
-29 నుంచి ఏప్రిల్ 4 వరకు -13 లోక్‌సభ స్థానాల్లో సీఎం ప్రచార సభలు -ప్రతిరోజూ రెండు.. గ్రేటర్‌సభ ఎల్బీ స్టేడియంలో
టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 29 నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో.. రెండు సభల్లో పాల్గొనేవిధంగా షెడ్యూల్‌ను ఖరారుచేశారు. వేసవికాలం నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. కరీంనగర్ నుంచి ఈ నెల 17వ తేదీన ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం కేసీఆర్.. 19వ తేదీన నిజామాబాద్‌లో మరో సభ నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 13 నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారుచేశారు. మొదటి విడుతలో ఆదిలాబాద్ మినహా మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల్లో సభలు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు.
ఈ నెల 29న నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం నాలుగు గంటలకు మొదటిసభ నిర్వహిస్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల సభను ఏర్పాటుచేశారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒకటి, పెద్ద నియోజకవర్గాల్లో రెండు మూడు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్లగొండ, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రెండు సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. 16 సీట్లే లక్ష్యంగా ఫెడరల్‌ఫ్రంట్ తో కేంద్రంలో కీలకపాత్ర పోషించి రాష్ట్ర ప్రయోజనాలను సాధించడానికి టీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నది. సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో ముందుకెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశంలేనందున.. టీఆర్‌ఎస్ సీట్లతోపాటుగా నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించడానికి సీఎం కేసీఆర్ వ్యూహరచన చేశారు.
కేంద్రంలో కీలకపాత్ర ద్వారా రాష్ట్రానికి కావాల్సినన్ని నిధులను రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో ఏ విధమైన పాత్రను పోషించనున్నామో.. టీఆర్‌ఎస్‌ను 16 సీట్లలో ఎందుకు గెలిపించాలో ఓటర్లకు సీఎం కేసీఆర్ విడమర్చి చెప్పనున్నారు. కేసీఆర్ సభలు విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లుచేస్తున్నాయి. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన, 28తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను పూర్తిగా సన్నద్ధంచేయడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించారు.
