
-ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్ -ఉర్దూలో ప్రమాణం స్వీకరించిన మహమూద్‌అలీ -రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా వేడుక అతిథులతో కిక్కిరిసిన గవర్నర్ నివాసం -కేసీఆర్‌కు ప్రధాని శుభాకాంక్షలు, మహమూద్ అలీకి హోంశాఖ కేటాయింపు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించారు. రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్.. సరిగ్గా మధ్యాహ్నం 1.25 గంటలకు కేసీఆర్‌తో పదవీ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంపట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ ఆయన ప్రమాణం చేయగానే కార్యక్రమానికి వచ్చినవారంతా హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అనంతరం ముఖ్యమంత్రి రాజ్‌భవన్ లాన్‌లో ఆసీనులైన సభికులకు వినమ్రంగా వందనం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గవర్నర్ నరసింహన్ పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. తర్వాత రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ మహమూద్‌అలీ అల్లాకే నామ్ అంటూ ఉర్దూలో ప్రమాణం స్వీకరించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రిని, గవర్నర్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దర్బార్‌హాల్‌లో గవర్నర్ దంపతులు.. సీఎం కుటుంబంతో, మహమూద్‌అలీ దంపతులతో కలిసి ఫోటోదిగారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సీనియర్ నాయకులను మాజీ మంత్రి కేటీఆర్ సాదరంగా స్వాగతించారు. అతిథులు, అధికారులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవడంతో రాజ్‌భవన్ కిక్కిరిసిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో మెజార్టీ సాధించిన హరీశ్‌రావును పలువురు అభినందించడం కనిపించింది. పార్టీ తరఫున ఎన్నికైన దాదాపు అందరు ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామీగౌడ్ తదితరులతోపాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డికూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
కేసీఆర్‌కు ప్రధాని శుభాకాంక్షలు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఐదేండ్లపాటు మంచిపరిపాలన కొనసాగించాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌తోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్ అలీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అలీని కలిసినవారిలో మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, మైనార్టీ అంశాలపై ఏర్పాటుచేసిన సుధీర్ కమిషన్ చైర్మన్ సుధీర్, కమిషన్ సభ్యులు ఎంఏ బారి, హజ్ కమిటీ చైర్మన్ మసిఉల్లాఖాన్, మలక్‌పేట మార్కెట్ కమిటీ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు.
మహమూద్ అలీకి హోంశాఖ రాష్ట్ర హోంశాఖ మంత్రిత్వ బాధ్యతలను మహమూద్ అలీకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సందడిగా మారిన రాజ్‌భవన్ సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారోత్సవానికి తరలివచ్చిన మాజీ మంత్రులు, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో రాజ్‌భవన్ సందడిగా మారింది. గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఆనంద క్షణాలను వీక్షించేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మ ధ్యాహ్నం 12 గంటల నుంచి రాజ్‌భవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌జామ్ అయింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు విజయ సంకేతం చూపిస్తూ రాజ్‌భవన్‌కు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తుండగా.. కుర్చీలు లేకపోవడంతో మాజీ మం త్రులూ నిలబడాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తుంటే అక్కడకు వచ్చిన అతిథులంతా పులకరించిపోయా రు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ను ప్రత్యేకంగా రంగురంగుల పూలతో అలంకరించారు. డప్పుచప్పుళ్లు, సంప్రదాయ వస్ర్తా లు, నృత్యాలతో రాజ్‌భవన్ చాలా సందడిగా మారింది.