారు. తెలంగాణకు జీఎస్టీద్వారా రూ.4531 కోట్లు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.450 కోట్లు, గ్రామీణాభివృద్ధికి ఆర్థికసంఘం నిధులు రూ.312 కోట్లు, పట్టణాభివృద్ధి, స్థానికసంస్థలకు (యుఎల్‌బీ) గ్రాంట్ కింద రూ.393 కోట్లు, నీతిఆయోగ్ సిఫార్సుచేసిన విధంగా మిషన్ భగీరథ పథకానికి రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు.. మొత్తంగా రాష్ట్రానికి రూ.29,891 కోట్లు రావాల్సి ఉన్నదని వివరించారు. కేంద్రం సహకరిస్తే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా దేశాబివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు విడుదలచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు.

మాజీ ఎంపీ కవిత మద్దతు
సహకార సమాఖ్యవాదం కేవలం నినాదంగా ఉండకూడదని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, ఇతర నిధులను వెంటనే విడుదలచేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. బుధవారం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలపై టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన తెలిపిన నేపథ్యంలో వారికి మద్దతుగా ఆమె ట్విట్టర్‌లో ఈ విధంగా స్పందించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.